అందెల రవళికి స్వర్ణోత్సవం | All Sets Kuchipudi Natya Swarnotsavam at Kuchipudi Natyakshetram | Sakshi
Sakshi News home page

అందెల రవళికి స్వర్ణోత్సవం

Published Fri, Dec 27 2024 4:14 AM | Last Updated on Fri, Dec 27 2024 9:47 AM

All Sets Kuchipudi Natya Swarnotsavam at Kuchipudi Natyakshetram

ఉమెన్‌ పవర్‌ 2024 

నేటి నుంచి జరగబోయే పతాక స్వర్ణోత్సవాలకు కూచిపూడి సిద్ధమైంది. సిద్దేంద్రయోగి అడుగు జాడలతో కూచిపూడి వెలిగిపోనుంది. 

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎంతోమంది కూచిపూడి అభిమానులు, నాట్యకారులను అమితంగా ఆకర్షిస్తున్న మాట... కూచిపూడి స్వర్ణోత్సవ పతాకం. ‘కూచిపూడి’ పుట్టిన కూచన్నపూడి గ్రామం పేరు కూచిపూడిగా మారింది. దేశానికి జాతీయ జెండా ఉన్నట్లుగానే కూచిపూడి వైభవాన్ని ప్రతిబించించే పతాకం ఒకటి ఉండాలని వేదాంతం పార్వతీశం సంకల్పించారు. చెరకుగడ, జడ, కర్ర గుర్తులతో 1974లో పతాకాన్ని రూపొందించారు. ఆ రూపకల్పన జరిగి యాభైఏళ్లు పూర్తయిన సందర్భంగా పతాక స్వర్ణోత్సవాలకు ముస్తాబైంది కూచిపూడి. 

కూచిపూడి కళా పీఠం దగ్గర 50 అడుగుల ఎత్తులో నిర్మించిన స్థూప పతాకాన్ని నేడు ఆవిష్కరించనున్నారు. మూడు రోజులపాటు కూచిపూడి గురువులు, కళాకారులు, కళాభిమానుల మధ్య రకరకాల కార్యక్రమాలు జరగనున్నాయి. పతాక స్వర్ణోత్సావాల నేపథ్యంలో చివరిరోజు రెండు వేల మందికి పైగా కళాకారులతో ప్రదర్శన ఇచ్చేందుకు కూచిపూడి సిద్ధం అయింది. ప్రదర్శనలకు ముందు అంబాపరాకు పాట పాడడం సంప్రదాయంగా వస్తోంది ‘అందెల రవమిది పదములదా... అంబరమంటిన హృదయముదా’ అంటూ కూచిపూడి స్వర్ణోత్సవ పతాకం తన సంబరాన్ని అంబరంతో పంచుకునే దృశ్యం కనుల విందు చేయనుంది.
 

గత వైభవం ఘనంగా...
మన సంప్రదాయ కళను భవిష్యత్తు తరాలకు అందించాలన్నదే నా లక్ష్యం. పతాక స్వర్ణోత్సవాలలాంటి కార్యక్రమాల ద్వారా గత వైభవాన్ని మళ్లీ ఘనంగా గుర్తుకు తెచ్చుకోవచ్చు. ఆ ఉత్సాహంతో మన నాట్యకళ మరింత శక్తిమంతమై మరింతగా జనాల్లోకి వెళుతుంది.
– జి. శ్రీవత్సల, రాజమహేంద్రవరం

నవతరానికి స్ఫూర్తిని ఇచ్చేలా...
అమ్మ సలహా మేరకు నేర్చుకున్న కూచిపూడి ఇప్పుడు నాకు మరో అమ్మ. కూచిపూడి పతాక స్వర్ణోత్సవాల గురించి తెలుసుకున్నప్పుడు చాలా సంతోషించాను. దేశ విదేశాల నుంచి నాట్యకారులు పాల్గొనే ఈ కార్యక్రమాలతో ఆ గడ్డపై గత వైభవం మరోసారి పునరావిష్కృతం అవుతుంది.  నవతరానికి స్ఫూర్తిని ఇస్తుంది.
– ఎం. వసుధ, హైదరాబాదు

ఆ జెండా రెప రెపలలో...
కూచిపూడి పతాక స్వర్ణోత్సవాల సందడి ఆప్రాంతానికి మాత్రమే పరిమితమైనది కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది కూచిపూడి కళాకారులకు సంతోషాన్ని కలిగించే విషయం. ఆ జెండా రెపరెపలలో కూచిపూడి కళ మరింతగా వెలిగిపోవాలని కోరుకుంటున్నాను.
– లంక సుస్మిత, విజయవాడ

దిశానిర్దేశం చేసే పతాకం
కూచిపూడి పతాక స్వర్ణోత్సవాలు ప్రపంచం నలుమూలలలో ఉన్న కూచిపూడి కళాకారులకు పండగలాంటివి. అంతెత్తున ఎగరబోయే జెండా కూచిపూడి నృత్యానికి సంబంధించి మౌనంగానే దిశానిర్దేశం చేయనుంది.
– జల్లూరి శరణ్య, మచిలీపట్నం

కెనడాలో కూచిపూడి
యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా కూచిపూడి పతాక స్వర్ణోత్సవాలు నిర్వహిస్తునందుకు సంతోషంగా ఉంది. కెనడాలో కూచిపూడి అకాడమీ ఏర్పాటు చేశాను. ఆసక్తి ఉన్న వారికి నేర్పించడంతో పాటు ప్రదర్శనలు ఇస్తున్నాను. కూచిపూడి నాట్య వ్యాప్తి కోసం నా వంతుగా కృషి చేస్తున్నాను.
– డాక్టర్‌ వేదాంతం వెంకట నాగ చలపతి రావు, కెనడా

పేద పిల్లలకు అండగా... 
ప్రతి ఏటా ఆర్థిక స్థోమత లేని ఇద్దరు చిన్నారులకు సొంత ఖర్చుతో కూచిపూడిలో శిక్షణ ఇప్పిస్తున్నాను. ఇప్పటికి 40 మందికి నేర్పించా. ఇక్కడ నేర్చుకున్న ఎంతోమంది నాట్య పాఠశాలలు మొదలుపెట్టి ఆసక్తి ఉన్న వారికి కూచిపూడి నేర్పిస్తున్నారు.
– డా. రవి బాలకృష్ణ, వైస్‌ ప్రిన్సిపల్, 
కూచిపూడి కళాక్షేత్రం, కూచిపూడి

– ఎస్‌.పి యూసుఫ్, సాక్షి, మచిలీపట్నం
ఫోటోలు: పవన్, సాక్షి, విజయవాడ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement