ఆవుపేడతో చేసిన రాఖీలు (శ్రీకృష్ణా గోశాల ఎఫ్‌బీ ఫొటో)
బిజనోర్: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే రాఖీ పూర్ణిమకు రకరకాల డిజైన్ల రాఖీలు మార్కెట్‌లో అమ్ముతుంటారు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని బిజనోర్ జిల్లాలో శ్రీకృష్ణా గోశాల నిర్వాహకులు విభిన్నంగా ఆవు పేడతో రాఖీలు తయారు చేశారు. సహజ రంగులు, దారాలతో పర్యావరణ హితంగా వీటిని తయారు చేసినట్టు ఎన్నారై మహిళ అల్కా లహోటి(52) తెలిపారు. తన తండ్రికి తోడుగా గోశాల నిర్వహణను చూసుకునేందుకు ఇండోనేసియాలో ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఆమె బిజనోర్‌కు వచ్చేశారు.
‘జునా అఖహరాతో కలిసి ఆవు పేడతో మేము తయారుచేసిన రాఖీలను మొదటసారి కుంభమేళాలో ప్రదర్శించినప్పుడు మంచి స్పందన వచ్చింది. ప్రజల కోసం ఇలాంటి రాఖీలు రూపొందించాలని స్వాములు సూచించారు. ఇతర నిపుణుల సాయంతో రాబోయే రాఖీ పండగ కోసం వేల సంఖ్యలో రాఖీలు తయారుచేశాం. ఉత్తరప్రదేశ్ నుంచే కాకుండా కర్ణాటక, ఉత్తరాఖండ్, ఒడిశా నుంచి ఆర్డర్లు వచ్చాయి. వివిధ ఆకృతులు, పరిమాణాల్లో టెంప్లేట్స్ తయారుచేసుకుని వీటిలో ఆవు పేడ నింపుతాం. తర్వాత వీటిని చల్లటి, చీకటి ప్రదేశంలో ఉంచుతాం. ఆరిపోయిన తర్వాత పర్యావరణహిత రంగులద్ది, రంగు రంగుల దారాలు కడతాం. చైనా రాఖీలతో పోలిస్తే ఈ రాఖీలు పర్యావరణహితమైనవి. వీటిని తయారుచేయడంలో మొదట్లో పలు సవాళ్లు ఎదుర్కొన్నాం. ఈ రాఖీలు త్వరగా ఇరిగిపోయేవి. ప్రయోగాలు కొనసాగిస్తూనే ఈ సమస్యను అధిగమించాం. గట్టిగా, దృఢంగా ఉండేలా వీటిని రూపొందించగలిగాం. తక్కువ ధరకే వీటిని విక్రయిస్తాం. మిగిలిపోయిన రాఖీలను ఉచితంగా పంచిపెడతామ’ని అల్కా లహోటి వివరించారు. శ్రీకృష్ణా గోశాలలో 117పైగా ఆవులున్నాయి. ఆవు మూత్రంతో ఫినాయిల్, పేడతో పూలకుండీలు కూడా తయారుచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment