
సమ్మె ముంగిట ఆర్టీసీ విషయంలో ప్రభుత్వ విధానం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్లు.. వారి సమస్యల పరిష్కారానికి నిర్దిష్ట హామీ కాకుండా, దశల వారీ పరిష్కార హామీ ఇచ్చి సమ్మెకు చెక్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే నెల ఏడో తేదీ నుంచి సమ్మె చేస్తామంటూ సంస్థ కార్మిక సంఘాలతో కూడిన ఓ జేఏసీ సమ్మె నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. దానికి మరో జేఏసీ, ఇతర సంఘాలు అంతగా సానుకూలంగా లేకపోవటంతో సమ్మె విజయవంతం విషయంలో డోలాయమానం నెలకొంది.
దీంతో ప్రభుత్వం కూడా సమ్మె విషయంలో అంత ఆందోళనగా లేదని సమాచారం. అసలు సమ్మెనే మొదలు కాకుండా చూసేందుకు చర్యలు ప్రారంభించింది. 21 అంశాలను పేర్కొంటూ ఓ జేఏసీలోని కార్మిక సంఘాలు సమ్మె నోటీసు ఇచ్చాయి. అయితే డిమాండ్లకు సంబంధించి ఎప్పటిలోగా పరిష్కరించేది, ఎంత మొత్తం నిధులు విడుదల చేసేది.. స్పష్టంగా చెప్పకుండా, ఓ ఏడాది కాలంలో పరిష్కరిస్తాం అనే తరహా హామీ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.
రిటైర్డ్ అధికారుల సమావేశంలో సంకేతాలు..: ఆర్టీసీ రిటైర్డ్ అధికారులకు ఆర్థిక పరమైన బకాయిల అంశం చాలా కాలంగా పెండింగ్ లో ఉంది. పలు సందర్భాల్లో రిటైర్డ్ ఉద్యో గులు బస్‌భవన్ ఎదుట ధర్నాలు చేశారు. వాటిని చెల్లించాలని వినతిపత్రాలు సమ ర్పించారు. కానీ అవి పరిష్కారం కాలేదు. ఆర్టీసీ రిటైర్డ్ అధికారుల సంఘం ఐదో వార్షిక సమావేశం ఆదివారం ఓ హోటల్‌లో జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌లు హాజరయ్యారు. రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలతోపాటు వారి డిమాండ్ల పరిష్కారానికి దృష్టి సారిస్తున్నామని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగవేందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.