మైక్రో ఏటీఎంలు, 1.3 లక్షల పోస్టాఫీసులు
పెద్ద నోట్లు రద్దు అనంతరం దేశంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులపై కేంద్ర ఆర్థిక శాఖ స్పందించింది.
న్యూఢిల్లీ: పెద్ద నోట్లు రద్దు అనంతరం దేశంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులపై కేంద్ర ఆర్థిక శాఖ స్పందించింది. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తి కాంత్ దాస్ సోమవారం ఉదయం ప్రెస్ మీట్ నిర్వహించారు. రిజర్వ్ బ్యాంక్ దగ్గర తగినంత నగదు అందుబాటులో ఉందని భరోసా ఇచ్చిన ఆయన రాబోయే రోజుల్లో పరిస్థితి చక్కబడుతుందని హామీ ఇచ్చారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పరిస్థితిని అంచనా వేస్తున్నారని, పెద్ద నోట్ల రద్దు వల్ల తలెత్తిన పరిస్థితిని తాము సమీక్షిస్తున్నామన్నారు. దేశ ప్రజలకు నగదును నేరుగా అందించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశామని, నగదును వేగంగా ఆందించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు శక్తికాంత్ దాస్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని తపాల కార్యాలయాల్లోనూ నగదు డిపాజిట్ కు ఇబ్బందులు ఉండబోవని తెలిపారు. ప్రజలు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా నోట్ల మార్పిడి, విత్ డ్రా పరిమితిని పెంచామన్నారు.
బ్యాంకుల్లో వారానికి నగదు విత్ డ్రా పరిమితిని రూ.24 వేలకు పెంచామని, ఈ నగదును ఖాతాదారుడు ఒకేరోజైనా లేదా వారంలో ఎప్పుడైనా సరే తీసుకోవచ్చని స్పష్టం చేశారు. ఏటీఎంల వద్ద భద్రత పెంచేందుకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మైక్రో ఏటీఎంలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 1.3లక్షల పోస్టాఫీసులను సిద్ధంగా ఉంచనున్నట్టు ప్రకటించారు.
మరోవైపు రాష్ట్రాల ఆర్థిక కార్యదర్శుల సమన్వయంతో ప్రత్యేక బృందాల ద్వారా నిఘాను మరింత కట్టుదిట్టం చేశామని ఆయన చెప్పారు. ప్రజలకు సులువుగా నగదు చేర్చే విధానాలను అన్వేషిస్తున్నామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ సందర్భంగా బ్యాంకు ఉద్యోగులు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారని ప్రశంసించారు.
ఈ నేపథ్యంలో రూ. 500 నోట్ల పంపణీని నిన్ననే ప్రారంభించామని, త్వరలోనే (రేపు లేదా నేడు) రూ.2వేల నోట్లను ఏటీంలలో అందుబాటులోఉంచుతామని చెప్పారు. అలాగే బ్యాంకింగ్ కరస్పాండెట్స్ విత్ డ్రా పరిమితి రూ. 50వేలకు, రోజువారి పరిమితి.2.5 లక్షలకు పెంచుతున్నట్టు వెల్లడించారు. పెద్దనోట్ల రద్దు తర్వాత 18 కోట్ల లావాదేవీలు జరిగాయని ఆయన వెల్లడించారు.