silambam
-
కర్రసాముకు పూర్వవైభవం.. చిన్నారుల్లో పెరుగుతున్న ఆసక్తి
విజయవాడ స్పోర్ట్స్: ప్రాచీన యుద్ధ కళ కర్రసాము (సిలంబం)కు పూర్వవైభవం వస్తోంది. విజయవాడ నగరానికి చెందిన చిన్నారులు కర్రసాములో నిష్ణాతులై, క్రీడా వేదికలపై సత్తా చాటుతున్నారు. నిరంతర సాధనతో జాతీయ పతకాలు కైవసం చేసుకుంటున్నారు. అంతరించిపోతున్న కళల జాబితాలో చేరిన విద్యను తాజాగా వెలుగులోకి తీసుకొస్తున్నారు. విశిష్ట చరిత్ర.. క్రీస్తుకు పూర్వమే ఈ కర్రసాము విద్య పుట్టింది. అప్పటి జీవన విధానం, అందుబాటులోని వనరుల ఆధారంగా శత్రువులపై పైచేయి సాధించేందుకు తమిళనాడులో గాడ్ మురుగన్ సంప్రదాయ కర్రసామును ప్రపంచానికి పరిచయం చేశారు. తమిళంలో దీనిని ‘సిలంబం’ అని, తెలుగులో ‘తాలింకానా’ అని పిలిచేవారని చరిత్ర చెబుతోంది. కర్రలతో చేసే సాధనం కావడంతో కొన్నేళ్ల తరువాత ‘కర్రసాము’గా తెలుగులో ప్రసిద్ధి కెక్కింది. కాలక్రమేణా కర్రసాము యుద్ధ ప్రాముఖ్యత తగ్గిపోయినా నేటికీ ఈ కళ కొన్ని గ్రామాల్లో సజీవంగానే ఉంది. అయితే నగర యువతకు ఈ విద్య గురించి పూర్తిగా అవగాహన ఉండదనేది అక్షర సత్యం. ఈ నేపథ్యంలోనే కర్రసాము ఔన్యత్యాన్ని నగర యువతకు చాటేందుకు ‘సంప్రదాయ కర్రసాము(ట్రెడిషనల్ సిలంబం)’ పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు. కర్రసాము సాధనతో ఆత్మరక్షణతో పాటు అధిక బరువు తగ్గడానికి, మడమలు, కీళ్లు, ఎముకల పటుత్వానికి, రక్త ప్రసరణ సజావుగా సాగేందుకు, ఏకాగ్రత పెంచేందుకు ఉపయోగపడుతుందని కోచ్‌లు వివరిస్తున్నారు. తొమ్మిది విభాగాల్లో పోటీలు.. ట్రెడిషనల్ సిలంబం పోటీలు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నారు. సింగిల్ స్టిక్, డబుల్ స్టిక్, స్వార్డ్, స్పీయర్, సురుల్వార్, డీర్ఆరమ్స్, మ్యాన్ టు మ్యాన్, డ్యూయల్ ఈవెంట్, గ్రూప్ ఈవెంట్లను నిర్వహిస్తున్నారు. వీటిల్లో మ్యాన్ టు మ్యాన్ విభాగంలో ఎదురెదురుగా ఇద్దరు యుద్ధం చేసినట్లు పోటీ పడతారు. మిగిలిన విభాగాలు కేవలం ప్రదర్శన మాదిరిగానే పోటీలు నిర్వహిస్తారు. పోటీలకు 6 మీటర్ల పొడవు, 6 మీటర్ల వెడల్పుతో ఏర్పాటు చేసిన కోర్టులో 70 సెకన్లలో ప్రదర్శన ముగించాల్సి ఉంటుంది. కర్ర తీప్పే స్పీడ్, స్టయిల్, సౌండ్, స్కిల్ ఆధారంగా మార్కులు వేస్తారు. వ్యక్తి శరీరానికి లేదా నేలకు కర్ర తాకితే నెగిటివ్ మార్కులు ఉంటాయి. జాతీయ క్రీడా వేదికపై.. చెన్నైలో గత నెల 25వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరిగిన జాతీయ స్థాయి ట్రెడిషనల్ సిలంబం పోటీల్లో విజయవాడకు చెందిన క్రీడాకారులు సత్తా చాటారు. అండర్–12 విభాగంలో ఎం.హియాజైన్ స్వర్ణం(డబుల్స్టిక్), ఎన్.యశస్వి స్వర్ణం(సింగిల్‌స్టిక్), కె.రిషికేష్ కాంస్యం(సింగిల్‌స్టిక్), అండర్–14 విభాగంలో జి.ఆరుష్ రజతం(సింగిల్ స్టిక్), అండర్–10 విభాగంలో ఎన్.కశ్యప్ రజతం(సింగిల్‌స్టిక్), పి.శ్రీకారుణ్య రజతం(డబుల్స్టిక్), అండర్–8 విభాగంలో బి.మేఘనా రజతం(సింగిల్‌స్టిక్), కారుణ్య కాంస్య(సింగిల్‌స్టిక్) పతకాలు సాధించారు. రెండు చోట్ల శిక్షణ కేంద్రాలు.. విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం, యనమలకుదురులోని కృష్ణానది వద్ద ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో కఠోర శిక్షణ తీసుకుంటున్నారు. ప్రస్తుతం విజయవాడ నగరంలో సుమారు 200 మంది చిన్నారులు కర్రసాములో శిక్షణ తీసుకుంటున్నట్లు కోచ్‌లు చెబుతున్నారు. (క్లిక్ చేయండి: అద్భుత శిల్పాలు చెక్కుతూ.. శాండ్ ఆర్టిస్ట్‌గా అంతర్జాతీయ ఖ్యాతి) అంతర్జాతీయ పతకాలు సాధిస్తాం.. ఇటీవల జరిగిన జాతీయ స్థాయి పోటీలకు దేశంలోని అన్ని రాష్ట్రాలు ప్రాతినిధ్యం వహించాయి. మన జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన ప్రతి క్రీడాకారుడు పతకం సాధించాడు. రానున్న రోజుల్లో జరిగే ప్రపంచ స్థాయి పోటీల్లోనూ పతకాలు సాధించేందుకు క్రీడాకారులను తీర్చిదిద్దుతున్నాం. – కె.సత్యశ్రీకాంత్, కోచ్ వచ్చే ఏడాది నుంచి స్కూల్ గేమ్స్‌లో.. సంప్రదాయ కర్రసాము క్రీడకు గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఏన్నో ఏళ్లుగా కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది (2023) స్కూల్ గేమ్స్‌లో చేర్చుతున్నట్లు ఇటీవల చేసిన ప్రకటన ఆనందాన్ని కలిగించింది. స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్) ఈ క్రీడకు గుర్తింపు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్)ను గుర్తింపు ఇవ్వాలని కోరుతున్నాం. – నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ ట్రెడిషనల్ సిలంబం అసోసియేషన్ కార్యదర్శి -
కర్రసాము: ‘చంటి చేతిలో కర్ర నాగుపాములా నాట్యం చేస్తుంది’
సాక్షి, గుంటూరు వెస్ట్ (క్రీడలు): ఎవరైనా జీవనోపాధి కోసం వృత్తిని, ఆత్మసంతృప్తి కోసం ప్రవృత్తిని ఎంచుకోవడం సహజం. అయితే, ప్రవృత్తినే ప్రధాన వృత్తిగా చేసుకుని ఆ రంగంలో రాణించడం కొందరికే సాధ్యపడుతుంది. అటువంటి కోవలోకే వస్తాడు ఖరీదు సాంబయ్య అలియాస్ చంటి. మరుగున పడిపోతున్న మన సంప్రదాయ కళ కర్రసాము (సిలంబం)లో అనేక విన్యాసాలు చేయడంతోపాటు జాతీయ పోటీల్లో ప్రతిభకనబరిచాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో టర్కీలో జరగనున్న అంతర్జాతీయ పోటీలకు సైతం ఎంపికయ్యాడు. పేద కుటుంబం నుంచి వచ్చిన చంటికి నిత్యం ఆర్థిక సమస్యలు వెంటాడుతూనే ఉన్నా సాధన, శిక్షణ మాత్రం నిరాఘాటంగా సాగిపోతూనే ఉంటాయి. సాధనతో పట్టు గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురం చంటి స్వగ్రామం. అయితే, జీవనోపాధిని వెదుక్కుంటూ భార్యతోపాటు ఇద్దరు ఆడపిల్లలు చాలా కాలం కిందట గుంటూరుకు మకాం మార్చాడు. కర్రసాము సాధన చేస్తూనే చిన్నచిన్న పనులు చేసుకుంటూ ఉన్నదాంట్లోనే జీవించేవాడు. అయితే, పెరుగుతున్న సంసారం, చాలని సంపాదన, మరో పక్క ప్రాణంగా ప్రేమించే కర్రసాము.. అన్నిటికి న్యాయం చేయడం కష్టంగానే ఉండేది. భార్య సలహా తీసుకుని పూర్తిగా కర్రసాము పైనే దృష్టి సారించి తక్కువ సమయంలోనే దానిపై పట్టు సాధించాడు. చంటి చేతిలో కర్ర నాగుపాములా నాట్యం చేస్తుందని ఆయన అభిమానులంటారు. పోటీల్లో పాల్గొంటూ పేద పిల్లలకు గ్రామ గ్రామాలు తిరిగి ఉచితంగా కర్రసామును నేర్పిస్తుంటాడు. కొన్ని పాఠశాలల్లో పార్ట్‌టైమ్ శిక్షణనిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చంటి మాత్రమే కాదు ఆయన శిష్యులు కూడా రాష్ట్ర స్థాయిలో బంగారు పతకాలు సాధిస్తున్నారు. (చదవండి: సూక్ష్మంలో అద్భుతాలు సృష్టించగలడు!) చంటి సాధించిన విజయాలివి ► ఈ ఏడాది నవంబర్‌లో నెల్లూరులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో కాంస్య పతకం ► నెల్లూరు జిల్లా సిలంబం స్టిక్ అసోసియేషన్ మేజర్ ధ్యాన్‌చంద్ సర్టిఫికెట్, యూనివర్సల్ ఎచీవర్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికెట్, మెడల్ బహూకరణ ► కర్నూలులో జరిగిన ఏపీ కర్రసాము పోటీలో కాంస్య పతకం ► ఈ నెలలో కృష్ణాజిల్లాలో జరిగిన స్టేట్ ట్రెడిషనల్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో బంగారు పతకం, ట్రైనింగ్ సర్టిఫికెట్ బహూకరణ ► గోవాలో జరిగిన జాతీయ పోటీల్లో చంటికి 21.7 పాయింట్లు సాధించి బంగారు పతకం గెలుపొందినా అక్కడ స్థానిక రాజకీయాలతో ఐదో స్థానం స్థానం ఇచ్చారు.తర్వాత తప్పు తెలుసుకున్న అసోసియేషన్ సభ్యులు ఫిబ్రవరిలో టర్కీలో జరగనున్న అంతర్జాతీయ పోటీలకు ఎంపిక చేసి గౌరవించారు. డిసెంబర్ 17, 18 తేదీల్లో కర్నూలులో జరగనున్న జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు. (చదవండి: ఇంజనీరింగ్ నైపుణ్యానికి మచ్చుతునక.. మల్లెమడుగు రిజర్వాయర్) కర్రసాము ప్రాణం నాకు కర్రసామంటే ప్రాణం. దాన్నే జీవనోపాధిగా చేసుకున్నాను. మన దేశ ప్రాచీన క్రీడల్లో కర్రసాముకు ప్రత్యేక స్థానముంది. దీనిని యువతరం తప్పకుండా నేర్చుకోవాలి. ముఖ్యంగా యువతులకు ఆత్మరక్షణతోపాటు మనోధైర్యం వస్తుంది. ఆర్థికంగా చాలా ఇబ్బందులున్నా ముందుకెళుతున్నా. దాతలు సహకరిస్తే అంతర్జాతీయ పోటీల్లోనూ పాల్గొంటా. కర్రసామును జీవనోపాదిగా చేసుకోవడాన్ని అదృష్టంగా బావిస్తాను. నా కుటుంబ సభ్యుల సహకారం మరువలేనిది – చంటి -
కబాలి కూతురి కర్రసాము
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కబాలి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన నటి ధన్సిక. తొలి సినిమాతోనే టాలీవుడ్లో సైతం అభిమానులను సంపాదించుకున్న ఈ బ్యూటి ప్రస్తుతం వాలుజడ అనే స్ట్రయిట్ తెలుగు సినిమాలో నటిస్తున్నారు. తాజాగా ఈ భామకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కబాలి సినిమాలో యాక్షన్ సీన్స్‌లో కనిపించిన ధన్సిక తాజాగా కర్రసాము చేస్తూ అలరించారు. ఈ వీడియోను ధన్సిక పర్సనల్ పీఆర్వో ప్రియా అభిమానుల కోసం సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్న ధన్సిక.. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ సినిమాల్లోనూ నటిస్తున్నారు. -
సమంత కొత్త హాబీ..!
-
సమంత కొత్త హాబీ..!
పెళ్లి వార్తల తరువాత సోషల్ మీడియాలో యమా యాక్టివ్ అయిన స్టార్ హీరోయిన్ సమంత, మరో ఇంట్రస్టింగ్ వీడియోతో అభిమానులను ఖుషీ చేసింది. ఇప్పటి వరకు సాఫ్ట్ రోల్స్‌లో మాత్రమే కానిపించిన ఈ బ్యూటీ, కర్రసాము చేస్తున్న వీడియో అభిమానులకు షాక్ ఇచ్చింది. 'నాకు ఛాలెంజ్ అంటే ఇష్టం. అందుకే కొత్త హాబీ సిలంబం (కర్రసాము). త్వరలోనే ఈ విద్యలో ప్రావీణ్యం సంపాధించాలనుంది' అంటూ ట్వీట్ చేసింది. అయితే సమంత హాబీగానే ఈ విద్య నేర్చుకుంటుందా..? లేక ఏదైనా సినిమా కోసమా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం నాగార్జునతో కలిసి రాజుగారి గది 2తో పాటు రామ్ చరణ్, సుకుమార్‌ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలోనూ సమంత నటిస్తోంది. ఈ రెండు సినిమాల తరువాత మరో రెండు తమిళ సినిమాలకు ఓకె చెప్పింది. ఈ మధ్యలోనే నాగచైతన్యతో తన పెళ్లితంతును ముంగించేందుకు ప్లాన్ చేసుకుంటుంది. Because I like a challenge