సాక్షి, హైదరాబాద్: ఆపన్నులకు ఇచ్చే ఆసరాలోనూ దుర్వినియోగం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. సెర్ప్ తనిఖీల్లో బాగోతం వెలుగులోకి వచ్చింది. కొంతమంది ప్రభుత్వం ఉద్యోగులు, వారి కుటుంబీకులు.. రిటైర్మెంట్ పెన్షన్లతో పాటు ఆపన్నులకు, అభాగ్యులకు, వృద్ధులకు అందించే ఆసరా పెన్షన్లను అందుకుంటున్నట్లు బయట పడింది.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5650 మంది అటు ఉద్యోగ పెన్షన్లతో పాటు.. ఆసరా పెన్షన్లు అందుకున్న జాబితాలో ఉన్నట్లు ఇటీవలి సెర్ప్ సర్వేలో వెల్లడైంది. వీరిలో 3824 మంది ఇప్పటికే చనిపోయినట్లు అధికారులు గుర్తించారు. మిగతా 1826 మంది ఇప్పటికీ రెండు పెన్షన్లు అందుకుంటున్నట్లు తేలింది. జూన్ నెల నుంచి వీరికి ఆసరా పెన్షన్ను ప్రభుత్వం నిలుపుదల చేసింది. ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే.. అంటే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 427 మంది అక్రమంగా డబుల్ పెన్షన్లు అందుకుంటున్నారు.
గత ప్రభుత్వం నిర్వాకం కారణంగా వీరికి చెల్లించిన ప్రజాధనం భారీ ఎత్తున దుర్వినియోగమైంది. రాష్ట్రవ్యాప్తంగా కొన్నేళ్లుగా ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబీకులు... ఈ విధంగా డబుల్ పింఛన్లు అందుకున్నట్లు గత నెలలో నిర్వహించిన తనిఖీల్లోనే తేలిపోయింది. ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే దాదాపు రూ.2.50 కోట్లు ఈ అక్రమంగా చెల్లించిన ఆసరా పెన్షన్లతో దుర్వినియోగమైనట్లు అక్కడి జిల్లా అధికారుల విచారణలో తేలింది.
రాష్ట్రవ్యాప్తంగా తేలిన లెక్క ప్రకారం భారీ మొత్తంలోనే ప్రజాధనం పక్కదారి పట్టినట్లు అంచనా. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వితంతువులు, ఒంటరి మహిశలు, వృద్ధులు,బీడీ కార్మికులు, స్టోన్ కట్టర్లు, చేనేత, వికలాంగులు, డయాలసిస్, ఫైలేరియా, ఎయిడ్స్ రోగులకు ఆసరా పథకం వర్తిస్తుంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉండి తెల్లరేషన్ కార్డు ఉన్నవారు ఈ పెన్షన్ పొందేందుకు అర్హులు. గత ప్రభుత్వం ఆసరా పేరుతో పెన్షన్లు ఇవ్వగా కొత్త ప్రభుత్వం వీటిని ‘చేయూత’ పెన్షన్లుగా పేరు మార్చింది.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాసరి మల్లమ్మ అనే 80 ఏళ్ల వృద్ధురాలకు ఆసరా పెన్షన్ కింద వచ్చిన ఒక లక్షా 72 వేల రూపాయలు వెనక్కు కట్టాలని ప్రభుత్వం నోటీసు ఇచ్చిందని.. ఇదంతా అమానవీయమైన చర్య అని ట్వీట్ చేసిన వ్యవహారం కూడా ఈ అనర్హుల జాబితాలోనే ఉండటం గమనార్హం. దాసరి మల్లమ్మ కూతురు దాసరి రాజేశ్వరి దంతుకూరులో ఏఎన్ఎంగా పని చేసేది. 2010లో ఆమె మరణించింది. ఆమెకు పెళ్లి కాకపోవటంతో డిపెండెంట్‌గా ఉన్న తల్లి దాసరి మల్లమ్మకు రూ.24073 ఫ్యామిలీ పెన్షన్‌గా ప్రభుత్వం చెల్లిస్తోంది.
ఆమెకు మరోవైపు ఆపన్నులకు అందే ఆసరా పెన్షన్ కూడా అందుతున్నట్లు ఇటీవలి సర్వేలో తేలింది. అందుకే జూన్ నెల నుంచి ఆసరా పెన్షన్ ను అక్కడి జిల్లా అధికారులు నిలిపివేశారు. అనర్హులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, జాతీయ రహదారులు, రోడ్లకు కూడా రైతుబంధు చెల్లించి దాదాపు రూ.25,672 కోట్లు దుర్వినియోగమైనట్లు ప్రభుత్వం గుర్తించింది. అదే తీరుగా ఆసరా పెన్షన్ల పేరిట భారీఎత్తున నిధులు పక్కదారి పట్టిన వ్యవహారం తాజా సంఘటనలో తేలిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment