రాఖీకి పోస్టల్ శాఖ అరుదైన కానుక
ముంబై: ముంబై పోస్టల్ శాఖ రక్షా బంధన్ సందర్భంగా అన్నచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు సంతోషపడే నిర్ణయం తీసుకుంది. వరుసగా రెండురోజులు రావడంతో రాఖీ పౌర్ణమిరోజు సోదరసోదరీమణుల ఆనందాన్ని ఇనుమడింప చేసే లక్ష్యంతో అరుదైన నిర్ణయం తీసుకుంది. ఎక్కడో దూరాన ఉన్న అక్కాచెల్లెళ్లు పంపించే రాఖీలను సకాలంలో డెలివరీ చేయాలనే యోచనతో ఆగస్ట్14 ఆదివారం ముంబై పోస్టల్ డిపార్ట్ మెంట్ పనిచేయాలని నిర్ణయించుకుంది. శనివారం సెమీ క్లోజ్డ్ , ఆదివారం, ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సం సెలవు లు రావడంతో పోస్ట్ ద్వారా వచ్చిన రాఖీలు ప్రతి వినియోగదారునికి బట్వాడా చేయడం కోసం సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తం ముంబై నగరం, థానే / నవీ ముంబై, పాల్ఘర్ , రైగాడ్ జిల్లాలలో ప్రధాన పోస్ట్ కార్యాలయం ఆదివారం నాడు ప్రత్యేకంగా పనిచేసేందుకు ఏర్పాట్లు చేసింది.
ఈ ఏడాది ఇ- కామర్స్ వ్యాపారంలో గణనీయమైన వృద్ధి ఉందనీ, అందుకే సాధారణ వాటితో పాటూ, ప్రత్యేకంగా వచ్చిన రాఖీ కానుకలను కూడా రాఖీ రోజు పంపిణీ చేయడానికి వీలుగా చర్యలు తీసుకున్నామని అసిస్టెంట్ డైరెక్టర్ వీవీ నాయక్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ముంబై పోస్టల్ ప్రాంతం అంతటా ముంబై నగరం, పొరుగున ఉన్న థానే, పాల్ఘర్ , రైగాడ్ జిల్లాల అంతటా బలమైన నెట్ వర్క్ ఉందని..దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. తమ ఈ నిర్ణయం లక్షల వినియోగదారులకు సరైన సమయానికి అందించడానికి మార్గం సుగమం చేసిందని ఆయన తెలిపారు.
రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి గా పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పౌర్ణమి అని కూడా వ్యవహరిస్తారు. అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల ప్రేమానురాగాలకుసూచికగా రాఖీలు కట్టుకోవడం, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీ. అయితే మొదట్లో ఉత్తర, పశ్చిమ భారతదేశాలకే పరిమితమైన ఈ సాంప్రదాయం ఇపుడు సర్వత్రా వ్యాపించిన సంగతి తెలిసిందే.