టీ.కాంగ్రెస్‌లో ‘పింఛన్ల’ చిచ్చు
వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుపట్టకపోవడంపై నిరసన
నల్లగొండ ఎమ్మెల్యేలు మినహా మిగతావారి ప్రత్యేక భేటీ
సీఎల్పీ నేతకు తమ అసంతృప్తి తెలిపిన ఎమ్మెల్యేలు
హైదరాబాద్: తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పాత్రలో కాంగ్రెస్ ఇంకా బాలారిష్టాలను దాటలేక పోతోంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎల్పీ నేతతో ముందే చర్చించి సభకు వెళ్తున్నా తమ వ్యూహాన్ని అమలు చేయలేకపోతున్నారు. బుధవారం సభలో పింఛన్ల అంశంపై కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. దీనిపై చర్చకు పట్టుబట్టింది. దీంతో సభ మొదలైన పది నిమిషాలకే వాయిదా పడింది. కానీ, సభ ప్రారంభం కావడానికి సుమారు అర్ధగంటకుపైగానే సమయం పట్టింది. ఈ సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా సీఎల్పీ నేత చాంబర్‌కు చేరుకున్నారు. తమ నేత జానారెడ్డితో ముచ్చటించారు. పింఛన్లపై చర్చకు పట్టుబట్టాలని నిర్ణయించుకున్నారు. కానీ, సభలో దీనికి పూర్తి విరుద్ధంగా జరగడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో అత్యధికులకు మింగుడుపడలేదు.
అసలేం జరిగింది...
సోమ, మంగళవారాల్లో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న సీఎం కేసీఆర్ తీరుపై చర్చ జరగాలని వాయిదా తీర్మానం ఇచ్చి దానికోసం పట్టుబట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బుధవారం పింఛన్ల వ్యవహారంపై తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం పింఛన్లపై చర్చించేలా వాయిదా తీర్మానం ఇవ్వాలని తీర్మానించుకున్నారు. దానికి తగినట్టే వాయిదా తీర్మానం ఇచ్చినా, ప్రభుత్వం చర్చకు ససేమిరా అన్నది. ఇదే అంశంపై సీఎం స్టేట్‌మెంట్ ఇస్తున్నారు కనుక వాయిదా తీర్మానంపై చర్చ అవసరం లేదని తోసిపుచ్చారు. కాంగ్రెస్ సభ్యులు చేసిన గొడవతో సభ వాయిదా పడింది. ఇదే సమయంలో ‘ప్రభుత్వ స్టేట్‌మెంట్‌తో సంబంధం లేకుండా చర్చకు పట్టుబట్టాలి..’ అని నిర్ణయించుకున్నారు. కానీ, సభలోకి వెళ్లాక దీనిపై ప్రతిఘటించకుండానే, అప్పటికే 344 నిబంధన కింద ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుపై చర్చకు అవకాశం ఇవ్వాలని సీఎల్పీ నేత స్పీకర్‌ను కోరడం, ఆయన నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ అంశంపై మాట్లాడడానికి అవకాశం ఇవ్వడం జరిగిపోయాయి. దీంతో అవాక్కయిన ఇతర ఎమ్మెల్యేలు.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రసంగం మొదలు పెట్టగానే బయటకు వచ్చేశారు.
అనుకున్నదేమిటి.. చేసిందేమిటి..?
‘మేం లోపల కూర్చుని మాట్లాడుకుంది ఒకటి. సభలో జరిగింది ఒకటి. వాళ్లు మాట్లాడాలనుకున్నది మాట్లాడుకుంటున్నారు. ఇక, మేమెందుకని బయటకు వచ్చేశాం’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు. జానారెడ్డి తీరుపైనా అసంతృప్తి చెందిన వీరంతా సీఎల్పీ నేత చాంబర్‌లో భేటీ అయ్యారు. ‘మేం అనుకున్నది అనుకున్నట్టు సభలో అమలు కాకుంటే సభలో కూర్చుని ఏం చేయాలి. ఇలాగైతే అధికార పక్షంతో ఎలా పోరాడతాం. అక్కడ కూర్చోబుద్దికాకనే వెళ్లిపోతున్నా..’ అని ఓ ఎమ్మెల్యే తీవ్రంగానే స్పందించారు. నల్లగొండ జిల్లా వారు మినహా మిగతా అందరినీ చాంబర్‌కు పిలిపించి రహస్యంగా చర్చించుకున్నారు. సభ వాయిదా పడిన తర్వాత కొందరు సీనియర్లు జానా వద్ద అసంతృప్తి వ్యక్తం చేశారని పార్టీ వర్గాల సమాచారం.