దేశ విదేశాల్లో 200కు పైగా ప్రదర్శనలిచ్చిన నాట్యమయూరి
చిన్న వయసులోనే లెక్కకు మిక్కిలిగా అవార్డులు, రివార్డులు
కూచిపూడి, భరతనాట్యం, జానపదం, కథకళి, కథక్, మణిపురి, ఒడిస్సీ, మోహినీ అట్టం, యక్షగానం ప్రముఖమైన నృత్యకళలు. వీటిలో భరత నాట్యానికి ఉన్న ప్రాముఖ్యత ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రసిద్ధిగాంచిన పురాతన ఆలయాల్లో కనిపించే శిల్పాలు భరతనాట్య భంగిమలో దర్శనమిస్తాయి. తంజావూరులో పుట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన భరతనాట్యమంటే అందరికీ ఇష్టమే. భరతనాట్య కళాకారులకు గుర్తింపు, గౌరవం కూడా ఎక్కువే. అలాంటి గుర్తింపు, గౌరవాన్ని చిన్న వయసులోనే సొంతం చేసుకుంది మార్కాపురానికి చెందిన చిన్నారి అవంతిక.
మార్కాపురం: కళలపై అభిరుచి ఉన్న తలిదండ్రులు తమ పిల్లలను ప్రముఖ కళాకారులుగా చూడాలని కోరుకుంటారు. మార్కాపురం పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భూపని కాశయ్య, అన్నపూర్ణాదేవి దంపతులు కూడా తమ కుమార్తె అవంతికను నాట్య కళాకారిణిగా చూడాలని భావించారు. ఐదేళ్ల వయసు నుంచే నాట్య గురువు ప్రతిమ దగ్గర శిక్షణ ఇప్పిస్తున్నారు. 2016లో ప్రారంభమైన నృత్య శిక్షణ ఇప్పటికీ కొనసాగుతోంది.
మార్కాపురం పట్టణంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న ఆ చిన్నారి గడిచిన ఏడేళ్లలో సొంతూరితోపాటు ఒంగోలు, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, శ్రీకాళహస్తి, శ్రీశైలం, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో నృత్య ప్రదర్శనలు ఇచ్చి శభాష్ అనిపించుకుంది. ముఖ్యంగా నరసింహ కౌతువం ప్రదర్శనలో అవంతిక నాట్యం అద్భుతమని చెప్పవచ్చు. ఇందులో హావభావాలు, ముఖ కవళికలను చూసి తీరాల్సిందే. 2022లో మలేíÙయా, 2023లో శ్రీలంక, ఈ ఏడాది ఏప్రిల్‌లో దుబాయ్‌లోనూ నృత్య ప్రదర్శనలిచ్చిన అవంతిక అంతర్జాతీయ స్థాయిలో బహుమతులు అందుకుంది. అంతే కాదండోయ్.. చదువులో కూడా అవంతిక క్లాస్ ఫస్టే. మరొక విశేషమేమిటంటే అవంతిక సంగీతంలోనూ శిక్షణ తీసుకుంటోంది.
గెలుపొందిన అవార్డులు
⇒ 2020లో నిర్వహించిన జాతీయ నృత్య ఉత్సవాల్లో పాల్గొని నంది పురస్కారం అందుకుంది.
⇒ 2021లో హంపిలో నిర్వహించిన జాతీయ స్థాయి నృత్య ప్రదర్శనలో అంజనా పురస్కారం, ధూర్జటి పురస్కారం, నాట్యమయూరి పురస్కారం పొందింది.
⇒ 2022లో జాతీయ స్ధాయిలో సూపర్ చాంపియన్‌గా ఎంపికైంది. డివిజన్ స్థాయి ఐకాన్ అవార్డు పొందింది. అలాగే బాల నాట్య నర్తకీమణి, నర్తన నంది, గజకేశరి పురస్కారాలు పొందింది.
⇒ కాళహస్తిలో నిర్వహించిన నృత్య పోటీలో ప్రథమ స్ధానాన్ని కైవసం చేసుకుంది.
⇒ రాజమండ్రిలో నిర్వహించిన పోటీల్లో రెండో స్ధానం, శ్రీశైలంలో నిర్వహించిన జాతీయ స్ధాయిలో మూడో స్ధానంలో నిలిచింది.
⇒ 2023లో అంతర్జాతీయ స్ధాయిలో సూపర్ చాంపియన్‌గా ఎంపికైంది.
నాట్యం, సంగీతం చాలా ఇష్టం
మా అమ్మాయి అవంతికకు నాట్యమంటే ఇష్టమని గమనించి నాట్య గురువు ప్రతిమ వద్ద 2016లో శిక్షణలో చేరి్పంచాం. అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లోనూ ప్రేక్షకులను మెప్పించి బహుమతులు సాధించింది. ఈ మధ్య సంగీతం కూడా నేర్చుకుంటోంది. ఈ రెండిటినీ బ్యాలెన్స్ చేస్తూ చదువులో కూడా ఫస్ట్ వస్తోంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇష్టమైన కళల్లో శిక్షణ ఇప్పించి ప్రోత్సహిస్తే సంస్కృతీ సంప్రదాయాలను కొనసాగించినవారవుతారు. మానసిక ఆనందంతోపాటు గౌరవం కూడా లభిస్తుంది.
– భూపని కాశయ్య, అన్నపూర్ణాదేవి
Comments
Please login to add a commentAdd a comment