Rakhis
-
ఆవు పేడతో రాఖీలు.. ముంబై నుంచి ఆర్డర్లు
ఆగస్టు 19న రాఖీ పండుగ.. ఇది అనుబంధాలకు ప్రతీకగా నిలిచే ఉత్సవం. ఈ సందర్భంగా అక్కాచెల్లెళ్లు తమ అన్నదమ్ములకు రాఖీ కడతారు. ఇందుకోసం ఇప్పటి నుంచే మార్కెట్లో వివిధ రకాల రాఖీలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌కు చెందిన పూజా మెహతా రూపొందిస్తున్న రాఖీలు ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్నాయి.ఆవు పేడలో వివిధ రకాల పప్పుదినులు కలిపి ఆమె అందమైన రాఖీలను తయారు చేస్తోంది. ఈ రాఖీలు పర్యావరణానికి అనుకూలమైనవి. ఈ రాఖీలను రూపొందిస్తున్న పూజా వీటిని విక్రయిస్తూ, స్వయం ఉపాధి కూడా పొందుతోంది. తన మాదిరిగానే ఎవరైనా సరే ఇటువంటి రాఖీలను తయారు చేసి ఉపాధి పొందవచ్చని ఆమె చెబుతోంది. తాను రూపొందిస్తున్న రాఖీలు అందరినీ అమితంగా ఆకట్టుకుంటున్నాయని పూజ తెలిపింది.బస్‌గావ్ గ్రామ నివాసి పూజా మీడియాతో మాట్లాడుతూ తాను తయారు చేస్తున్న రాఖీలు దేశంలోని ప్రతి ప్రాంతానికి పంపిస్తానని తెలిపారు. ఢిల్లీ, గుజరాత్, ముంబైల నుంచి తనకు చాలా ఆర్డర్టు వస్తున్నాయని పూజా పేర్కొన్నారు. తాను ఈ రాఖీలను రూ. 40కు విక్రయిస్తున్నానని తెలిపారు. తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ రాఖీలను విక్రయిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. తాను ఈ ప్రత్యేకమైన రాఖీలను రూపొందించేందుకు ఆవు పేడ, ఎర్రమట్టి, బంక, పప్పుదినులు ఉపయోగిస్తానని తెలిపారు. దీంతో పాటు ఆవాలు, నువ్వులు, బంతిపూలు మొదలైనవాటిని కూడా వినియోగిస్తానని తెలిపారు. -
ఎకో ఫ్రెండీ వినాయకుడినే చూశారు.. మట్టితో ఈసారి రాఖీ చేసుకుందామా?
ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని చేశాం. ఎకో ఫ్రెండ్లీ ఆభరణాలను చూశాం. ప్రకృతి– పర్యావరణాల బంధానికి... ఇకపై... ఎకో ఫ్రెండ్లీ రక్షాబంధనం. బంధాల అల్లిక రాఖీ పండుగకు... అనుబంధాల లతలల్లింది శ్రీలత. నిజామాబాద్‌కు చెందిన శ్రీలత సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లమో చేశారు. పెళ్లి తర్వాత కుటుంబ బాధ్యతల వల్ల ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. గృహిణిగా ఇంటి నాలుగ్గోడలే జీవితం అనుకోలేదామె. నాలుగు గోడలను సృజనాత్మకతతో తీర్చిదిద్దారు. శ్రీలత తన ఇంట్లో సోఫాలో కూర్చుని ఏ గోడను చూసుకున్నా తాను చేసిన ఫ్లవర్ వాజ్, కార్నర్ స్టాండ్, తలమీద కుండలు పేర్చుకుని భవనంలోకి అడుగుపెడుతున్న ఎంబ్రాయిడరీ గొల్లభామ, రాధాకృష్ణుల వాల్ హ్యాంగింగ్‌లు కనిపిస్తాయి. తలెత్తి చూస్తే షాండ్లియర్ కనువిందు చేస్తుంది. బీరువా తెరిస్తే తాను పెయింటింగ్ చేసుకున్న చీరలు. ఏక్తార మీటుతున్న భక్త మీరాబాయి ఆమె కుంచెలో ఒదిగిపోయి చీర కొంగులో జాలువారి ఉంది. మెడలో ధరించిన టెర్రకోట ఆభరణంలో రాధాకృష్ణులు వయ్యారాలొలికిస్తుంటారు. మరోదిక్కున వర్లి జానపద మహిళలు కొలువుదీరిన మినీ టేబుల్ స్టాండ్. డాబా మీదకెళ్తే మొక్కల పచ్చదనం, చుట్టూ ఎర్రటి పిట్టగోడల మీద తెల్లటి చుక్కల ముగ్గులు... ఖాళీ సమయాన్ని ఇంత ఉపయుక్తంగా మార్చుకోవచ్చా... అన్న విస్మయం, అందరికీ రోజుకు ఇరవై నాలుగ్గంటలే కదా ఉంటాయి... ఇన్ని రకాలెలా సాధ్యం అనే ఆశ్చర్యం ఏకకాలంలో కలుగుతాయి. ఇప్పుడామె రాబోతున్న రాఖీ పండుగకు పర్యావరణహితమైన టెర్రకోట రాఖీల తయారీకి సిద్ధమయ్యారు. తన కళాభిరుచిని సాక్షితో పంచుకున్నారు శ్రీలత. రంగు... బ్రష్ ఉంటే చాలు! ‘‘మా సొంతూరు దోమకొండ. మా చిన్నప్పుడే నిజామాబాద్‌కి వచ్చేశాం. అత్తగారిల్లు బాన్సువాడ, కానీ మావారి వ్యాపారరీత్యా నిజామాబాద్‌లోనే స్థిరపడ్డాం. అత్తగారిల్లు ఉమ్మడి కుటుంబం, ఇంటి బాధ్యతల కోసం పూర్తి సమయం కేటాయించాల్సిన అవసరం ఉండేది. దాంతో ఉద్యోగం మానేయక తప్పలేదు. అయితే నిజామాబాద్‌కి వచ్చిన తర్వాత ఖాళీ సమయం ఎక్కువగా ఉంటోంది. పిల్లలు ముగ్గురూ స్కూళ్లకు, కాలేజ్‌కి, మా వారు బయటకు వెళ్లిన తర్వాత రోజంతా ఖాళీనే. టీవీ చూస్తూ గడిపేయడం నాకు నచ్చేది కాదు. చిన్నప్పుడు మా అమ్మ చేస్తూ ఉంటే చూసి నేర్చుకున్న కళలన్నీ గుర్తుకు వచ్చాయి. నా క్రియేటివ్ జర్నీ అలా మొదలైంది. వీటన్నింటినీ చేయడానికి ముడిసరుకు కోసం మార్కెట్కెళ్లే పనే ఉండదు. ఇంటికి వచ్చిన పెళ్లి పత్రిక, చాక్లెట్ బాక్సులు, కేక్ కట్ చేసిన తర్వాత మిగిలిన అట్టముక్క... దేనినీ వదలను. రంగులు, బ్రష్‌లు కొంటే చాలు ఇక నాకు చేతినిండా పని. నా మెదడు చివరికి ఎంతగా ట్యూన్ అయిపోయిందంటే... ఉపయోగంలో లేని ఏ వస్తువును చూసినా దాంతో ఏమి చేయవచ్చు... అనే ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయి. ఆలోచనలకు ఒక రూపం వచ్చిందంటే పని మొదలు పెట్టడమే. వచ్చిన ఐడియాని మర్చిపోతానేమోనని ఒక్కోసారి ఒకటి పూర్తికాకముందే మరొకటి మొదలు పెడతాను. మట్టితో రాఖీ! కోవిడ్ లాక్డౌన్ సమయం నాకు బాగా కలిసి వచ్చింది. ఒక్కరోజు కూడా బోరు కొట్టలేదు. అప్పటివరకు ఇంటి అలంకరణ వస్తువులు, ఆభరణాలు మాత్రమే చేసిన నేను రాఖీల తయారీ కూడా మొదలు పెట్టాను. మొక్కల కోసం తెప్పించుకునే ఎర్రమట్టిని రాఖీలు, ఆభరణాలకు అనుగుణంగా సిద్ధం చేసుకుంటాను. మట్టిని నీటిలో నానబెట్టి కరిగిన తరవాత సన్నని చిల్లులున్న జల్లెడలో వేసి బకెట్లోకి వడపోయాలి. రాళ్లు, నలకలు, పుల్లల వంటివి జల్లెడ పైన ఉండిపోతాయి. ఓ గంట సేపటికి బకెట్లో నీరు పైకి తేలుతుంది. అడుగుకు చేరిన మట్టిని తీసి ఎండబెట్టాలి. తేమ ఆరిపోతూ ముద్దగా ఉన్నప్పుడు ఆభరణాలు తయారుచేసి ఎండబెట్టాలి. ఎండిన తర్వాత కొబ్బరిపీచు, వరిపొట్టులో వేసి కాల్చాలి. ఇటుకలు కాల్చినట్లేనన్నమాట. వేడి చల్లారిన తర్వాత రంగులు వేసి, దారాలు చుడితే రాఖీ రెడీ. లాకెట్లు, చెవుల జూకాలు కూడా ఇలాగే చేస్తాను. మొక్క నాటుతాం! రాఖీలను మొదట్లో మా ఇంట్లో వరకే చేశాను. ఇప్పుడు నా రాఖీలు కావాలని బంధువులు, స్నేహితులు అడుగుతున్నారు. ఓ వంద రాఖీలు అవసరమవుతున్నాయి. అందుకే ఈ ఏడాది ఆగస్టు మొదటివారం నుంచే పని మొదలుపెట్టాను. పర్యావరణ పరిరక్షణ పట్ల ఆసక్తి కలిగినప్పటి నుంచి మట్టి వినాయకుడి బొమ్మనే తెచ్చుకుంటున్నాం. పండుగ తరవాత గణపతిని పూలకుండీలో పెట్టి నీరు పోసి కరిగిన తరవాత మొక్క నాటుతాను. మరో విషయం... మా ఇంట్లో ఏటా పుట్టినరోజులు, పెళ్లిరోజుకు కొత్త మొక్కను నాటుతాం’’ అని చెప్తూ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియచేశారు శ్రీలత. – వాకామంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
బీజేపీ పెద్దలకు సీమా హైదర్ రాఖీ..
లక్నో: ప్రియుని కోసం పాకిస్థాన్ వదిలి భారత్ వచ్చిన సీమా హైదర్ ప్రధాని మోదీకి రాఖీ పంపించింది. ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు మోహన్ భగవత్‌తో సహా యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లకు కూడా రాఖీలు పంపించింది. ఈ నెల 30న రాఖీ పండగ సందర్భంగా రాఖీలను పోస్టు చేసినట్లు తెలిపింది. 'ఈ దేశ బాధ్యతలను భుజాలకెత్తుకున్న నా సోదరులకు రాఖీలను పింపించాను. జై శ్రీరాం, జై హింద్, హిందుస్థాన్ జిందాబాద్.' అంటూ సీమా హైదర్ నినాదాలు చేసింది. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బ్యాగ్రౌండ్లో 'బయ్యా మేరే రాఖీ కె బంధన్ కో నిభానా' అనే సాంగ్ కూడా ప్లే అవుతోంది. సీమా తన పిల్లలతో కలిసి రాఖీ కడుతున్న దృశ్యాలు అందులో కనిపించాయి. పబ్జీలో పరిచయమైన సచిన్ అనే యువకున్ని ప్రమించి అతని కోసం స్వదేశమైన పాక్‌ను దాటి వచ్చేసింది సీమా హైదర్. పిల్లలతో కలిసి దుబాయ్ మీదుగా నేపాల్ చేరి అటునుంచి ఉత్తరప్రదేశ్‌కి చేరింది. ఆమెపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేసి అప్పట్లో అరెస్టు చేశారు. అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు. ప్రస్తుతం ఆమె తన ప్రియునితో కలిసి నోయిడాలో జీవిస్తోంది. ఇదీ చదవండి: ప్రధాని మోదీకి పాక్ సోదరి రాఖీ.. గత 30 ఏళ్లుగా.. -
ఈ రాఖీలు వేటితో చేశారో చెప్పగలరా?
బిజనోర్: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే రాఖీ పూర్ణిమకు రకరకాల డిజైన్ల రాఖీలు మార్కెట్లో అమ్ముతుంటారు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని బిజనోర్ జిల్లాలో శ్రీకృష్ణా గోశాల నిర్వాహకులు విభిన్నంగా ఆవు పేడతో రాఖీలు తయారు చేశారు. సహజ రంగులు, దారాలతో పర్యావరణ హితంగా వీటిని తయారు చేసినట్టు ఎన్నారై మహిళ అల్కా లహోటి(52) తెలిపారు. తన తండ్రికి తోడుగా గోశాల నిర్వహణను చూసుకునేందుకు ఇండోనేసియాలో ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఆమె బిజనోర్‌కు వచ్చేశారు. ‘జునా అఖహరాతో కలిసి ఆవు పేడతో మేము తయారుచేసిన రాఖీలను మొదటసారి కుంభమేళాలో ప్రదర్శించినప్పుడు మంచి స్పందన వచ్చింది. ప్రజల కోసం ఇలాంటి రాఖీలు రూపొందించాలని స్వాములు సూచించారు. ఇతర నిపుణుల సాయంతో రాబోయే రాఖీ పండగ కోసం వేల సంఖ్యలో రాఖీలు తయారుచేశాం. ఉత్తరప్రదేశ్ నుంచే కాకుండా కర్ణాటక, ఉత్తరాఖండ్, ఒడిశా నుంచి ఆర్డర్లు వచ్చాయి. వివిధ ఆకృతులు, పరిమాణాల్లో టెంప్లేట్స్ తయారుచేసుకుని వీటిలో ఆవు పేడ నింపుతాం. తర్వాత వీటిని చల్లటి, చీకటి ప్రదేశంలో ఉంచుతాం. ఆరిపోయిన తర్వాత పర్యావరణహిత రంగులద్ది, రంగు రంగుల దారాలు కడతాం. చైనా రాఖీలతో పోలిస్తే ఈ రాఖీలు పర్యావరణహితమైనవి. వీటిని తయారుచేయడంలో మొదట్లో పలు సవాళ్లు ఎదుర్కొన్నాం. ఈ రాఖీలు త్వరగా ఇరిగిపోయేవి. ప్రయోగాలు కొనసాగిస్తూనే ఈ సమస్యను అధిగమించాం. గట్టిగా, దృఢంగా ఉండేలా వీటిని రూపొందించగలిగాం. తక్కువ ధరకే వీటిని విక్రయిస్తాం. మిగిలిపోయిన రాఖీలను ఉచితంగా పంచిపెడతామ’ని అల్కా లహోటి వివరించారు. శ్రీకృష్ణా గోశాలలో 117పైగా ఆవులున్నాయి. ఆవు మూత్రంతో ఫినాయిల్, పేడతో పూలకుండీలు కూడా తయారుచేస్తున్నారు. -
రాఖీలపై మోదీ, ఆదిత్యనాథ్‌ల ఫోటోలు
గాంధీనగర్: సోదర ప్రేమకు ప్రతీక రక్షాబంధన్. ఆదివారం రాఖీ పౌర్ణమి సందర్భంగా ఇప్పటికే షాపింగ్ సెంటర్లు, బంగారు దుకాణాలు, స్వీట్‌హౌస్‌లకు పండుగ కల వచ్చేసింది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు వినూత్న ఆఫర్లు, వివిధ వెరైటీలతో వ్యాపరస్తులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. బంగారు పూత మిఠాయిలు, సిల్వర్ స్వీట్స్ వంటి వెరైటీలు మార్కెట్లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సూరత్‌లోని బంగారు దుకాణం యజయాని ఇలాంటి విభన్న ప్రయత్నమే చేశాడు. ప్రధాని నరేంద్రమోదీ, యూపీ యోగి ఆదిత్యనాథ్, గుజరాత్ సీఎం విజయ్ రూపానీల చిత్రాలతో కూడిన బంగారు రాఖీలను తయారు చేయించాడు. ఇప్పడు గుజరాత్లో వీటికి యమా క్రేజ్ వచ్చేసింది. తమ అభిమాన నాయకుల ఫోటోలతో కూడిన రాఖీలకోసం ఆర్డర్ ఇచ్చి మరీ తయారు చేయించుకుంటున్నారని షాప్ యజమాని పేర్కొంటున్నారు. ‘ ప్రధాని నరేంద్ర మోదీలాగా నా తమ్ముడు కూడా గొప్పవాడు కావాలనే ఉద్దేశంతో ఆయన చిత్రం ఉన్న రాఖీ కావాలని ఆర్డర్ చేశానని’ ఓ సోదరి వివరించింది. -
ట్రంప్‌కు 1001 రాఖీలు
గుర్గావ్(హర్యానా): అమెరికా అధ్యక్షుడికి హర్యానా మహిళలు రాఖీలు పంపిస్తున్నారు. మహిళలపట్ల దురుసుగా వ్యవహరించే ట్రంప్‌కు రక్షాబంధనం పురస్కరించుకొని ఇంత పెద్ద మొత్తంలో సోదరభావంతో 1001 రాఖీలు పంపటం విశేషం. వెనుకబడిన మెవాట్ ప్రాంతంలోని మరోరా గ్రామాన్ని సులభ్ స్వచ్ఛంద సంస్థ దత్తత తీసుకుంది. ఈ సంస్థ ఆధ్వర్యంలోనే ఆ గ్రామ బాలికలు అమెరికా అధినేతకు వెయ్యిన్నొక్క రాఖీలు పంపిస్తోంది. సులభ్ ఇంటర్నేషనల్ సంస్థ(ఎస్‌ఐఎస్‌ఎస్‌ఓ) అధినేత బిందేశ్వర్ పాఠక్ ఇటీవలే ఈ గ్రామానికే ట్రంప్ గ్రామం అని పేరు పెట్టారు. దీంతో ఆ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. అయితే, నిబంధనలకు విరుద్ధంగా గ్రామానికి పేరు మార్చారంటూ అధికారులు అభ్యంతరం తెలపటంతో కొత్తగా ఏర్పాటు చేసిన ట్రంప్ గ్రామ సూచిక బోర్డులను తొలగించారు. పున్హానా తహశీల్ పరిధిలోని ఈ గ్రామ జనాభా 1800లో ఎక్కువ మంది ముస్లిములే. ఎస్‌ఐఎస్‌ఎస్‌ఓ సంస్థ ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లను ఈ గ్రామ మహిళలు తమ పెద్దన్నయ్యలుగా భావిస్తున్నారని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అందుకే మోదీ ఫొటోలతో 501 రాఖీలను, ట్రంప్ ఫొటోలతో 1001 రాఖీలను తయారుచేసి పంపిస్తున్నారని వివరించారు. గ్రామ మహిళలు కొందరు ప్రధానమంత్రి మోదీని ఆయన నివాసంలో కలిసి రాఖీలు కట్టేందుకు ఢిల్లీ బయలుదేరారని పేర్కొన్నారు. ఈ గ్రామంలోని 140 నివాసాలకు గాను 45 మాత్రమే టాయిలెట్లు ఉండగా సులభ్ సంస్థ మిగతా 95ఇళ్లకు కూడా టాయిలెట్లు నిర్మించి ఇచ్చింది. గ్రామంలోని మహిళలు, బాలికల కోసం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. -
మోదీ కోసం ప్రత్యేక రాఖీలు..
వారణాసీ: ప్రధాని నరేంద్రమోదీ ఈ రాఖీ పండుగకు ప్రత్యేక రాఖీలందుకోనున్నారు. వారణాసీకి చెందిన దుర్గాకుంద్ వృద్ధాశ్రమంలోని మహిళలు మోదీకోసం ప్రత్యేకమైన రాఖీలను రూపొందిస్తున్నారు. గతేడాది కూడా ఈ వృద్ధ మహిళలు మోదీ కోసం ప్రత్యేక రాఖీలు రూపొందించి పంపారు. ప్రతి ఏటా రాఖీ పండుగ రోజు ప్రధాని నరేంద్ర మోదీ తన నివాసానికి పిల్లలు, విభిన్న మతాల మహిళలను పిలుచుకొని వారితో రాఖీ కట్టించుకుంటారు. భారత్‌లో సోదరి-సోదరుల రక్షణకు ప్రతీకగా రాఖీ పర్వదినాన్ని నిర్వహిస్తారు. ఆగష్టు 7న దేశ వ్యాప్తంగా రాఖీ పండుగ జరగనుంది. -
రాఖీకి పోస్టల్ శాఖ అరుదైన కానుక
ముంబై: ముంబై పోస్టల్ శాఖ రక్షా బంధన్ సందర్భంగా అన్నచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు సంతోషపడే నిర్ణయం తీసుకుంది. వరుసగా రెండురోజులు రావడంతో రాఖీ పౌర్ణమిరోజు సోదరసోదరీమణుల ఆనందాన్ని ఇనుమడింప చేసే లక్ష్యంతో అరుదైన నిర్ణయం తీసుకుంది. ఎక్కడో దూరాన ఉన్న అక్కాచెల్లెళ్లు పంపించే రాఖీలను సకాలంలో డెలివరీ చేయాలనే యోచనతో ఆగస్ట్14 ఆదివారం ముంబై పోస్టల్ డిపార్ట్ మెంట్ పనిచేయాలని నిర్ణయించుకుంది. శనివారం సెమీ క్లోజ్డ్ , ఆదివారం, ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సం సెలవు లు రావడంతో పోస్ట్ ద్వారా వచ్చిన రాఖీలు ప్రతి వినియోగదారునికి బట్వాడా చేయడం కోసం సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తం ముంబై నగరం, థానే / నవీ ముంబై, పాల్ఘర్ , రైగాడ్ జిల్లాలలో ప్రధాన పోస్ట్ కార్యాలయం ఆదివారం నాడు ప్రత్యేకంగా పనిచేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ ఏడాది ఇ- కామర్స్ వ్యాపారంలో గణనీయమైన వృద్ధి ఉందనీ, అందుకే సాధారణ వాటితో పాటూ, ప్రత్యేకంగా వచ్చిన రాఖీ కానుకలను కూడా రాఖీ రోజు పంపిణీ చేయడానికి వీలుగా చర్యలు తీసుకున్నామని అసిస్టెంట్ డైరెక్టర్ వీవీ నాయక్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ముంబై పోస్టల్ ప్రాంతం అంతటా ముంబై నగరం, పొరుగున ఉన్న థానే, పాల్ఘర్ , రైగాడ్ జిల్లాల అంతటా బలమైన నెట్ వర్క్ ఉందని..దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. తమ ఈ నిర్ణయం లక్షల వినియోగదారులకు సరైన సమయానికి అందించడానికి మార్గం సుగమం చేసిందని ఆయన తెలిపారు. రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి గా పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పౌర్ణమి అని కూడా వ్యవహరిస్తారు. అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల ప్రేమానురాగాలకుసూచికగా రాఖీలు కట్టుకోవడం, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీ. అయితే మొదట్లో ఉత్తర, పశ్చిమ భారతదేశాలకే పరిమితమైన ఈ సాంప్రదాయం ఇపుడు సర్వత్రా వ్యాపించిన సంగతి తెలిసిందే. -
పాదం మీద.. పుట్టుమచ్చనవుతా
ఆ మువ్వల సవ్వడిలో అక్కల ఆప్యాయత ఉంది. ఎలుగెత్తి వినిపించే ఆ గొంతుకలో తోబుట్టువుల అనురాగం దాగుంది. అందుకే ఆ గళం.. ఆడపడుచుల ఆర్తనాదమైంది. ఆ పాదాల మీద పుట్టుమచ్చై రుణం తీర్చుకుంటానంది. మల్లె తీగకు పందిరిలా మారిపోతానంది. మసక చీకటిలో వెన్నెల వెలుగులు నింపుతానంది. ఈ ఆర్ద్రత వెనుక అలవికాని అనురాగం ఉంది. సిరిమల్లె చెట్టు కింద చినబోయిన లచ్చువమ్మ గోస ఉంది. అజ్ఞాతంలో పల్లవించిన గళం కోసం అల్లాడిపోయిన అక్కల ఆవేదన ఉంది. తన జీవితమంతా అక్కలతో ముడిపడి ఉందంటున్న ప్రజాగాయకుడు గద్దర్ రాఖీ బంధాన్ని, అనుబంధాన్ని ‘సిటీప్లస్’తో పంచుకున్నారు. - వనం దుర్గాప్రసాద్ నాకు ముగ్గురు అక్కలు. నా చిన్నతనంలోనే వాళ్ల పెళ్లిళ్లు అయ్యాయి. అయినా వాళ్లకు నేనంటే ప్రాణం. పెద్దక్క పేరు సరస్వతీబాయి. రెండో అక్క శాంతాబాయి. మూడో అక్క బాలమణి. మొదటి ఇద్దరూ కాలం చేశారు. ఇప్పుడున్నది మూడో అక్కే. పెద్దక్కను ఔరంగాబాద్‌కు ఇచ్చాం. రెండో అక్క అల్వాల్‌లోనే ఉండేది. మూడో అక్క మేడ్చల్‌లో ఉంటుంది. నిజానికి రెండో అక్క దగ్గరే ఎక్కువ కాలం ఉండేవాణ్ని. ఆమెలో ఉద్యమ భావాలు బాగా నచ్చేవి. నక్సల్స్ ఉద్యమంపై తీవ్ర నిర్బంధం ఉన్న రోజుల్లోనూ ఉద్యమ నేతలకు ఆమె రాఖీ కట్టేది. కొండపల్లి సీతారామయ్య వంటి నాయకులకు శాంతాబాయి చాలాసార్లు రాఖీ కట్టింది. అందుకే ఆమె ప్రజా ఉద్యమానికే సోదరిగా భావిస్తాం. అజ్ఞాతంలో ఎక్కువ గడపడం వల్ల నేను వాళ్లకు చాలా కాలం దూరంగానే ఉన్నాను. పెద్దక్క మాత్రం ఏటా ఇంటికొచ్చేది. బావ వాళ్ల తమ్ముళ్లకు దుస్తులు కొంటే తను నాకు కూడా కొనేది. అక్కంటే ప్రాణం కావడం వల్లేమో, ఆమె తెచ్చేవన్నీ నాకు నచ్చేవి. ఆ రాఖీ అలాగే.. రాఖీ పండుగొస్తే ఎంతో మంది ఈ అన్నకు రాఖీలు కడతారు. కానీ రెండో అక్క శాంతాబాయి రాఖీ అంటే నాకు చాలా ఇష్టం. దాన్ని ఊడిపోయే వరకూ విప్పే ప్రసక్తే లేదు. ఒక రోజు ముందే రాఖీ కొనేది. ‘రేపు రాఖీ... ఎక్కడికీ వెళ్లకూ...’ అని ముందే హెచ్చరించేది. పొద్దున్నే స్నానం చేసేవరకే అక్క సిద్ధంగా ఉండేది. రాఖీ కట్టి ఆత్మీయంగా కౌగిలించుకునేది. ఆ అక్కకు నేనేమిచ్చి రుణం తీర్చుకుంటాన? అక్క కట్టిన ఆ రాఖీ చేతికున్నంత సేపు రాలిపోయే స్వర్ణక్కలు.. వాడిపోయే లచ్చుమమ్మలు గుర్తుకొస్తారు. ఆ రాఖీలో అంత శక్తి ఉందనిపిస్తుంది. మాదంతా రివర్స్ ‘రాఖీ కట్టావ్.. అన్న నీకు ఏం ఇచ్చాడు?’ సాధారణంగా విన్పించే ప్రశ్న ఇది. కానీ మా ఇంట్లో భిన్నంగా ఉంటుంది. రాఖీ కట్టిన అక్క ఆ రోజు ఆమె దగ్గర ఎంత ఉంటే అంత ఇవ్వాల్సిందే. సోదర భావాన్ని సామాజిక, మానవీయ కోణంలో చూడాలని కోరుకుంటాను. నిజానికి ఆ సోదర ప్రేమను ఏ రూకలతో కొలుస్తాం? ఆ సెంటిమెంట్‌ను బలమైన బంధంగా మార్చే సన్నివేశానికి ఎలా వెలకడతాం? నేను మాత్రం పాట, మాట, ఆటతోనే ఆ అక్కలకు జోహార్లర్పిస్తాను. ఎర్రపూల దారిలోనే పాదాభివందనం చేస్తాను. అజ్ఞాతంలో మరుపురాని జ్ఞాపకం నేను అజ్ఞాతంలో ఉన్నాను. ఒకసారి పెద్దక్కను ఔరంగాబాద్‌లో రహస్యంగా కలుసుకోవాలనుకున్నా. పోలీసుల నిఘా తీవ్రంగా ఉండటంతో ఇబ్బంది పడుతుందనుకున్నా. చెప్పినట్టే ఓ రహస్య ప్రదేశానికి వచ్చింది. అప్పుడూ ఆమె ఒట్టి చేతులతో రాలేదు. నాకు ఇష్టమని గోధుమ రొట్టెలు, టీ తీసుకుని వచ్చింది. టీలో ఆ రొట్టెలు ముంచుకుని తినడం.. అప్పుడు అక్క ఆప్యాయంగా చూడటం.. ఆ తర్వాత నన్ను కౌగిలించుకుని భోరున ఏడ్వటం ఇప్పటికీ మరచిపోలేను. అప్పుడు రాఖీ జీవితంలో మరపురానిది. దేవుడికి ముడుపులు కట్టారు పోలీసులు అణువణువూ గాలిస్తున్న రోజులవి. అప్పుడప్పుడు కంటపడితే ‘ఏంటిరా ఇది.. నీ బిడ్డల ముఖమైనా చూడవా?’ అని ప్రశ్నించేవాళ్లు. నేను మారాలనే అక్కలే.. బయటవాళ్ల ముందు మాత్రం ‘మా తమ్ముడు ఏం తప్పు చేశాడు?’ అని ప్రశ్నించేవాళ్లు. అజ్ఞాతంలో ఉన్న నేను క్షేమంగా ఉండాలని దేవుళ్లకు ముగ్గురక్కలూ ముడుపులు కట్టేవాళ్లు. ఒకసారి ఔరంగాబాద్‌లో పెద్దక్క రైల్వే స్టేషన్లో నన్ను చూసి, ముద్దుపెట్టుకుని, కన్నీళ్లు పెట్టింది. పాటకు ప్రాణం అనుభవాలే ఒకసారి ప్రశాంతంగా గతాన్ని నెమరు వేసుకుంటున్నప్పుడు, కళ్లు చెమర్చిన రాఖీ అనుబంధాలు.. ‘మల్లెతీగకు పందిరి వోలె..’ అనే పాటగా మారాయి. ఆ సమయంలోనే నారాయణమూర్తి తన సినిమా కోసం కదిలించే పాట కావాలన్నారు. ఓ పాఠశాలలో నేను రాసిన పాట విన్నారు. వందేమాతం శ్రీనివాస్ ట్యూన్ కట్టారు. ఆ పాట నారాయణమూర్తిని కదిలించింది. సినిమా విడుదలయ్యాక దాసరి నారాయణరావు భార్య పద్మ ఒక రోజంతా కన్నీరు పెట్టారు. ఊరూవాడా అంతగా కదిలించిన ఆ పాటకు అక్కల మమకారమే ప్రేరణని సగర్వంగా చెబుతాను. అందుకే వాళ్లు కట్టే రాఖీకి వెలకట్టలేమని భావిస్తాను. నా తమ్ముడికి ఎందరో అక్కాచెల్లెళ్లు: బాలమణి గద్దర్ ప్రపంచానికి పాటై పల్లవించినా.. మాకు మాత్రం పిల్లాడే. నాన్న చెప్పిన అంబేద్కర్ భావాల ప్రభావమో.. గద్దర్‌తో ఉన్న మమకారమో.. ఆ ఆత్మీయత అలా బలపడింది. ఏ చిన్న కష్టమొచ్చినా ఆదుకుంటాడు. కన్నీళ్లు పెడితే ఊరడిస్తాడు. ఇంతకన్నా ఏ అక్కకైనా కావాల్సిందేంటి? ఏటా రాఖీ పండుగకు రావడం అలవాటు. నేనొచ్చేసరికే సిద్ధమవుతాడు. తమ్ముడు అజ్ఞాతంలో ఉన్నప్పుడు రాఖీ కట్టలేదన్న వేదన కలచివేసేది. కానీ గద్దర్‌కు ఎక్కడున్నా అక్కాచెల్లెళ్లు ఉంటారు. నాలాంటి వాళ్లు ఎక్కడో ఒక చోట రాఖీ కట్టే ఉంటారని మనసును ఓదార్చుకునేదాన్ని. ఇప్పుడా ఇబ్బంది లేదు. ఈ జన్మలోనే కాదు.. ఇంకెన్ని జన్మలకైనా నా తమ్ముడు నా చేత, నాలాంటి వాళ్ల చేత రాఖీ కట్టించుకోవాలని కోరుకుంటున్నా. - ఫొటోలు: సృజన్పున్నా -
నేడు రాఖీ పౌర్ణమి మండుతున్న రాఖీల ధరలు
సాక్షి, న్యూఢిల్లీ: రాజధానిలో కాయగూరల ధరలేకాక రాఖీల ధరలూ మండుతున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే రాఖీల ధరలు 20 నుంచి 30 శాతం పెరిగాయని దుకాణదారులు అంటున్నారు. గత సంవ త్సరం బ్రేస్లెట్ రాఖీ ధర 40 నుంచి రూపాయల నుంచి మొదలుకాగా ఈ సంవత్సరం దాని ధర 50 రూపాయల కంటే తక్కువ లేదు. పిల్లలు మోజుపడే కార్టూన్ రాఖీల ధరలు కూడా బాగా పెరిగాయి. నిరుడు ఐదు నుంచి ఎనిమిది రూపాయలకు టామ్ అండ్ జెర్రీ, డోరెమాన్ రాఖీలు అమ్ముడయ్యాయి. ఇప్పుడు వాటి వెల రూ. 10 నుంచి 30 రూపాయలు ఉంది. మామూలు దారంపోగులతో తయారు చేసిన రాఖీల ధర కూడా పెరిగింది. వాటి ధర కూడా 15 రూపాయలు పలుకుతోంది. రాఖీలపై నరేంద్ర మోడీ ప్రభావం సైతం కనబడుతోంది. ప్రధాని చిత్రంతో రూపొందించిన రాఖీలు పెద్ద ఎత్తున అమ్ముడవుతున్నాయని దుకాణదారులు చెబుతున్నారు. వాటి ధర రూ.20 నుంచి 30 రూపాయలు ఉంది. టీవీ సీరియల్స్ ప్రభావం కూడా రాఖీ మార్కెట్‌నై పడింది. కామెడీ నైట్స్ విత్ కపిల్ షో యాంకర్ కపిల్ శర్మ తరచుగ వాడే డైలాగ్ ‘బాబా జీకా టుల్లు’ ఆధారంగా రూపొందించిన రాఖీ వెల రూ.300లని దుకాణదారులు అంటున్నా రు. మరో టీవీ సీరియల్ వీరా ఆధారంగా రూ పొందిన రాఖీ వెల 60 రూపాయలు పలుకుతోంది. రక్షాబంధన్‌ను పురస్కరించుకుని నగరంలోని విభిన్న ప్రభుత్వం విభాగాలు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. సోదరీమణులు పంపే రాఖీలు సోదరులకు సకాలంలో చేర్చడానికి తపాలా విభాగం నగరంలోని 34 ముఖ్యమైన పోస్టాఫీసుల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసింది. గత 20 రోజులుగా ఈ కౌంటర్లు పనిచేస్తున్నాయి. రాఖీపౌర్ణిమ నాడు అంటే.. ఆదివారం ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మహిళలకు డీటీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించారు. ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహిళల భద్రత కోసం పలు ప్రాంతాలలో అధిక బలగాలను మోహరించారు. -
పోలీసులకు టీవీ సిస్టర్స్ రాఖీలు
న్యూఢిల్లీ: హిందీ సీరియళ్ల అభిమానులకు శాస్త్రి సిస్టర్స్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇదే పేరుతో ప్రసారమయ్యే సీరియల్లో అక్కాచెల్లెళ్లు కనిపించే నేహా పెడ్నేకర్ (అల్కానీ), ఇషితా గంగూలీ (అనుష్క), సోనల్ వెంగులూకర్ (దేవయాని), ప్రగతి చౌరాసియా (పియా) శుక్రవారం ఢిల్లీకి వచ్చిన సందర్భంగా పోలీసు అధికారులకు రాఖీలు కట్టారు. ఈ షోలో పెద్ద అక్కగా కనిపించే నేహా మాట్లాడుతూ ఎవరికైనా రాఖీ కడుతున్నప్పుడు అతడు మనకు ఆపత్కాలంలో రక్షణ కల్పిస్తాడనే నమ్మకం కుదురుతుందని చెప్పింది. గత నెల శాస్త్రిసిస్టర్స్ షూటింగ్ ఢిల్లీలో జరిగినప్పుడు పోలీసులు తమకు తగిన భద్రత కల్పించి ఆదుకున్నారని తెలిపింది. ఆపత్కాలంలో నలుగురు తోబట్టువుల ఐక్యమత్యం గురించి శాస్త్రి సిస్టర్స్ వివరిస్తుంది. కాన్పూర్ నుంచి ఢిల్లీ ఉపాధి కోసం ఢిల్లీకి వచ్చాక ప్రేమలు, వేధింపులు, ఇళ్ల వంటి సమస్యలను ఎలా ఎదర్కున్నారో తెలియాలంటే ఈ సీరియల్ చూడాల్సిందే. రక్షాబంధన్ అంటేనే భద్రత గుర్తుకు వస్తుందని, మనదేశానికి ఎంతో సేవ చేస్తున్న పోలీసులతోపాటు సాయుధ దళాలకు శిరసు వంచి వందనం చేయాల్సిందేనని మరో సిస్టర్ సోనల్ చెప్పింది. అన్నట్టు.. శాస్త్రి సిస్టర్స్ కలర్స్ చానెల్లో ప్రసారమవుతోంది.