సాక్షి, గుంటూరు వెస్ట్ (క్రీడలు): ఎవరైనా జీవనోపాధి కోసం వృత్తిని, ఆత్మసంతృప్తి కోసం ప్రవృత్తిని ఎంచుకోవడం సహజం. అయితే, ప్రవృత్తినే ప్రధాన వృత్తిగా చేసుకుని ఆ రంగంలో రాణించడం కొందరికే సాధ్యపడుతుంది. అటువంటి కోవలోకే వస్తాడు ఖరీదు సాంబయ్య అలియాస్ చంటి. మరుగున పడిపోతున్న మన సంప్రదాయ కళ కర్రసాము (సిలంబం)లో అనేక విన్యాసాలు చేయడంతోపాటు జాతీయ పోటీల్లో ప్రతిభకనబరిచాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో టర్కీలో జరగనున్న అంతర్జాతీయ పోటీలకు సైతం ఎంపికయ్యాడు. పేద కుటుంబం నుంచి వచ్చిన చంటికి నిత్యం ఆర్థిక సమస్యలు వెంటాడుతూనే ఉన్నా సాధన, శిక్షణ మాత్రం నిరాఘాటంగా సాగిపోతూనే ఉంటాయి.
సాధనతో పట్టు
గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురం చంటి స్వగ్రామం. అయితే, జీవనోపాధిని వెదుక్కుంటూ భార్యతోపాటు ఇద్దరు ఆడపిల్లలు చాలా కాలం కిందట గుంటూరుకు మకాం మార్చాడు. కర్రసాము సాధన చేస్తూనే చిన్నచిన్న పనులు చేసుకుంటూ ఉన్నదాంట్లోనే జీవించేవాడు. అయితే, పెరుగుతున్న సంసారం, చాలని సంపాదన, మరో పక్క ప్రాణంగా ప్రేమించే కర్రసాము.. అన్నిటికి న్యాయం చేయడం కష్టంగానే ఉండేది. భార్య సలహా తీసుకుని పూర్తిగా కర్రసాము పైనే దృష్టి సారించి తక్కువ సమయంలోనే దానిపై పట్టు సాధించాడు. చంటి చేతిలో కర్ర నాగుపాములా నాట్యం చేస్తుందని ఆయన అభిమానులంటారు. పోటీల్లో పాల్గొంటూ పేద పిల్లలకు గ్రామ గ్రామాలు తిరిగి ఉచితంగా కర్రసామును నేర్పిస్తుంటాడు. కొన్ని పాఠశాలల్లో పార్ట్‌టైమ్ శిక్షణనిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చంటి మాత్రమే కాదు ఆయన శిష్యులు కూడా రాష్ట్ర స్థాయిలో బంగారు పతకాలు సాధిస్తున్నారు. (చదవండి: సూక్ష్మంలో అద్భుతాలు సృష్టించగలడు!)
చంటి సాధించిన విజయాలివి
► ఈ ఏడాది నవంబర్‌లో నెల్లూరులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో కాంస్య పతకం
► నెల్లూరు జిల్లా సిలంబం స్టిక్ అసోసియేషన్ మేజర్ ధ్యాన్‌చంద్ సర్టిఫికెట్, యూనివర్సల్ ఎచీవర్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికెట్, మెడల్ బహూకరణ
► కర్నూలులో జరిగిన ఏపీ కర్రసాము పోటీలో కాంస్య పతకం
► ఈ నెలలో కృష్ణాజిల్లాలో జరిగిన స్టేట్ ట్రెడిషనల్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో బంగారు పతకం, ట్రైనింగ్ సర్టిఫికెట్ బహూకరణ
► గోవాలో జరిగిన జాతీయ పోటీల్లో చంటికి 21.7 పాయింట్లు సాధించి బంగారు పతకం గెలుపొందినా అక్కడ స్థానిక రాజకీయాలతో ఐదో స్థానం స్థానం ఇచ్చారు.తర్వాత తప్పు తెలుసుకున్న అసోసియేషన్ సభ్యులు ఫిబ్రవరిలో టర్కీలో జరగనున్న అంతర్జాతీయ పోటీలకు ఎంపిక చేసి గౌరవించారు. డిసెంబర్ 17, 18 తేదీల్లో కర్నూలులో జరగనున్న జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు. (చదవండి: ఇంజనీరింగ్ నైపుణ్యానికి మచ్చుతునక.. మల్లెమడుగు రిజర్వాయర్)
కర్రసాము ప్రాణం
నాకు కర్రసామంటే ప్రాణం. దాన్నే జీవనోపాధిగా చేసుకున్నాను. మన దేశ ప్రాచీన క్రీడల్లో కర్రసాముకు ప్రత్యేక స్థానముంది. దీనిని యువతరం తప్పకుండా నేర్చుకోవాలి. ముఖ్యంగా యువతులకు ఆత్మరక్షణతోపాటు మనోధైర్యం వస్తుంది. ఆర్థికంగా చాలా ఇబ్బందులున్నా ముందుకెళుతున్నా. దాతలు సహకరిస్తే అంతర్జాతీయ పోటీల్లోనూ పాల్గొంటా. కర్రసామును జీవనోపాదిగా చేసుకోవడాన్ని అదృష్టంగా బావిస్తాను. నా కుటుంబ సభ్యుల సహకారం మరువలేనిది
– చంటి
Comments
Please login to add a commentAdd a comment