పోస్టల్ చెల్లింపు బ్యాంక్‌కు పీఐబీ ఆమోదం
న్యూఢిల్లీ: ఇండియా పోస్ట్ ఏర్పాటు చేయాలనుకుంటున్న రూ.800 కోట్ల చెల్లింపు బ్యాంక్ ప్రతిపాదనకు పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డ్(పీఐబీ) ఆమోదం తెలిపింది. తుది ఆమోదం కోసం ఈ ప్రతిపాదనను నెల రోజుల్లోపల కేబినెట్ ముందుకు వచ్చే అవకాశాలున్నాయని పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఉన్నతాధికారొకరు చెప్పారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ అధీనంలోని పీఐబీ ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడి ప్రతిపాదనల వ్యవహారాలను చూస్తుంది. గత నెల 19న జరిగిన పీఐబీ సమావేశంలో ఇండియా పోస్ట్ రూ.800 కోట్ల చెల్లింపు బ్యాంక్ ప్రతిపాదనకు ఆమోదం లభించిందని ఆ ఉన్నతాధికారి చెప్పారు.
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఏర్పాటుకు సంబంధించి ఒక కన్సల్టెంట్‌ను నియమించే ప్రక్రియ తుదిదశలో ఉందని పేర్కొన్నారు. కన్సల్టెంట్ కోసం ఆరు సంస్థలను షార్ట్ లిస్ట్ చేయగా, వాటిల్లో మూడు సంస్థలు మాత్రమే బిడ్‌లను సమర్పించాయని వివరించారు. బ్యాంక్ సేవలు అందని గ్రామీణ, మారుమూల ప్రాంత ప్రజలు లక్ష్యంగా ద ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలు నిర్వహించనున్నది.
సాధారణ డిపాజిట్, మనీ రెమిటెన్సెస్‌ల సేవలు అందించనున్నది. ఈ బ్యాంక్ వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రయోగాత్మకంగా కార్యకలాపాలు నిర్వహించనున్నది. మార్చి నుంచి పూర్తిస్థాయిలో పనిచేస్తుంది. ఇప్పటికే కొన్ని ఆర్థిక సేవలందిస్తున్న పోస్టల్ శాఖ దేశవ్యాప్తంగా 1.55 లక్షల బ్రాంచీలతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.