కలసపాడు: సాధ్యం కాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం రెండేళ్లలో ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని సిద్దమూర్తిపల్లె ప్రజలు ప్రశ్నించారు. మంగళవారం మండలంలోని మహానందిపల్లె పంచాయతీ పరిధిలోని సిద్దమూర్తిపల్లె, మహానందిపల్లె, మామిళ్లపల్లె గ్రామాల్లో గడప గడపకు వైఎస్సార్ నిర్వహించారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ వెంకటసుబ్బయ్య ఎదుట ప్రజలు వారి గోడును వెల్లబోసుకున్నారు. చంద్రబాబునాయుడు డ్వాక్రా , రైతు రుణాలు, నిరుద్యోగ భృతి, ఎన్టీఆర్ గృమాలు ఇలా ఎన్నో హామీలిచ్చి ఏ ఒక్కటీ అమలు చేయడం లేదన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో జన్మభూమి కమిటీల పెత్తనమేంటని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పి జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించుకుంటామన్నారు. కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధి సింగమల వెంకటేశ్వర్లు, సూదా రామకృష్ణారెడ్డి, జెడ్పీటసీ సభ్యుడు సగిలి సుదర్శన్, మాజీ సర్పంచ్ పి.పురుషోత్తంరెడ్డి, రాజుపాలెం సుబ్బారెడ్డి, బయపురెడ్డి, గంగురాజుయాదవ్, సిద్దమూర్తిపల్లె వెంకట రామిరెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, గోవిందరెడ్డి, ఎస్సీ సెల్ స్టీరింగ్ కమిటీ సభ్యుడు పగిడి థామస్, సామెల్, తదితరులు పాల్గొన్నారు.