పిన్నీస్ జిందాబాద్!
‘‘ఈ జిప్పులు వచ్చి పోస్టాఫీసుల పొట్టగొట్టాయిరా... జిప్పుల వల్ల మన పోస్టాఫీసులు క్రమంగా అంతరించిపోయాయి’’ అన్నాడు అన్నాడు మా రాంబాబుగాడు. ‘‘పొంతన లేకుండా మాట్లాడకు. పోస్టాఫీసులు అంతరించిపోవడానికి కొత్తగా వచ్చిన కొరియర్ సర్వీసులు కారణం కదా. వాటికీ జిప్పులకూ లింకు పెడతావేమిట్రా నువ్వు?’’ అడిగాను. ‘‘కాదురా... నేను మాట్లాడేది మన సొంత పోస్టాఫీసుల గురించి’’ అన్నాడు వాడు. ‘‘నీకు మతి పోయింది. సొంత పోస్టాఫీసులు ఏమిట్రా... నీ ముఖం. అసలు పోస్టాఫీసులు సెంట్రల్ గవర్నమెంటు కిందికి వస్తాయి. ఒక తరం కింది వరకూ ఎందరికో అత్యద్భుతమైన జ్ఞాపకాలూ, అనుభూతులూ పంచిన వాటి గురించి అజ్ఞానంతో మాట్లాడకు’’ అని కోప్పడ్డాను నేను.
‘‘నీకు గుర్తుండే ఉంటుంది. అప్పట్లో మన నిక్కర్లకు జిప్పులుండేవి కావు. అలా జిప్పులు కనిపెట్టని ఆ రోజుల్లో నిక్కరుకు మూడు గుండీలే ఉండేవి. ఉన్న మూడింట్లో ఒకటో రెండో కొన్నాళ్లకి తప్పక ఊడిపోయేవి. ఆ ఖాళీ భర్తీ చేయడానికి మా అమ్మ అక్కడ పిన్నీసు పెట్టేది. పిన్నీసు పెట్టుకోకపోతే అందరూ ‘పోస్టాఫీస్’ అనో ‘టప్పా ఖానా’ అనో వెక్కిరించేవాళ్లు. పిన్నీసు పెట్టే ముందు అది గుచ్చుకుంటుందేమో అని కడుపులో భయం. అబ్బ... నువ్వు ఎన్నైనా చెప్పురా జిప్పుల ఆవిర్భావ కాలానికి ముందు పిన్నీసులదే స్వర్ణ యుగంరా. జిప్పులు వచ్చాయి. అటు పిన్నీసులూ... ఇటు పోస్టాఫీసులూ... ఇలా రెండూ అంతరించిపోయాయి. అప్పటి చిన్నారుల మాన సంరక్షణ విషయంలోనే కాదురా... పిన్నీసులు కొంత భాషా సేవ కూడా చేశాయి’’ అన్నాడు వాడు.
‘‘పిన్నీసులు చేసిన భాషా సేవ ఏమిట్రా’’ అయోమయంగా అడిగా. ‘‘ముల్లును ముల్లుతోనే తీయాలి అని సామెత. అప్పట్లో పొలాల గట్ల మీద నడిచే రోజుల్లో ముళ్లు గుచ్చుకోవడం చాలా మామూలు విషయం. దాన్ని పిన్నీసులతో నేర్పుగా తీయడమూ అంతే మామూలు. ఇప్పటి పిల్లలకు ముల్లు గుచ్చుకోవడం అంతగా తెలియదు... ముల్లును ముల్లుతోనే తియ్యాలనీ... ఇందుకోసం పిన్నీసు ముల్లును వాడాలన్న విషయమూ తెలియదు. ఇలా పిన్నీసు వాడటం తగ్గింది. వాటిని ఉపయోగించే నేర్పూ తగ్గింది. షాపుల్లో అవి కనిపించడం కూడ తగ్గింది. అలాగే ముల్లును ముల్లుతోనే తియ్యాలన్న సామెత వాడకమూ తగ్గిందిగదరా. అయినా సరే ఒక ఆశా కిరణం ఏమిటంటే... కలిసి ఉంటామని చెప్పడానికి పాశ్చాత్య దేశాల్లో పిన్నీసే సంకేతమట’’ అన్నాడు వాడు.‘‘అదేమిటి పాశ్చాత్య దేశాలు కలిసి ఉంటామని చెప్పడానికి సింబాలిగ్గా పిన్నీసు వాడతాయా?’’ అడిగా.
‘‘అవును బ్రెక్సిట్ సమావేశం తర్వాత అందరూ వేరుపడదాం నిశ్చయించుకున్నారు కదా... ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని వద్దనుకున్న వారు ఏ చిరుగూ లేకపోయినా షర్టుకు స్టైలిష్‌గా పిన్నీసును పెట్టుకుంటున్నారట. రేసిజానికి వ్యతిరేకంగా పిన్నీసు ఒక ప్రతీక అట తెల్సా. అంత గొప్పదిరా పిన్నీసు. పాశ్చాత్యులు అలా దాన్ని పట్టుకుంటుంటే... మనం దాన్ని ఎప్పుడో వదిలేశాం. అందుకే నాకు గుండెల్లో ముల్లు గుచ్చినంత బాధగా ఉందిరా. పైగా డార్విన్‌గారు చెప్పిన పరిణామ సిద్ధాంతంలోని అంశాలు పిన్నీసు విషయంలోనూ నిజం కావడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉందిరా’’ అన్నాడు వాడు. ‘‘ఏమిటీ... పరిణామ సిద్ధాంతంలో డార్విన్ పిన్నీసు గురించి మాట్లాడాడా?’’ అడిగాను నేను ఎంతో ఆశ్చర్యపడిపోతూ. ‘‘అంటే నేరుగా చెప్పలేదు. కానీ ఆయన పరిణామక్రమం గురించి చెప్పింది పిన్నీసుకూ అప్లై అవుతుంది’’
‘‘అదెలా?’’
‘‘దేన్నైతే ఎక్కువగా వాడతామో అది జిరాఫీ మెడలాగా మరింతగా అభివృద్ధి చెందుతుంది. దేన్ని వాడమో అది అంతరించిపోతుంటుంది అన్నాడు కదరా. అలా చూస్తే ఆ సిద్ధాంతం పిన్నీసుకు కూడా వర్తిస్తుంది కదా. ఇలా చూస్తే పిన్నీసు గురించి పరోక్షంగా డార్విన్‌గారు చెప్పినట్టే కదరా. ఇప్పుడు ఆలోచించు... పిన్నీసు అన్నది ఒక ఇంజనీరింగ్ అద్భుతమే అయినా... ఇటు జీవులకు సంబంధించిన బయాలజీలోని జీవపరిణామ సిద్ధాంతమూ దానికి వర్తిండచం ఒక అద్భుతం కాదంటావా? ఒకనాడు వారూ వీరు కాకుండా అందరి షర్టూ నిక్కరుకైనా ఉండిన అంతటి పిన్నీసు ఇలా తన ప్రాభవం కోల్పోవడం నాకు దుఃఖం తెప్పిస్తోందిరా’’ అన్నాడు వాడు.
వాడి ధోరణిలో ఏదైనా చెప్పిగానీ వాడిని ఊరడించలేమని అనిపించింది. అందుకే వాడితో ఒక మాట చెప్పా. ‘‘ఒరేయ్... ఒక పిన్నుకు గుండు ఉంటే దాన్ని గుండుపిన్ను లేదా గుండు సూది అంటారు. అలాగే పిన్నీసుకు ఉండే సూదికి చివరన గుండుకు బదులుగా మంచి తలకట్టు ఉంది. మనుషుల్లో జుట్టు పట్ల ఇష్టం ఉన్నంత కాలం పిన్నీసు కూడా ఆదరణ కోల్పోకుండా ఉంటుంది. కాబట్టి నువ్వు బాధపడకు’’ అన్నాను. ‘‘నీ మాటను తథాస్తు దేవతలూ వినాలి రా. నువ్వన్నట్టే జరగాలి రా’’ అంటూ కళ్లు తుడుచుకున్నాడు వాడు.
- యాసీన్