సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా 1.33 లక్షల మందికి ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేయనుంది. జనవరి ఒకటో తేదీ నుంచే కొత్త పింఛన్ల డబ్బులు చెల్లిస్తారు. ప్రస్తుతం పింఛను లబ్ధిదారులకు ఒక్కొక్కరికీ ఇస్తున్న రూ. 2,250 మొత్తాన్ని జనవరి ఒకటో తేదీ నుంచి రూ.2,500కు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో పింఛన్లలో కోత పెడుతున్నారని ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తుంటే.. వారికి చెంపపెట్టులా ప్రభుత్వం పింఛన్లు పెంచుతోంది. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గత రెండున్నర సంవత్సరాల్లో 17,03,250 మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేశారు.
తాజాగా పింఛన్లు పొందుతున్న 1.33 లక్షల మందితో కలిపి వీరి సంఖ్య 18.36 లక్షలు అవుతుంది. ఇప్పటికే వృద్ధాప్య పింఛన్ల కనీస అర్హత వయస్సును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు ప్రభుత్వం తగ్గించింది. దీనికి తోడు గతంలో లబ్ధిదారులు వృద్ధాప్యంలో సైతం ప్రతి నెలా పింఛను డబ్బుల కోసం గ్రామ పంచాయతీ లేదా వార్డు కార్యాలయాల వద్దనో, ఇతర ప్రభుత్వ కార్యాలయాల వద్దో గంటల తరబడి వేచి చూడాల్సివచ్చేది. ఇప్పుడా పరిస్థితి లేకుండా వలంటీర్ల ద్వారా ఇళ్ల వద్దే పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. దీంతో వృద్ధులు, దివ్యాంగులు, ఆనారోగ్యంతో ఉన్న వారు తదితరులు ఇంటి వద్ద లేదా వారు ఎక్కడ ఉంటే అక్కడే పింఛను డబ్బులు తీసుకుంటున్నారు.
చదవండి: (ఆర్బీకే సేవలకు కేంద్ర మంత్రులు ఫిదా)
కొత్త వారి మంజూరు పత్రాలు సిద్ధం
జనవరి నుంచి కొత్తగా పింఛన్లు పొందుతున్న 1.33 లక్షల మంది మంజూరు పత్రాలను ఇప్పటికే జిల్లాల్లో సిబ్బంది అందజేశారని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో ఇంతియాజ్ చెప్పారు. ఒకటో తేదీ నాటికి ఈ సంఖ్య స్వల్పంగా పెరిగే అవకాశం కూడా ఉందని అన్నారు. తాజాగా మంజూరు చేసిన పింఛన్లతో కలిపి 2020 జనవరి నుంచి ఇప్పటి వరకు 18 లక్షల మందికిపైగా లబ్ధిదారులకు ప్రభుత్వం కొత్త పింఛన్లను మంజూరు చేసిందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment