kalasapadu
-
Eguvaramapuram: సైనికుల ఊరు.. సరిలేరు మీకెవ్వరు
భారత భూభాగాన్ని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుతూ, పొరుగు దేశాల దురాక్రమణలను అడ్డుకుంటూనే, ఎప్పటికప్పుడు యుద్ధానికి సన్నద్ధులై కీలకమైన ఆపరేషన్లలో ప్రధాన పాత్రధారులుగా ఆ గ్రామ యువత దేశరక్షణలో నిమగ్నమైంది. సాధారణ సిపాయి నుంచి అత్యున్నత శిక్షణ పొందిన కమాండో, సెంట్రల్ మిలటరీ పోలీసు (సీఎంపీ) వరకూ ఆ గ్రామానికి చెందిన వారు సేవలందిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే యుద్ధభూమిలో ఆ గ్రామ యువత కీలకంగా వ్యవహరిస్తోంది. వైఎస్సార్ జిల్లాకు గర్వకారణంగా నిలుస్తున్న ఆ గ్రామం పేరు ఎగువరామాపురం. కలసపాడు మండలంలోని ఒక్క ఎగువ రామాపురం నుంచే దాదాపు 300 మంది యువకులు దేశరక్షణలో ఉండడం విశేషం. సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 2200 మంది భారతదేశ రక్షణ విభాగంలో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తిస్తుంటే ఒక్క కలసపాడు మండలంలోనే దాదాపు 700 మందికి పైగా ఉన్నారు. అంటే జిల్లా నుంచి సైన్యంలో పనిచేస్తున్న వారిలో 30 శాతం వాటా కలసపాడు మండలానిదేనని స్పష్టమవుతోంది. ఈ మండలంలో ప్రధానంగా ఎగువరామాపురం, ఎగువ తంబళ్లపల్లె, రాజుపాళెం గ్రామాల నుంచే ఆర్మీలో ఉండడం మరో విశేషం. వారిలో అత్యధికంగా ఎగువరామాపురం వాసులు ఉన్నారు. పాకిస్థాన్‌తో తలపడిన కార్గిల్ యుద్ధంలో సైతం వీరి భాగస్వామ్యం ఉంది. ముంబయి తాజ్ హోటల్ వద్ద పాకిస్తాన్ ఉగ్రవాదులతో తలపడ్డ ఆపరేషన్ ‘సైక్లోన్’లో కూడా ఎగువరామాపురం గ్రామానికి చెందిన కమాండో ఉన్నారు. ఇలా అనేక ఆపరేషన్లలో ఆ గ్రామానికి చెందిన యువత భాగస్వామ్యం ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కార్గిల్ యుద్ధంలో.. నిత్యం మంచు ముద్దలు, మంచు కొండలు విరిగిపడుతుంటాయి. అలాంటి ప్రాంతంలో 1999 మే 13వతేదీ నుంచి 28 వరకు కార్గిల్‌లో యుద్ధం జరిగింది. భారతదేశ భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్ ముష్కరులను భారత సైన్యం తరిమికొట్టింది. ఈ యుద్ధంలో ఎగువరామాపురానికి చెందిన వారు 20 మంది ఉండడం మరో విశేషం. 2008 డిసెంబర్లో భారతదేశ ఆర్థిక రాజధానిగా పేరుబడ్డ ముంబయి నగరంలో తాజ్ హోటల్‌పై పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేశారు. వారిని తుదముట్టించేందుకు ఢిల్లీ నుంచి బ్లాక్ క్యాట్ క మాండోలను ముంబయికి తరలించారు. ఆపరేషన్ ‘సైక్లోన్’ పేరుతో నిర్వహించిన ఈ టాస్క్‌లో ఎగువరామాపురానికి చెందిన కమాండో బండి ప్రతాప్‌రెడ్డి పాల్గొని విజయకేతనం ఎగురవేసి దేశ ప్రతిష్టలో భాగస్వామి అయ్యాడు. అన్నదమ్ములం ఇద్దరం ఆర్మీలో చేరాం మేం ఇద్దరం అన్నదమ్ములం. ఇద్దరం ఆర్మీలో చేరాం. మా అమ్మా నాన్న పొలంలో కష్టం చేసి మా ఇద్దరిని చదివించారు. జీవనోపాధికి ఆర్మీలో చేరినా దేశ భద్రతలో మేం కూడా మా వంతు పాత్ర పోషిస్తున్నందుకు సంతోషంగా ఉంది. మిలటరీలో చేరి 13 సంవత్సరాలు అయింది. సెలవుపై ఇంటికి వచ్చినప్పుడు వ్యవసాయ పనుల్లో అమ్మా నాన్నకు చేదోడుగా ఉంటున్నాం. – వై.వెంకటరెడ్ధి ఆర్మీ ఉద్యోగి,ఎగువ రామాపురం దేశసేవ తృప్తిగా ఉంది మాది చాలా పేద కుటుంబం. పదవ తరగతి పూర్తయిన వెంటనే పై చదువులకు వెళ్లే పరిస్థితులు లేవు. ఆర్మీలో అయితే త్వరగా జాబ్ వస్తుందని పదవ తరగతి పూర్తి అయిన వెంటనే సెలక్షన్‌కు పోయా, ఉద్యోగం వచ్చింది. దాంతో బతుకు దెరువు దొరికింది. అమ్మా నాన్నలు కూడా ఆర్మీలోనే చేరమని చెప్పారు. దేశ సేవ చేస్తున్నానన్న ఆనందం ఉంది. ఇప్పటికి 15 సంవత్సరాలు సర్వీస్ పూర్తి అయింది. ఆర్మీ కమ్యూనికేషన్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నాను. – కె.కిరణ్‌కుమార్ ఆర్మీ ఉద్యోగి.ఎగువ రామాపురం మాకెంతో గర్వకారణం దేశ రక్షణలో మా గ్రామస్తుల భాగస్వామ్యం ఉండడం మాకెంతో గర్వకారణం. తరాలు మారినా ఆర్మీకి వెళ్లడంలో గ్రామ యువత ఎప్పటికీ ముందుంటుంది. గ్రామానికి చెందిన ఉదయగిరి చెన్నయ్య(40), నడిపి మస్తాన్(45) మరో ఇరువురు ప్రమాదవశాత్తు, అనారోగ్య పరిస్థితులతో మృత్యువాత పడ్డారు. అయినప్పటికీ ఆర్మీకి పంపేందుకు తల్లిదండ్రులు సంకోచించరు. దేశానికి సేవ చేస్తున్నామనే తృప్తే మెండుగా ఉంటుంది. ఆర్మీలో ఎంతో క్రమశిక్షణతో మా గ్రామానికి చెందిన వారు వివిధ హోదాల్లో రాణిస్తున్నారు. మాజీ సైనికోద్యోగులను ఆదుకోవాలి. – వెంకటయ్య సర్పంచ్, ఎగువ రామాపురం -
Tholu Bommalata: ఒకప్పుడు తిరుగులేని ఆదరణ.. ఇప్పుడు కనుమరుగు
ప్రేక్షకులకు సినిమా పరిచయం లేని రోజుల్లో ఓ వెలుగు వెలిగిన తోలుబొమ్మలాట ప్రదర్శన క్రమంగా ఆదరణ కోల్పోతూ వస్తోంది. సినిమాల రాకతో తోలు బొమ్మలాట ప్రభావం కొంత తగ్గినా క్రమేణా టీవీలు రావడం, ఆ తర్వాత మొబైల్ ఫోన్ల ఆవిర్భావంతో బొమ్మలాట దాదాపుగా కనుమరుగైంది. చాలా ప్రాంతాల్లో తోలుబొమ్మలాట కళాకారులు, వారి వారసులు ప్రత్యామ్నాయ వృత్తులను ఆశ్రయించారు. దీంతో తర్వాతి తరం బొమ్మలాట కళకు దూరమైంది. సాక్షి ప్రతినిధి, కడప: ఒకప్పుడు బొమ్మలాటకు గ్రామాల్లో తిరుగులేని ఆదరణ ఉండేది. క్రీస్తు పూర్వమే పుట్టిన బొమ్మలాట కళ 1980వ దశకం వరకు వైభవంగా నడిచింది. ఈ కళను గ్రామాలలో విపరీతంగా ఆదరించారు. బొమ్మలాట కళాకారులు రామాయణం, భారతంలోని దాదాపు 30 ఘట్టాలను ప్రదర్శించేవారు. ప్రధానంగా భారతంలో విరాటపర్వం, భీష్మపర్వం, ద్రోణపర్వం, పద్మవ్యూహం, సైంధవ వధ, దానవీర శూర కర్ణ, శల్య, శకుని, భీమ, దుర్యోధన యుద్ధం, అశ్వమేధ యాగం, ప్రమీలార్జునీయం, విభీషణ విజయం, బబ్రువాహన చరిత్ర తదితర ఘట్టాలను బొమ్మలాట ద్వారా ప్రదర్శించేవారు. ఇక రామాయణంలో సుందరకాండ, లక్ష్మణమూర్ఛ, సతీసులోచన, ఇంద్రజిత్తు మరణం, రామరామ యుద్ధం, మహిరావణ చరిత్ర తదితర పురాణ గాథలను కూడా తోలు బొమ్మలాటలో ప్రాధాన్యత పొందాయి. పది మంది కళాకారులతో నాటకం తోలు బొమ్మలాట ప్రదర్శనకు పది మంది కళాకారులు అవసరం. హార్మోనియం, తబలా, డబ్బా తదితర సంగీత వాయిద్యాలను వాయించేవారితోపాటు మిగిలిన వారు బొమ్మలు ఆడించడం, పద్యాలు పాడటం, అర్థం చెప్పేందుకు మరికొంతమంది కళాకారులు పనిచేసేవారు. రామాయణ, భారతంలోని మగ పాత్రలకు మగవాళ్లే పనిచేసేవారు. ఆడపాత్రలకు మహిళలు తెరవెనుక నాటకం వేసేవారు. మహిళలు సైతం పోటాపోటీగా పౌరాణిక ఘటనలను పద్యాల ద్వారా చెప్పి వినసొంపుగా అర్థాలు విడమరిచి చెప్పేవారు. తోలుబొమ్మలాటలో బొమ్మలు ఆడించడం ఒక కళ అయితే, వాటికి అనుగుణంగా పద్యాలు పాడి అర్థాలు చెప్పడం అంతకుమించిన కళ. ఈ రెండింటి అనుసంధానంతోనే బొమ్మలాట నాటకాన్ని కళాకారులు రక్తి కట్టిస్తారు. ప్రమిదల వెలుగులో బొమ్మలాట నాటకం పూర్వం బొమ్మలాటను ప్రత్యేకమైన తెల్ల పంచె తెరగా ఏర్పాటు చేసుకుని చుట్టూ చీకటి ఉండేలా చూసుకుని తెరవెనుక ఆముదం పోసి వెలిగించిన ప్రమిదల సాయంతో తెరపైన తోలుబొమ్మలు కనబడేలా చేసేవారు. రానురాను పెట్రోమ్యాక్స్ లైట్లు, ఆ తర్వాత గ్యాస్ లైట్లు, విద్యుత్ బల్బుల సాయంతో బొమ్మలు తెరపైన కనబడేలా చేసేవారు. అప్పట్లో తెరపైన బొమ్మలు ఆడటం పాతతరం గ్రామీణ ప్రజలకు వింతగా, ఆసక్తిగా, సంబరంగా ఉండేది. పైపెచ్చు చదువులేకపోయినా వంట బట్టించుకున్న పౌరాణిక గాథలు కళ్ల ముందు కనిపించడం అప్పటి జనాన్ని మరింత ఆకట్టుకునేది. నాటకాల్లో సీరియస్ పాత్రలతోపాటు జుట్టుపోలిగాడు, బంగారక్క పాత్రలను సైతం సృష్టించి బొమ్మల ద్వారా హాస్యాన్ని పండించేవారు. తోలు బొమ్మలాటకు తిరుగులేని ఆదరణ తోలుబొమ్మలాట కళకు 80వ దశకం వరకు తిరుగులేని ఆదరణ ఉండేది. ఒక్కో గ్రామంలో 15 రోజుల నుంచి నెలరోజులపాటు కూడా నాటకం ఆడేవారు. పక్క గ్రామాలకు వెళ్లాలంటే ఆయా గ్రామాల ప్రజలు వచ్చి ళాకారులకు తాంబూలం ఇచ్చి తేదీని ఖరారు చేసుకునేవారు. ఇప్పటి సినిమా నటుల కాల్షీట్ల డిమాండ్ కంటే అప్పటి బొమ్మలాట కళాకారుల డిమాండ్ మూడింతలు ఉండేది. కళాకారులు తోలు బొమ్మలను వారి వాయిద్యాలతోపాటు ఇతర సామగ్రిని మూడు లేదా నాలుగు ఎద్దుల బండ్లలో సామాన్లు నింపుకుని నెలల తరబడి గ్రామాల్లోనే ఉండేవారు. ఒక్కోసారి ఆరు నెలలు లేదా ఏడాదిపాటు సంచార జీవనం గడుపుతూ ఇంటికి రాకుండా బొమ్మలాట ఆడేవారు. అప్పట్లో నాటకానికి రూ. 15 అప్పట్లో గ్రామంలో ఒకరోజు నాటకం ఆడేందుకు రూ. 15 చెల్లించేవారు. ఇది కాకుండా కళాకారులు గ్రామంలో ఉన్నన్నాళ్లు ఇంటింటికి వెళ్లి ధాన్యం సేకరించుకునేవారు. వారు ఎన్ని రోజులు ఉన్నా భోజన ఏర్పా ట్లు గ్రామ ప్రజలే చూసుకునేవారు. బొమ్మలాట కళాకారులను గుర్తించిన నాటి ప్రధాని నెహ్రూ, దివంగత ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖరరెడ్డిలు కళాకారులను ప్రశంసించడంతోపాటు సన్మానించారు. 80వ దశకం తర్వాత ఆదరణ కోల్పోయిన వైనం 80వ దశకం వరకు వైభవంగా నడిచిన తోలు బొమ్మలాట ఆ తర్వాత క్రమేణ ఆదరణ కోల్పోయి దాదాపుగా అంతరించిపోయింది. తొలుత సినిమాల రాకతో తోలు బొమ్మలాటకు ఆదరణ తగ్గింది. ఆ తర్వాత టీవీల రాక, వాటి తర్వాత మొబైల్ఫోన్ల పుట్టుకతో తోలుబొమ్మలాట పూర్తిగా కనుమరుగైంది. ఇప్పటి తరానికి తోలు బొమ్మలాట అంటే ఏంటో తెలియని పరిస్థితి. వైఎస్సార్ జిల్లాలో బొమ్మలాట కళాకారులు జిల్లాలోని కలసపాడు మండలం సింగరాయపల్లె, పోరుమామిళ్ల మండలం అగ్రహారం, చిన్నాయపల్లె, పోరుమామిళ్ల పట్టణంలోని ఎస్టీ కాలనీ, మహబూబ్‌నగర్ ప్రాంతంలో 50 కుటుంబాలకు పైగా ఈ కళాకారులు ఉండేవారు. జిల్లాలో కడప సమీపంలోని ఆలంఖాన్‌పల్లె వద్ద, అలాగే అనంతపురం జిల్లా ధర్మవరంలోనూ కళాకారులు ఉండేవారు. ప్రస్తుతం జిల్లాలోని పోరుమామిళ్లలో మూడు కుటుంబాల వారు మాత్రమే ఉన్నారు. బొమ్మలాట ప్రదర్శనకు ఎవరూ ఆసక్తి చూపడం లేదని వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బొమ్మల తయారీ ఇలా.. మేక, గొర్రె, కొండగొర్రె తదితర జంతువుల చర్మాలను సేకరించి వాటిని శుభ్రపరిచి ఆరబెట్టుకుని ఆ తర్వాత వాటిపైన గోరుగల్లు సాధనంతో రామాయణానికి సంబంధించి రాముడు, సీత, ఆంజనేయుడు, అంగధుడు, సుగ్రీవుడు, రావణాసురుడు తదితర బొమ్మలు, భారతానికి సంబంధించి పాండవులు, కౌరవుల బొమ్మల ఆకారాలను గీతల ద్వారా గీసుకునేవారు. తర్వాత నెల్లూరు, గుంటూరు, విజయవాడ ప్రాంతాల నుంచి తెచ్చిన ప్రత్యేకమైన రంగులు బొమ్మలకు వేసుకునేవారు. రోడ్డున పడ్డ కళాకారులు బొమ్మలాటకు ఆదరణ తగ్గడంతో కళాకారులు వీధిన పడ్డారు. వృత్తిని పక్కనపెట్టి బతుకుదెరువు కోసం రకరకాల వృత్తులను ఎన్నుకున్నారు. పెద్దమునిరావు కుమారులు ఖాదర్ రావు, వెంకటేశ్వర్లు పెయింటింగ్ పనులు, వాచ్‌మన్‌గా ఉంటుండగా, రమణరావు ముగ్గురు కుమారులు పాత ఇనుము సేకరించే వ్యాపారంలో పడ్డారు. నరసింహారావు కుమారులు సైతం చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పెద్దమునిరావు, నరసింహారావు, రమణరావులు గ్రామాలలో తెలిసిన వారి పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యాలకు వెళ్లి వారిచ్చే కొద్దోగొప్పో మొత్తం స్వీకరించి కాలం వెళ్లదీస్తున్నారు. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కొంతమంది కళాకారులకు పెన్షన్ ఇస్తుండడంతో వృద్ధ కళాకారులకు కొంతమేర ఆసరాగా ఉంటోంది. (క్లిక్ చేయండి: మహిమాన్విత సూఫీ క్షేత్రం.. కడప అమీన్‌పీర్ దర్గా) కళను ప్రోత్సహించాలి అంతరించిపోతున్న బొమ్మలాట కళను నిలబెట్టుకునేలా ప్రభుత్వం ప్రోత్సహించాలి. కళాకారులను ఆదుకోవాలి. వారికి నాటకాలు వేసే అవకాశం కల్పించాలి. తద్వారా ఉపాధి అందించాలి. కళాకారులందరికీ పెన్షన్లు మంజూరు చేయాలి. ఇతరత్రా సంక్షేమ పథకాలను అందించాలి. ప్రభుత్వమే నాటకాలను ఆదరించాలి. – వనపర్తి పెద్దమునిరావు, ఎస్టీ కాలనీ, పోరుమామిళ్ల తోలుబొమ్మల కేంద్రం ఏర్పాటు చేయాలి తోలుబొమ్మలాట కళను బతికించేందుకు ప్రభు త్వం చర్యలు చేపట్టాలి. తోలు బొమ్మల తయారీ కేంద్రాలను నెలకొల్పాలి. తోలుబొమ్మలాట కళను భావితరాల వారికి నేర్పించాలి. ఉన్న బొమ్మలాట కళాకారులను గురువులుగా ఏర్పాటు చేసి యువతకు విద్యను నేర్పించాలి. గురువులకు, విద్య నేర్చుకునే వారికి ప్రభుత్వం ఉపాధి కల్పించాలి. – వనపర్తి నరసింహారావు, ఎస్టీ కాలనీ, పోరుమామిళ్ల ప్రభుత్వ ఆధ్వర్యంలోనే బొమ్మలాట కళాకారులను ప్రోత్సహించేందుకు తోలు బొమ్మలాటను ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రదర్శించేందుకు చర్యలు చేపట్టాలి. బొమ్మలాట కళను విస్తృ తం చేసేందుకు కళను ఆసక్తిగల యువతకు నేర్పించాలి. కళాకారులందరికీ ప్రభుత్వం పెన్షన్లతోపాటు ఇంటి పట్టాలు, ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. సంక్షేమ పథకాలు అందించి ఆదుకోవాలి. – వనపర్తి రమణారావు, ఎస్టీ కాలనీ, పోరుమామిళ్ల -
ప్రధానోపాధ్యాయుడిపై పోలీసుల దాడి
సాక్షి, కడప : వాహన తనిఖీల్లో భాగంగా కలసపాడు పోలీసులు ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిపై దాడి చేసిన ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గురువారం సాయంత్రం ఎస్ఐ ప్రదీప్‌నాయుడు, పోలీసులు స్థానిక మూడు రోడ్ల కూడలిలో వాహనాల తనిఖీ నిర్వహించారు. రాత్రి 8–30 గంటల సమయంలో ఉపాధ్యాయుడు తన పనులు ముగించుకుని ఇంటికి వెళుతున్న బ్రాహ్మణపల్లె మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శివారెడ్డి మోటారుసైకిల్‌ను పోలీసులు ఆపారు. పత్రాలన్నీ శివారెడ్డి చూపించగా ఎస్ఐ బైకుకు ఇన్సూరెన్స్ లేదన్న కారణంతో రూ.1050 జరిమానా విధించారు. ఈ క్రమంలో ఎస్ఐ శివారెడ్డిని దూషించడంతో మనస్తాపం చెందిన శివారెడ్డి తాను ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడినని, తనను దూషించడం సరికాదన్నారు. ఇంతలో ఎస్ఐ తనకే ఎదురు మాట్లాడుతావా అంటూ పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి ఎస్ఐ, కానిస్టేబుల్ దాదావలిలు దాడిచేశారు. అంతే కాకుండా తప్పుడు కేసు బనాయించేందుకు సిద్ధం చేస్తున్న క్రమంలో ఓ ఉపాధ్యాయ సంఘ నాయకుడు పోలీసుస్టేషన్‌కు వెళ్లి పోలీసులకు సర్దిచెప్పి శివారెడ్డిని గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత బయటికి తీసుకువచ్చారు. ఈ విషయం శనివారం ఉదయం బయటికి పొక్కడంతో శివారెడ్డి తీవ్రమనస్తాపం చెంది అనారోగ్యంగా ఉండడంతో ఒక్కసారిగా ఉపాధ్యాయ సంఘం నాయకులు, మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా స్థానిక ఎమ్మార్సీ కార్యాలయం నుంచి వైఎస్ఆర్ విగ్రహం వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మూడు రోడ్ల కూడలిలో బైఠాయించి బాధితుడు శివారెడ్డికి న్యాయం చేయాలని, ఎస్ఐ, కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఒకపక్క పెద్ద ఎత్తున గుమికూడిన ప్రజలు మరో పక్క పోలీసులు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇంతలో వైఎస్సార్సీపీ మండల నాయకులు జోక్యం చేసుకుని ప్రజలకు, ఉపాధ్యాయ సంఘ నాయకులకు సర్దిచెప్పి ఎస్ఐ ద్వారా ఉపాధ్యాయునికి క్షమాపణ చెప్పించారు. దీంతో ప్రజలు, ఉపాధ్యాయులు శాంతించి భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావుృతం కాకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు రామకృష్ణారెడ్డి, గురివిరెడ్డి, జెడ్పీటీసీ సుదర్శన్, పురుషోత్తంరెడ్డి, ఉపాధ్యాయ సంఘం నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. -
రెచ్చిపోయిన పోలీస్ కానిస్టేబుల్
-
రెచ్చిపోయిన పోలీస్ కానిస్టేబుల్
సాక్షి, కడప: ఆవ్యక్తి ఏం తప్పు చేశాడో తెలియదు కానీ ఆ పోలీస్ కానిస్టేబుల్ రెచ్చిపోయాడు. లాఠీతో గొడ్డును బాదినట్లు బాదాడు. రోడ్డు మీద వెంటపడీ మరీ ఖాకీ జులుం చూపించాడు. ఏంచేసినా అడిగేవారు లేరు అనుకుంటున్నారో ఏమో కానీ, ప్రశ్నిస్తే మాత్రం వీపు విమాన మోత మోగాల్సిందే. వైఎస్సార్ జిల్లా, కలసపాడు మండలం కేంద్రంలో ఓ పోలీసు కానిస్టేబుల్ చేతిలో లాఠీ ఉంది కదా అని రోడ్డు మీద వ్యక్తిని ఎలా బాదుతున్నాడో చూడండి. అయితే స్థానికులు గుమికూడటంతో సదరు కానిస్టేబుల్ వెనక్కితగ్గాడు. బాధితుడి శరీరంపై మాత్రం లాఠీవాతలు కమిలిపోయి కనిపించాయి. సామాన్యుడిపై లాఠీచార్జ్ చేస్తున్న కానిస్టేబుల్ వీడియోని వీక్షించండి -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
గిద్దలూరు రూరల్ : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని చాణిక్య స్కూల్ సమీపంలో బుధవారం జరిగింది. వివరాలు.. వైఎస్సార్ జిల్లా కలసపాడు మండలం ఎగువరామాపురం పంచాయతీ కొత్తకోటకు చెందిన ఓసూరి అఖిల్ (22) ఒంగోలు వైపు పల్సర్ బైకుపై వెళ్తున్నాడు. ఎదురుగా వస్తున్న లగేజీ వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో అఖిల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్సై మల్లికార్జున సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని చికిత్స కోసం ఢీకొట్టిన వాహనంలో పట్టణంలోని ఏరియా వైద్యశాలకు తరలించారు. డాక్టర్ సూరిబాబు అఖిల్‌కు చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. -
రెండేళ్ల పాలనలో ప్రజలకు ఏం చేశారు?
కలసపాడు: సాధ్యం కాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం రెండేళ్లలో ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని సిద్దమూర్తిపల్లె ప్రజలు ప్రశ్నించారు. మంగళవారం మండలంలోని మహానందిపల్లె పంచాయతీ పరిధిలోని సిద్దమూర్తిపల్లె, మహానందిపల్లె, మామిళ్లపల్లె గ్రామాల్లో గడప గడపకు వైఎస్సార్ నిర్వహించారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ వెంకటసుబ్బయ్య ఎదుట ప్రజలు వారి గోడును వెల్లబోసుకున్నారు. చంద్రబాబునాయుడు డ్వాక్రా , రైతు రుణాలు, నిరుద్యోగ భృతి, ఎన్టీఆర్ గృమాలు ఇలా ఎన్నో హామీలిచ్చి ఏ ఒక్కటీ అమలు చేయడం లేదన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో జన్మభూమి కమిటీల పెత్తనమేంటని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పి జగన్మోహన్రెడ్డిని గెలిపించుకుంటామన్నారు. కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధి సింగమల వెంకటేశ్వర్లు, సూదా రామకృష్ణారెడ్డి, జెడ్పీటసీ సభ్యుడు సగిలి సుదర్శన్, మాజీ సర్పంచ్ పి.పురుషోత్తంరెడ్డి, రాజుపాలెం సుబ్బారెడ్డి, బయపురెడ్డి, గంగురాజుయాదవ్, సిద్దమూర్తిపల్లె వెంకట రామిరెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, గోవిందరెడ్డి, ఎస్సీ సెల్ స్టీరింగ్ కమిటీ సభ్యుడు పగిడి థామస్, సామెల్, తదితరులు పాల్గొన్నారు. -
వీరబ్రహ్మం సన్నిధిలో విదేశీయులు
బ్రహ్మంగారిమఠం: జర్మనీ దేశానికి చెందిన పర్యాటకులు మంగళవారం శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామిని దర్శించుకున్నారు. వీరి వెంట కలసపాడుకు చెందిన ఆర్సీఎం చర్చి నిర్వాహకులు వచ్చారు. విదేశీ పర్యాటకులకు మఠం నిర్వాకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రంలో దేవస్థానం మేనేజర్ ఈశ్వరాచారి తదితరులు పాల్గొన్నారు.