ggysr
-
ఒక్క పథకమూ అందలేదు
- ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న ప్రజలు బద్వేలు అర్బన్: ఎన్నికలలో గెలిపిస్తే పక్కాగృహాలు ఇస్తాం, పెన్షన్లు ఇస్తాం అంటూ ఏవేవో హామీలిస్తే నమ్మి ఓట్లేశాం. గెలిచిన తర్వాత ఏ ఒక్క పథమూ అందించలేదని మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డుకు చెందిన మంగళకాలని, పూసలవాడ ప్రజలు వాపోయారు. బుధవారం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో వార్డు పరిధిలోని ఆయా కాలనీలలో నిర్వహించిన గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమంలో ప్రజలు తమగోడు వెళ్లబోసుకున్నారు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ పెన్షన్లు, పక్కాగృహాలు , మరుగుదొడ్లు మంజూరుచేయడంలో వివక్షచూపుతున్నారని వాపోయారు. ఎన్నికలలో ప్రచారానికి వచ్చిన సమయంలో ఇళ్ల పట్టాలు ఇప్పిస్తామని, కాలనీలలో సిమెంటు రోడ్లు , తాగునీటి సౌకర్యం కల్పిస్తామని అనేక హామీలిచ్చిన టీడీపీ నాయకులు కాలనీ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని మండిపడ్డారు. ఇప్పటికే చంద్రబాబును నమ్మి అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డామని, ఇక నమ్మే పరిస్థితులలో లేమని తేల్చి చెప్పారు. అనంతరం సమన్వయకర్త డాక్టర్ వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ చంద్రబాబునాయుడు కేవలం ఎన్నికలలో గెలుపొందేందుకే ఆచరణకు సాధ్యంకాని హామీలు ఇచ్చారని అన్నారు. కార్యక్రమంలో బ్రాహ్మణపల్లె సింగిల్‌విండో అధ్యక్షుడు గుర్రంపాటి సుందరరామిరెడ్డి , జిల్లా సంయుక్త కార్యదర్శి కొండు శేఖర్‌రెడ్డి , మున్సిపాలిటీ కన్వీనర్ కరిముల్లా , మాజీ సర్పంచ్ ఆదిశేషయ్య, నాయకులు రఘురామిరెడ్డి, గాజులపల్లె కేశవరెడ్డి,యద్దారెడ్డి, మల్లేష్, ఎస్ఎం. షరీఫ్, సాంబశివారెడ్డి, శేఖర్‌రెడ్డి, రాము,మురళి,చరణ్ తదితరులు పాల్గొన్నారు. -
విశ్వాసం కోల్పోయారు
పోరుమామిళ్ల: ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి చంద్రబాబు ప్రజల్లో విశ్వాసం కోల్పోయారని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని 16, 17, 18 వార్డులకు చెందిన బెస్తవీధి, కొత్తవీధి, ఆపరేటర్బాషా వీధి, రంపాడ్రోడ్, చితానందనగర్లలో సమన్వయకర్త డాక్టర్ వెంకటసుబ్బయ్య, ఎంపీపీ చిత్తా విజయప్రతాప్‌రెడ్డి, మండలశాఖ అధ్యక్షుడు సీఎం బాషాలతో కలసి ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గడప గడపకు వైఎస్సార్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఏ విషయంలోనూ నిలకడగా మాట్లాడరని, ప్రత్యేకహోదా విషయంలోనూ మాట మార్చారన్నారు.ఆయన మంత్రులు కూడా ఆయన బాటలోనే నడుస్తున్నారన్నారు. బెస్తవీధికి చెందిన మైనారిటీ మహిళలు మాట్లాడుతూ తమ కాలనీలో కుళాయిలకు నీళ్లు రావడం లేదని, ట్యాంకర్లు వచ్చినా అందరికీ అందడం లేదన్నారు. మరికొంత మంది మాట్లాడుతూ పింఛన్లు, రేషన్‌కార్డులను దరఖాస్తు చేసి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదన్నారు. కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్‌మెంబర్ రవిప్రకాష్‌రెడ్డి, ఎస్సీసెల్ జిల్లా కార్యదర్శి ముత్యాల ప్రసాద్, కో ఆప్షన్ మెంబర్ ఇస్సాక్, మండల కార్యదర్శి ఓబన్న, మండల మాజీ ఉపాధ్యక్షుడు సంగా వసంతరాయలు, మాజీ సర్పంచులు డాక్టర్ మాబు, భూతప్ప, ఎంపీటీసీలు సంగా బ్రహ్మయ్య, మహబూబ్‌పీర్, వార్డు మెంబర్లు అల్లా, చెండ్రాయుడు, నాయకులు కరెంటు రమణారెడ్డి, చాపాటి లక్ష్మినారాయణరెడ్డి, సుబ్బారావు, ఓబయ్య, ఓబులపతి, మూర్తెయ్య, గురయ్య, అమీర్‌బాషా, మిద్దె షరీఫ్, రమణ, గిరిప్రణీత్‌రెడ్డి, సద్దాం, బాబు, అవినాష్ పాల్గొన్నారు. -
హామీలిచ్చారు.. పత్తాలేరు
- గడప గడపకు వైఎస్సార్‌లో మహిళల ఆవేదన బద్వేలు అర్బన్: ఎన్నికల సమయంలో అదిచేస్తాం, ఇదిచేస్తామంటూ ఏవేవో హామీలు ఇచ్చిన టీడీపీ నాయకులు గెలిచి రెండున్నరేళ్లకాలం అవుతున్నా వార్డువైపు కన్నెత్తికూడా చూడకుండా పత్తాలేకుండా పోయారని మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులోని కృష్ణా కాంప్లెక్స్లైన్, ఓబుళమ్మ కాంప్లెక్స్లైన్, కోదండరామరైస్ మిల్లు లైన్ మహిళలు వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయయకర్త డాక్టర్ వెంకటసుబ్బయ్య ఎదుట వాపోయారు. బుధవారం వార్డు పరిధిలోని ఆయా కాలనీలలో నిర్వహించిన గడప గడపకు వైఎస్సార్ లో ప్రజలు తమ సమస్యలను వివరించారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామంటే నమ్మి రుణాలు చెల్లించడం లేదని ఇప్పుడేమో బ్యాంక్ అధికారులు రుణాలు చెల్లించాల్సిందేనని హెచ్చరికలు జారీ చేస్తున్నారని మహిళలు వాపోయారు. అలాగే పక్కాగృహాల కోసం రెండేళ్లుగా దరఖాస్తు చేసుకుంటున్నా ఒక్క ఇళ్లు కూడా మంజూరు చేయలేదని మండిపడ్డారు. అనంతరం డాక్టర్ వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి అర్హులైన పేదలకు ఏ ఒక్క పథకం అందడం లేదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకుడు, బ్రాహ్మణపల్లె సింగిల్ విండో అధ్యక్షుడు గుర్రంపాటి సుందరరామిరెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి కొండు శేఖర్‌రెడ్డి , కౌన్సిలర్ గోపాలస్వామి, మున్సిపాలిటీ కన్వీనర్ కరిముల్లా , 8వ వార్డు ఇన్చార్జి రాము, మడకలవారిపల్లె , తిరువెంగళాపురం మాజీ సర్పంచ్ ఆదిశేషయ్య, రఘురామిరెడ్డి, నాయకులు చెన్నయ్య, యద్దారెడ్డి, గాజులపల్లె కేశవరెడ్డి ,సాంబశివారెడ్డి, రఘురామిరెడ్డి, బండి వెంకటసుబ్బయ్య, సుబ్బరాజ, ఎల్లారెడ్డి,గంగులయ్య, సిద్దయ్య, తదితరులు పాల్గొన్నారు. -
రెండేళ్ల పాలనలో ప్రజలకు ఏం చేశారు?
కలసపాడు: సాధ్యం కాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం రెండేళ్లలో ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని సిద్దమూర్తిపల్లె ప్రజలు ప్రశ్నించారు. మంగళవారం మండలంలోని మహానందిపల్లె పంచాయతీ పరిధిలోని సిద్దమూర్తిపల్లె, మహానందిపల్లె, మామిళ్లపల్లె గ్రామాల్లో గడప గడపకు వైఎస్సార్ నిర్వహించారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ వెంకటసుబ్బయ్య ఎదుట ప్రజలు వారి గోడును వెల్లబోసుకున్నారు. చంద్రబాబునాయుడు డ్వాక్రా , రైతు రుణాలు, నిరుద్యోగ భృతి, ఎన్టీఆర్ గృమాలు ఇలా ఎన్నో హామీలిచ్చి ఏ ఒక్కటీ అమలు చేయడం లేదన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో జన్మభూమి కమిటీల పెత్తనమేంటని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పి జగన్మోహన్రెడ్డిని గెలిపించుకుంటామన్నారు. కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధి సింగమల వెంకటేశ్వర్లు, సూదా రామకృష్ణారెడ్డి, జెడ్పీటసీ సభ్యుడు సగిలి సుదర్శన్, మాజీ సర్పంచ్ పి.పురుషోత్తంరెడ్డి, రాజుపాలెం సుబ్బారెడ్డి, బయపురెడ్డి, గంగురాజుయాదవ్, సిద్దమూర్తిపల్లె వెంకట రామిరెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, గోవిందరెడ్డి, ఎస్సీ సెల్ స్టీరింగ్ కమిటీ సభ్యుడు పగిడి థామస్, సామెల్, తదితరులు పాల్గొన్నారు. -
అబద్ధపు హామీలతో మోసపోయాం
అట్లూరు : అధికారంలోకి రాకముందు అధికార దాహంతో మోసపూరిత హామీలు ఇచ్చి చంద్రబాబునాయుడు ప్రజలను మోసం చేశాడని వేమలూరు ప్రజలు వాపోయారు. మండలంలోని వేమలూరులో సోమవారం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డాక్టర్ వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ ఎన్నికలకు బంగారు రుణాలతో పాటు డ్వాక్రా రుణాలు చెల్లించవద్దు, నేను వస్తే మీరు తాకట్టుపెట్టిన బంగారు మీ ఇంటికి వచ్చేటట్లు చేయడంతో పాటు మీరు తీసుకున్న డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామన్నారన్నారు. అలాగే పంట రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని, నిరుద్యోగులకు నిరుద్యోగభృతి, ఇంటికో ఉద్యోగం ఇలా ఎన్నెన్నో మోసపూరిత హామీలు ఇచ్చి చంద్రబాబు ప్రజలను మోసం చేశాడని మండిపడ్డారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా సంయుక్త కార్యదర్శి అందూరి రామక్రిష్ణారెడ్డి, మండలాధ్యక్షురాలు పెరుగుసావిత్రి, ఎంపీటీసీ శ్యామలమ్మ, వేమలూరు సర్పంచు ప్రభాకర్‌రెడ్డి, వైఎస్ఆర్సీపీ మండల నాయకులు మల్లుసుబ్బారెడ్డి, గంగిరెడ్డి, సుబ్బారెడ్డి, బాలక్రిష్ణారెడ్డి, తిరుపాల్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, మాధవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు
– గడప గడపకు వైఎస్సార్‌లో చంద్రబాబుపై ప్రజల ఆగ్రహం గోపవరం : ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా బుధవారం మండలంలోని బేతాయపల్లె పంచాయతీ పెద్దపోరుపల్లె, పీ.పీ.కుంట ఎస్టీకాలనీలో నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ వెంకటసుబ్బయ్య, పార్టీ అధికార ప్రతినిధి సింగమాల వెంకటేశ్వర్లు, మండల కన్వీనర్ గోపవరం సరస్వతి, సింగిల్‌విండో అధ్యక్షుడు సుందర్రామిరెడ్డిలు ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన వంద హామీల గురించి ప్రజల వద్ద ప్రస్తావించగా వారు పైవిధంగా స్పందించారు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పుణ్యమా అని అప్పట్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్నామని, ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు పట్టించుకునేవారే లేరని స్థానికులు మండిపడ్డారు. చంద్రబాబు నోరుతెరిస్తే అబద్ధాలే చెబుతున్నాడన్నారు. అధికారపార్టీకి చెందిన వారికే లక్షల రూపాయలు నీరు–చెట్టు పేరుతో పనులు కట్టబెడుతున్నారని, ప్రజా సమస్యలపై ఏనాడు కూడా స్పందించిన దాఖలాలు లేవన్నారు. వ్యవసాయ బోర్ల కింద వరిపంటను సాగు చేస్తే విద్యుత్తు సరఫరా కూడా సక్రమంగా ఇవ్వడం లేదని రైతులు నాయకుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. 9 గంటలు సరఫరా చేస్తామని చెప్పి ఇంత వరకు హామీ నెరవేర్చకపోగా ఇచ్చే 7 గంటల విద్యుత్తులో కూడా ఇష్టానుసారంగా కోతలు విధిస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో వేసిన పంట దక్కుతుందో లేదోనని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా రెండవ విడత రుణమాఫీ విషయంలో అధిక శాతం మందికి రుణవిముక్తి పత్రాలు అందలేదని పెద్దపోరుపల్లె గ్రామానికి చెందిన పెంచలయ్య, సుబ్బయ్య వాపోయారు. కార్యక్రమంలో సర్పంచు ఇమ్మిడిశెట్టిసునీత, నాయకులు గోపవరంమల్లికార్జునరెడ్డి, పెంచలయ్య, సాంబశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కరెంటు బిల్లుల మోత మోగుతోంది
కడప అగ్రికల్చర్: ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కరెంట్ బిల్లుల మోత మోగుతోందని నిరుపేదలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో మంగళవారం గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమాన్ని మూడు నియోజకవర్గాల్లో ఆ పార్టీ నేతలు నిర్వహించారు. మైదుకూరు మండలం అన్నలూరులో ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ప్రజలను కలుసుకుని కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రజలు మాట్లాడుతూ ఆ మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలమైన తమకు కరెంటు బిల్లుల భారం ఉండేదికాదని అన్నారు. ఈ మాయదారి ప్రభుత్వం వచ్చాక బిల్లులు వేలల్లో వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరు మండలం సోములవారిపల్లె పంచాయతీలో ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి ప్రజలతో మమేకమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ నేతలు హామీలను భారీగా ఇచ్చినా ఇంతవరకు ఒక్కటీ నెరవేర్చలేదని దుయ్యబట్టారు. నందలూరు మండలం రాచపల్లె, ఇసుకపల్లెల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలో ప్రజలు మాట్లాడుతూ 108, 104 వాహనాలు అందుబాటులో ఉండటం లేదని, ఏదైనా ప్రమాదం సంభవిస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొక తప్పదని, వాటిని అందుబాటు ఉండేలా చూడాలని కోరారు. -
హోదాపై ఇంకా మభ్యపెట్టొద్దు
బోళ్లపాడు(ఉయ్యూరు): సిగ్గు, లజ్జ లేకుండా ఇంకా హోదాపై రాష్ట్ర ప్రజలను సీఎం చంద్రబాబునాయుడు మభ్యపెడుతున్నారని వైఎస్సార్ సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కొలుసు పార్థసార«థి ధ్వజమెత్తారు. గ్రామంలో గడపగడపకూ వైఎస్సార్ శుక్రవారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజాబ్యాలెట్ అందించి చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలను వివరించి ప్రజలను చైతన్యవంతుల్ని చేశారు. వైఎస్సార్ సర్కిల్లో జరిగిన బహిరంగ సభలో పార్థసారధి మాట్లాడారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రజలను మభ్యపెట్టి ఐదు కోట్ల మంది నోట్లో మట్టికొడుతున్నారని ఆరోపించారు. కృష్ణా, గోదావరి పుష్కరాల పేరుతో రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. పుష్కరాల సందర్భంగా ప్రార్థనా మందిరాలను కూల్చడం తప్ప ఆయన చేసిందేమీ లేదని ఎద్దేవ చేశారు. తెలుగు ప్రజలు దైవంగా భావించే వైఎస్సార్ విగ్రహాన్ని కూల్చిన నీతిమాలిన వ్యక్తి సీఎం అన్నారు. దేశంలోని ముఖ్యమంత్రుల్లో అత్యంత సంపన్నమైన వ్యక్తి చంద్రబాబని ఓ సర్వే సంస్థ నిజాన్ని బట్టబయలుచేసిందని వివరించారు. చంద్రబాబు శనివారం హోదా కోసం చేపట్టే బంద్‌కు సహకరించి తన నిజాయితీని చాటుకోవాలని సవాల్ విసిరారు. పవన్‌కల్యాణే కాదు ఏ ఒక్కరు ప్రత్యేక హోదా కోసం ఉద్యమించినా వైఎస్సార్ సీపీ మద్దతు ఇస్తోందని చెప్పారు. కరువు.. చంద్రబాబు కవలలు..! కరువు, చంద్రబాబు కవలలని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టాక రైతులకు మద్దతు ధర కరువైందన్నారు. పులిచింతల, పోలవరం ప్రాజెక్టులను పక్కనపెట్టి పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టి డెల్టా, రాయలసీమ ప్రాంతాలకు తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. 24 పంప్ సెట్లు ఎందుకు ప్రారంభించలేదో రైతులకు సమాధానం చెప్పాలని కోరారు. మొత్తం పంపు సెట్లు పనిచేస్తే 40 కిలోమీటర్ల పొడవు కాలువ కట్టలు ముక్కలుచెక్కలుగా తెగిపోతాయని సీఎంకు ముందే తెలుసని వివరించారు. సభలో ఎంపీపీ తుమ్మూరు గంగారత్నం, పెనమలూరు పరిశీలకురాలు కైలా జ్ఞానమణి, తుమ్మల చారిట్రబుల్ ట్రస్ట్ చైర్మన్ తుమ్మల చంద్రశేఖర్ పాల్గొన్నారు.