మైక్రో ఏటీఎంలు అంటే ఏంటి?
త్వరలోనే భారీ సంఖ్యలో మైక్రో ఏటీఎంలను ప్రవేశపెడతామని, దానివల్ల డబ్బులు తీసుకోవడం సులభం అవుతుందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. కానీ అసలు ఈ మైక్రో ఏటీఎంలు అంటే ఏంటో చాలామందికి తెలియదు. ఇన్నాళ్ల బట్టి డబ్బులు తీసుకోవాలంటే మనకు ఏటీఎం (ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్లు) మాత్రమే అలవాటు. నిజానికి మైక్రో ఏటీఎం అంటే.. కార్డు స్వైప్ చేసే పోర్టబుల్ యంత్రాలు. వీటికి జీపీఆర్ఎస్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి.. డెబిట్ కార్డు స్వైప్ చేయగానే సంబంధిత బ్యాంకు నెట్‌వర్క్‌కు కనెక్ట్ అవుతుంది. అందులో ఎంత బ్యాలెన్స్ ఉందో డిస్‌ప్లే అవుతుంది. అప్పుడు పరిమితిని బట్టి ఎంత మొత్తం విత్‌డ్రా చేయాలో అందులో ఎంటర్ చేసిన తర్వాత, అకౌంటు లోంచి ఆ మొత్తం తగ్గుతుంది. అప్పుడు ఆ పోర్టబుల్ యంత్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి.. ఆ మొత్తాన్ని తీసి ఇస్తాడన్న మాట. సాధారణంగా ఈ యంత్రాలను బిజినెస్ కరస్పాండెంట్లు (గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకు ప్రతినిధులు) తీసుకెళ్తారు. బ్రాంచిల నుంచి దూరంగా ఉండే ప్రాంతాలకు చెందిన కస్టమర్లకు కూడా బ్యాంకు సేవలు అందేందుకు వీలుగా వీటిని తొలుత ప్రవేశపెట్టారు. ముందు ఇందులో డిపాజిట్ల స్వీకరణకు వీలు కల్పించారు. ఇప్పుడు అవసరాన్ని బట్టి పాతనోట్ల స్వీకరణ, కొత్త నోట్లు ఇవ్వడం లాంటి లావాదేవీలు కూడా నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది.
సాధారణంగా ఒక ఏటీఎంలో రోజుకు 80-100 వరకు లావాదేవీలు జరుగుతాయి. వాటి నిర్వహణకు నెలకు దాదాపు రూ.20 వేల వరకు ఖర్చవుతుంది. అద్దె, టెలికం చార్జీలు, వార్షిక నిర్వహణ, విద్యుత్ ఖర్చులు, సెక్యూరిటీ గార్డు వేతనం అన్నీ ఇందులో ఉంటాయి. అదే మైక్రో ఏటీఎం అయితే యంత్రం ఖరీదు రూ. 20వేల లోపే ఉంటుంది. దాన్ని చేత్తో తీసుకెళ్లిపోయే అవకాశం ఉంది కాబట్టి నిర్వహణ వ్యయం అంటూ ఏమీ ఉండదు. కేవలం చార్జింగ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని జీఎస్ఎం సిమ్ కార్డుతో కూడా కనెక్ట్ చేసేందుకు వీలుంటుంది కాబట్టి, సిగ్నల్ వచ్చే ప్రతి ప్రాంతానికీ పంపొచ్చు. అయితే, ఇందులో కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. సంబంధిత బిజినెస్ కరస్పాండెంట్ (స్థానిక వ్యాపారులు, వేరే ఎవరైనా) వద్ద ఎంత మొత్తం ఉంటే అంతవరకు మాత్రమే ఇవ్వగలరు. ప్రస్తుతం బ్యాంకులలో కూడా కొంతమందికి ఇచ్చిన తర్వాత డబ్బులు అయిపోయాయన్న విషయం వినిపిస్తోంది.