తాము తయారుచేసిన కళాకృతులతో పూజా బృందం; పేడతో కళాకృతులు తయారు చేస్తూ...
‘ఇంకేం మిగిలింది పేడ’ అని వ్యంగ్యంగా అనవచ్చు. పేడ విలువ మన పూర్వికులకు తెలుసు. దాని ఉపయోగాలూ తెలుసు. పేడ అలికిన ఇల్లు శుభదాయకమైనది. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇప్పుడొక టీచరమ్మ పేడతో కళాకృతులు తయారు చేస్తోంది. ఆధ్యాత్మిక చిహ్నాలను పేడతో రూపొందిస్తోంది. వీటి అలంకరణ ఇంటికి సంప్రదాయకళ తెస్తుందని చెబుతోంది. ప్రస్తుతం జనం వాటిని కొనేందుకు సిద్ధమవుతున్నారు.
పేడతో పిడకలు కొట్టడం, కళ్లాపి చల్లుకోవడం, ఇల్లు అలుక్కోవడం తరతరాలు చేస్తున్నదే. కాని పేడతో కళాకృతులు చేయడం ద్వారా ఒట్టిపోయిన ఆవులను, ఎడ్లను కూడా రోడ్ల మీద వదలడమో, కబేళాకు తరలించడమో చేయకుండా వాటి ఆలనా పాలనా చూడొచ్చు అంటుంది 42 ఏళ్ల పూజా గాంగ్వర్.
కిలో పేడ ఎంత?
కిలో పేడ మనం ఎంతకు కొంటాం? ఎంతకీ కొనం. ఎందుకంటే పేడ ఎక్కడైనా దొరుకుతుంది. ‘కాని వాటితో కళాకృతులు చేస్తే కిలో పేడ కళాకృతులకు 2000 రూపాయలు వస్తాయి. సంపాదించవచ్చు’ అంటోంది పూజా గాంగ్వర్. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌కు సమీపంలోని రాజన్‌పూర్ అనే గ్రామంలో ప్రైమరీ టీచర్‌గా పని చేస్తున్న పూజా గాంగ్వర్ పేడతో కళాకృతులు చేయడమే కాదు. వాటివల్ల ఒక డజను మందికి ఉపాధి కల్పిస్తోంది, ఆదాయమూ గడిస్తోంది. వాల్ హ్యాంగింగులు, నేమ్ ప్లేట్లు, బొమ్మలు, పెన్ హోల్డర్లు, అగర్ బత్తీలు, చెప్పులు... ఇలా ఎన్నో తయారు చేస్తూ ఆకట్టుకుంటోంది.
తేలిక బొమ్మలు
పేడతో తయారయ్యే వస్తువులు తేలిగ్గా ఉంటాయి. ఎందుకంటే పేడను సేకరించి, ఎండబెట్టి, పొడి చేసుకుని, జల్లెడ పట్టుకుని, ఆ వచ్చిన మెత్తటి పొడికి మైదా పిండిగాని, చెట్టు బంక గాని, ముల్తానీ మట్టిగాని కలిపి సాగే లక్షణం కలిగిన బంక పదార్థంగా (క్లే) చేసుకుని దానితో కళాకృతులు తయారు చేస్తారు. ‘ఇనుము, రాగి, ఫైబర్ మూసల్లో పేడ క్లేను మూసబోసి ఆరబెట్టి బొమ్మలను తయారు చేస్తాం’ అని తెలిపింది గాంగ్వర్.
బొప్పాయి పాలు
‘మూసలో పోసి ఆరబెట్టుకున్న కళాకృతులకు పాలిష్ కోసం బొప్పాయి పాలుగాని, అవిసె గింజల నూనె గాని వాడతాం. ఈ కళాకృతులు పాడుగావు. నీళ్లు తగలకుండా చూసుకుంటే ఐదారేళ్లు ఉంటాయి. మా ఊళ్లోని యాభై ఆవుల పేడను నేను ఈ బొమ్మల కోసం వాడుతున్నాను. ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల నుంచి స్త్రీలు వచ్చి నేర్చుకుంటామంటున్నారు. వారికి ట్రయినింగ్ ఇస్తే ఆవు పేడ సద్వినియోగం అవుతుంది. ఆవుల సంరక్షణా జరుగుతుంది’ అని తెలిపింది పూజ..
Comments
Please login to add a commentAdd a comment