Tholu Bommalata: ఒకప్పుడు తిరుగులేని ఆదరణ.. ఇప్పుడు కనుమరుగు | YSR District: Tholu Bommalata Shadow Puppet Theatre Tradition Disappeared | Sakshi
Sakshi News home page

Tholu Bommalata: ఒకప్పుడు తిరుగులేని ఆదరణ.. ఇప్పుడు కనుమరుగు

Published Thu, Dec 15 2022 6:09 PM | Last Updated on Thu, Dec 15 2022 6:16 PM

YSR District: Tholu Bommalata Shadow Puppet Theatre Tradition Disappeared - Sakshi

ప్రేక్షకులకు సినిమా పరిచయం లేని రోజుల్లో ఓ వెలుగు వెలిగిన తోలుబొమ్మలాట ప్రదర్శన క్రమంగా ఆదరణ కోల్పోతూ వస్తోంది. సినిమాల రాకతో తోలు బొమ్మలాట ప్రభావం కొంత తగ్గినా క్రమేణా టీవీలు రావడం, ఆ తర్వాత మొబైల్‌ ఫోన్ల ఆవిర్భావంతో బొమ్మలాట దాదాపుగా కనుమరుగైంది. చాలా ప్రాంతాల్లో తోలుబొమ్మలాట కళాకారులు, వారి వారసులు ప్రత్యామ్నాయ వృత్తులను ఆశ్రయించారు. దీంతో తర్వాతి తరం బొమ్మలాట కళకు దూరమైంది.  

సాక్షి ప్రతినిధి, కడప: ఒకప్పుడు బొమ్మలాటకు గ్రామాల్లో తిరుగులేని ఆదరణ ఉండేది. క్రీస్తు పూర్వమే పుట్టిన బొమ్మలాట కళ 1980వ దశకం వరకు వైభవంగా నడిచింది. ఈ కళను గ్రామాలలో విపరీతంగా ఆదరించారు. బొమ్మలాట కళాకారులు రామాయణం, భారతంలోని దాదాపు 30 ఘట్టాలను ప్రదర్శించేవారు. ప్రధానంగా భారతంలో విరాటపర్వం, భీష్మపర్వం, ద్రోణపర్వం, పద్మవ్యూహం, సైంధవ  వధ, దానవీర శూర కర్ణ, శల్య, శకుని, భీమ, దుర్యోధన యుద్ధం, అశ్వమేధ యాగం, ప్రమీలార్జునీయం, విభీషణ విజయం, బబ్రువాహన చరిత్ర తదితర ఘట్టాలను బొమ్మలాట ద్వారా ప్రదర్శించేవారు. ఇక రామాయణంలో సుందరకాండ, లక్ష్మణమూర్ఛ, సతీసులోచన, ఇంద్రజిత్తు మరణం, రామరామ యుద్ధం, మహిరావణ చరిత్ర తదితర పురాణ గాథలను కూడా తోలు బొమ్మలాటలో ప్రాధాన్యత పొందాయి.  


పది మంది కళాకారులతో నాటకం 

తోలు బొమ్మలాట ప్రదర్శనకు పది మంది కళాకారులు అవసరం. హార్మోనియం, తబలా, డబ్బా తదితర సంగీత వాయిద్యాలను వాయించేవారితోపాటు మిగిలిన వారు బొమ్మలు ఆడించడం, పద్యాలు పాడటం, అర్థం చెప్పేందుకు మరికొంతమంది కళాకారులు పనిచేసేవారు. రామాయణ, భారతంలోని మగ పాత్రలకు మగవాళ్లే పనిచేసేవారు. ఆడపాత్రలకు మహిళలు తెరవెనుక నాటకం వేసేవారు. మహిళలు సైతం పోటాపోటీగా పౌరాణిక ఘటనలను పద్యాల ద్వారా చెప్పి వినసొంపుగా అర్థాలు విడమరిచి చెప్పేవారు. తోలుబొమ్మలాటలో బొమ్మలు ఆడించడం ఒక కళ అయితే, వాటికి అనుగుణంగా పద్యాలు పాడి అర్థాలు చెప్పడం అంతకుమించిన కళ. ఈ రెండింటి అనుసంధానంతోనే బొమ్మలాట నాటకాన్ని కళాకారులు రక్తి కట్టిస్తారు.  


ప్రమిదల వెలుగులో బొమ్మలాట నాటకం 

పూర్వం బొమ్మలాటను ప్రత్యేకమైన తెల్ల పంచె తెరగా ఏర్పాటు చేసుకుని చుట్టూ చీకటి ఉండేలా చూసుకుని తెరవెనుక ఆముదం పోసి వెలిగించిన ప్రమిదల సాయంతో తెరపైన తోలుబొమ్మలు కనబడేలా చేసేవారు. రానురాను పెట్రోమ్యాక్స్‌ లైట్లు, ఆ తర్వాత గ్యాస్‌ లైట్లు, విద్యుత్‌ బల్బుల సాయంతో బొమ్మలు తెరపైన కనబడేలా చేసేవారు. అప్పట్లో తెరపైన బొమ్మలు ఆడటం పాతతరం గ్రామీణ ప్రజలకు వింతగా, ఆసక్తిగా, సంబరంగా ఉండేది. పైపెచ్చు చదువులేకపోయినా వంట బట్టించుకున్న పౌరాణిక గాథలు కళ్ల ముందు కనిపించడం అప్పటి జనాన్ని మరింత ఆకట్టుకునేది. నాటకాల్లో సీరియస్‌ పాత్రలతోపాటు  జుట్టుపోలిగాడు, బంగారక్క పాత్రలను సైతం సృష్టించి బొమ్మల ద్వారా హాస్యాన్ని పండించేవారు. 
     

తోలు బొమ్మలాటకు తిరుగులేని ఆదరణ 

తోలుబొమ్మలాట కళకు 80వ దశకం వరకు తిరుగులేని ఆదరణ ఉండేది. ఒక్కో గ్రామంలో 15 రోజుల నుంచి నెలరోజులపాటు కూడా నాటకం ఆడేవారు. పక్క గ్రామాలకు వెళ్లాలంటే ఆయా గ్రామాల ప్రజలు వచ్చి ళాకారులకు తాంబూలం ఇచ్చి తేదీని ఖరారు చేసుకునేవారు. ఇప్పటి సినిమా నటుల కాల్‌షీట్ల డిమాండ్‌ కంటే అప్పటి బొమ్మలాట కళాకారుల డిమాండ్‌ మూడింతలు ఉండేది. కళాకారులు తోలు బొమ్మలను వారి వాయిద్యాలతోపాటు ఇతర సామగ్రిని మూడు లేదా నాలుగు ఎద్దుల బండ్లలో సామాన్లు నింపుకుని నెలల తరబడి గ్రామాల్లోనే ఉండేవారు. ఒక్కోసారి ఆరు నెలలు లేదా ఏడాదిపాటు సంచార జీవనం గడుపుతూ ఇంటికి రాకుండా బొమ్మలాట ఆడేవారు.  


అప్పట్లో నాటకానికి రూ. 15 

అప్పట్లో గ్రామంలో ఒకరోజు నాటకం ఆడేందుకు రూ. 15 చెల్లించేవారు. ఇది కాకుండా కళాకారులు గ్రామంలో ఉన్నన్నాళ్లు ఇంటింటికి వెళ్లి ధాన్యం సేకరించుకునేవారు. వారు ఎన్ని రోజులు ఉన్నా భోజన ఏర్పా ట్లు గ్రామ ప్రజలే చూసుకునేవారు. బొమ్మలాట కళాకారులను గుర్తించిన నాటి ప్రధాని నెహ్రూ, దివంగత ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్‌ రాజశేఖరరెడ్డిలు కళాకారులను ప్రశంసించడంతోపాటు సన్మానించారు.  

80వ దశకం తర్వాత ఆదరణ కోల్పోయిన వైనం
80వ దశకం వరకు వైభవంగా నడిచిన తోలు బొమ్మలాట ఆ తర్వాత క్రమేణ ఆదరణ కోల్పోయి దాదాపుగా అంతరించిపోయింది. తొలుత సినిమాల రాకతో తోలు బొమ్మలాటకు ఆదరణ తగ్గింది. ఆ తర్వాత టీవీల రాక, వాటి తర్వాత మొబైల్‌ఫోన్ల పుట్టుకతో తోలుబొమ్మలాట పూర్తిగా కనుమరుగైంది. ఇప్పటి తరానికి తోలు బొమ్మలాట అంటే ఏంటో తెలియని పరిస్థితి.  

వైఎస్సార్‌ జిల్లాలో బొమ్మలాట కళాకారులు 
జిల్లాలోని కలసపాడు మండలం సింగరాయపల్లె, పోరుమామిళ్ల మండలం అగ్రహారం, చిన్నాయపల్లె, పోరుమామిళ్ల పట్టణంలోని ఎస్టీ కాలనీ, మహబూబ్‌నగర్‌ ప్రాంతంలో 50 కుటుంబాలకు పైగా ఈ కళాకారులు ఉండేవారు. జిల్లాలో కడప సమీపంలోని ఆలంఖాన్‌పల్లె వద్ద, అలాగే అనంతపురం జిల్లా ధర్మవరంలోనూ కళాకారులు ఉండేవారు. ప్రస్తుతం జిల్లాలోని పోరుమామిళ్లలో మూడు కుటుంబాల వారు మాత్రమే ఉన్నారు. బొమ్మలాట ప్రదర్శనకు ఎవరూ ఆసక్తి చూపడం లేదని వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

బొమ్మల తయారీ ఇలా.. 
మేక, గొర్రె, కొండగొర్రె తదితర జంతువుల చర్మాలను సేకరించి వాటిని శుభ్రపరిచి ఆరబెట్టుకుని ఆ తర్వాత వాటిపైన గోరుగల్లు సాధనంతో రామాయణానికి సంబంధించి రాముడు, సీత, ఆంజనేయుడు, అంగధుడు, సుగ్రీవుడు, రావణాసురుడు తదితర బొమ్మలు, భారతానికి సంబంధించి పాండవులు, కౌరవుల బొమ్మల ఆకారాలను గీతల ద్వారా గీసుకునేవారు. తర్వాత నెల్లూరు, గుంటూరు, విజయవాడ ప్రాంతాల నుంచి తెచ్చిన ప్రత్యేకమైన రంగులు బొమ్మలకు వేసుకునేవారు. 

రోడ్డున పడ్డ కళాకారులు 
బొమ్మలాటకు ఆదరణ తగ్గడంతో కళాకారులు వీధిన పడ్డారు. వృత్తిని పక్కనపెట్టి బతుకుదెరువు కోసం రకరకాల వృత్తులను ఎన్నుకున్నారు. పెద్దమునిరావు కుమారులు ఖాదర్‌ రావు, వెంకటేశ్వర్లు పెయింటింగ్‌ పనులు, వాచ్‌మన్‌గా ఉంటుండగా, రమణరావు ముగ్గురు కుమారులు పాత ఇనుము సేకరించే వ్యాపారంలో పడ్డారు. నరసింహారావు కుమారులు సైతం చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పెద్దమునిరావు, నరసింహారావు, రమణరావులు గ్రామాలలో తెలిసిన వారి పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యాలకు వెళ్లి వారిచ్చే కొద్దోగొప్పో మొత్తం స్వీకరించి కాలం వెళ్లదీస్తున్నారు. ప్రస్తుతం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కొంతమంది కళాకారులకు పెన్షన్‌ ఇస్తుండడంతో వృద్ధ కళాకారులకు కొంతమేర ఆసరాగా ఉంటోంది. (క్లిక్ చేయండి: మహిమాన్విత సూఫీ క్షేత్రం.. కడప అమీన్‌పీర్‌ దర్గా)


కళను ప్రోత్సహించాలి 

అంతరించిపోతున్న బొమ్మలాట కళను నిలబెట్టుకునేలా ప్రభుత్వం ప్రోత్సహించాలి. కళాకారులను ఆదుకోవాలి. వారికి నాటకాలు వేసే అవకాశం కల్పించాలి. తద్వారా ఉపాధి అందించాలి. కళాకారులందరికీ పెన్షన్లు మంజూరు చేయాలి. ఇతరత్రా సంక్షేమ పథకాలను అందించాలి. ప్రభుత్వమే నాటకాలను ఆదరించాలి. 
– వనపర్తి పెద్దమునిరావు, ఎస్టీ కాలనీ, పోరుమామిళ్ల  


తోలుబొమ్మల కేంద్రం ఏర్పాటు చేయాలి
 
తోలుబొమ్మలాట కళను బతికించేందుకు ప్రభు త్వం చర్యలు చేపట్టాలి. తోలు బొమ్మల తయారీ కేంద్రాలను నెలకొల్పాలి. తోలుబొమ్మలాట కళను భావితరాల వారికి నేర్పించాలి. ఉన్న బొమ్మలాట కళాకారులను గురువులుగా ఏర్పాటు చేసి యువతకు విద్యను నేర్పించాలి. గురువులకు, విద్య నేర్చుకునే వారికి ప్రభుత్వం ఉపాధి కల్పించాలి.     
– వనపర్తి నరసింహారావు, ఎస్టీ కాలనీ, పోరుమామిళ్ల  


ప్రభుత్వ ఆధ్వర్యంలోనే బొమ్మలాట 

కళాకారులను ప్రోత్సహించేందుకు తోలు బొమ్మలాటను ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రదర్శించేందుకు చర్యలు చేపట్టాలి. బొమ్మలాట కళను విస్తృ తం చేసేందుకు కళను ఆసక్తిగల యువతకు నేర్పించాలి. కళాకారులందరికీ ప్రభుత్వం పెన్షన్లతోపాటు ఇంటి పట్టాలు, ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. సంక్షేమ పథకాలు అందించి ఆదుకోవాలి.     
– వనపర్తి రమణారావు, ఎస్టీ కాలనీ, పోరుమామిళ్ల  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement