ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు
– గడప గడపకు వైఎస్సార్‌లో చంద్రబాబుపై ప్రజల ఆగ్రహం
గోపవరం : ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గడప గడపకు వైఎస్‌ఆర్ కార్యక్రమంలో భాగంగా బుధవారం మండలంలోని బేతాయపల్లె పంచాయతీ పెద్దపోరుపల్లె, పీ.పీ.కుంట ఎస్టీకాలనీలో నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ వెంకటసుబ్బయ్య, పార్టీ అధికార ప్రతినిధి సింగమాల వెంకటేశ్వర్లు, మండల కన్వీనర్ గోపవరం సరస్వతి, సింగిల్‌విండో అధ్యక్షుడు సుందర్‌రామిరెడ్డిలు ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన వంద హామీల గురించి ప్రజల వద్ద ప్రస్తావించగా వారు పైవిధంగా స్పందించారు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పుణ్యమా అని అప్పట్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్నామని, ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు పట్టించుకునేవారే లేరని స్థానికులు మండిపడ్డారు. చంద్రబాబు నోరుతెరిస్తే అబద్ధాలే చెబుతున్నాడన్నారు. అధికారపార్టీకి చెందిన వారికే లక్షల రూపాయలు నీరు–చెట్టు పేరుతో పనులు కట్టబెడుతున్నారని, ప్రజా సమస్యలపై ఏనాడు కూడా స్పందించిన దాఖలాలు లేవన్నారు. వ్యవసాయ బోర్ల కింద వరిపంటను సాగు చేస్తే విద్యుత్తు సరఫరా కూడా సక్రమంగా ఇవ్వడం లేదని రైతులు నాయకుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. 9 గంటలు సరఫరా చేస్తామని చెప్పి ఇంత వరకు హామీ నెరవేర్చకపోగా ఇచ్చే 7 గంటల విద్యుత్తులో కూడా ఇష్టానుసారంగా కోతలు విధిస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో వేసిన పంట దక్కుతుందో లేదోనని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా రెండవ విడత రుణమాఫీ విషయంలో అధిక శాతం మందికి రుణవిముక్తి పత్రాలు అందలేదని పెద్దపోరుపల్లె గ్రామానికి చెందిన పెంచలయ్య, సుబ్బయ్య వాపోయారు. కార్యక్రమంలో సర్పంచు ఇమ్మిడిశెట్టిసునీత, నాయకులు గోపవరంమల్లికార్జునరెడ్డి, పెంచలయ్య, సాంబశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.