traditional art
-
అందెల రవళికి స్వర్ణోత్సవం
నేటి నుంచి జరగబోయే పతాక స్వర్ణోత్సవాలకు కూచిపూడి సిద్ధమైంది. సిద్దేంద్రయోగి అడుగు జాడలతో కూచిపూడి వెలిగిపోనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎంతోమంది కూచిపూడి అభిమానులు, నాట్యకారులను అమితంగా ఆకర్షిస్తున్న మాట... కూచిపూడి స్వర్ణోత్సవ పతాకం. ‘కూచిపూడి’ పుట్టిన కూచన్నపూడి గ్రామం పేరు కూచిపూడిగా మారింది. దేశానికి జాతీయ జెండా ఉన్నట్లుగానే కూచిపూడి వైభవాన్ని ప్రతిబించించే పతాకం ఒకటి ఉండాలని వేదాంతం పార్వతీశం సంకల్పించారు. చెరకుగడ, జడ, కర్ర గుర్తులతో 1974లో పతాకాన్ని రూపొందించారు. ఆ రూపకల్పన జరిగి యాభైఏళ్లు పూర్తయిన సందర్భంగా పతాక స్వర్ణోత్సవాలకు ముస్తాబైంది కూచిపూడి. కూచిపూడి కళా పీఠం దగ్గర 50 అడుగుల ఎత్తులో నిర్మించిన స్థూప పతాకాన్ని నేడు ఆవిష్కరించనున్నారు. మూడు రోజులపాటు కూచిపూడి గురువులు, కళాకారులు, కళాభిమానుల మధ్య రకరకాల కార్యక్రమాలు జరగనున్నాయి. పతాక స్వర్ణోత్సావాల నేపథ్యంలో చివరిరోజు రెండు వేల మందికి పైగా కళాకారులతో ప్రదర్శన ఇచ్చేందుకు కూచిపూడి సిద్ధం అయింది. ప్రదర్శనలకు ముందు అంబాపరాకు పాట పాడడం సంప్రదాయంగా వస్తోంది ‘అందెల రవమిది పదములదా... అంబరమంటిన హృదయముదా’ అంటూ కూచిపూడి స్వర్ణోత్సవ పతాకం తన సంబరాన్ని అంబరంతో పంచుకునే దృశ్యం కనుల విందు చేయనుంది. గత వైభవం ఘనంగా...మన సంప్రదాయ కళను భవిష్యత్తు తరాలకు అందించాలన్నదే నా లక్ష్యం. పతాక స్వర్ణోత్సవాలలాంటి కార్యక్రమాల ద్వారా గత వైభవాన్ని మళ్లీ ఘనంగా గుర్తుకు తెచ్చుకోవచ్చు. ఆ ఉత్సాహంతో మన నాట్యకళ మరింత శక్తిమంతమై మరింతగా జనాల్లోకి వెళుతుంది.– జి. శ్రీవత్సల, రాజమహేంద్రవరంనవతరానికి స్ఫూర్తిని ఇచ్చేలా...అమ్మ సలహా మేరకు నేర్చుకున్న కూచిపూడి ఇప్పుడు నాకు మరో అమ్మ. కూచిపూడి పతాక స్వర్ణోత్సవాల గురించి తెలుసుకున్నప్పుడు చాలా సంతోషించాను. దేశ విదేశాల నుంచి నాట్యకారులు పాల్గొనే ఈ కార్యక్రమాలతో ఆ గడ్డపై గత వైభవం మరోసారి పునరావిష్కృతం అవుతుంది. నవతరానికి స్ఫూర్తిని ఇస్తుంది.– ఎం. వసుధ, హైదరాబాదుఆ జెండా రెప రెపలలో...కూచిపూడి పతాక స్వర్ణోత్సవాల సందడి ఆప్రాంతానికి మాత్రమే పరిమితమైనది కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది కూచిపూడి కళాకారులకు సంతోషాన్ని కలిగించే విషయం. ఆ జెండా రెపరెపలలో కూచిపూడి కళ మరింతగా వెలిగిపోవాలని కోరుకుంటున్నాను.– లంక సుస్మిత, విజయవాడదిశానిర్దేశం చేసే పతాకంకూచిపూడి పతాక స్వర్ణోత్సవాలు ప్రపంచం నలుమూలలలో ఉన్న కూచిపూడి కళాకారులకు పండగలాంటివి. అంతెత్తున ఎగరబోయే జెండా కూచిపూడి నృత్యానికి సంబంధించి మౌనంగానే దిశానిర్దేశం చేయనుంది.– జల్లూరి శరణ్య, మచిలీపట్నంకెనడాలో కూచిపూడియాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా కూచిపూడి పతాక స్వర్ణోత్సవాలు నిర్వహిస్తునందుకు సంతోషంగా ఉంది. కెనడాలో కూచిపూడి అకాడమీ ఏర్పాటు చేశాను. ఆసక్తి ఉన్న వారికి నేర్పించడంతో పాటు ప్రదర్శనలు ఇస్తున్నాను. కూచిపూడి నాట్య వ్యాప్తి కోసం నా వంతుగా కృషి చేస్తున్నాను.– డాక్టర్ వేదాంతం వెంకట నాగ చలపతి రావు, కెనడాపేద పిల్లలకు అండగా... ప్రతి ఏటా ఆర్థిక స్థోమత లేని ఇద్దరు చిన్నారులకు సొంత ఖర్చుతో కూచిపూడిలో శిక్షణ ఇప్పిస్తున్నాను. ఇప్పటికి 40 మందికి నేర్పించా. ఇక్కడ నేర్చుకున్న ఎంతోమంది నాట్య పాఠశాలలు మొదలుపెట్టి ఆసక్తి ఉన్న వారికి కూచిపూడి నేర్పిస్తున్నారు.– డా. రవి బాలకృష్ణ, వైస్ ప్రిన్సిపల్, కూచిపూడి కళాక్షేత్రం, కూచిపూడి– ఎస్.పి యూసుఫ్, సాక్షి, మచిలీపట్నంఫోటోలు: పవన్, సాక్షి, విజయవాడ -
భలే... పేడ కళ
‘ఇంకేం మిగిలింది పేడ’ అని వ్యంగ్యంగా అనవచ్చు. పేడ విలువ మన పూర్వికులకు తెలుసు. దాని ఉపయోగాలూ తెలుసు. పేడ అలికిన ఇల్లు శుభదాయకమైనది. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇప్పుడొక టీచరమ్మ పేడతో కళాకృతులు తయారు చేస్తోంది. ఆధ్యాత్మిక చిహ్నాలను పేడతో రూపొందిస్తోంది. వీటి అలంకరణ ఇంటికి సంప్రదాయకళ తెస్తుందని చెబుతోంది. ప్రస్తుతం జనం వాటిని కొనేందుకు సిద్ధమవుతున్నారు. పేడతో పిడకలు కొట్టడం, కళ్లాపి చల్లుకోవడం, ఇల్లు అలుక్కోవడం తరతరాలు చేస్తున్నదే. కాని పేడతో కళాకృతులు చేయడం ద్వారా ఒట్టిపోయిన ఆవులను, ఎడ్లను కూడా రోడ్ల మీద వదలడమో, కబేళాకు తరలించడమో చేయకుండా వాటి ఆలనా పాలనా చూడొచ్చు అంటుంది 42 ఏళ్ల పూజా గాంగ్వర్. కిలో పేడ ఎంత? కిలో పేడ మనం ఎంతకు కొంటాం? ఎంతకీ కొనం. ఎందుకంటే పేడ ఎక్కడైనా దొరుకుతుంది. ‘కాని వాటితో కళాకృతులు చేస్తే కిలో పేడ కళాకృతులకు 2000 రూపాయలు వస్తాయి. సంపాదించవచ్చు’ అంటోంది పూజా గాంగ్వర్. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌కు సమీపంలోని రాజన్‌పూర్ అనే గ్రామంలో ప్రైమరీ టీచర్‌గా పని చేస్తున్న పూజా గాంగ్వర్ పేడతో కళాకృతులు చేయడమే కాదు. వాటివల్ల ఒక డజను మందికి ఉపాధి కల్పిస్తోంది, ఆదాయమూ గడిస్తోంది. వాల్ హ్యాంగింగులు, నేమ్ ప్లేట్లు, బొమ్మలు, పెన్ హోల్డర్లు, అగర్ బత్తీలు, చెప్పులు... ఇలా ఎన్నో తయారు చేస్తూ ఆకట్టుకుంటోంది. తేలిక బొమ్మలు పేడతో తయారయ్యే వస్తువులు తేలిగ్గా ఉంటాయి. ఎందుకంటే పేడను సేకరించి, ఎండబెట్టి, పొడి చేసుకుని, జల్లెడ పట్టుకుని, ఆ వచ్చిన మెత్తటి పొడికి మైదా పిండిగాని, చెట్టు బంక గాని, ముల్తానీ మట్టిగాని కలిపి సాగే లక్షణం కలిగిన బంక పదార్థంగా (క్లే) చేసుకుని దానితో కళాకృతులు తయారు చేస్తారు. ‘ఇనుము, రాగి, ఫైబర్ మూసల్లో పేడ క్లేను మూసబోసి ఆరబెట్టి బొమ్మలను తయారు చేస్తాం’ అని తెలిపింది గాంగ్వర్. బొప్పాయి పాలు ‘మూసలో పోసి ఆరబెట్టుకున్న కళాకృతులకు పాలిష్ కోసం బొప్పాయి పాలుగాని, అవిసె గింజల నూనె గాని వాడతాం. ఈ కళాకృతులు పాడుగావు. నీళ్లు తగలకుండా చూసుకుంటే ఐదారేళ్లు ఉంటాయి. మా ఊళ్లోని యాభై ఆవుల పేడను నేను ఈ బొమ్మల కోసం వాడుతున్నాను. ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల నుంచి స్త్రీలు వచ్చి నేర్చుకుంటామంటున్నారు. వారికి ట్రయినింగ్ ఇస్తే ఆవు పేడ సద్వినియోగం అవుతుంది. ఆవుల సంరక్షణా జరుగుతుంది’ అని తెలిపింది పూజ.. -
Tholu Bommalata: ఒకప్పుడు తిరుగులేని ఆదరణ.. ఇప్పుడు కనుమరుగు
ప్రేక్షకులకు సినిమా పరిచయం లేని రోజుల్లో ఓ వెలుగు వెలిగిన తోలుబొమ్మలాట ప్రదర్శన క్రమంగా ఆదరణ కోల్పోతూ వస్తోంది. సినిమాల రాకతో తోలు బొమ్మలాట ప్రభావం కొంత తగ్గినా క్రమేణా టీవీలు రావడం, ఆ తర్వాత మొబైల్ ఫోన్ల ఆవిర్భావంతో బొమ్మలాట దాదాపుగా కనుమరుగైంది. చాలా ప్రాంతాల్లో తోలుబొమ్మలాట కళాకారులు, వారి వారసులు ప్రత్యామ్నాయ వృత్తులను ఆశ్రయించారు. దీంతో తర్వాతి తరం బొమ్మలాట కళకు దూరమైంది. సాక్షి ప్రతినిధి, కడప: ఒకప్పుడు బొమ్మలాటకు గ్రామాల్లో తిరుగులేని ఆదరణ ఉండేది. క్రీస్తు పూర్వమే పుట్టిన బొమ్మలాట కళ 1980వ దశకం వరకు వైభవంగా నడిచింది. ఈ కళను గ్రామాలలో విపరీతంగా ఆదరించారు. బొమ్మలాట కళాకారులు రామాయణం, భారతంలోని దాదాపు 30 ఘట్టాలను ప్రదర్శించేవారు. ప్రధానంగా భారతంలో విరాటపర్వం, భీష్మపర్వం, ద్రోణపర్వం, పద్మవ్యూహం, సైంధవ వధ, దానవీర శూర కర్ణ, శల్య, శకుని, భీమ, దుర్యోధన యుద్ధం, అశ్వమేధ యాగం, ప్రమీలార్జునీయం, విభీషణ విజయం, బబ్రువాహన చరిత్ర తదితర ఘట్టాలను బొమ్మలాట ద్వారా ప్రదర్శించేవారు. ఇక రామాయణంలో సుందరకాండ, లక్ష్మణమూర్ఛ, సతీసులోచన, ఇంద్రజిత్తు మరణం, రామరామ యుద్ధం, మహిరావణ చరిత్ర తదితర పురాణ గాథలను కూడా తోలు బొమ్మలాటలో ప్రాధాన్యత పొందాయి. పది మంది కళాకారులతో నాటకం తోలు బొమ్మలాట ప్రదర్శనకు పది మంది కళాకారులు అవసరం. హార్మోనియం, తబలా, డబ్బా తదితర సంగీత వాయిద్యాలను వాయించేవారితోపాటు మిగిలిన వారు బొమ్మలు ఆడించడం, పద్యాలు పాడటం, అర్థం చెప్పేందుకు మరికొంతమంది కళాకారులు పనిచేసేవారు. రామాయణ, భారతంలోని మగ పాత్రలకు మగవాళ్లే పనిచేసేవారు. ఆడపాత్రలకు మహిళలు తెరవెనుక నాటకం వేసేవారు. మహిళలు సైతం పోటాపోటీగా పౌరాణిక ఘటనలను పద్యాల ద్వారా చెప్పి వినసొంపుగా అర్థాలు విడమరిచి చెప్పేవారు. తోలుబొమ్మలాటలో బొమ్మలు ఆడించడం ఒక కళ అయితే, వాటికి అనుగుణంగా పద్యాలు పాడి అర్థాలు చెప్పడం అంతకుమించిన కళ. ఈ రెండింటి అనుసంధానంతోనే బొమ్మలాట నాటకాన్ని కళాకారులు రక్తి కట్టిస్తారు. ప్రమిదల వెలుగులో బొమ్మలాట నాటకం పూర్వం బొమ్మలాటను ప్రత్యేకమైన తెల్ల పంచె తెరగా ఏర్పాటు చేసుకుని చుట్టూ చీకటి ఉండేలా చూసుకుని తెరవెనుక ఆముదం పోసి వెలిగించిన ప్రమిదల సాయంతో తెరపైన తోలుబొమ్మలు కనబడేలా చేసేవారు. రానురాను పెట్రోమ్యాక్స్ లైట్లు, ఆ తర్వాత గ్యాస్ లైట్లు, విద్యుత్ బల్బుల సాయంతో బొమ్మలు తెరపైన కనబడేలా చేసేవారు. అప్పట్లో తెరపైన బొమ్మలు ఆడటం పాతతరం గ్రామీణ ప్రజలకు వింతగా, ఆసక్తిగా, సంబరంగా ఉండేది. పైపెచ్చు చదువులేకపోయినా వంట బట్టించుకున్న పౌరాణిక గాథలు కళ్ల ముందు కనిపించడం అప్పటి జనాన్ని మరింత ఆకట్టుకునేది. నాటకాల్లో సీరియస్ పాత్రలతోపాటు జుట్టుపోలిగాడు, బంగారక్క పాత్రలను సైతం సృష్టించి బొమ్మల ద్వారా హాస్యాన్ని పండించేవారు. తోలు బొమ్మలాటకు తిరుగులేని ఆదరణ తోలుబొమ్మలాట కళకు 80వ దశకం వరకు తిరుగులేని ఆదరణ ఉండేది. ఒక్కో గ్రామంలో 15 రోజుల నుంచి నెలరోజులపాటు కూడా నాటకం ఆడేవారు. పక్క గ్రామాలకు వెళ్లాలంటే ఆయా గ్రామాల ప్రజలు వచ్చి ళాకారులకు తాంబూలం ఇచ్చి తేదీని ఖరారు చేసుకునేవారు. ఇప్పటి సినిమా నటుల కాల్షీట్ల డిమాండ్ కంటే అప్పటి బొమ్మలాట కళాకారుల డిమాండ్ మూడింతలు ఉండేది. కళాకారులు తోలు బొమ్మలను వారి వాయిద్యాలతోపాటు ఇతర సామగ్రిని మూడు లేదా నాలుగు ఎద్దుల బండ్లలో సామాన్లు నింపుకుని నెలల తరబడి గ్రామాల్లోనే ఉండేవారు. ఒక్కోసారి ఆరు నెలలు లేదా ఏడాదిపాటు సంచార జీవనం గడుపుతూ ఇంటికి రాకుండా బొమ్మలాట ఆడేవారు. అప్పట్లో నాటకానికి రూ. 15 అప్పట్లో గ్రామంలో ఒకరోజు నాటకం ఆడేందుకు రూ. 15 చెల్లించేవారు. ఇది కాకుండా కళాకారులు గ్రామంలో ఉన్నన్నాళ్లు ఇంటింటికి వెళ్లి ధాన్యం సేకరించుకునేవారు. వారు ఎన్ని రోజులు ఉన్నా భోజన ఏర్పా ట్లు గ్రామ ప్రజలే చూసుకునేవారు. బొమ్మలాట కళాకారులను గుర్తించిన నాటి ప్రధాని నెహ్రూ, దివంగత ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖరరెడ్డిలు కళాకారులను ప్రశంసించడంతోపాటు సన్మానించారు. 80వ దశకం తర్వాత ఆదరణ కోల్పోయిన వైనం 80వ దశకం వరకు వైభవంగా నడిచిన తోలు బొమ్మలాట ఆ తర్వాత క్రమేణ ఆదరణ కోల్పోయి దాదాపుగా అంతరించిపోయింది. తొలుత సినిమాల రాకతో తోలు బొమ్మలాటకు ఆదరణ తగ్గింది. ఆ తర్వాత టీవీల రాక, వాటి తర్వాత మొబైల్ఫోన్ల పుట్టుకతో తోలుబొమ్మలాట పూర్తిగా కనుమరుగైంది. ఇప్పటి తరానికి తోలు బొమ్మలాట అంటే ఏంటో తెలియని పరిస్థితి. వైఎస్సార్ జిల్లాలో బొమ్మలాట కళాకారులు జిల్లాలోని కలసపాడు మండలం సింగరాయపల్లె, పోరుమామిళ్ల మండలం అగ్రహారం, చిన్నాయపల్లె, పోరుమామిళ్ల పట్టణంలోని ఎస్టీ కాలనీ, మహబూబ్‌నగర్ ప్రాంతంలో 50 కుటుంబాలకు పైగా ఈ కళాకారులు ఉండేవారు. జిల్లాలో కడప సమీపంలోని ఆలంఖాన్‌పల్లె వద్ద, అలాగే అనంతపురం జిల్లా ధర్మవరంలోనూ కళాకారులు ఉండేవారు. ప్రస్తుతం జిల్లాలోని పోరుమామిళ్లలో మూడు కుటుంబాల వారు మాత్రమే ఉన్నారు. బొమ్మలాట ప్రదర్శనకు ఎవరూ ఆసక్తి చూపడం లేదని వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బొమ్మల తయారీ ఇలా.. మేక, గొర్రె, కొండగొర్రె తదితర జంతువుల చర్మాలను సేకరించి వాటిని శుభ్రపరిచి ఆరబెట్టుకుని ఆ తర్వాత వాటిపైన గోరుగల్లు సాధనంతో రామాయణానికి సంబంధించి రాముడు, సీత, ఆంజనేయుడు, అంగధుడు, సుగ్రీవుడు, రావణాసురుడు తదితర బొమ్మలు, భారతానికి సంబంధించి పాండవులు, కౌరవుల బొమ్మల ఆకారాలను గీతల ద్వారా గీసుకునేవారు. తర్వాత నెల్లూరు, గుంటూరు, విజయవాడ ప్రాంతాల నుంచి తెచ్చిన ప్రత్యేకమైన రంగులు బొమ్మలకు వేసుకునేవారు. రోడ్డున పడ్డ కళాకారులు బొమ్మలాటకు ఆదరణ తగ్గడంతో కళాకారులు వీధిన పడ్డారు. వృత్తిని పక్కనపెట్టి బతుకుదెరువు కోసం రకరకాల వృత్తులను ఎన్నుకున్నారు. పెద్దమునిరావు కుమారులు ఖాదర్ రావు, వెంకటేశ్వర్లు పెయింటింగ్ పనులు, వాచ్‌మన్‌గా ఉంటుండగా, రమణరావు ముగ్గురు కుమారులు పాత ఇనుము సేకరించే వ్యాపారంలో పడ్డారు. నరసింహారావు కుమారులు సైతం చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పెద్దమునిరావు, నరసింహారావు, రమణరావులు గ్రామాలలో తెలిసిన వారి పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యాలకు వెళ్లి వారిచ్చే కొద్దోగొప్పో మొత్తం స్వీకరించి కాలం వెళ్లదీస్తున్నారు. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కొంతమంది కళాకారులకు పెన్షన్ ఇస్తుండడంతో వృద్ధ కళాకారులకు కొంతమేర ఆసరాగా ఉంటోంది. (క్లిక్ చేయండి: మహిమాన్విత సూఫీ క్షేత్రం.. కడప అమీన్‌పీర్ దర్గా) కళను ప్రోత్సహించాలి అంతరించిపోతున్న బొమ్మలాట కళను నిలబెట్టుకునేలా ప్రభుత్వం ప్రోత్సహించాలి. కళాకారులను ఆదుకోవాలి. వారికి నాటకాలు వేసే అవకాశం కల్పించాలి. తద్వారా ఉపాధి అందించాలి. కళాకారులందరికీ పెన్షన్లు మంజూరు చేయాలి. ఇతరత్రా సంక్షేమ పథకాలను అందించాలి. ప్రభుత్వమే నాటకాలను ఆదరించాలి. – వనపర్తి పెద్దమునిరావు, ఎస్టీ కాలనీ, పోరుమామిళ్ల తోలుబొమ్మల కేంద్రం ఏర్పాటు చేయాలి తోలుబొమ్మలాట కళను బతికించేందుకు ప్రభు త్వం చర్యలు చేపట్టాలి. తోలు బొమ్మల తయారీ కేంద్రాలను నెలకొల్పాలి. తోలుబొమ్మలాట కళను భావితరాల వారికి నేర్పించాలి. ఉన్న బొమ్మలాట కళాకారులను గురువులుగా ఏర్పాటు చేసి యువతకు విద్యను నేర్పించాలి. గురువులకు, విద్య నేర్చుకునే వారికి ప్రభుత్వం ఉపాధి కల్పించాలి. – వనపర్తి నరసింహారావు, ఎస్టీ కాలనీ, పోరుమామిళ్ల ప్రభుత్వ ఆధ్వర్యంలోనే బొమ్మలాట కళాకారులను ప్రోత్సహించేందుకు తోలు బొమ్మలాటను ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రదర్శించేందుకు చర్యలు చేపట్టాలి. బొమ్మలాట కళను విస్తృ తం చేసేందుకు కళను ఆసక్తిగల యువతకు నేర్పించాలి. కళాకారులందరికీ ప్రభుత్వం పెన్షన్లతోపాటు ఇంటి పట్టాలు, ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. సంక్షేమ పథకాలు అందించి ఆదుకోవాలి. – వనపర్తి రమణారావు, ఎస్టీ కాలనీ, పోరుమామిళ్ల -
కర్రసాముకు పూర్వవైభవం.. చిన్నారుల్లో పెరుగుతున్న ఆసక్తి
విజయవాడ స్పోర్ట్స్: ప్రాచీన యుద్ధ కళ కర్రసాము (సిలంబం)కు పూర్వవైభవం వస్తోంది. విజయవాడ నగరానికి చెందిన చిన్నారులు కర్రసాములో నిష్ణాతులై, క్రీడా వేదికలపై సత్తా చాటుతున్నారు. నిరంతర సాధనతో జాతీయ పతకాలు కైవసం చేసుకుంటున్నారు. అంతరించిపోతున్న కళల జాబితాలో చేరిన విద్యను తాజాగా వెలుగులోకి తీసుకొస్తున్నారు. విశిష్ట చరిత్ర.. క్రీస్తుకు పూర్వమే ఈ కర్రసాము విద్య పుట్టింది. అప్పటి జీవన విధానం, అందుబాటులోని వనరుల ఆధారంగా శత్రువులపై పైచేయి సాధించేందుకు తమిళనాడులో గాడ్ మురుగన్ సంప్రదాయ కర్రసామును ప్రపంచానికి పరిచయం చేశారు. తమిళంలో దీనిని ‘సిలంబం’ అని, తెలుగులో ‘తాలింకానా’ అని పిలిచేవారని చరిత్ర చెబుతోంది. కర్రలతో చేసే సాధనం కావడంతో కొన్నేళ్ల తరువాత ‘కర్రసాము’గా తెలుగులో ప్రసిద్ధి కెక్కింది. కాలక్రమేణా కర్రసాము యుద్ధ ప్రాముఖ్యత తగ్గిపోయినా నేటికీ ఈ కళ కొన్ని గ్రామాల్లో సజీవంగానే ఉంది. అయితే నగర యువతకు ఈ విద్య గురించి పూర్తిగా అవగాహన ఉండదనేది అక్షర సత్యం. ఈ నేపథ్యంలోనే కర్రసాము ఔన్యత్యాన్ని నగర యువతకు చాటేందుకు ‘సంప్రదాయ కర్రసాము(ట్రెడిషనల్ సిలంబం)’ పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు. కర్రసాము సాధనతో ఆత్మరక్షణతో పాటు అధిక బరువు తగ్గడానికి, మడమలు, కీళ్లు, ఎముకల పటుత్వానికి, రక్త ప్రసరణ సజావుగా సాగేందుకు, ఏకాగ్రత పెంచేందుకు ఉపయోగపడుతుందని కోచ్‌లు వివరిస్తున్నారు. తొమ్మిది విభాగాల్లో పోటీలు.. ట్రెడిషనల్ సిలంబం పోటీలు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నారు. సింగిల్ స్టిక్, డబుల్ స్టిక్, స్వార్డ్, స్పీయర్, సురుల్వార్, డీర్ఆరమ్స్, మ్యాన్ టు మ్యాన్, డ్యూయల్ ఈవెంట్, గ్రూప్ ఈవెంట్లను నిర్వహిస్తున్నారు. వీటిల్లో మ్యాన్ టు మ్యాన్ విభాగంలో ఎదురెదురుగా ఇద్దరు యుద్ధం చేసినట్లు పోటీ పడతారు. మిగిలిన విభాగాలు కేవలం ప్రదర్శన మాదిరిగానే పోటీలు నిర్వహిస్తారు. పోటీలకు 6 మీటర్ల పొడవు, 6 మీటర్ల వెడల్పుతో ఏర్పాటు చేసిన కోర్టులో 70 సెకన్లలో ప్రదర్శన ముగించాల్సి ఉంటుంది. కర్ర తీప్పే స్పీడ్, స్టయిల్, సౌండ్, స్కిల్ ఆధారంగా మార్కులు వేస్తారు. వ్యక్తి శరీరానికి లేదా నేలకు కర్ర తాకితే నెగిటివ్ మార్కులు ఉంటాయి. జాతీయ క్రీడా వేదికపై.. చెన్నైలో గత నెల 25వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరిగిన జాతీయ స్థాయి ట్రెడిషనల్ సిలంబం పోటీల్లో విజయవాడకు చెందిన క్రీడాకారులు సత్తా చాటారు. అండర్–12 విభాగంలో ఎం.హియాజైన్ స్వర్ణం(డబుల్స్టిక్), ఎన్.యశస్వి స్వర్ణం(సింగిల్‌స్టిక్), కె.రిషికేష్ కాంస్యం(సింగిల్‌స్టిక్), అండర్–14 విభాగంలో జి.ఆరుష్ రజతం(సింగిల్ స్టిక్), అండర్–10 విభాగంలో ఎన్.కశ్యప్ రజతం(సింగిల్‌స్టిక్), పి.శ్రీకారుణ్య రజతం(డబుల్స్టిక్), అండర్–8 విభాగంలో బి.మేఘనా రజతం(సింగిల్‌స్టిక్), కారుణ్య కాంస్య(సింగిల్‌స్టిక్) పతకాలు సాధించారు. రెండు చోట్ల శిక్షణ కేంద్రాలు.. విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం, యనమలకుదురులోని కృష్ణానది వద్ద ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో కఠోర శిక్షణ తీసుకుంటున్నారు. ప్రస్తుతం విజయవాడ నగరంలో సుమారు 200 మంది చిన్నారులు కర్రసాములో శిక్షణ తీసుకుంటున్నట్లు కోచ్‌లు చెబుతున్నారు. (క్లిక్ చేయండి: అద్భుత శిల్పాలు చెక్కుతూ.. శాండ్ ఆర్టిస్ట్‌గా అంతర్జాతీయ ఖ్యాతి) అంతర్జాతీయ పతకాలు సాధిస్తాం.. ఇటీవల జరిగిన జాతీయ స్థాయి పోటీలకు దేశంలోని అన్ని రాష్ట్రాలు ప్రాతినిధ్యం వహించాయి. మన జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన ప్రతి క్రీడాకారుడు పతకం సాధించాడు. రానున్న రోజుల్లో జరిగే ప్రపంచ స్థాయి పోటీల్లోనూ పతకాలు సాధించేందుకు క్రీడాకారులను తీర్చిదిద్దుతున్నాం. – కె.సత్యశ్రీకాంత్, కోచ్ వచ్చే ఏడాది నుంచి స్కూల్ గేమ్స్‌లో.. సంప్రదాయ కర్రసాము క్రీడకు గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఏన్నో ఏళ్లుగా కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది (2023) స్కూల్ గేమ్స్‌లో చేర్చుతున్నట్లు ఇటీవల చేసిన ప్రకటన ఆనందాన్ని కలిగించింది. స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్) ఈ క్రీడకు గుర్తింపు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్)ను గుర్తింపు ఇవ్వాలని కోరుతున్నాం. – నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ ట్రెడిషనల్ సిలంబం అసోసియేషన్ కార్యదర్శి -
కలంశారి
కలంశారి... అచ్చుతప్పుకాదు అచ్చమైన ‘చేనేత’లివి... కళ అనే సిరాతో కలం గీసిన చీరలివి... ఏభైఏళ్ల వస్త్రవైభవానికి చిరునామాలివి... కలంకారి చీరలు కలలనారికి వరాలు... ‘కలం’ అంటే పెన్ను అని అర్థం. కలం చేత రంగులు అద్దేవాడు కళాకారుడు. వెదురు పుల్లను తీసుకొని, దానిని చివర సన్నగా చెక్కి, మధ్యలో ఉలెన్ దారాన్ని చుడతారు. దీని ద్వారా సహజమైన రంగులు తీసుకుంటూ, వస్త్రంపై చిత్రీకరిస్తారు. తమిళనాడులో పుట్టిన ఈ ప్రాచీన సంప్రదాయ కళ మన రాష్ట్రంలో శ్రీకాళహస్తి, మచిలీపట్నంలలో విలసిల్లుతోంది. 1- ఎరుపు-తెలుపు మేళవింపుతో లంగాఓణీని తీర్చిదిద్ది, అంచులకు కలంకారి డిజైన్‌ను జత చేర్చడంతో పదహారణాల తెలుగమ్మాయి రూపం మరింత కళగా కనిపిస్తోంది. 2- పూర్తి కలంకారి డిజైన్‌ను నింపుకున్న టస్సర్ చీర ఇది. పువ్వులు, లతలు, పక్షులు, లేళ్లు, నృత్యకారిణుల డిజైన్‌తో ఆకట్టుకుంటుంది ఈ చీర. 3- వంగపండు రంగు ఉప్పాడ పట్టు చీరకు కలంకారి డిజైన్ గల పెద్ద అంచు, చీర కొంగు ఆక ర్షణీయంగా మారాయి. 4- ఎరుపురంగు చందేరి చీరకు ఓణీ భాగం పూర్తిగా కలంకారి దుపట్టాతో జతచేయడంతో రూపం ఆధునికంగా మారింది. 5-పసుపు రంగు కోటా చీరపై రాధాకృష్ణుల కలంకారి డిజైన్‌తో చేసిన ప్యాచ్‌వర్క్ అందంగా రూపుకట్టింది. మోడల్: అశ్విని ఫొటోల: ఎస్.ఎస్.ఠాకూర్ - కిరణ్ కుమార్ మణి, కలంకారి దుస్తుల డిజైనర్, హైదరాబాద్ www.facebook.com/jayanth.kalamkari