![The role of women in society is crucial - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2023/12/29/faffa.jpg.webp?itok=ztotBDXI)
సమాజ నిర్మాణంలో స్త్రీ పాత్ర కీలకం. అవని అంతటినీ నడిపించే శక్తి ఆమె. గ్రామీణ విద్యార్థులను అంతర్జాతీయ వేదిక మీద నిలిపిన టీచర్ ఒకరు. సమాజంలో నెలకొన్న రుగ్మతలకు కూడా చికిత్స చేస్తున్న డాక్టర్ ఒకరు. నిస్సహాయుల బతుకును ఈతతో దరిచేరుస్తున్న తల్లి ఒకరు. సాటి మహిళకు స్వావలంబన సాధనలో సహకారం అందిస్తున్న శక్తి ఒకరు. స్థితప్రజ్ఞత సాధనకై నాట్య యోగ ధ్యాన క్రియలతో శ్రమిస్తున్న ఔత్సాహిక ఒకరు. చక్కటి జాతి నిర్మాణంలో తమదైన పాత్రను పోషిస్తున్న ఆణిముత్యాలు వీళ్లు. ఇయర్ రౌండప్‌లో ఈ ఏడాది వారు సాధించిన లక్ష్యాల గురించి క్లుప్తంగా...
శ్రుతకీర్తి
శ్రుతకీర్తి ప్రముఖ కూచిపూడి నాట్యకారిణి. గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ డాన్స్ హెచ్‌వోడీగా శాస్త్రీయ నాట్యంలో కొత్తతరాలకు మార్గదర్శనం చేస్తున్నారు. మూడేళ్ల వయసులో వేదిక మీద తొలి ప్రదర్శన ఇచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు దేశవిదేశాల్లో వెయ్యికి పైగా ప్రదర్శనలిచ్చారామె. గొంతు, ఉచ్చారణ బాగుందని టీచర్లు స్కూల్ రేడియోలో వ్యాఖ్యాతగా అవకాశం ఇచ్చారు. అలా మొదలైన వ్యాఖ్యాన పరంపరలో ఆరవ తరగతిలో ప్రముఖుల కార్యక్రమాలకు వేదిక మీద వ్యాఖ్యాతగా వ్యవహరించే స్థాయికి ఎదిగారు.
ఐదు వందలకు పైగా సభలను నిర్వహించిన శ్రుతకీర్తి తొమ్మిదవ తరగతి నుంచి న్యూస్ ప్రెజెంటర్‌గా జెమినీ టీవీలో వార్తలు చదివారు. ఎంబీఏ, ఎల్‌ఎల్‌బీ, కౌన్సెలింగ్ సైకాలజీలో డాక్టరేట్ చేసిన కీర్తి... దశాబ్దకాలంగా మాతా ఆత్మానందమయి శిష్యరికంలో సుషుమ్న క్రియ యోగదీక్ష సాధన చేస్తూ ప్రపంచ శాంతి, మెంటల్ అండ్ ఎమోషనల్ హెల్త్ కోసం దేశవిదేశాల్లో స్కూళ్లు, కాలేజ్‌లతోపాటు కార్పొరేట్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. మనసు చంచలమైనది. సాధన ద్వారా స్థితప్రజ్ఞత సాధించాలి. ఇప్పుడు ప్రపంచం అంతటా యువతను పీడిస్తున్న సమస్య ఏకాగ్రతలోపం. నాట్యం, యోగసాధన, ధ్యానం ద్వారా ఏకాగ్రతను సాధించవచ్చని ఆచరణాత్మకంగా తెలియచేస్తున్నానని చెబుతారు శ్రుతకీర్తి.
నీరజ గొడవర్తి
‘సంకల్ప బలమే లక్ష్యం వైపు నడిపిస్తుంది. నా జీవితంలో ‘నో’ అనే పదానికి స్థానమే లేదు’ అంటున్న నీరజ గొడవర్తిది అంబేద్కర్ కోనసీమ జిల్లా ముంగండ. ఏకశిల కెమికల్స్ లిమిటెడ్‌కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా దాదాపు నలభై ఏళ్లుగా ఆ సంస్థను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇక ప్రవృత్తి, అభిరుచుల విషయానికి వస్తే... ఇకబెనా ఫ్లవర్ డెకరేషన్, కర్ణాటక సంగీత గాయని, పాటల రచయిత, స్వరకర్త, రోటరీ క్లబ్ సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ బిజీగా ఉంటారు.
పారిశ్రామిక రంగం అంటే మగవాళ్ల ప్రపంచం అనే అభిప్రాయం స్థిరంగా ఉన్న రోజుల్లో పరిశ్రమ స్థాపించి, విజయవంతమైన పారిశ్రామికవేత్తగా నిలదొక్కుకోవడానికి ఎంతగా శ్రమించాల్సి వచ్చిందో తనకు తెలుసంటారామె. అందుకే పరిశ్రమల రంగంలోకి రావాలనే ఆసక్తి ఉన్న మహిళలకు ఒక మార్గం వేయాలనే ఉద్దేశంలో కోవె(కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్) నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ద్వారా మహిళలను సంఘటితం చేస్తూ, ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలకు సహాయ సహకారాలందిస్తున్నారు. ఆమె విశిష్ట సేవలకు గాను ఈ ఏడాది ‘డాక్టర్ సరోజినీ నాయుడు ఇంటర్నేషనల్ అవార్డు, హార్టికల్చరిస్ట్, మల్టీ టాలెంటెడ్ ఉమన్’ పురస్కారాలను అందుకున్నారు.
లక్ష్మీదేవి
కృష్ణా జిల్లా, పెడన గ్రామం, జిల్లా పరిషత్ హైస్కూల్‌లో సైన్స్ టీచర్ లక్ష్మీదేవి. విద్యార్థులకు పాఠాలు నేర్పించడంతోపాటు ప్రయోగాల్లోనూ మేటిగా తీర్చిదిద్దుతారామె. ఆమె స్టూడెంట్స్ మణికంఠ, వినయ్ కుమార్ ఈ ఏడాది యూఎస్‌లోని డాలస్‌లో జరిగిన ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఫేర్‌లో పాల్గొని ఎకో ఫ్రెండ్లీ ఫ్లవర్ పాట్‌ను ప్రదర్శించి నాలుగో స్థానంలో నిలిచారు. ఇప్పటివరకు వందకు పైగా ప్రయోగాలు చేసిన లక్ష్మీదేవి తన పరిశోధన ఫార్ములాను స్టార్టప్ కంపెనీలకు ఉచితంగా ఇస్తూ... ‘వినియోగదారులకు తక్కువ ధరకు ఇవ్వండి. అదే మీరు నాకిచ్చే గొప్ప పారితోషికం’ అంటారు.
ప్రస్తుతం ఫ్లోరైడ్ బాధిత ఆదివాసీ గ్రామాల కోసం మట్టిలో తులసి ఆకుల పొడి కలిపి కుండలను చేసి ప్రయోగాన్ని విజయవంతం చేశారు. నూజివీడు సమీపంలోని ఆదివాసీ గ్రామాలకు వెళ్లి పంచడానికి కుండలను సిద్ధం చేస్తున్నారు. ఒక సందేహం రావడం, ఆ సందేహానికి సమాధానం కోసం అన్వేషణ. పరిశోధన, ప్రయోగాలతో సమాధానాన్ని రాబట్టడం ఆమె వంతు. ఆ సమాధానంతో సమాజంలోని సమస్యకు పరిష్కారం లభించడం... ఆమె ప్రయోగాల గొప్పతనం. సమాజానికి ఆమె అందిస్తున్న శాస్త్రీయ సేవకు గాను జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పురస్కారాలందుకున్న లక్ష్మీదేవి ఈ ఒక్క ఏడాదిలోనే పదికి పైగా సత్కారాలందుకున్నారు.
రజనీ లక్కా
రజనీ లక్కా స్విమ్మింగ్ చాంపియన్. ఆమె తన కోసం తాను రికార్డు సాధించడమే కాదు, స్పెషల్లీ చాలెంజ్‌డ్ (దివ్యాంగులు) పిల్లలకు ఉచితంగా ఈతలో శిక్షణనిస్తున్నారు. ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోయినప్పుడు మామూలు వాళ్లు ఈదుకుంటూ ఒడ్డుకు చేరతారు. కానీ దివ్యాంగులు... శారీరక వైకల్యం కారణంగా ఈదలేక నిస్సహాయంగా నీటిలో మునిగిపోవడాన్ని సహించలేకపోయారామె. వారికి ఉచితంగా ఈత నేర్పిస్తున్నారు.
దశాబ్దకాలంగా సాగుతున్న ఆమె సర్వీస్‌లో అరవై మందికి పైగా పిల్లలు ఈత నేర్చుకుని, పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. ఆమె సాధించిన పతకాలు నూట పాతికకు చేరితే ఆమె శిష్యులు సాధించిన పతకాల సంఖ్య రెండు వందల యాభై దాటాయి. సాయి నిఖిల్ గత ఏడాది నేషనల్ రికార్డు సాధించగా గోపీచంద్ ఈ ఏడాది ఏషియన్ గేమ్స్‌లో పాల్గొన్నాడు. అనంతపురానికి చెందిన ఆమె బళ్లారిలో నివసిస్తున్నారు. ప్రతి వ్యక్తీ ఆల్ రౌండర్‌గా ఉండాలని అభిలషించే రజని సోలో ట్రావెలర్, గార్డెనర్, మిసెస్ ఇండియా కిరీటధారి కూడా. ఇంటర్నేషనల్ ఇన్‌స్పిరేషన్ అవార్డు– 2020 అందుకున్న రజని లక్కా ఈ ఏడాది కర్ణాటక ప్రభుత్వం నుంచి వ్యక్తిగత సేవావిభాగంలో పురస్కారం అందుకున్నారు.
పెన్నా కృష్ణప్రశాంతి
డాక్టర్ పెన్నా కృష్ణ ప్రశాంతి, కన్సల్టెంట్ ఫిజీషియన్. తిరుపతిలోని ఎస్‌వీ మెడికల్ కాలేజ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. జాతీయస్థాయిలో బైరాక్ (బయో టెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెంట్ కౌన్సిల్) బోర్డు మెంబర్‌గా ఎంపికైన తొలి మహిళ. అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, డయాబెటిక్ రీసెర్చ్ సొసైటీ కౌన్సిల్ మెంబర్. ఇంతకు ముందు ఈ హోదాల్లో మగవాళ్లే బాధ్యతలు నిర్వర్తించారు.
ఆ గిరిగీతను చెరిపేసిన మహిళ ఆమె. శ్రీసాయి హర్షిత చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తిరుపతి, పరిసర ప్రాంతాల్లో ఆమె వైద్యసేవలందిస్తున్నారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో బయోటెక్ ఇన్‌క్యుబేషన్ సౌకర్యాల కల్పనతోపాటు విద్యార్థినులకు సలహా సూచనలిస్తున్నారు. పలు విద్యాసంస్థల్లో పాలక వర్గంలో సభ్యురాలు. మహిళా సంక్షేమం కోసం పోలీస్ శాఖతో కలిసి పని చేస్తున్నారు. ఆమె వైద్యరంగానికి, సమాజానికి అందిస్తున్న సేవలకుగాను ‘తెలివిగల నాయకత్వ లక్షణాలున్న మహిళ’గా రాష్ట్రపతి ప్రశంసలు అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment