విజయవాడ స్పోర్ట్స్: ప్రాచీన యుద్ధ కళ కర్రసాము (సిలంబం)కు పూర్వవైభవం వస్తోంది. విజయవాడ నగరానికి చెందిన చిన్నారులు కర్రసాములో నిష్ణాతులై, క్రీడా వేదికలపై సత్తా చాటుతున్నారు. నిరంతర సాధనతో జాతీయ పతకాలు కైవసం చేసుకుంటున్నారు. అంతరించిపోతున్న కళల జాబితాలో చేరిన విద్యను తాజాగా వెలుగులోకి తీసుకొస్తున్నారు.
విశిష్ట చరిత్ర..
క్రీస్తుకు పూర్వమే ఈ కర్రసాము విద్య పుట్టింది. అప్పటి జీవన విధానం, అందుబాటులోని వనరుల ఆధారంగా శత్రువులపై పైచేయి సాధించేందుకు తమిళనాడులో గాడ్ మురుగన్ సంప్రదాయ కర్రసామును ప్రపంచానికి పరిచయం చేశారు. తమిళంలో దీనిని ‘సిలంబం’ అని, తెలుగులో ‘తాలింకానా’ అని పిలిచేవారని చరిత్ర చెబుతోంది. కర్రలతో చేసే సాధనం కావడంతో కొన్నేళ్ల తరువాత ‘కర్రసాము’గా తెలుగులో ప్రసిద్ధి కెక్కింది.
కాలక్రమేణా కర్రసాము యుద్ధ ప్రాముఖ్యత తగ్గిపోయినా నేటికీ ఈ కళ కొన్ని గ్రామాల్లో సజీవంగానే ఉంది. అయితే నగర యువతకు ఈ విద్య గురించి పూర్తిగా అవగాహన ఉండదనేది అక్షర సత్యం. ఈ నేపథ్యంలోనే కర్రసాము ఔన్యత్యాన్ని నగర యువతకు చాటేందుకు ‘సంప్రదాయ కర్రసాము(ట్రెడిషనల్ సిలంబం)’ పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు. కర్రసాము సాధనతో ఆత్మరక్షణతో పాటు అధిక బరువు తగ్గడానికి, మడమలు, కీళ్లు, ఎముకల పటుత్వానికి, రక్త ప్రసరణ సజావుగా సాగేందుకు, ఏకాగ్రత పెంచేందుకు ఉపయోగపడుతుందని కోచ్‌లు వివరిస్తున్నారు.
తొమ్మిది విభాగాల్లో పోటీలు..
ట్రెడిషనల్ సిలంబం పోటీలు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నారు. సింగిల్ స్టిక్, డబుల్ స్టిక్, స్వార్డ్, స్పీయర్, సురుల్వార్, డీర్‌ఆరమ్స్, మ్యాన్ టు మ్యాన్, డ్యూయల్ ఈవెంట్, గ్రూప్ ఈవెంట్‌లను నిర్వహిస్తున్నారు. వీటిల్లో మ్యాన్ టు మ్యాన్ విభాగంలో ఎదురెదురుగా ఇద్దరు యుద్ధం చేసినట్లు పోటీ పడతారు. మిగిలిన విభాగాలు కేవలం ప్రదర్శన మాదిరిగానే పోటీలు నిర్వహిస్తారు. పోటీలకు 6 మీటర్ల పొడవు, 6 మీటర్ల వెడల్పుతో ఏర్పాటు చేసిన కోర్టులో 70 సెకన్లలో ప్రదర్శన ముగించాల్సి ఉంటుంది. కర్ర తీప్పే స్పీడ్, స్టయిల్, సౌండ్, స్కిల్ ఆధారంగా మార్కులు వేస్తారు. వ్యక్తి శరీరానికి లేదా నేలకు కర్ర తాకితే నెగిటివ్ మార్కులు ఉంటాయి.
జాతీయ క్రీడా వేదికపై..
చెన్నైలో గత నెల 25వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరిగిన జాతీయ స్థాయి ట్రెడిషనల్ సిలంబం పోటీల్లో విజయవాడకు చెందిన క్రీడాకారులు సత్తా చాటారు. అండర్–12 విభాగంలో ఎం.హియాజైన్ స్వర్ణం(డబుల్‌స్టిక్), ఎన్.యశస్వి స్వర్ణం(సింగిల్‌స్టిక్), కె.రిషికేష్ కాంస్యం(సింగిల్‌స్టిక్), అండర్–14 విభాగంలో జి.ఆరుష్ రజతం(సింగిల్ స్టిక్), అండర్–10 విభాగంలో ఎన్.కశ్యప్ రజతం(సింగిల్‌స్టిక్), పి.శ్రీకారుణ్య రజతం(డబుల్‌స్టిక్), అండర్–8 విభాగంలో బి.మేఘనా రజతం(సింగిల్‌స్టిక్), కారుణ్య కాంస్య(సింగిల్‌స్టిక్) పతకాలు సాధించారు.
రెండు చోట్ల శిక్షణ కేంద్రాలు..
విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం, యనమలకుదురులోని కృష్ణానది వద్ద ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో కఠోర శిక్షణ తీసుకుంటున్నారు. ప్రస్తుతం విజయవాడ నగరంలో సుమారు 200 మంది చిన్నారులు కర్రసాములో శిక్షణ తీసుకుంటున్నట్లు కోచ్‌లు చెబుతున్నారు. (క్లిక్ చేయండి: అద్భుత శిల్పాలు చెక్కుతూ.. శాండ్ ఆర్టిస్ట్‌గా అంతర్జాతీయ ఖ్యాతి)
అంతర్జాతీయ పతకాలు సాధిస్తాం..
ఇటీవల జరిగిన జాతీయ స్థాయి పోటీలకు దేశంలోని అన్ని రాష్ట్రాలు ప్రాతినిధ్యం వహించాయి. మన జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన ప్రతి క్రీడాకారుడు పతకం సాధించాడు. రానున్న రోజుల్లో జరిగే ప్రపంచ స్థాయి పోటీల్లోనూ పతకాలు సాధించేందుకు క్రీడాకారులను తీర్చిదిద్దుతున్నాం.
– కె.సత్యశ్రీకాంత్, కోచ్
వచ్చే ఏడాది నుంచి స్కూల్ గేమ్స్‌లో..
సంప్రదాయ కర్రసాము క్రీడకు గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఏన్నో ఏళ్లుగా కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది (2023) స్కూల్ గేమ్స్‌లో చేర్చుతున్నట్లు ఇటీవల చేసిన ప్రకటన ఆనందాన్ని కలిగించింది. స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్) ఈ క్రీడకు గుర్తింపు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్)ను గుర్తింపు ఇవ్వాలని కోరుతున్నాం.
– నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ ట్రెడిషనల్ సిలంబం అసోసియేషన్ కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment