అన్ని వీఆర్వో సంఘాలతో ఐక్యకార్యాచరణకు సిద్ధం
గుంటూరు మెడికల్: ఏపీజేఏసీ, ఏపీఆర్‌ఎస్‌ఏ అనుబంధ వీఆర్వోల సంఘంతో కలిసి పని చేస్తామని ఏపీజీఈఏ అనుబంధ వీఆర్వోల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం గుంటూరులోని ఏపీఎన్జీవోస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు భూపతి రవీంద్రరాజు వెల్లడించారు. గతంలో ఏపీజేఏసీ, ఏపీఆర్‌ఎస్‌ఏ అనుబంధ వీఆర్వోల సంఘంపై అనుచిత వ్యాఖ్యలతోపాటు వారి కార్యకలాపాలకు ఆటంకం కలిగించామని, దీనికి బహిరంగంగా క్షమాపణలు తెలియజేస్తున్నానని తెలిపారు. తొలుత ఏపీజీఈఏ అనుబంధ వీఆర్వో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు భూపతి రవీంద్రరాజు ఆధ్వర్యంలో సమావేశం ప్రారంభించారు. ప్రభుత్వం నుంచి ఐవీఆర్‌ఎస్ కాల్స్ రావడంపై చర్చించేందుకు ఆ సంఘ నాయకులు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఏపీజేఏసీ అమరావతి, ఏపీఆర్‌ఎస్‌ఏ అనుబంధ వీఆర్వోల సంఘ నాయకులు అనుపమ, అయూబ్ తో పాటు ఏపీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్న కుమార్ మరియు ఇతర గుంటూరు జిల్లా సంఘ నాయకులు, భూపతి రవీంద్ర రాజు వద్దకు వెళ్లి నిలదీశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహించవద్దని సూచించారు. ప్రస్తుతం వీఆర్వోలపై పని భారం ఎక్కువగా ఉందని, ఇలాంటి విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళదామని సూచించారు. లేదంటే ఈ సమావేశాన్ని అడ్డుకుంటామని స్పష్టం చేశారు. దీంతో భూపతి రవీంద్ర రాజు ఏపీజేఏసీ అమరావతి, ఏపీఆర్‌ఎస్‌ఏ అనుబంధ వీఆర్వోల సంఘ నాయకులకు క్షమాపణలు చెప్పారు. ఇకపై ఏపీజేఏసీ అమరావతి, ఏపీఆర్‌ఎస్‌ఏ అనుబంధ వీఆర్వోల సంఘంతో కలిసి పని చేస్తామని ప్రకటించారు. దీనిపై త్వరలో ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని ఏపీజేఏసీ అమరావతి, ఏపీఆర్‌ఎస్‌ఏ అనుబంధ వీఆర్వోల సంఘం నాయకులు స్వాగతించారు. కార్యక్రమంలో ఏపీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్న కుమార్, ఏపీవీఆర్వోల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనుపమ, ప్రచార కార్యదర్శి కోటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ అయూబ్, కోశాధికారి నాగేశ్వరరావు, మహిళా కార్యదర్సులు చిన్నారి, శ్రీలక్ష్మీ, గుంటూరు తూర్పు మండల అధ్యక్షులు అరుణ్, ఉపాధ్యక్షుడు రామ్ ప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీలు సంగీతరావు, వంశీ, పొన్నూరు మండల కార్యవర్గ సభ్యులు బోసుబాబు తదితరులు పాల్గొన్నారు.
ఏపీజీఈఏ అనుబంధ వీఆర్వోల సంఘ నాయకుడు భూపతిరాజు రవీంద్ర రాజు
గతంలో ఏపీజేఏసీ అమరావతి, వారి అనుబంధ వీఆర్వోల సంఘంపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు అంగీకారం
బహిరంగ క్షమాపణలు చెప్పిన రవీంద్రరాజు
స్వాగతించిన ఏపీజేఏసీ అమరావతి అనుబంధ వీఆర్వోల సంఘం


