సాక్షి, కడప : వాహన తనిఖీల్లో భాగంగా కలసపాడు పోలీసులు ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిపై దాడి చేసిన ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గురువారం సాయంత్రం ఎస్‌ఐ ప్రదీప్‌నాయుడు, పోలీసులు స్థానిక మూడు రోడ్ల కూడలిలో వాహనాల తనిఖీ నిర్వహించారు. రాత్రి 8–30 గంటల సమయంలో ఉపాధ్యాయుడు తన పనులు ముగించుకుని ఇంటికి వెళుతున్న బ్రాహ్మణపల్లె మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శివారెడ్డి మోటారుసైకిల్‌ను పోలీసులు ఆపారు. పత్రాలన్నీ శివారెడ్డి చూపించగా ఎస్‌ఐ బైకుకు ఇన్సూరెన్స్ లేదన్న కారణంతో రూ.1050 జరిమానా విధించారు.
ఈ క్రమంలో ఎస్‌ఐ శివారెడ్డిని దూషించడంతో మనస్తాపం చెందిన శివారెడ్డి తాను ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడినని, తనను దూషించడం సరికాదన్నారు. ఇంతలో ఎస్‌ఐ తనకే ఎదురు మాట్లాడుతావా అంటూ పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి ఎస్‌ఐ, కానిస్టేబుల్ దాదావలిలు దాడిచేశారు. అంతే కాకుండా తప్పుడు కేసు బనాయించేందుకు సిద్ధం చేస్తున్న క్రమంలో ఓ ఉపాధ్యాయ సంఘ నాయకుడు పోలీసుస్టేషన్‌కు వెళ్లి పోలీసులకు సర్దిచెప్పి శివారెడ్డిని గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత బయటికి తీసుకువచ్చారు. ఈ విషయం శనివారం ఉదయం బయటికి పొక్కడంతో శివారెడ్డి తీవ్రమనస్తాపం చెంది అనారోగ్యంగా ఉండడంతో ఒక్కసారిగా ఉపాధ్యాయ సంఘం నాయకులు, మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసుల తీరుకు నిరసనగా స్థానిక ఎమ్మార్సీ కార్యాలయం నుంచి వైఎస్‌ఆర్ విగ్రహం వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మూడు రోడ్ల కూడలిలో బైఠాయించి బాధితుడు శివారెడ్డికి న్యాయం చేయాలని, ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఒకపక్క పెద్ద ఎత్తున గుమికూడిన ప్రజలు మరో పక్క పోలీసులు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇంతలో వైఎస్సార్‌సీపీ మండల నాయకులు జోక్యం చేసుకుని ప్రజలకు, ఉపాధ్యాయ సంఘ నాయకులకు సర్దిచెప్పి ఎస్‌ఐ ద్వారా ఉపాధ్యాయునికి క్షమాపణ చెప్పించారు. దీంతో ప్రజలు, ఉపాధ్యాయులు శాంతించి భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావుృతం కాకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు రామకృష్ణారెడ్డి, గురివిరెడ్డి, జెడ్పీటీసీ సుదర్శన్, పురుషోత్తంరెడ్డి, ఉపాధ్యాయ సంఘం నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment