Year End 2023
-
2023 భారీ డిజాస్టర్ సినిమా ఇదే.. రూ. 45 కోట్ల బడ్జెట్‌కు లక్ష మాత్రమే వచ్చింది
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఈ ఏడాది ఎన్నో సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని అంచనాలకు మించి కలెక్షన్స్ రాబట్టాయి. నేడు ఇండియన్ సినిమాను ప్రపంచ దేశాలు కూడా దగ్గర చేర్చుకుంటున్నాయి. ఒక సినిమా కోసం నెలల పాటు కష్టపడటమే కాకుండా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. సినిమా బాగుంటే థియేటర్ ప్రేక్షకుల నుంచి వచ్చే డబ్బే కాకుండా శాటిలైట్ హక్కులు, ఓటీటీ రైట్స్ ఇలా పలు రకాలుగా తిరిగి పొందుతారు. అదే సినిమా బాగలేదని టాక్ వస్తే మొదటి రోజు నుంచే ఆ థియేటర్ వైపు వెళ్లరు. దీంతో నిర్మాతకు కోట్ల రూపాయల నష్టం తప్పదు. 2023లో కొన్ని వందల చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ - హీరోయిన్ భూమి పెడ్నేకర్ నటించిన 'ది లేడీ కిల్లర్' నవంబర్ 3న విడుదలైంది. ఈ చిత్రం దారుణమైన వసూళ్లను అందుకుంది. బాలీవుడ్లో వీళ్లు అల్లాటప్పా యాక్టర్లు ఏమీ కాదు.. అక్కడ టాప్ రేంజ్లో వారికి గుర్తింపు ఉంది కాబట్టే ఈ సినిమా కోసం రూ. 45 కోట్లు ఖర్చు పెట్టారు.. కానీ నిర్మాతకు ఫైనల్‌గా కేవలం రూ. లక్ష మాత్రమే వచ్చింది. నమ్మలేకున్నా ఇదే నిజం. 2023లో విడుదల అయిన ఇండియన్ చిత్ర పరిశ్రమలోనే అత్యంత దారుణమైన డిజాస్టర్‌గా ఈ సినిమా కలెక్షన్స్ ఉన్నాయి. ఈ చిత్రాన్ని అజయ్ బెహల్ దర్శకత్వం వహించారు. శైలేష్ సింగ్, సాహిల్ మీర్ చందానీ నిర్మించారు. టీ-సీరీస్ వాళ్ల భాగస్వామ్యంతో ఈ సినిమా విడుదలైంది. మొత్తంగా ముంబై, ఢిల్లీ కలిపి 11 స్క్రీన్లలో మాత్రమే విడుదల చేశారు. సినిమా షూటింగులో ఉండగానే ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు అప్పటికే భారీగా బడ్జెట్ పెట్టేశారు. మళ్లీ ఖర్చు పెట్టేందుకు నిర్మాతలు ముందుకు రాలేదు.. దీంతో సరిగ్గా ఎడిటింగ్ కూడా చేయకుండానే విడుదల చేశారు. సినిమాలో కథతో పాటు ఏ ఒక్క విషయం కూడ ప్రేక్షకులను మెప్పించలేక పోయింది. మొదటిరోజు కేవలం 293 టికెట్లు మాత్రమే సేల్ అయ్యాయి. ఐఎండీబీలో కూడా కేవలం 1.5 రేటింగ్‌తో 'ది లేడీ కిల్లర్' ఉంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ తీసుకుంది. అందుకు గాను నిర్మాతకు ఎంత చెల్లించారనేది తెలియదు. ఓటీటీలో కూడా ఆ చిత్రం వ్యూస్ మరీ దారుణంగా ఉన్నాయి. -
2023లో విపత్తులకు నిలయమైన రాష్ట్రం ఏది?
2023 ఉత్తరాఖండ్‌కు ప్రమాదాల సంవత్సరంగా నిలిచింది. ఈ ఏడాది ఉత్తరాఖండ్‌లో పలు భారీ ప్రమాదాలు జరిగాయి. 2023 ప్రారంభం నుండి చివరి వరకు ఏదో ఒక విపత్తు చోటుచేసుకుంటూనే ఉంది. ఈ ఏడాది ఉత్తరాఖండ్‌కు అనేక చేదు అనుభవాలను మిగిల్చింది. ఏడాది ప్రారంభంలోనే జోషిమఠ్‌లో భూమి కుంగిపోయిన ఘటన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆందోళనలోకి నెట్టివేసింది. 2023 జనవరిలో చమోలి జిల్లా జోషిమఠ్‌లోని ఇళ్లు, రోడ్లకు అకస్మాత్తుగా భారీ పగుళ్లు కనిపించాయి. కుంగిపోతున్న జోషిమఠ్ అందరినీ కలవరానికి గురి చేసింది. ఈ వార్త దేశ విదేశాల్లో కూడా పతాక శీర్షికల్లో నిలిచింది. ఈ ఏడాది ఉత్తరాఖండ్‌లోని చమోలీలో నమామి గంగే ప్రాజెక్టు పనులు కొనసాగుతుండగా విద్యుదాఘాతానికి గురై 16 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు 24 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఈ దుర్ఘటన నేపధ్యంలో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి బాధితులను పరామర్శించారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు, గాయపడిన వారికి ఒక్కొక్కరికి లక్ష చొప్పున పరిహారం అందించారు. ఈ ఏడాది ఆగస్టు నెలలో ఉత్తరాఖండ్‌లోని గంగోత్రి హైవేపై నుంచి బస్సు కాలువలో పడి ఏడుగురు మృతి చెందగా, 28 మంది గాయపడ్డారు. నవంబర్‌లో ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్లో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 14 మంది మరణించారు. దీపావళి రోజున ఉత్తరకాశీలో సొరంగం కూలి 41 మంది కార్మికులు దానిలో చిక్కుకుపోయారు. వారిని బయటకు తీసుకువచ్చేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే ఎట్టకేలకు వారిని 17 రోజుల తరువాత ర్యాట్ హోల్ మైనర్స్ బయటకు తీసుకువచ్చారు. ఇది కూడా చదవండి: అయోధ్య విమానాశ్రయం చూతము రారండి! -
త్రివిధ దళ ప్రతిభావంతుల ప్రథమ అడుగు
త్రివిధ దళ ప్రతిభావంతుల ప్రథమ అడుగు త్రివిధ దళాలలో మహిళా అధికారులకు సంబంధించి ఈ సంవత్సరంలో ఎన్నో ‘ప్రథమం’లు కనిపిస్తాయి. మహిళా సైనికులు ఆర్టిలరీ బ్రాంచిలలోకి అడుగుపెట్టారు. యుద్ధనౌకల కమిషనింగ్ బృందంలో భాగం అయ్యారు. అత్యంత కఠినమైన యుద్ధభూమి సియాచిన్లోకి వైద్యసేవల కోసం వెళ్లారు. భారత నావికాదళానికి చెందిన గైడెడ్ క్షిపణి విధ్వంసక నౌక ‘ఐఎన్ఎస్’ ఇంఫాల్ మహిళా అధికారులు, నావికులతో ప్రత్యేక వసతులతో కూడిన తొలి యుద్ధనౌకగా అవతరించింది, నావికా, వైమానిక దళాలు తమ ఆపరేషన్లకు సంబంధించిన ప్రతి విభాగం లోకి మహిళలను అనుమతిస్తున్నాయి. ఇంతకాలం పురుషులు మాత్రమే నాయకత్వ స్థానంలో ఉండే విభాగాలలో ఈ సంవత్సరం మహిళా అధికారులు నాయకత్వ స్థానాల్లోకి వచ్చారు.... ► హరియాణాలోని జింద్ జిల్లాకు చెందిన చెందిన పాయల్ చబ్ర ఎంబీబీఎస్, ఎంఎస్ చేసింది. అంబాలా కంటోన్మెంట్ని ఆర్మీ హాస్పిటల్, లడఖ్‌లోని ఖర్దుంగ్లా ఆర్మీ హాస్పిటల్లో పనిచేసింది. ఆ తరువాత లడఖ్‌లోని ఆర్మీ హాస్పిటల్లో సర్జన్‌గా పనిచేసింది. ఒకవైపు సర్జన్‌గా పనిచేస్తూనే మరోవైపు పారో కమాండో కావడానికి ఆగ్రాలోని పారాట్రూపర్స్ ట్రైనింగ్ స్కూల్లో శిక్షణ పొందింది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న తరువాత పారా మిలిటరీ ప్రత్యేక భద్రతా దళంలో చేరిన తొలి మహిళా ఆర్మీ సర్జన్‌గా ప్రత్యేకత సాధించింది. ►ముంబాయికి చెందిన ప్రేరణ దేవస్థలీ సెయింట్ జేవియర్స్ కాలేజీలో సైకాలజీలో గ్రాడ్యుయేషన్ చేసింది. 2009లో భారత నావికా దళంలో చేరింది. పశ్చిమ నౌకాదళానికి చెందిన పెట్రోలింగ్ నౌక ‘ఐఎన్ఎస్ త్రిన్కాత్’ ఫస్ట్ ఫిమేల్ కమాండింగ్ ఆఫీసర్‌గా చరిత్ర సృష్టించింది. ప్రేరణ సోదరుడు ఇండియన్ నేవీలో పనిచేస్తాడు. అతడి స్ఫూర్తితోనే నావికాదళంలోకి వచ్చింది ప్రేరణ. ‘భారత నౌకాదళం అవకాశాల సముద్రం. స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా మనల్ని మనం నిరూపించుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి’ అంటుంది ప్రేరణ. ► దిల్లీ కంటోన్మెంట్‌లోని భారత సైన్యానికి చెందిన రక్తమార్పిడి కేంద్రం(ఎఎఫ్టీసీ) ఫస్ట్ ఉమెన్ కమాండింగ్ ఆఫీసర్‌గా ప్రత్యేకత చాటుకుంది కల్నల్ సునీతా బీఎస్. రోహ్తక్ మెడికల్ కాలేజీలో ‘పాథాలజీ’లో పీజీ చేసిన సునీత అరుణాచల్‌ప్రదేశ్‌లో మిలిటరీ ఆస్పత్రిలో కమాండింగ్ ఆఫీసర్‌గా పనిచేసింది. ► ‘ఫ్రంట్‌లైన్ ఐఏఎఫ్ కంబాట్ యూనిట్’ కమాండర్ బాధ్యతలు స్వీకరించిన తొలి మహిళ షాలిజా ధామి. 2003లో హెలికాప్టర్ పైలట్ అయింది. 2,800 గంటలకు పైగా విమానాన్ని నడిపిన అనుభవం ఆమె సొంతం. వెస్ట్రన్ సెక్టార్‌లోని హెలికాప్టర్ యూనిట్లో ఫ్లైట్ కమాండర్‌గా పనిచేసింది. పంజాబ్‌లోని లూథియానా థామి స్వస్థలం. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసింది. భారత వైమానిక దళంలో శాశ్వత కమిషన్‌ను పొందిన మొదటి మహిళా అధికారిగా నిలిచింది. ► తూర్పు లడఖ్‌లో భారత్–చైనా సరిహద్దు ప్రాంతంలో ఉన్న ‘స్వతంత్ర ఫీల్డ్ వర్క్‌షాప్’కు పురుష అధికారులు మాత్రమే నాయకత్వ స్థానంలో ఉండేవారు. ఈ ఏడాది ఆ అవకాశం గీతా రాణాకు వచ్చింది. స్వతంత్ర ఫీల్డ్ వర్క్‌షాప్‌కు కమాండ్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలి మహిళా అధికారిగా గీతా రాణా ప్రత్యేకత నిలుపుకుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్(ఈఎంఈ) ట్రైనింగ్ సెంటర్లో ఇన్‌స్ట్రక్టర్‌గా బాధత్యలు నిర్వహించింది గీతా రాణా. ► స్క్వాడ్రన్ లీడర్ మనిషా పధి మిజోరం గవర్నర్ సహాయకురాలి (ఏడీసీ)గా నియామకం అయింది. మన దేశంలో గవర్నర్‌కు ఎయిడ్–డి–క్యాంప్(ఏడీసీ)గా నియామకం అయినా ఫస్ట్ ఉమన్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫీసర్‌గా చరిత్ర సృష్టించింది. మనిషా స్వస్థలం ఒడిషా రాష్ట్రంలోని బెర్హంపూర్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ చేసింది. ఎయిర్ ఫోర్స్ స్టేషన్–బీదర్, ఎయిర్‌ఫోర్స్ స్టేషన్–పుణె చివరగా భటిండాలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో పనిచేసింది. ► ప్రపంచంలో అత్యంత ఎత్తయిన యుద్ధక్షేత్రం సియాచిన్ గ్లేసియర్. వైద్యసేవలు అందించడానికి ఈ ప్రమాదకరమైన యుద్ధక్షేత్రంలోకి అడుగు పెట్టిన తొలి మహిళా మెడికల్ ఆఫీసర్ (ఆపరేషనల్ పోస్ట్)గా ప్రత్యేకత చాటుకుంది కెప్టెన్ ఫాతిమా వసిమ్. దీనికిముందు ‘సియాచిన్ బ్యాటిల్ స్కూల్’లో ఎన్నో నెలల పాటు కఠోరమైన శిక్షణ తీసుకుంది. (చదవండి: కొత్త సంవత్సరమా మనిషిని మేల్కొలుపు) -
Year End 2023: హిట్లు తక్కువ..ఫ్లాపులెక్కువ
స్ట్రయిట్ చిత్రాలు 236... డబ్బింగ్ సినిమాలు 70... మొత్తం 306 చిత్రాలను 2023 ఇచ్చింది. మరి జయాపజయాల శాతం ఎంత? అంటే... ఎప్పటిలానే విజయాలను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు... అపజయాలు లెక్కలేనన్ని. అయితే విజయం సాధించినవాటిలో ఎమోషనల్‌గా సాగేవి ఎక్కువగా ఉన్నాయి. ఆ విధంగా ఈ ఏడాది భావోద్వేగాలకు ప్రేక్షకులు ప్రాధాన్యం ఇచ్చారనుకోవచ్చు. ఇక ఈ ఏడాది ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు..’ పాటకిగాను కీరవాణి, చంద్రబోస్‌లకు ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డు దక్కడం ఓ రికార్డ్. తెలుగు నుంచి జాతీయ తొలి ఉత్తమ నటుడి అవార్డు అల్లు అర్జున్‌కి దక్కడం మరో ఆనందం. ఇలా కొన్ని ఆనందాలను ఇచ్చింది 2023. కె. విశ్వనాథ్, జమున, కైకాల సత్యనారాయణ, చంద్రమోహస్ వంటి వారిని దూరం చేసి, విషాదాన్ని మిగిల్చింది. ఇక... ఈ ఏడాది లెస్ హిట్.. మోర్ ఫట్‌గా సాగింది తెలుగు సినిమా. ఆ విశేషాల్లోకి... స్టార్ హీరోలు కొందరు ‘హిట్ హిట్ హుర్రే’ అంటూ మంచి విజయాలు అందుకున్నారు. వారితో పాటు కొందరు మీడియమ్ రేంజ్, చిన్న రేంజ్ హీరోలకూ 2023 విజయానందాన్నిచ్చింది. ఆ హిట్స్ గురించి తెలుసుకుందాం. సంక్రాంతి అంటే సినిమాల పండగ. అలా ఈ ఏడాది పండగకి అన్నదమ్ముల సెంటిమెంట్ నేపథ్యంలో వచ్చిన చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో వచ్చిన బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ మంచి వసూళ్లు రాబట్టాయి. చిరంజీవి హీరోగా, రవితేజ ఓ కీలక పాత్రలో ‘వాల్తేరు వీరయ్య’కు బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహించగా, ‘వీరసింహారెడ్డి’ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. సంక్రాంతికి మంచి హిట్ అందుకున్న బాలకృష్ణ దసరా పండక్కి ‘భగవంత్ కేసరి’తోనూ మరో హిట్ సాధించారు. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు ఈ ఏడాది ఓ హిట్.. ఓ ఫట్ పడ్డాయి. ‘సలార్: సీజ్ఫైర్’తో ప్రభాస్‌కి సూపర్ డూపర్ హిట్ దక్కింది. స్నేహం ప్రధానాంశంగా ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. ఈ ఏడాది నానీకి బాగా కలిసొచ్చింది. శ్రీకాంత్ ఓదెలను దర్శకుడిగా పరిచయం చేస్తూ నాని హీరోగా నటించిన మాస్, ఎమోషనల్ మూవీ ‘దసరా’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అలాగే శౌర్యువ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో నాని హీరోగా నటించిన ఎమోషనల్ మూవీ ‘హాయ్ నాన్న’ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. విజయ్ దేవరకొండ, సమంతల వెండితెర ప్రేమకథ ‘ఖుషీ’ కూడా ప్రేక్షకులను ఖుషీ చేసింది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపోందిన ఈ ఎమోషనల్ లవ్‌స్టోరీ మంచి వసూళ్లు రాబట్టుకుంది. తమిళ స్టార్ ధనుష్ తెలుగులో చేసిన స్ట్రయిట్ ఫిల్మ్ ‘సార్’. తెలుగు, తమిళ భాషల్లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపోందిన ఈ పీరియాడికల్ యాక్షన్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ చిత్రం ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. నాలుగేళ్లుగా హీరోయిన్ గా తెలుగు వెండితెరపై కనిపించని అనుష్కా శెట్టి ఈ ఏడాది ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ‘జాతి రత్నాలు’ ఫేమ్ నవీన్ పోలిశెట్టితో కలిసి ఈ సినిమాతో రొమాంటిక్ హిట్ అందుకున్నారు. ఈ చిత్రానికి పి. మహేశ్‌బాబు దర్శకుడు. అలాగే కుర్ర హీరోల్లో సాయిధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ హిట్‌తో జోష్‌గా ఉన్నారు. హారర్ థ్రిల్లర్‌గా కార్తీక్ దండు దర్శకత్వంలో ‘విరుపాక్ష’ రూపోందింది. గత ఏడాది హిట్ అందుకోలేకపోయిన శ్రీవిష్ణు ‘సామజవరగమన’ అంటూ ప్రేక్షకులను నవ్వించి ఈ ఏడాది సూపర్ హిట్ సాధించారు. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ ఆకట్టుకుంది. అలాగే కుర్ర హీరో ఆనంద్ దేవరకొండ ‘బేబీ’తో పెద్ద హిట్ అందుకున్నారు. ఈ ట్రయాంగిల్ లవ్‌స్టోరీ మూవీకి సాయి రాజేశ్ దర్శకత్వం వహించారు. హాస్య నటుడు వేణు కెరీర్ డైరెక్షన్ ఈ ఏడాది మరో మలుపు తిరిగింది. వేణు తొలిసారి దర్శకత్వం వహించిన ‘బలగం’ సినిమా సూపర్‡హిట్‌గా నిలిచింది. తెలంగాణలోని కాకిముట్టుడు సంప్రదాయం, కుటుంబ అనుబంధాల నేపథ్యంలో రూపోందిన ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌రామ్, సుధాకర్ కీలక పాత్రలు పోషించారు. ‘బలగం’ విడుదలయ్యేటప్పుడు చిన్న చిత్రమైనా వసూళ్లతో పెద్ద సినిమాగా మారింది. రెండేళ్ల క్రితం ‘మా ఊరి పోలిమేర’తో మంచి హిట్ అందుకున్నారు ‘సత్యం’ రాజేశ్. అయితే ఆ చిత్రం ఓటీటీలో విడుదలైంది. ఆ సినిమా సీక్వెల్ ‘మా ఊరి పోలిమేర 2’తో ఈ ఏడాది థియేటర్స్‌లో సక్సెస్ అందుకున్నారు ‘సత్యం’ రాజేశ్. ఈ చిత్రానికి అనిల్ విశ్వనాథ్ దర్శకుడు. ఇక 2023కి ముగింపు పలుకుతూ శుక్రవారం (డిసెంబర్ 29) విడుదలైన చిత్రాల్లో కల్యాణ్‌రామ్ ‘డెవిల్’కి ప్రేక్షకాదరణ లభిస్తోంది. స్వీయదర్శకత్వంలో అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇంకా స్ట్రయిట్ హిట్ చిత్రాల్లో కార్తికేయ ‘బెదురులంక 2012’, ‘అల్లరి’ నరేశ్ ‘ఉగ్రం’, పాయల్ రాజ్‌పుత్ ‘మంగళవారం’, నవీన్ చంద్ర ‘మంత్ ఆఫ్ మధు’, సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్‌ల ‘మ్యాడ్’, తరుణ్ భాస్కర్ ‘కీడా కోలా’ వంటివి ఉన్నాయి. అనువాద చిత్రాల్లో రజనీకాంత్ ‘జైలర్’, విజయ్ ‘వారసుడు’, ‘లియో’, మణిరత్నం ‘పోన్నియిన్ సెల్వన్ 2’, విజయ్ ఆంటోని ‘బిచ్చగాడు 2’, టొవినో థామస్ ‘2018’, షారుక్ ఖాన్ ‘పఠాన్’, ‘జవాన్’, రణ్‌బీర్ కపూర్ ‘యానిమల్’ వంటివి మంచి వసూళ్లు రాబట్టాయి. ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన కొన్ని చిత్రాలతో పాటు ఏ అంచనాలు లేకుండా విడుదలైన చిత్రాలు పరాజయాన్ని చవి చూశాయి. ఫట్ అయిన ఆ చిత్రాల గురించి.. ‘వాల్తేరు వీరయ్య’చిత్రంతో హిట్ సాధించిన చిరంజీవికి ‘భోళా శంకర్’ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. తమిళ సూపర్ హిట్ ‘వేదాళం’ రీమేక్‌గా మెహర్ రమేశ్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ రూపోందింది. ఆల్రెడీ వేరే భాషలో హిట్టయిన సినిమా కాబట్టి ఇక్కడ కూడా ఆ ఫలితాన్ని ఆశించారు. కానీ అది నెరవేరలేదు. ఇక ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన చిత్రం ‘ఆది పురుష్’. ఓం రౌత్ దర్శకత్వంలో రూపోందిన ఈ పాన్ ఇండియా చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో నెలకొన్నాయి. రామాయణంలోని కొన్ని ముఖ్య ఘట్టాల నేపథ్యంలో రూపోందిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో పరాజయంగా నిలిచింది. రవితేజ సోలో హీరోగా నటించిన (‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో కీలక పాత్ర చేశారు) ‘రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలు బోల్తా కొట్టాయి. సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర’, వంశీ దర్శకత్వంలో ‘టైగర్ నాగేశ్వరరావు’ రూపోందాయి. ‘కస్టడీ’ చిత్రం రూపంలో ఈ ఏడాది నాగచైతన్యకు పరాజయం ఎదురైంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ద్విభాషా చిత్రంగా ఈ యాక్షన్ థ్రిల్లర్ రూపోందింది. హీరో రామ్–దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘స్కంద అంచనాలను అందుకోలేకపోయింది. ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్’ కూడా నిరాశనే మిగిల్చింది. ఈ ఏడాది వరుణ్ తేజ్ వ్యక్తిగతంగా ఫుల్ హ్యాపీ. లావణ్యా త్రిపాఠీని పెళ్లి చేసుకుని, లైఫ్‌లో కొత్త చాప్టర్‌ని మొదలుపెట్టారు. అయితే కెరీర్ పరంగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘గాండీవధారి అర్జున’ నిరాశపరిచింది. నితిన్ హీరోగా వక్కంతం వంశీ డైరెక్షన్లో రూపోందిన ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్’ ఆర్డినరీ సినిమా అనిపించుకుంది. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘రంగ మార్తాండ’ ఎమోషనల్ మూవీ అనిపించుకుంది. టాక్ బాగున్నా వసూళ్లు ఆశించిన విధంగా రాలేదు. హీరోయిన్ సమంత, నటుడు దేవ్ మోహన్ కాంబినేషన్లో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’ పరాజయాన్ని మూటకట్టుకుంది. ఇవే కాదు.. గోపీచంద్ ‘రామబాణం’, కల్యాణ్ రామ్ ‘అమిగోస్’, నిఖిల్ ‘స్పై’, వైష్ణవ్ తేజ్ ‘ఆదికేశవ’, సుధీర్ బాబు ‘హంట్, మామా మశ్చీంద్ర’ వంటి సినిమాలతో పాటు మరికొన్ని ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. -
యూట్యూబ్ షేక్.. 2023లో దుమ్ము రేపిన వీడియోలు, షార్ట్స్ ఇవే..
ఆధునిక కాలంలో సోషల్ మీడియా రాజ్యమేలుతోంది. దీంతో ప్రపంచంలో ఏ మూల ఏ సంఘటన జరిగిన నిమిషంలో తెలిసిపోతోంది. ఇందులో కూడా కొన్ని సంఘటనలు మాత్రమే పెద్దగా వైరల్ అవుతాయి. ఈ ఏడాది (2023) ఎక్కువ మంది చూసిన వీడియోలు ఏవి, టాప్ ట్రెండింగ్ కంటెంట్, దాని వెనుక ఉన్న క్రియేటర్ల గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. 2023లో ఎక్కువ మంది వీక్షించిన వీడియాల్లో చెప్పుకోదగ్గది 'చంద్రయాన్-3 మిషన్ సాఫ్ట్-ల్యాండింగ్ లైవ్ టెలికాస్ట్'. దీనికి ప్రారంభంలో 8.5 మిలియన్స్.. ఇప్పటి వరకు 79 మిలియన్ వ్యూవ్స్ వచ్చాయి. ఈ సంవత్సరంలో యూట్యూబ్‌లో అతిపెద్ద లైవ్ స్ట్రీమ్‌గా ఇది సంచలనం సృష్టించింది. ఆ తరువాత వరుసగా మ్యాన్ ఆన్ మిషన్, యూపీఎస్సీ స్టాండ్ అప్ కామెడీ, డైలీ వ్లాగర్ పేరడీ, శాస్తా బిగ్ బాస్ 2 వంటివి ఎక్కువ వ్యూవ్స్ పొందాయి. టాప్ 15 గేమింగ్ వీడియోలు 2023లో 'ఐ స్టోల్ సుప్రా ఫ్రమ్ మాఫియా హౌస్' ఎక్కువమంది హృదయాలను దోచింది. ఈ గేమింగ్ వీడియో ఇప్పటికి 30 మిలియన్ వీక్షణనలను పొందింది. ఆ తరువాత స్థానంలో జీటీఏ5 ఇన్ రియల్ లైఫ్, గ్రానీ చాఫ్టర్ 1, స్కిబిడి టాయిలెట్ 39 - 59, కునాలి కో దర్ నహీ లగ్తా వంటివి ఉన్నాయి. టాప్ 10 కంటెంట్ క్రియేటర్స్ ఈ ఏడాది యుట్యూబ్లో సంచలనం సృష్టించిన టాప్ 10 కంటెంట్ క్రియేటర్ల జాబితాలో ప్రధమ స్థానంలో పవన్ సాహు ఉండగా.. ఆ ఆ తరువాత స్థానాల్లో నీతూ బిష్ట్ (Neetu Bisht), క్యూట్ శివాని 05, ఫిల్మీ సూరజ్ యాక్టర్, అమన్ డ్యాన్సర్ రియల్, ఆర్టిస్ట్ సింతు మౌర్య మొదలైనవారు ఉన్నాయి. ఇందులోనే మహిళల విభాగంలో నీతూ బిష్ట్, షాలు కిరార్, జశ్వి విశ్వి, ది థాట్ఫుల్ గర్ల్, రాయల్ క్యూన్, సోనాల్ అగర్వాల్, మింకు టింకు, అంజు డ్రాయింగ్ షార్ట్స్, మహి లక్రా వ్లాగ్స్, మామ్ అండ్ రీదిష్ణ వంటి వారు ఉన్నారు. టాప్ 15 షార్ట్స్ యూట్యూబ్ షార్ట్స్ విభాగంలో ఈ ఏడాది వరుసగా పతి కో బనాయా పాగల్, కదం కదం భజాంగే జా, 500 మీ ఐఫోన్, బ్లో ద రోలర్ అండ్ విన్ ఛాలెంజ్, చలాక్ బాయ్ ఫ్రెండ్, టామ్ అండ్ జెర్రీ (రిత్వి & కవి), పోర్ ఛాలెంజ్ విత్ సిరప్ వంటివి ఉన్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: 50 రూపాయలతో రూ.350 కోట్ల సామ్రాజ్యం - చూపు లేకున్నా.. సక్సెస్ కొట్టాడిలా.. టాప్ 15 మ్యూజిక్ వీడియోలు 2023లో పాపులర్ అయిన వీడియోల విషయానికి వస్తే.. ఇందులో మొదటి స్థానంలో ఘనీ కో సబ్ ఘన్, జరా హక్తే జరా బచ్కే, జవేద్ మోహ్సిన్, క్యా లోగే తుమ్, హా నువ్ కావాలయ్యా (జైలర్), పల్సర్ బైక్ (ధమాకా), నా రెడీ (లియో) మొదలైనవి ఉన్నాయి. -
Rewind 2023: బడ్జెట్‌తో పనిలేని బంపర్ హిట్స్
ఈ ఇయర్లో కొన్ని చిన్న సినిమాలు పెట్టిన పెట్టుబడికి ఐదారు ఇంతలకు పైగా కలెక్షన్లు సంపాదించాయి. ఇంకా చెప్పాలి అంటే..మేకర్స్ కూడా ఈ రేంజ్ విజయాన్ని ఉహించలేకపోయారు. అంతగా ఆడియన్స్ మనసు దోచుకున్నాయి. బయ్యర్లకు భారీ లాభాలు తీసుకొచ్చి.. కంటెంట్ బలం మరోసారి నిరూపించాయి. ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్‌గా నిలిచిన స్మాల్ మూవీస్‌పై ఓ లుక్కేద్దాం. బలగం ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి పెద్ద హిట్‌గా నిలిచిన చిత్రాల్లో బలగం ముందు వరుసలో ఉంటుంది. కమెడియన్ వేణు ఎల్దండి దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఇది. తెలంగాణ నేపథ్యంలోని పల్లెటూరి లో జరిగే స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కించాడు వేణు. మార్చి 3న విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.25 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. తెలంగాణలోని పల్లెల్లో తెరలు కట్టి మరి ఈ సినిమాను ప్రదర్శించారంటే.. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. బేబి ఈ ఏడాది సూపర్ హిట్ కొట్టిన మరో చిన్న చిత్రం బేబి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి, విరాజ్అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం జులై 14న విడుదలై బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. .దాదాపుగా వందకోట్ల వసూళ్ల వరకు వెళ్లి సంచలనాలు నమోదు చేసింది. సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన ఈ ముక్కోణపు ప్రేమ కథా చిత్రంపై మొదట్లో పెద్ద అంచనాలేమి లేవు. కానీ సినిమా విడుదలైన తర్వాత మౌత్‌టాక్‌తో వసూళ్లను పెంచుకుంది. ఈ సినిమా బడ్జెట్ 10 కోట్లలోపే కానీ.. కలెక్షన్స్ మాత్రం వంద కోట్ల వరకు వచ్చాయి. కంటెంట్ బాగుంటే చాలు ప్రేక్షకులు సినిమా హిట్ చేస్తారనేదానికి బేబీ మూవీని బెస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్పొచ్చు. మ్యాడ్ అంతా కొత్త నటులే..అయినా కూడా బాక్సాఫీస్‌ని షేక్ చేశారు. విడుదలకు ముందు మ్యాడ్ చిత్రంపై కూడా పెద్దగా అంచనాలు లేవు. కానీ రిలీజ్(అక్టోబర్ 6) తర్వాత ఈ మూవీకి బాగా పేరొచ్చింది. కాలేజీ నేపథ్యంలో సాగే ఈ కామెడీ డ్రామా.. యూత్‌ని బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రంతో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ ఏడాది సితార ఎంటర్టైన్మెంట్స్కు మంచి లాభాలను తెచ్చిపెట్టిన చిత్రంగా మ్యాడ్ నిలిచింది. ఈ ఇయర్ మరికొన్ని చిన్న చిత్రాలు కూడా ఆడియన్స్‌ని ఆకట్టుకున్న చిత్రాలలో చోటు దక్కించుకున్నాయి. ఆర్ ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ హీరోగా నటించిన బెదురు లంక 2012 మూవీ .డీసెంట్ హిట్ కొట్టింది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చినా..కీడా కోలా..పెట్టుబడిని వెనక్కి తీసుకొచ్చిన చిన్న చిత్రాల జాబితాలోకి చేరింది. సత్యం రాజేష్,బాలాదిత్యా ప్రధాన పాత్రలో నటించిన మా ఊరి పొలిమేర 2 మూవీ విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. తెలంగాణ నేపథ్యంలో వచ్చిన పరేషాన్..కూడా ఎంటర్టైన్ చేసింది.మరో చిన్న సినిమా మిస్టర్ ప్రెంగ్నెంట్ కూడా డిఫరెంట్ సబ్జెక్ట్ చిత్రంగా అలరించింది.ఇక స్మాల్ హీరో సుహాస్ హీరోగా నటించిన రైటర్ పద్మభూషణ్ మూవీ కూడా హిట్ స్టెటస్ దక్కించుకుంది. అలాగే ఇటీవల విడుదలైన హారర్ మూవీ పిండం కూడా మంచి టాక్ని సొంతం చేసుకుంది. -
ఏడాదిలో రూ.81.90 లక్షల కోట్ల సంపద.. ఎక్కడంటే..
స్టాక్మార్కెట్లో మదుపుదారులకు ఈ ఏడాది చాలా గుర్తుండిపోతుంది. వరుసగా ఎనిమిదో సంవత్సరమూ సూచీలు లాభాల బాటపట్టాయి. ఈ ఏడాదిలో నిఫ్టీ 50లోని 27 షేర్లు ఆల్‌టైమ్‌హైను చేరాయి. 40కి పైగా కంపెనీలు 10-100 శాతం పెరిగాయి. స్మాల్, మిడ్‌క్యాప్ షేర్లు భారీగా పుంజుకున్నాయి. లిస్టింగ్ గెయిన్స్ కోసం ఇన్వెస్ట్ చేసినవారికి, ఇతర పెట్టుబడిదారులకు ఐపీఓలు లిస్ట్ అయిన తొలిరోజే మంచి లాభాలను తీసుకొచ్చాయి. 2023 ప్రారంభంలో మార్కెట్లు కాస్త నష్టాల్లోకి వెళ్లినా తరువాత భారీగా రాణించాయి. అంతర్జాతీయ మాంద్యం భయాలు, కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్ల పెంపుపై ఆందోళనలతో గతంలో నిఫ్టీ, సెన్సెక్స్ వరుసగా 4, 3 శాతమే రాణించాయి. విదేశీ సంస్థాగత మదుపర్ల పెట్టుబడులతో ఏప్రిల్ నుంచి సూచీలు పుంజుకున్నాయి. ర్యాలీకి కారణాలు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్ల పెంపునకు విరామం ఇవ్వడం, ముడి చమురు ధరలు వేగంగా తగ్గడంతో, రెండు నెలల పాటు బాగా రాణించిన సూచీలు ప్రథమార్ధాన్ని 6 శాతం పైగా లాభాలతో ముగించాయి. సెప్టెంబరు త్రైమాసికంలో 7.6% వృద్ధి నమోదైంది. తర్వాత కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ఇటీవల జరిగిన రాష్ట్రాల ఎన్నికల్లోనూ విజయం సాధించడం, విదేశీ మదుపర్ల పెట్టుబడులు బలంగా కొనసాగడం, 2024లో రేట్ల కోతకు అవకాశం ఉందని అమెరికా ఫెడ్ సంకేతాలివ్వడం ఇందుకు దోహదం చేసింది. ఎన్ఎస్ఈ నమోదిత కంపెనీల మార్కెట్ విలువ.. చరిత్రలోనే తొలిసారిగా డిసెంబరు 6వ తేదీన 4 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ విలువను దాటేసింది. బీఎస్ఈ నమోదిత కంపెనీల మార్కెట్ విలువ ఈ ఏడాదిలో ఇప్పటిదాకా రూ.81.90 లక్షల కోట్లు పెరిగి రూ.364 లక్షల కోట్ల ఆల్‌టైం గరిష్ఠానికి చేరింది. జూన్‌లో నిఫ్టీ సూచీ 19,000 పాయింట్లు, సెప్టెంబరులో 20,000, ఈనెల 8న 21,000 పాయింట్లకు చేరింది. డిసెంబరు 28న ఆల్‌టైం గరిష్ఠస్థాయి అయిన 21,801.45ను చేరింది. సెన్సెక్స్ జూన్‌లో 64,000 పాయింట్లను అధిగమించింది. జులైలో 67,000ను తాకింది. నవంబరు, ఈనెల 28నలో ఏకంగా 8000 పాయింట్లకుపైగా ర్యాలీ అయి 72,484.34 వద్ద జీవనకాల రికార్డు గరిష్ఠాన్ని చేరింది. ఏడాది మొత్తం మీద నిఫ్టీ 18%, సెన్సెక్స్ 19% మేర లాభాలను అందించాయి. 2024లో ఎలా ఉండబోతుందంటే.. వచ్చే ఏడాది స్టాక్‌మార్కెట్లు భారీగా లాభపడడానికి పెద్దగా అవకాశాలను ఈ ఏడాది మిగల్చలేదని బ్రోకరేజీ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుత స్థాయి నుంచి మహా అయితే 8-10% రాణించొచ్చని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నివేదించింది. ఎన్నికల ముందు ర్యాలీ కారణంగా వచ్చే ఏడాది ప్రథమార్ధం వరకు సానుకూలంగా ఉండొచ్చు. ఇదీ చదవండి: ఆందోళనలో దేశీయ కంపెనీలు.. ముప్పు తప్పదా..? ఎన్నికల ఫలితాలు, పూర్తి స్థాయి బడ్జెట్ ప్రకటనలు వచ్చాకే స్టాక్ మార్కెట్ దిశపై ఒక అంచనాకు రాగలమని బ్రోకరేజీలు అంటున్నాయి. అదే సమయంలో వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ పరిణామాలు కూడా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. -
Year End 2023: లాభాల స్వీకరణతో 2023కు వీడ్కోలు
2023 ఏడాదిని స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగించింది. సూచీలు అయిదు రోజుల వరుస ర్యాలీ నేపథ్యంలో ఇంధన, బ్యాంకింగ్, ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. సెన్సెక్స్ 170 పాయింట్లు నష్టపోయి 72,240 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 47 పాయింట్లు పతనమై 21,731 వద్ద నిలిచింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. ఒక దశలో సెన్సెక్స్ 328 పాయింట్లు క్షీణించి 72,083 వద్ద, నిఫ్టీ 102 పాయింట్లు నష్టపోయి 21,677 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. నష్టాల మార్కెట్లోనూ టెలికం, ఆటో, సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ, కన్జూమర్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. టాటా మోటార్స్ షేరు మూడున్నర శాతం లాభపడి రూ.781 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఆరున్నర శాతం పెరిగి రూ.803 ఏడాది గరిష్టాన్ని తాకింది. ఈ ఏడాది నిఫ్టీ– 50 షేర్లలో రెట్టింపు లాభాలు(111%) పంచిన షేరు ఇదే. లాభాల్లో ఇన్నోవా క్యాప్టాబ్ ఇన్నోవా క్యాప్టాబ్ లిస్టింగ్ రోజు ఇన్వెస్టర్లను మెప్పించింది. ఇష్యూ ధర రూ. 448తో పోలిస్తే బీఎస్ఈలో 2 శాతం లాభంతో రూ. 456 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. తదుపరి ఒక దశలో 22 శాతం(రూ. 99)పైగా జంప్‌చేసి రూ. 547ను అధిగమించింది. చివరికి రూ. 97 లాభపడి రూ. 545 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈలోనూ రూ. 452 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్ ముగిసేసరికి 21 శాతం ఎగసి రూ. 543 సమీపంలో నిలిచింది. సెకండరీ మార్కెట్ కోసం యూపీఐ సెకండరీ మార్కెట్లో లావాదేవీల కోసం కూడా యూపీఐ సదుపాయాన్ని వచ్చే వారం అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తెలిపింది. రూ. 82,00,000 కోట్ల సంపద సృష్టి ఈ ఏడాది సెన్సెక్స్ 19% ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని కంపెనీల మార్కెట్ విలువ 2022 డిసెంబర్ ఆఖరకు రూ.282.38 లక్షల కోట్లు ఉండగా.., ఈ ఏడాది చివరి ట్రేడింగ్ నాటికి రూ.82 లక్షల కోట్లు పెరిగి రూ.364.05 లక్షల కోట్లకు చేరింది. విలువ పరంగా 4 ట్రిలియన్ల మార్కెట్ క్యాప్‌తో ప్రపంచలోనే అతిపెద్ద నాలుగవ నాలుగవ ఈక్విటీ మార్కెట్‌గా దలాల్ స్ట్రీట్ అవతరించింది. 2023లో 58 కంపెనీలు ఐపీఓ ద్వారా రూ.54,000 కోట్లు సమీకరించాయి. లిస్టింగ్ నాటి నుంచి ఇరెడా(220%), సైయంట్ డీఎల్ఎం(154%), నెట్వెబ్ టెక్నాలజీ(137%), టాటా టెక్నాలజీ(136%), విష్ణు ప్రకాశ్ ఆర్(118%) అత్యధిక లాభాలు పంచాయి. -
Year End 2023: ఆవిష్కరణల ఏడాది
అంతరిక్ష అన్వేషణ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ దాకా, గ్లోబల్ వారి్మంగ్ నుంచి పలు మానవ వికాసపు మూలాల దాకా శాస్త్ర సాంకేతిక రంగాల్లో 2023లో పలు నూతన ఆవిష్కరణలు చోటుచేసుకున్నాయి. ప్రపంచం దృష్టిని తమవైపుకు తిప్పుకోవడమే గాక భవిష్యత్తుపై కొంగొత్త ఆశలు కూడా కల్పించాయి. వినాశ హేతువైన గ్లోబల్ వారి్మంగ్‌లో కొత్త రికార్డులకూ ఈ ఏడాది వేదికైంది! 2023లో టాప్ 10 శాస్త్ర సాంకేతిక, పర్యావరణ పరిణామాలను ఓసారి చూస్తే... 1. చంద్రయాన్ దశాబ్దాల కృషి అనంతరం భారత్ ఎట్టకేలకు చందమామను చేరింది. తద్వారా చంద్రయాన్–3 ప్రయోగం చరిత్ర సృష్టించింది. పైగా ఇప్పటిదాకా ఏ దేశమూ దిగని విధంగా చంద్రుని దక్షిణ ధ్రువంవైపు చీకటి ఉపరితలంపై దిగిన రికార్డును కూడా చంద్రయాన్–3 సొంతంచేసుకుంది. ఇంతటి ప్రయోగాన్ని ఇస్రో కేవలం 7.5 కోట్ల డాలర్ల వ్యయంతో దిగి్వజయంగా నిర్వహించడం ప్రపంచాన్ని అబ్బురపరిచిందనే చెప్పాలి. చంద్రుని ఉపరితలంపై సల్ఫర్ జాడలున్నట్టు చంద్రయాన్–3 ప్రయోగం ధ్రువీకరించింది. రెండు వారాల పాటు చురుగ్గా పని చేసి దాన్ని ప్రయోగించిన లక్ష్యాన్ని నెరవేర్చింది. 2. కృత్రిమ మేధ ఈ రంగంలో కీలక ప్రగతికి 2023 వేదికైంది. 2022 చివర్లో ఓపెన్ఏఐ విడుదల చేసిన ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ ఈ ఏడాది అక్షరాలా సంచలనమే సృష్టించింది. ఆకా శమే హద్దుగా అన్ని రంగాల్లోకి చొచ్చుకుపోయింది. లీవ్ లెటర్లు ప్రిపేర్ చేసినంత సులువుగా సృజనాత్మకమైన లవ్ లెటర్లనూ పొందికగా రాసి పెడుతూ వైవిధ్యం చాటుకుంది. అప్పుడప్పుడూ తడబడ్డా, మొత్తమ్మీద అన్ని అంశాల్లోనూ అపారమైన పరిజ్ఞానం, నైపుణ్యంతో యూజర్ల మనసు దోచుకుంది. గూగుల్ తదితర దిగ్గజాలు కూడా సొంత ఏఐ చాట్బోట్లతో బరిలో దిగుతుండటంతో ఏఐ రంగంలో మరిన్ని విప్లవాత్మక పరిణామాలు వచ్చేలా ఉన్నాయి. 3. ఆదిమ ‘జాతులు’! మనిషి పుట్టిల్లు ఏదంటే తడుముకోకుండా వచ్చే సమాధానం... ఆఫ్రికా. అంతవరకూ నిజమే అయినా, మనమంతా ఒకే ఆదిమ జాతి నుంచి పుట్టుకొచ్చామని ఇప్పటిదాకా నమ్ముతున్న సిద్ధాంతం తప్పని 2023లో ఓ అధ్యయనం చెప్పింది. మన మూలాలు కనీసం రెండు ఆదిమ జాతుల్లో ఉన్నట్టు తేలి్చంది! 10 లక్షల ఏళ్ల కింద ఆఫ్రికాలో ఉనికిలో ఉన్న పలు ఆదిమ జాతులు హోమోసెపియన్ల ఆవిర్భావానికి దారి తీసినట్టు డీఎన్ఏ విశ్లేషణ ఆధారంగా అది చెప్పడం విశేషం! మూలవాసులైన అమెరికన్లు దాదాపు 20 వేల ఏళ్ల కింద ఉత్తర అమెరికాకు వలస వెళ్లి యురేషియాకు తిరుగు పయనమైనట్టు మరో అధ్యయనం తేల్చింది. 4. గ్రహశకలం ఓసిరిస్ నాసా ప్రయోగించిన ఒసిరిస్ రెక్స్ రోబోటిక్ అంతరిక్ష నౌక ఏడేళ్ల ప్రయాణం అనంతరం బెన్నూ గ్రహశకలంపై దిగింది. అక్కడి దాదాపు పావు కిలో పరిమాణంలో రాళ్లు, ధూళి నమూనాలను సేకరించి భూమికిపైకి పంపింది. అవి సెపె్టంబర్ 24న అమెరికాలోని ఉటా ఎడారి ప్రాంతంలో దిగాయి. వాటిని విశ్లేషించిన సైంటిస్టులు నీటితో పాటు భారీ మొత్తంలో కార్బన్ జాడలున్నట్టు తేల్చారు. బెన్నూ గ్రహశకలం భూమి కంటే పురాతనమైనది. దాని నమూనాల విశ్లేషణ ద్వారా భూమిపై జీవం ఆవిర్భావానికి సంబంధించిన కీలకమైన రహస్యాలు వెలుగు చూడవచ్చని భావిస్తున్నారు. 5. అత్యంత వేడి ఏడాది చరిత్రలో ఇప్పటిదాకా నమోదైన అత్యంత వేడి ఏడాదిగా 2023 ఓ అవాంఛనీయ రికార్డును సొంతం చేసుకుంది. ఏప్రిల్ నుంచి నవంబర్ దాకా ప్రతి నెలా ఇప్పటిదాకా అత్యంత వేడిమి మాసంగా నమోదవుతూ వచి్చంది! ఫలితంగా ఏడాది పొడవునా లిబియా నుంచి అమెరికా దాకా తీవ్ర తుఫాన్లు, వరదలు, కార్చిచ్చులు ఉత్పాతాలు సృష్టిస్తూనే వచ్చాయి. పైగా నవంబర్‌లో అయితే 17వ తేదీన భూ తాపంలో చరిత్రలోనే తొలిసారిగా 2 డిగ్రీల పెరుగుదల నమోదైంది! 2 డిగ్రీల లక్ష్మణ రేఖను తాకితే సర్వనాశనం తప్పదని సైంటిస్టులు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం వణికిస్తోంది. 6. సికిల్ సెల్‌కు తొలి జన్యుచికిత్స సికిల్ సెల్, బెటా థలస్సీమియా వ్యాధులకు తొలిసారిగా జన్యు చికిత్స అందుబాటులోకి వచి్చంది. వాటికి చికిత్స నిమిత్తం కాస్జెవీ 9క్రిస్పర్ కేస్9) జన్యు ఎడిటింగ్ టూల్ వాడకానికి బ్రిటన్ ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం లభించింది. ఈ థెరపీ ద్వారా రోగులకు నొప్పి నిదానించిందని, ఎర్ర రక్త కణాల మారి్పడి ఆవశ్యకత కూడా తగ్గుముఖం పట్టిందని తేలింది. కాకపోతే ఈ చికిత్స ఖరీదే ఏకంగా 20 లక్షల డాలర్లు! పైగా భద్రత అంశాలు, దీర్ఘకాలిక పనితీరు తదితరాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 7. ఊబకాయానికి మందు మధుమేహానికి ఔషధంగా పేరుబడ్డ వెగోవీ ఊబకాయాన్ని తగ్గించే మందుగా కూడా తెరపైకి వచ్చి సంచలనం సృష్టించింది. బరువును తగ్గించడం మాత్రమే గాక గుండెపోటు, స్ట్రోక్ తదితర ముప్పులను కూడా ఇది బాగా తగ్గిస్తుందని తేలడం విశేషం. వీటితో పాటు పలురకాల అడిక్షన్లకు చికిత్సగా కూడా వెగోవీ ప్రభావవంతంగా ఉపయోగపడుతోందని తేలింది. అయితే దీని వాడకం వల్ల థైరాయిడ్ క్యాన్సర్ వంటి సైడ్ ఎఫెక్టులు రావచ్చంటున్నారు! 8. పాపం పక్షిజాలం ప్రపంచవ్యాప్తంగా జంతుజాలానికి, మరీ ముఖ్యంగా పక్షిజాలానికి మరణశాసనం రాసిన ఏడాదిగా 2023 నిలిచింది! ప్రపంచ వ్యాప్తంగా లక్షల కొద్దీ పక్షి జాతుల జనాభాలో ఈ ఏడాది విపరీతమైన తగ్గుదల నమోదైనట్టు సైంటిస్టులు తేల్చారు. గత నాలుగు దశాబ్దాలుగా పెరుగుతూ వస్తున్న ఈ ధోరణి 2023లో బాగా వేగం పుంజుకున్నట్టు పలు పరిశోధనల్లో తేలింది. పురుగుమందుల విచ్చలవిడి వాడకమే పక్షుల మనుగడకు ముప్పుగా మారిందని తేలింది! 9. మూల కణాధారిత పిండం అండం, శుక్ర కణాలతో నిమిత్తం లేకుండానే కేవలం మూల కణాల సాయంతో మానవ పిండాన్ని సృష్టించి ఇజ్రాయెల్ సైంటిస్టులు సంచలనం సృష్టించారు. అది కూడా మహిళ గర్భంతో నిమిత్తం లేకుండా ప్రయోగశాలలో వారీ ఘనత సాధించారు. ఈ నమూనా పిండం ప్రయోగశాలలో 14 రోజుల పాటు పెరిగింది. ఆ సమయానికి సహజంగా తల్లి గర్భంలో ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఎదిగిందని తేలింది. మానవ పునరుత్పత్తి రంగంలో దీన్ని కీలక మైలురాయిగా భావిస్తున్నారు. ఇలాంటి మరిన్ని ప్రయోగాలకు ఇది ప్రేరణగా నిలుస్తుందని భావిస్తున్నారు. 10. కార్చిచ్చులు 2023లో కార్చిచ్చులు కొత్త రికార్డులు సృష్టించాయి. ముఖ్యంగా కెనడాలోనైతే పెను వినాశనానికే దారి తీశాయి. వీటి దెబ్బకు అక్కడ గత అక్టోబర్ నాటికే ఏకంగా 4.5 కోట్ల ఎకరాలు బుగ్గి పాలయ్యాయి! అక్కడ 1989లో నమోదైన పాత రికార్డుతో పోలిస్తే ఇది ఏకంగా రెట్టింపు విధ్వంసం. అమెరికా, బ్రిటన్, స్పెయిన్, నార్వే వంటి పలు ఇతర దేశాల్లోనూ కార్చిచ్చులు విధ్వంసమే సృష్టించాయి. వీటి దెబ్బకు జూన్ నెలంతా అమెరికాలో వాయు నాణ్యత ఎన్నడూ లేనంతగా తగ్గిపోయింది. హవాయి దీవుల్లో కార్చిచ్చుకు ఏకంగా 100 మంది బలయ్యారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Happy New Year 2024: వెల్కమ్ పార్టీ
2023 కి వీడ్కోలు, న్యూ ఇయర్‌కి వెల్కమ్ చెప్పడానికి బంధు మిత్రులు బృందంగా ఒక చోట చేరుతుంటారు. ఏడాది మొత్తం జ్ఞాపకంగా మిగిలిపోయే ఈ రోజును ఇంట్లో ఉల్లాసభరితంగా ఎలా మార్చుకోవచ్చో తెలుసుకుందాం. న్యూ ఇయర్ వేడుకల అలంకరణలో మెరిసే, ఆకర్షణీయమైన వెలుగులతో ఈ రోజును అలంకరించడానికి చకచకా సిద్ధం అయిపోవచ్చు. ► బ్యానర్ ముందుగా ‘హ్యాపీ న్యూ ఇయర్’ అని చూపే ఒక సాధారణ బ్యానర్‌ను ఏర్పాటు చేసుకోవాలి. నలుపు, బంగారం, వెండి రంగులు ఉండే బ్యానర్‌తో ఉన్న ఈ అలంకారం అందరిలోనూ ఒక ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఈ బ్యానర్ ను మీ ఇంట్లో ఎక్కడైనా వేలాడదీయవచ్చు. దీనిని టేప్‌తో గోడలకు అతికించడం, ఆ తర్వాత తొలగించడం కూడా సులువే. ► బెలూన్స్ నూతన సంవత్సర వేడుకల అలంకరణలో బెలూన్లు మరో ముఖ్యపాత్ర పోషిస్తాయి. పార్టీ మూడ్‌ను తీసుకురావడానికి ఇంట్లో బెలూన్ ఆర్చ్‌ని సృష్టించుకోవాలి. రెడీమేడ్‌గా కూడా ఈ ఆర్చ్‌లు దొరుకుతాయి. ఈ బెలూన్స్ కూడా బంగారం, తెలుపు, మెరిసే బెలూన్స్ మరింత పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తాయి. ► కొవ్వొత్తులు స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి కూర్చున్నప్పుడు అక్కడి వాతావరణం హాయిగొలిపే అనుభూతిని ఇవ్వాలి. ఇందుకు ఫ్లేమ్‌లెస్, సెంటెడ్ క్యాండిల్స్ ఎంతగానో తోడ్పడతాయి. అందుకని, ముందుగానే వీటిని సిద్ధం చేసుకోవడం మంచిది. న్యూ ఇయర్లోకి అడుగిడే కొత్త సమయంలో ఈ కొవ్వొత్తుల వెలుగులు అందరిలోనూ నూతన ఉత్సాహాన్ని నింపుతాయి. ► ఫన్ నెక్లెస్ లు టేబుల్‌పై కొవ్వొత్తులు ఒకటే ఉంచితే సరిపోదు. ఆ టేబుల్‌పైన పరిచే రన్నర్ పై పూసల దండలను అమర్చడం, వేలాడదీయడం పండగ సంబరాన్ని తీసుకువస్తుంది. వీటిలో కూడా బంగారం, నలుపు, వెండి పూసల దండలను ఎంచుకోవడం మంచిది. ► డిస్కో థీమ్ కొత్తసంవత్సరం అంటేనే ఒక జోష్‌తో నడవాలనుకుంటారు. న్యూ ఇయర్‌కి వెల్కమ్ చెప్పే సమయంలో డాన్స్ చేసే వీలుండేలా డిస్కో థీమ్‌ని అలంకరించుకోవాలి. ఇందుకు సియెర్రా వంటి కొన్ని డిస్కో బాల్స్ ఈ అలంకరణకు ఉపయోగించుకోవాలి. ► పిల్లల కోసం ప్రత్యేకం పార్టీలో పిల్లలు ఉంటే వారి కోసం.. వారి చేత నియాన్, పేస్టెల్ బెలూన్లు, రంగురంగుల నాప్కిన్స్, కప్పులతో వారి పార్టీ ప్లేస్‌ను అలంకరించవచ్చు. ► తెల్ల బంగారం తెలుపు, బంగారు రంగులతో పార్టీ ప్లేస్‌ను మెరిసేలా అలంకరించండి. ఇందుకు షిమ్మరీ గోల్డ్ ఫ్రింజ్ కర్టెన్లను జోడించే ముందు డోర్ ఫ్రేమ్ పై భాగంలో తెల్లటి బెలూన్లను బ్లో అప్ చేయచ్చు. ► స్ట్రింగ్ లైట్లు బయటి వైపు స్ట్రింగ్ లైట్లను వేలాడదీసి, వాటిని మెరిసేలా చేయచ్చు. దీంతో బయటి వాతావరణం వెలుగులతో పండగ వాతావరణాన్ని నిండుగా కనిపంచేలా చేస్తుంది. ► పేపర్ ప్లేట్స్ రంగు రంగుల పేపర్ ప్లేట్లను వాల్ డెకార్‌గా మార్చుకోవచ్చు. గోడపైన ఉల్లాసాన్ని కలిగించే రంగులను ఆకర్షణీయంగా అలంకరించుకోవడానికి చవకైన, సరైన మార్గం అవుతుంది. ► రంగు రంగుల టిష్యూ కొత్త కొత్త అలంకరణతో పార్టీ ప్లేస్‌ను ఉత్తేజంగా మార్చడానికి రంగురంగుల టిష్యూ పేపర్లు కూడా వాడచ్చు. పింక్, బ్లూ, వైట్ టిష్యూ పేపర్లను తీసుకొని, వాటిని ఒక్కొక్కటీ జోడిస్తూ దండలా అల్లుకోవాలి. దీనిని పార్టీ ప్లేస్‌లో వేలాడదీయాలి. ► టేబుల్ క్లాత్ పింక్ గ్లిటర్ టేబుల్ క్లాత్ పరిచి, దానిపైన బంగారు, స్టార్ మోటిఫ్‌లతో ఉల్లాసభరితమైన థీమ్‌ని తీసుకురావచ్చు. దీంతో డిన్నర్ చేసే టేబుల్ న్యూ ఇయర్ వేడుకలో మరింత ప్రత్యేకతను నింపుకుంటుంది. -
2023 రౌండప్: భారత క్రీడారంగంలో కీలక ఘట్టాలు
అంతర్జాతీయ క్రీడా వేదికపై భారత్ ఈ ఏడాది అత్యుత్తమ విజయాలు నమోదు చేసి తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, ఆర్చరీ, ఫుట్‌బాల్, క్రికెట్, చెస్, పారా అథ్లెటిక్స్ తదితర క్రీడల్లో భారత ఆటగాళ్లు ఈ ఏడాది చిరస్మరణీయ విజయాలు సాధించి విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఏడాది భారత ఆటగాళ్లు వ్యక్తిగతంగా, టీమ్ విభాగాల్లో సాధించిన అత్యుత్తమ విజయాలు.. వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా బంగారు పతకాన్ని కైవసం చేసుకోగా.. ఆసియా క్రీడల చరిత్రలో భారత్ తొలిసారి 100 పతకాల మార్కును దాటి (107 పతకాలు (28 గోల్డ్, 38 సిల్వర్, 41 బ్రాంజ్)), పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. రమేష్‌బాబు ప్రజ్ఞానంద.. 18 సంవత్సరాల వయసులో ఫిడే చెస్ ప్రపంచ కప్‌కు అర్హత సాధించిన అతి పిన్న వయస్కుడిగా ప్రపంచ రికార్డు. చరిత్ర సృస్టించిన సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి-చిరాగ్ షెట్టి.. బ్యాడ్మింటన్ డబుల్స్‌లో వరల్డ్ నంబర్ వన్ ర్యాంక్ సాధించిన తొలి భారత జోడీగా రికార్డు. తొమ్మిదోసారి SAFF చాంపియన్‌గా నిలిచిన భారత ఫుట్‌బాల్ జట్టు. కువైట్‌పై చారిత్రక విజయం సాధించడంతో ఫిఫా వరల్డ్‌కప్ రౌండ్-2కు అర్హత. భారత పురుషుల క్రికెట్ జట్టు అన్ని ఫార్మాట్లలో వరల్డ్ నంబర్ వన్ జట్టుగా అవతరణ. టీ20 ప్రపంచకప్‌ను గెలిచిన భారత మహిళల అండర్ 19 జట్టు. వన్డే ప్రపంచకప్‌లో తుది సమరం వరకు అద్భుతంగా పోరాడిన టీమిండియా .. ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. చరిత్ర సృష్టించిన భారత పారా అథ్లెట్లు.. ఆసియా పారా గేమ్స్ చరిత్రలో తొలిసారి వందకు పైగా పతకాలు (111, 29 గోల్డ్, 31 సిల్వర్, 51 బ్రాంజ్) సొంతం. ఈ పోటీల్లో భారత్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. అర్చరీ వ్యక్తిగత విభాగంలో తొలి వరల్డ్ టైటిల్‌ను సాధించిన అదితి స్వామి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జ్యోతి సురేఖ వెన్నం.. పర్నీత్ కౌర్, అదితి స్వామితో కలిసి మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్‌ను గెలుచుకుంది. ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఇది తొలి స్వర్ణం కావడం విశేషం. -
ఐఫోన్ కొనటానికి ఇది మంచి సమయం - ఎందుకంటే?
2023 ముగుస్తోంది.. కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. ఈ సమయంలో చాలామంది కొత్త బైకులు, కార్లు లేదా మొబైల్ ఫోన్స్ వంటివి కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు కూడా కొన్ని ఆకర్షణీయమైన ఆఫర్స్ అందిస్తున్నాయి. ఈ కథనంలో ఐఫోన్ 15 (iPhone 15)పై అందుబాటులో ఉన్న ఆఫర్స్ గురించి వివరంగా తెలుసుకుందాం. వండర్లస్ట్ ఈవెంట్లో లాంచ్ అయిన ఐఫోన్ 15 ధర రూ. 79990. ఈ లేటెస్ట్ ఫోన్‌ను అమెజాన్‌లో కొనుగోలు చేసినట్లయితే రూ. 74990కే సొంతం చేసుకోవచ్చు. అంటే ఐఫోన్ 15 కొనుగోలుదారులు రూ.5000 డిస్కౌంట్ పొందవచ్చు. రూ.5000 డిస్కౌంట్ మాత్రమే కాకుండా అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ కార్డు వినియోగదారులు 5 శాతం (రూ. 3745) క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చు. దీంతో రూ.79990 మొబైల్.. అన్ని డిస్కౌంట్స్ తరువాత రూ.71245కే కొనుగోలు చేయవచ్చు. మొత్తం మీద ఐఫోన్ 15 కొనుగోలుపై ఇప్పుడు 8745 రూపాయల తగ్గింపును పొందవచ్చు. ఇదీ చదవండి: సచిన్‌కు రూ.27 కోట్ల లాభం.. ఎలా అంటే? ఐఫోన్ 15 ఫీచర్స్ ఐఫోన్ 15 అనేది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది కొత్త డైనమిక్ ఐలాండ్ టెక్నాలజీతో వస్తుంది. 6.1 ఇంచెస్ స్క్రీన్ కలిగిన ఈ మొబైల్ అద్భుతమైన కెమెరా సెటప్ పొందుతుంది. దీంతో వినియోగదారులు 0.5x, 1x, 2x జూమ్ స్థాయిలలో కూడా ఫోటోలను తీసుకోవచ్చు. మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ మొబైల్ 128, 256, 512 జీబీ మెమొరీ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఇది ఇప్పుడు USB-C ఛార్జర్‌కు సపోర్ట్ చేస్తుంది. మొత్తం మీద ఐఫోన్ 15 అన్ని విధాలా అద్భుతంగా ఉంటుంది. మంచి డిస్కౌంట్‌తో ఐఫోన్ కొనాలనే వారికి ఇది గొప్ప అవకాశం అని తెలుస్తోంది. -
ఆణిముత్యాలు
సమాజ నిర్మాణంలో స్త్రీ పాత్ర కీలకం. అవని అంతటినీ నడిపించే శక్తి ఆమె. గ్రామీణ విద్యార్థులను అంతర్జాతీయ వేదిక మీద నిలిపిన టీచర్ ఒకరు. సమాజంలో నెలకొన్న రుగ్మతలకు కూడా చికిత్స చేస్తున్న డాక్టర్ ఒకరు. నిస్సహాయుల బతుకును ఈతతో దరిచేరుస్తున్న తల్లి ఒకరు. సాటి మహిళకు స్వావలంబన సాధనలో సహకారం అందిస్తున్న శక్తి ఒకరు. స్థితప్రజ్ఞత సాధనకై నాట్య యోగ ధ్యాన క్రియలతో శ్రమిస్తున్న ఔత్సాహిక ఒకరు. చక్కటి జాతి నిర్మాణంలో తమదైన పాత్రను పోషిస్తున్న ఆణిముత్యాలు వీళ్లు. ఇయర్ రౌండప్‌లో ఈ ఏడాది వారు సాధించిన లక్ష్యాల గురించి క్లుప్తంగా... శ్రుతకీర్తి శ్రుతకీర్తి ప్రముఖ కూచిపూడి నాట్యకారిణి. గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ డాన్స్ హెచ్వోడీగా శాస్త్రీయ నాట్యంలో కొత్తతరాలకు మార్గదర్శనం చేస్తున్నారు. మూడేళ్ల వయసులో వేదిక మీద తొలి ప్రదర్శన ఇచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు దేశవిదేశాల్లో వెయ్యికి పైగా ప్రదర్శనలిచ్చారామె. గొంతు, ఉచ్చారణ బాగుందని టీచర్లు స్కూల్ రేడియోలో వ్యాఖ్యాతగా అవకాశం ఇచ్చారు. అలా మొదలైన వ్యాఖ్యాన పరంపరలో ఆరవ తరగతిలో ప్రముఖుల కార్యక్రమాలకు వేదిక మీద వ్యాఖ్యాతగా వ్యవహరించే స్థాయికి ఎదిగారు. ఐదు వందలకు పైగా సభలను నిర్వహించిన శ్రుతకీర్తి తొమ్మిదవ తరగతి నుంచి న్యూస్ ప్రెజెంటర్‌గా జెమినీ టీవీలో వార్తలు చదివారు. ఎంబీఏ, ఎల్ఎల్బీ, కౌన్సెలింగ్ సైకాలజీలో డాక్టరేట్ చేసిన కీర్తి... దశాబ్దకాలంగా మాతా ఆత్మానందమయి శిష్యరికంలో సుషుమ్న క్రియ యోగదీక్ష సాధన చేస్తూ ప్రపంచ శాంతి, మెంటల్ అండ్ ఎమోషనల్ హెల్త్ కోసం దేశవిదేశాల్లో స్కూళ్లు, కాలేజ్‌లతోపాటు కార్పొరేట్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. మనసు చంచలమైనది. సాధన ద్వారా స్థితప్రజ్ఞత సాధించాలి. ఇప్పుడు ప్రపంచం అంతటా యువతను పీడిస్తున్న సమస్య ఏకాగ్రతలోపం. నాట్యం, యోగసాధన, ధ్యానం ద్వారా ఏకాగ్రతను సాధించవచ్చని ఆచరణాత్మకంగా తెలియచేస్తున్నానని చెబుతారు శ్రుతకీర్తి. నీరజ గొడవర్తి ‘సంకల్ప బలమే లక్ష్యం వైపు నడిపిస్తుంది. నా జీవితంలో ‘నో’ అనే పదానికి స్థానమే లేదు’ అంటున్న నీరజ గొడవర్తిది అంబేద్కర్ కోనసీమ జిల్లా ముంగండ. ఏకశిల కెమికల్స్ లిమిటెడ్‌కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా దాదాపు నలభై ఏళ్లుగా ఆ సంస్థను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇక ప్రవృత్తి, అభిరుచుల విషయానికి వస్తే... ఇకబెనా ఫ్లవర్ డెకరేషన్, కర్ణాటక సంగీత గాయని, పాటల రచయిత, స్వరకర్త, రోటరీ క్లబ్ సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ బిజీగా ఉంటారు. పారిశ్రామిక రంగం అంటే మగవాళ్ల ప్రపంచం అనే అభిప్రాయం స్థిరంగా ఉన్న రోజుల్లో పరిశ్రమ స్థాపించి, విజయవంతమైన పారిశ్రామికవేత్తగా నిలదొక్కుకోవడానికి ఎంతగా శ్రమించాల్సి వచ్చిందో తనకు తెలుసంటారామె. అందుకే పరిశ్రమల రంగంలోకి రావాలనే ఆసక్తి ఉన్న మహిళలకు ఒక మార్గం వేయాలనే ఉద్దేశంలో కోవె(కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్) నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ద్వారా మహిళలను సంఘటితం చేస్తూ, ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలకు సహాయ సహకారాలందిస్తున్నారు. ఆమె విశిష్ట సేవలకు గాను ఈ ఏడాది ‘డాక్టర్ సరోజినీ నాయుడు ఇంటర్నేషనల్ అవార్డు, హార్టికల్చరిస్ట్, మల్టీ టాలెంటెడ్ ఉమన్’ పురస్కారాలను అందుకున్నారు. లక్ష్మీదేవి కృష్ణా జిల్లా, పెడన గ్రామం, జిల్లా పరిషత్ హైస్కూల్లో సైన్స్ టీచర్ లక్ష్మీదేవి. విద్యార్థులకు పాఠాలు నేర్పించడంతోపాటు ప్రయోగాల్లోనూ మేటిగా తీర్చిదిద్దుతారామె. ఆమె స్టూడెంట్స్ మణికంఠ, వినయ్ కుమార్ ఈ ఏడాది యూఎస్‌లోని డాలస్‌లో జరిగిన ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఫేర్‌లో పాల్గొని ఎకో ఫ్రెండ్లీ ఫ్లవర్ పాట్‌ను ప్రదర్శించి నాలుగో స్థానంలో నిలిచారు. ఇప్పటివరకు వందకు పైగా ప్రయోగాలు చేసిన లక్ష్మీదేవి తన పరిశోధన ఫార్ములాను స్టార్టప్ కంపెనీలకు ఉచితంగా ఇస్తూ... ‘వినియోగదారులకు తక్కువ ధరకు ఇవ్వండి. అదే మీరు నాకిచ్చే గొప్ప పారితోషికం’ అంటారు. ప్రస్తుతం ఫ్లోరైడ్ బాధిత ఆదివాసీ గ్రామాల కోసం మట్టిలో తులసి ఆకుల పొడి కలిపి కుండలను చేసి ప్రయోగాన్ని విజయవంతం చేశారు. నూజివీడు సమీపంలోని ఆదివాసీ గ్రామాలకు వెళ్లి పంచడానికి కుండలను సిద్ధం చేస్తున్నారు. ఒక సందేహం రావడం, ఆ సందేహానికి సమాధానం కోసం అన్వేషణ. పరిశోధన, ప్రయోగాలతో సమాధానాన్ని రాబట్టడం ఆమె వంతు. ఆ సమాధానంతో సమాజంలోని సమస్యకు పరిష్కారం లభించడం... ఆమె ప్రయోగాల గొప్పతనం. సమాజానికి ఆమె అందిస్తున్న శాస్త్రీయ సేవకు గాను జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పురస్కారాలందుకున్న లక్ష్మీదేవి ఈ ఒక్క ఏడాదిలోనే పదికి పైగా సత్కారాలందుకున్నారు. రజనీ లక్కా రజనీ లక్కా స్విమ్మింగ్ చాంపియన్. ఆమె తన కోసం తాను రికార్డు సాధించడమే కాదు, స్పెషల్లీ చాలెంజ్డ్ (దివ్యాంగులు) పిల్లలకు ఉచితంగా ఈతలో శిక్షణనిస్తున్నారు. ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోయినప్పుడు మామూలు వాళ్లు ఈదుకుంటూ ఒడ్డుకు చేరతారు. కానీ దివ్యాంగులు... శారీరక వైకల్యం కారణంగా ఈదలేక నిస్సహాయంగా నీటిలో మునిగిపోవడాన్ని సహించలేకపోయారామె. వారికి ఉచితంగా ఈత నేర్పిస్తున్నారు. దశాబ్దకాలంగా సాగుతున్న ఆమె సర్వీస్‌లో అరవై మందికి పైగా పిల్లలు ఈత నేర్చుకుని, పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. ఆమె సాధించిన పతకాలు నూట పాతికకు చేరితే ఆమె శిష్యులు సాధించిన పతకాల సంఖ్య రెండు వందల యాభై దాటాయి. సాయి నిఖిల్ గత ఏడాది నేషనల్ రికార్డు సాధించగా గోపీచంద్ ఈ ఏడాది ఏషియన్ గేమ్స్‌లో పాల్గొన్నాడు. అనంతపురానికి చెందిన ఆమె బళ్లారిలో నివసిస్తున్నారు. ప్రతి వ్యక్తీ ఆల్ రౌండర్‌గా ఉండాలని అభిలషించే రజని సోలో ట్రావెలర్, గార్డెనర్, మిసెస్ ఇండియా కిరీటధారి కూడా. ఇంటర్నేషనల్ ఇన్స్పిరేషన్ అవార్డు– 2020 అందుకున్న రజని లక్కా ఈ ఏడాది కర్ణాటక ప్రభుత్వం నుంచి వ్యక్తిగత సేవావిభాగంలో పురస్కారం అందుకున్నారు. పెన్నా కృష్ణప్రశాంతి డాక్టర్ పెన్నా కృష్ణ ప్రశాంతి, కన్సల్టెంట్ ఫిజీషియన్. తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. జాతీయస్థాయిలో బైరాక్ (బయో టెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెంట్ కౌన్సిల్) బోర్డు మెంబర్‌గా ఎంపికైన తొలి మహిళ. అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, డయాబెటిక్ రీసెర్చ్ సొసైటీ కౌన్సిల్ మెంబర్. ఇంతకు ముందు ఈ హోదాల్లో మగవాళ్లే బాధ్యతలు నిర్వర్తించారు. ఆ గిరిగీతను చెరిపేసిన మహిళ ఆమె. శ్రీసాయి హర్షిత చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తిరుపతి, పరిసర ప్రాంతాల్లో ఆమె వైద్యసేవలందిస్తున్నారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో బయోటెక్ ఇన్క్యుబేషన్ సౌకర్యాల కల్పనతోపాటు విద్యార్థినులకు సలహా సూచనలిస్తున్నారు. పలు విద్యాసంస్థల్లో పాలక వర్గంలో సభ్యురాలు. మహిళా సంక్షేమం కోసం పోలీస్ శాఖతో కలిసి పని చేస్తున్నారు. ఆమె వైద్యరంగానికి, సమాజానికి అందిస్తున్న సేవలకుగాను ‘తెలివిగల నాయకత్వ లక్షణాలున్న మహిళ’గా రాష్ట్రపతి ప్రశంసలు అందుకున్నారు. -
ఈ కార్ల కొనుగోలుపై అదిరిపోయే ఆఫర్స్ - పూర్తి వివరాలు
ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'రెనాల్ట్ ఇండియా' ఈ ఏడాది బ్రాండ్ కార్లను కొనుగోలు చేసేవారి కోసం అద్భుతమైన ఆఫర్లను తీసుకువచ్చింది. ఇందులో క్యాష్ డిస్కౌంట్, లాయల్టీ బోనస్‌లు, కార్పొరేట్ డిస్కౌంట్స్, ఎక్స్చేంజ్ బోనస్ వంటి వున్నాయి. కంపెనీ అందించే ఈ బెనిఫిట్స్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రెనాల్ట్ కైగర్ కంపెనీ తన రెనాల్ట్ కైగర్ కొనుగోలుపైన రూ. 65,000 వరకు డిస్కౌంట్స్ అందిస్తోంది. ఇందులో రూ.25,000 క్యాష్ డిస్కౌంట్, రూ.20,000 స్పెషల్ కస్టమర్ లాయల్టీ బోనస్‌లు, రూ.12,000 కార్పొరేట్ బెనిఫిట్స్ మొదలైనవి ఉన్నాయి. 1.0 లీటర్ పెట్రోల్, టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో లభించే ఈ మోడల్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. రెనాల్ట్ ట్రైబర్ రెనాల్ట్ ట్రైబర్ కొనుగోలుపైన కంపెనీ రూ.50000 వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. ఇందులో రూ.20,000 క్యాష్ డిస్కౌంట్, రూ.20,000 వరకు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్, రూ.10,000 లాయల్టీ కస్టమర్ ప్రయోజనాల కింద తగ్గింపు ఉన్నాయి. రూ.6.34 లక్షల ప్రారంభ ధర వద్ద లభిస్తున్న ఈ కారును ఈ నెలలో కొనుగోలు చేస్తే రూ.50,000 వరకు సేవ్ అవుతుంది. ఇదీ చదవండి: 2024లో మరింత వేగంగా భారత్ వృద్ధి - అసోచామ్ రెనాల్ట్ క్విడ్ ప్రారంభం నుంచి అత్యుత్తమ అమ్మకాలు పొందుతున్న రెనాల్ట్ క్విడ్ కొనుగోలుపైన కంపెనీ ఇప్పుడు రూ. 50000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్, లాయల్టీ బోనస్‌లు, కార్పొరేట్ డిస్కౌంట్స్, ఎక్స్చేంజ్ బోనస్ వంటివి ఉన్నాయి. రూ.4.5 లక్షల ప్రారంభ ధరలో లభించే ఈ కారుని ఇప్పుడు రూ.50,000 తగ్గింపుతో ఈ నెలలో కొనుగోలు చేయవచ్చు. Note: రెనాల్ట్ కంపెనీ అందిస్తున్న ఆఫర్స్ ఒక నగరం నుంచి మరో నగరానికి మారుతూ ఉండే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా కంపెనీ అందించే తగ్గింపులు కేవలం మరో రెండు రోజులు మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. ఖచ్చితమైన వివరాలు తెలుసుకోవడానికి వినియోగదారులు సమీపంలోని అధికారిక డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవాలి. -
ఈ ఏడాది విచిత్రమైన ఆవిష్కరణలు ఇవే..
ప్రపంచంలో ఎప్పటికప్పుడు అనేక కొత్త సాంకేతిక ఆవిష్కరణలు సృష్టిలోకి వస్తూనే ఉంటాయి. వీటిలో కొన్ని చాలా ఉపయోగకరమైనవి, వేగంగా ప్రాచుర్యం పొందుతుంటాయి. మరికొన్ని మరింత ప్రయోగాత్మకంగా ఉంటాయి. అయితే కొన్ని ఆవిష్కరణలు మాత్రం విచిత్రంగా అనిపిస్తాయి. వాటిని మనం ఎప్పటికీ ఊహించలేము. అయినా వాటితో సమాజానికి ఉపయోగం ఉంటుంది. ఇలా ఈ ఏడాది వచ్చిన కొన్ని విచిత్రమైన సాంకేతిక ఆవిష్కరణలు గురించి ఇక్కడ తెలుసుకుందాం. హైబ్రిడ్ మొబిలిటీ రోబో(హెచ్ఎంఆర్) రోబోటిక్స్‌లో హైబ్రిడ్ మొబిలిటీ రోబోను టెక్ నిపుణులు ఒక సంచలనంగా చెబుతారు. ఇది బంతిని పోలి ఉండే ఎగిరే పరికరం. బంతిలాగా అన్నివైపులా కదులుతూ ఉంటుంది. అది వెళ్లే మార్గంలో ఏదైనా అడ్డంకి లేదా నిటారుగా ఉన్న నిర్మాణాలు ఎదురైతే పైకి కిందకు ఎగురుతూ ముందుకు సాగిపోతుంది. హ్యూమని ఏఐ పిన్ హ్యూమని ఏఐ పిన్ను మొదటిసారిగా ఏప్రిల్ 2023లో జరిగిన టెడ్ కాన్ఫరెన్స్‌లో ఆవిష్కరించారు. ఇది రోజువారి ఫోన్కాల్లు చేయడం, రోజువారి కార్యకలాపాలను విశ్లేషించడం, ఆహార పదార్థాలను స్కాన్ చేయడం వంటి కొన్ని అంశాలను ప్రదర్శించారు. ఈ పరికరం సెప్టెంబరు 2023లో జరిగిన పారిస్ ఫ్యాషన్ వీక్‌లో మరోసారి దర్శణమిచ్చింది. ఎయిర్‌బ్యాగ్ జీన్స్ స్వీడిష్ కంపెనీ మోసైకిల్ ఎయిర్‌బ్యాగ్ జీన్స్‌ను తయారుచేసింది. మోటార్‌సైకిల్ ఢీకొనేటప్పుడు ఈ జీన్స్ ధరిస్తే కొంత ప్రమాదాన్ని నివారించవచ్చని కంపెనీ తెలిపింది. అందులో ఉండే సెన్సార్లు ప్రమాదం జరిగిన వెంటనే జీన్స్‌లో ఉన్న బ్యాగ్‌లో ఓపెన్ అయి ప్రమాదాన్ని కొంత నివారించేలా తోడ్పడతాయి. సాధారణంగా ఆ జీన్స్ ధరిస్తే మాములుగానే కనిపిస్తుంది. కానీ ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం బ్యాగ్‌లు ఓపెన్అయి కొంత లావుగా ఉంటుంది. అండర్‌వాటర్ జెట్ప్యాక్ నీటిలో అన్వేషణకు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ నీటిలో ప్రయాణం క్లిష్టంగా ఉంటుంది. ఆ ప్రయాణాన్ని సులువు చేసేందుకు అండర్‌వాటర్ జెట్ప్యాక్ అనే పరికరాన్ని తయారుచేశారు. దాన్ని వీపునకు ధరించి నీటిలో ప్రయాణించవచ్చు. రాకెట్ ఎలాగైతే ఆకాశంలో దూసుకుపోతుందో..ఈ పరికరం నీటిలో వర్టికల్‌గా ప్రయాణించడానికి ఉపయోగపడుతుంది. ఇదీ చదవండి: నైట్‌లో ముంబయి మొదటిస్థానం.. వీకెండ్లో.. ఫ్లైయింగ్ జెట్స్కి కాలిఫోర్నియా కేంద్రంగా ఉన్న జెట్సన్ అనే కంపెనీ జెట్సన్ వన్ పేరుతో ఈ ప్రత్యేక ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ లాండింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను తయారు చేస్తోంది. ఇది విద్యుత్‌శక్తి సాయంతో ఎగురుతుంది. జెట్సన్ వన్ వాహనం కారు కంటే వేగంగా పయనించగలదు. గంటకు 63 మైళ్లు అంటే 101 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. అలాగే 15,00 అడుగుల ఎత్తు వరకూ ఎగరగలదు. -
వాళ్లకు సారీ చెప్పారా? వీళ్లతో థ్యాంక్యూ అన్నారా?
365 రోజులు... జీవితమనే అంతులేని ప్రయాణంలో 2023వ సంవత్సరం ఈ 365 రోజులు మనకెన్నో జ్ఞాపకాలు, అనుభవాలు, సంతోషాలు, సవాళ్లు ఇచ్చి ఉంటుంది. ఈ ప్రయాణం మనం ఒక్కరమేచేయగలమా? ఎందరో సాయం చేసి ఉంటారు. వారికి మనస్ఫూర్తిగా థ్యాంక్యూ చెప్పామో లేదో. ఇప్పుడు చెబుదామా. కొందరిని తెలిసో తెలియకో హర్ట్ చేసి ఉంటాం. ఎంత బాధ పడ్డారో ఏమో.. సారీ చెబుదామా. పాత సంవత్సరం అకౌంట్లు సెటిల్ చేసుకొని కొత్త సంవత్సరంలోకి అడుగు పెడదామా? ఏదో హెల్త్ ఇష్యూస్ వచ్చి ఉంటాయి. ఎవరినో సలహా అడిగి ఉంటాం. హాస్పిటల్‌కు తోడు రమ్మని చెప్పి ఉంటాం. అప్పు అడిగి ఉంటాం. వారు ఇచ్చి ఉంటారు. ఆ హడావిడిలో వారికి సరైన థ్యాంక్యూ చెప్పి ఉండం. పట్టించుకోరులే అనుకుంటాం. కాని పట్టించుకుంటారు. మనకు ఈ సంవత్సరం ఇంత సాయం చేసిన వారికి ఈ సంవత్సరాంతంలో కాల్ చేసి, లేదా ఇంటికి వెళ్లి, ఈ సంవత్సరం ఫలానా టైమ్‌లో మీరు నాకు ఈ సాయం చేశారు... థ్యాంక్యూ అని చెప్పి చూడండి... వాళ్ల కళ్లల్లో నీళ్లు చిప్పిల్లుతాయి... మీ కళ్లల్లో కూడా. చెబుదామా? సాయం చేసిన వాళ్లు అవతలి వారి నుంచి కృతజ్ఞతను ఆశించరు కానీ అలాగని కృతజ్ఞత తెలియచేయడం కనీస బాధ్యత కదా! అసలు మేలు చేస్తేనే థ్యాంక్యూ చెప్పాలా? మీ ఇరుగున ఒక ఇల్లు, పొరుగున ఒక ఇల్లు ఉంటుంది. వారితో ఏ తగాదా గొడవా లేకుండానే హ్యాపీగా ఈ సంవత్సరం గడిచిపోయింది. వాళ్లను పలకరించి ‘ఈ సంవత్సరమంతా మనం స్నేహంగా ఉన్నాం. అందుకు థ్యాంక్యూ. వచ్చే సంవత్సరం కూడా ఇలాగే ఉందాం’ అని చిన్న స్వీట్ ఇచ్చి చూడండి. ఆ మేజిక్ ఎలా ఉంటుందో. మీ ఆఫీస్‌లో కలీగ్స్‌తో ‘థ్యాంక్యూ... ఈ సంవత్సరమంతా మనం కలిసి మెలిసి పని చేసినందుకు’ అని టీకి పిలవండి... అదీ చిన్న మేజిక్ కాదు. ఒక సంవత్సరం దాటి వచ్చినందుకు ఎందరికో కృతజ్ఞత ప్రకటించాలి. తల్లిదండ్రులకు, తోడ బుట్టిన వారికి, మిత్రులకు... వీరున్నారనే ధైర్యం వల్లే కదా... ప్రతి రోజునూ చులాగ్గా దాటాం. వీరికి థ్యాంక్స్ చెప్పండి: ఈ సంవత్సరమంతా మనకు ఇంటి సాయం చేసిన పని మనిషికి, కారు డ్రైవర్‌కు, ప్రయాణాలకు టికెట్లు బుక్ చేసిచ్చిన ఏజెంట్‌కు, పిల్లలకు ట్యూషన్ చెప్పిన టీచర్‌కు, అపార్ట్మెంట్ వాచ్‌మెన్‌కు, ఫ్యామిలీ డాక్టర్‌కు... డబ్బు చెల్లించే పని చేయించుకుని ఉండొచ్చు. డబ్బు ఇచ్చినా అలాంటి పని చేసేవారు దొరకనప్పుడు తెలుస్తుంది వారి విలువ. అందుకే థ్యాంక్స్ చెప్పండి. బాగుంటుంది. ఇక మీకు సపోర్ట్‌గా నిలిచిన స్నేహితులకు కాల్ చేసి, వారు ఏ సందర్భంలో ఎంత సపోర్ట్ చేశారో చెప్పి థ్యాంక్స్ చెప్పండి. ఊళ్లో ఉన్న అమ్మా నాన్నలను ఎవరో ఒక పక్కింటి పిన్ని పలకరించి బాగోగులు గమనిస్తుంటుంది. ఆమెకు థ్యాంక్స్ చెప్పండి. మన పిల్లలను రోజూ ఆటకు పిలిచి వారితో స్నేహంగా ఆడుతున్న పిల్లలకూ థ్యాంక్స్ చెప్పండి. వారు ఇంకా విలువైన వారు. అన్నింటికి మించి మన పట్ల కనికరంగా ఉన్న ప్రకృతికి. కరుణతో ఉన్న రుతువులకి, తిన్న ప్రతి అన్నం ముద్దకి, మీరు విశ్వసించే ఈశ్వరునికి థ్యాంక్స్ చెప్పండి. వీరితో సారీ చెప్పండి: ఈ సంవత్సరం రెండు మూడుసార్లు కూడా వెళ్లి చూడటం కుదరని తల్లిదండ్రులకు, తోబుట్టువులకు, అన్నదమ్ములకు... ‘సారీ.. మీరంటే ఎంతో ప్రేమ... కాని కలవడం కుదరలేదు’ అని చెప్పండి. మనసు తేలిక అవుతుంది. ఎందరో స్నేహితులు, బంధువులు శుభకార్యాలకు పిలిచి ఉంటారు. వెళ్లి ఉండరు. వారికి పనిగట్టుకుని ఫోన్ చేసి సారీ చెప్పండి. ఇకపై తప్పక వస్తామని చెప్పండి. బాగా ఆత్మీయులు కొందరు స్వర్గస్తులై ఉంటారు. ఏదో కారణాన వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చి ఉండరు. ఇప్పుడు ఫోన్ చేసి వీలైతే కలిసి సహేతుకమైన కారణం చెప్పి సారీ చెప్పండి. కొందరు మీరు చేయదగ్గ సాయం అడిగినా మీరు నిర్లక్ష్యంతో చేసి ఉండరు. వారు బాధ పడిన విషయం కూడా మీకు తెలిసి ఉండదు. గుర్తు తెచ్చుకుని సారీ చెప్పండి. ఎవరికో ఏవో వాగ్దానాలు చేసి తప్పి ఉంటారు. సారీ చెప్పండి. భార్య భర్తను బాధించిన సందర్భాలకు, భర్త భార్యను కష్టపెట్టిన సందర్భాలకు తప్పక ఒకరికొకరు సారీ చెప్పాలి. పిల్లల్ని చిన్నబుచ్చిన సందర్భాలకు కూడా వారికి సారీ చెప్పాలి. చేజారిన బంధాలు, స్నేహాలు... పలచబడిన బాంధవ్యాలు కేవలం ‘థ్యాంక్యూ’, ‘సారీ’ అనే రెండు పదాలతో తిరిగి అతుక్కుంటాయి. రెండు మూడు రోజులు టైమ్ ఉంది. తెమిలి కూచుని ఇతరుల ఒప్పులను, మీ తప్పులను లిస్ట్ చేసుకుని ఎవరికి ఏం చెప్పాలో అది చెప్పి కొత్త సంవత్సరాన్ని ఉత్సాహంగా మొదలెట్టండి. -
2023.. న్యూ ఇయర్ వేళ.. ఢిల్లీలో జరిగిన ఘోరమిదే!
అది 2023, జనవరి ఒకటి.. దేశమంతా నూతన సంవత్సర వేడుకల్లో మునిగితేలుతోంది. ఇంతలో దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటన యావత్ దేశప్రజలను కలచివేసింది. మర్నాటి ఉదయం వెలుగు చూసిన ఒక వీడియో సంచలనంగా మారింది. అదే.. ఢిల్లీలో నూతన సంవత్సరం వేళ కంఝావాలాలో చోటుచేసుకున్న హిట్ అండ్ రన్ ఘటన. ఒక హోటల్ జరిగిన న్యూ ఇయర్ పార్టీకి హాజరైన అంజలి(20) స్కూటీపై ఇంటికి తిరిగి వెళుతోంది. ఇంతలో అటుగా కారులో వచ్చిన యువకులు ఆమె వాహనాన్ని ఢీకొని, కారుని వేగంగా పోనిచ్చారు. అయితే ఆమె కారు కింద ఇరుక్కుపోయింది. కారు ఆమెను ఈడ్చుకుంటూ 12 కిలోమీటర్లు దూరం వరకూ వెళ్లింది. ఆమె తనను కాపాడాలని అరుస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఫలితంగా ఆమె మృతి చెందింది. ఈ ఘటన దేశ ప్రజల్లో ఆగ్రహాన్ని నింపింది. ఢిల్లీ పోలీసులు ఈ కేసులో అంజలి స్నేహితురాలు నిధిని కూడా విచారించారు. ఆ సమయంలో అంజలి మద్యం మత్తులో ఉందని నిధి పోలీసులకు తెలిపింది. కాగా వారి స్కూటీ కంఝావాలాలోని సుల్తాన్‌పురి ఏరియాకు చేరుకున్నంతలో మితిమీరిన వేగంతో వచ్చిన ఒక కారు వీరి స్కూటీని ఢీకొంది. దాంతో నిధి ఎగిరి పక్కన పడిపోగా, అంజలి కారు కింద ఇరుక్కుపోయింది. అయితే కారును ఆపకుండా.. కారులో ఉన్న అయిదుగురు నిందితులు 12 కిలోమీటర్ల దూరం వరకూ అంజలిని ఈడ్చుకుంటూ వెళ్లారు. తరువాత ఆమె మృతదేహాన్ని రోడ్డుపక్కన పడేసి పరారయ్యారు. పోలీసుల విచారణలో నిధి.. తమను కారు ఏవిధంగా ఢీకొన్నదో తెలిపింది. అయితే ఆ సమయంలో తాను భయాందోళనకు లోనైనందుకు పోలీసులకు వెంటనే ఈ విషయం చెప్పలేకపోయానని నిధి పేర్కొంది. కాగా తెల్లవారుజామున 3.24 గంటలకు ఒక మృతదేహాన్ని ఈడ్చుకుంటూ ఒక కారు కుతుబ్ మినార్ వైపు అతివేగంతో వెళుతున్నదని ఢిల్లీలోని కంఝావాలా పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందింది. ఈ ఘటన దర్యాప్తు దరిమిలా విధులలో నిర్లక్ష్యం వహించారంటూ 11 మంది పోలీసులను సస్పెండ్ చేశారు. వీరిలో ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు, నలుగురు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు, నలుగురు హెడ్ కానిస్టేబుళ్లు, ఒక కానిస్టేబుల్ ఉన్నారు. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు 800 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. పోలీసులు ఏడుగురిని నిందితులుగా కేసులో చేర్చారు. వీరిలో అమిత్ ఖన్నా, అశుతోష్లపై మోటారు వాహన చట్టం కింద కేసు కూడా నమోదైంది. బాధిత కుటుంబానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఇది కూడా చదవండి: 2023లో ప్రధాని మోదీ ఎన్ని దేశాల్లో పర్యటించారు? ఎవరిని కలిశారు? -
పాక్ రాజకీయాల్లో పెను సంచలనాలు!
2023లో పాకిస్తాన్లో చోటుచేసుకున్నరాజకీయాలు సినిమా సీన్లను తలపించాయి. యాక్షన్, సస్పెన్స్, డ్రామా అన్నీ కనిపించాయి. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందు పాక్‌లో చోటుచేసుకున్న రాజకీయ గందరగోళం మున్ముందు కూడా ఇలానే కొనసాగేలా కనిపిస్తోంది. 2023లో ఇమ్రాన్ ఖాన్ అరెస్టు, నవాజ్ షరీఫ్ స్వదేశానికి తిరిగి రావడం సంచలనాలుగా నిలిచాయి. పాక్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) మాజీ ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ ఈ ఏడాది పెను సంచలనం సృష్టించింది. ఈ నేపధ్యంలో ఇమ్రాన్‌ఖాన్ మద్దతుదారులు దేశవ్యాప్తంగా నిరసన చేపట్టారు. విధ్వంస ఘటనలు చోటుచేసుకున్నాయి. మే 9న జరిగిన నిరసనను పాక్ ఆర్మీ.. ఇదొక చీకటి అధ్యాయంగా అభివర్ణించింది. కాగా ఇమ్రాన్ ఖాన్ దేశంలో చట్టాన్ని ఉల్లంఘించారని పాక్ మాజీ ప్రధాని షరీఫ్ ఆరోపించారు. తోషాఖానా కేసులో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను కోర్టు ఆగస్టులో దోషిగా నిర్ధారించి శిక్ష విధించింది. అనంతరం పాక్ ఎన్నికల సంఘం ఇమ్రాన్ ఖాన్‌పై ఐదేళ్లపాటు అనర్హత వేటు వేసింది. ప్రస్తుతం పాక్ జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్థానంలో పీటీఐ కొత్త అధ్యక్షునిగా బారిస్టర్ గోహర్ అలీ ఖాన్ ఎన్నికయ్యారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పార్టీలో ఎన్నికలు జరిగాయి. గౌహర్ ఖాన్‌ను స్వయంగా ఇమ్రాన్ ఖాన్ ఈ పదవికి నామినేట్ చేశారు. మరోవైపు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పాక్‌కు తిరిగి వచ్చిన దరిమిలా రాజకీయాలు మరింత వేడెక్కాయి. నవాజ్ షరీఫ్ బ్రిటన్‌లో నాలుగేళ్ల పాటు ఉండి, అక్టోబర్ 21న దుబాయ్ మీదుగా పాకిస్తాన్‌కు చేరుకున్నారు. మరికొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆయన ఎంట్రీ ఆసక్తికరంగా మారింది. 2024 ఫిబ్రవరిలోపు పాకిస్తాన్లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్ అధికార పగ్గాలు తాత్కాలిక ప్రధాని చేతుల్లోనే ఉన్నాయి. నవాజ్ షరీఫ్ నాలుగేళ్లు దేశానికి దూరంగా ఉన్నా ఆయన పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్-ఎన్ బలహీనపడలేదు. నవాజ్ షరీఫ్ లేనప్పటికీ, కుమార్తె మరియం, నవాజ్ సోదరుడు షాబాజ్ షరీఫ్‌లు ఇమ్రాన్ ఖాన్‌ను అధికారం నుండి దించి పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చారు. అల్-అజీజియా మిల్స్, అవెన్‌ఫీల్డ్ అవినీతి కేసులో పాకిస్తాన్ కోర్టు నవాజ్ షరీఫ్‌ను దోషిగా నిర్ధారించి, ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. అంతకుముందు 2017లో తన జీతం ప్రకటించనందుకు సుప్రీంకోర్టు అతనిపై జీవితకాల అనర్హత వేటు వేసింది. ఈ నేపధ్యంలో షరీఫ్ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అదేసమయంలో ఇమ్రాన్ ఖాన్ దేశ రాజకీయాల్లోకి ప్రవేశించారు. అయితే జైలు శిక్ష అనుభవిస్తున్న నవాజ్ షరీఫ్ వైద్య చికిత్స కోసం 2019లో లండన్ వెళ్లేందుకు అనుమతి కోరారు. దీనిపై లాహోర్ హైకోర్టు నాలుగు వారాల పాటు లండన్ వెళ్లేందుకు అనుమతించింది. అయితే నాలుగు వారాలకు బదులుగా నవాజ్ షరీఫ్ నాలుగు సంవత్సరాల తర్వాత లండన్ నుండి పాకిస్తాన్ తిరిగి వచ్చారు. ఇది కూడా చదవండి: సన్యసించి, కాశీ వెళ్లిన పెరియార్ నాస్తికుడెలా అయ్యారు? -
ఐదుగురు ప్రియురాళ్లు... సరిహద్దులు దాటి, చిక్కుల్లో పడి..
ప్రేమకు హద్దులు, సరిహద్దులు లేవంటారు. ప్రేమను పొందేందుకు కొందరు ఎంతకైనా వెనుకాడరు. ఇదేకోవలో ఐదుగురు మహిళలు ప్రేమ కోసం తమ దేశ సరిహద్దులు దాటి, విదేశాల్లోకి ప్రవేశించి, చిక్కుల్లో పడ్డారు. వీటికి సంబంధించిన ఉందంతాలు 2023లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. సీమా హైదర్ సీమా హైదర్ పేరు దేశంలో చర్చనీయాంశమైంది, పాకిస్తాన్‌కు చెందిన ఈ 27 ఏళ్ల మహిళ ఆన్లైన్ గేమ్ పబ్జీ ఆడుతూ 21 ఏళ్ల భారతీయ కుర్రాడు సచిన్ మీనా ప్రేమలో పడింది. నలుగురు పిల్లల తల్లి అయిన సీమా తన ప్రేమను నెరవేర్చుకునేందుకు పాకిస్తాన్ నుంచి సరిహద్దులు దాటి భారత్‌కు చేరుకుంది. సీమా.. భారత్ వచ్చేందుకు పాకిస్తాన్‌లోని తన ఇంటిని అమ్మేసింది. భారత్ వచ్చిన సీమాపై గూఢచర్యం ఆరోపణలు వచ్చాయి. విచారణ కూడా జరిగింది. ఇప్పటికి పూర్తి వివరాలు వెల్లడికాలేదు. అంజు రాజస్థాన్‌కు చెందిన అంజు తన ప్రేమికుడు నస్రుల్లాను కలవడానికి పాకిస్తాన్‌కు వెళ్లింది. ఆమె అక్కడ తన తన పాకిస్తానీ ప్రేమికుడిని పెళ్లాడిందనే ప్రచారం జరిగింది. అయితే ఇది జరిగిన నాలుగు నెలల తర్వాత అంజు భారత్‌కు తిరిగి వచ్చింది. అంజును మొదట ఐబీ, తర్వాత పంజాబ్ పోలీసులు విచారించారు. ప్రస్తుతం ఆమె గ్వాలియర్‌లోని తన తండ్రి ఇంటిలో ఉంటోంది. అయితే ఆమె భారత్‌లో ఎంతకాలం ఉంటుంది? పాకిస్తాన్‌కు తిరిగి వెళ్తుందా? అనేది ఇంకా వెల్లడికాలేదు. జవేరియా ఖానుమ్ జావేరియా పాకిస్తాన్‌లోని కరాచీ నివాసి. త్వరలో ఆమె కోల్‌కతాకు చెందిన సమీర్‌ఖాన్‌ను పెళ్లి చేసుకోబోతోంది. వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగింది. ఖానుమ్ భారతదేశానికి వచ్చి 45 రోజులు ఉంది. ఆమెకు డప్పులతో ఘన స్వాగతం పలికారు. అట్టారీ సరిహద్దు నుంచి ఆమె భారత్‌లోకి ప్రవేశించింది. బార్బరా పొలాక్ జార్ఖండ్‌లోని తన ప్రియుడిని కలవడానికి పోలాండ్‌కు చెందిన బార్బరా పొలాక్ భారతదేశానికి వచ్చింది. ఆమెకు ఒక కుమార్తె ఉంది. విడాకులు తీసుకున్న ఆమె తన సోషల్ మీడియా స్నేహితుడు షాదాబ్‌ను పెళ్లి చేసుకోనుంది. ఆమె షాబాద్‌ను పెళ్లి చేసుకోవడానికి వీలుగా 2027 వరకు చెల్లుబాటు అయ్యే టూరిస్ట్ వీసాతో ఇండియాకు వచ్చింది. త్వరలో వీరు పెళ్లి చేసుకోబోతున్నారు. కృష్ణా మండల్ కృష్ణా మండల్ అనే బంగ్లాదేశ్ మహిళ తన ప్రియుడు అభిక్ మండల్‌ను కలిసేందుకు బంగ్లాదేశ్ మీదుగా ఈదుకుంటూ భారత్ వచ్చింది. కృష్ణా.. అభిక్ మండల్ వివాహం చేసుకోవాలనుకున్నారు. కానీ ఆమెకు పాస్‌పోర్ట్ లేదు. కోల్‌కతాలోని కాళీఘాట్ ఆలయంలో వారు పెళ్లి చేసుకున్నారు. అయితే కృష్ణాను భారత ఏజెన్సీ అరెస్టు చేసి, బంగ్లాదేశ్ హైకమిషన్‌కు అప్పగించింది. ఇది కూడా చదవండి: 2023లో జేకేలో ఎన్కౌంటర్లు ఎన్ని? ఎందరు మరణించారు? -
2023లో జేకేలో ఎన్కౌంటర్లు ఎన్ని? ఎందరు మరణించారు?
ఆర్టికల్ 370ని తొలగించి నాలుగున్నరేళ్లు దాటినా జమ్ముకశ్మర్లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు జమ్ముకశ్మీర్‌లో 85 మంది ఉగ్రవాదులు, 35 మంది భద్రతా సిబ్బంది, 14 మంది పౌరులు మృతి చెందారు. 2023లో జమ్ముకశ్మీర్‌లో తొమ్మిది ఎన్కౌంటర్లు జరిగాయి. వీటిలో ఆరు జమ్మూ డివిజన్లో, మూడు కశ్మీర్ లోయలో జరిగాయి. ఈ ఘటనల్లో పలువురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. జమ్మూ డివిజన్లో 25 మంది సైనికులు మరణించారు. ప్రధానంగా పూంచ్, రాజౌరి జిల్లాల్లో, కశ్మీర్ లోయలో జరిగిన మూడు ఆపరేషన్లలో తొమ్మదిమంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. గత మార్చి, జూన్, జూలై, అక్టోబర్లలో సైనిక ప్రాణనష్టం జరగలేదు. ఫిబ్రవరిలో ఒక సైనికుడు, ఏప్రిల్, మే, నవంబర్, డిసెంబర్లలో ఒక్కొక్కరు చొప్పున ఐదుగురు, సెప్టెంబర్‌లో నలుగురు, ఆగస్టులో ముగ్గురు సైనికులు అమరులయ్యారు. ఈ ఏడాది జనవరిలో ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోని మాచెల్ సెక్టార్‌లోని ఒక ఫార్వర్డ్ ఏరియాలోని లోయలో జారిపడి ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్, ఇద్దరు సైనికులు మరణించారు. ఫిబ్రవరిలో పుల్వామా జిల్లాలోని పొట్గంపొర అవంతిపొర వద్ద జరిగిన ఎన్కౌంటర్లో హిమాచల్ ప్రదేశ్ సైనికుడు వీరమరణం పొందారు. ఏప్రిల్‌లో పూంచ్ జిల్లాలోని మెంధార్ సబ్ డివిజన్లోని భటాధురియన్ ప్రాంతంలో ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు ఆర్మీ సిబ్బంది అమరులయ్యారు. ఒక సైనికుడు గాయపడ్డాడు. స్థానికేతర మిలిటెంట్లు యూబీజీఎల్ ఉపయోగించి ఆర్మీ వాహనంపై గ్రెనేడ్‌తో దాడి చేసినట్లు సమాచారం. మేలో జమ్మూ ప్రాంతంలోని రాజౌరీ జిల్లాలోని కంది అటవీ ప్రాంతంలో కార్డన్, సెర్చ్ ఆపరేషన్ సమయంలో ఉగ్రవాదులు జరిపిన పేలుడులో ఐదుగురు సైనికులు అమరులయ్యారు. ఆగస్టులో దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని హలాన్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు సైనికులు వీరమరణం పొందారు. సెప్టెంబరులో, రాజౌరిలోని నార్లా గ్రామంలో జరిగిన ఎన్కౌంటర్లో ఒక సైనికునితో పాటు ఒక ఆర్మీ శునకం మరణించింది. దక్షిణ కాశ్మీర్‌లోని గాడోల్ కోకెర్నాగ్ ఎన్కౌంటర్లో కల్నల్, మేజర్‌తో సహా కనీసం ముగ్గరు ఆర్మీ సిబ్బంది మరణించారు. నవంబర్‌లో కలకోట్ రాజౌరిలోని బాజీ మాల్ అటవీ ప్రాంతంలో 30 గంటలపాటు జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు కెప్టెన్లతో సహా ఐదుగురు సైనికులు వీరమరణం పొందారు. డిసెంబరులో పూంచ్‌లోని తన్నమండి సూరంకోట్ రోడ్‌లోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఆర్మీ వాహనాలపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేయడంతో నలుగురు ఆర్మీ సైనికులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఏడాది ఉగ్రవాదుల దాడుల్లో 11 మంది పౌరులు మరణించగా, ఆర్మీ కస్టడీలో ముగ్గురు మరణించారు. 2023లో ఇప్పటి వరకు 85 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఇది కూడా చదవండి: ఐదు వ్యాధులు.. 2023లో జనం గుండెల్లో రైళ్లు! -
ఐదు వ్యాధులు.. 2023లో జనం గుండెల్లో రైళ్లు!
చివరిదశకు వచ్చిన 2023లో మనం చాలా చూశాం. అంతకన్నా ఎక్కువగానే నేర్చుకున్నాం. కాలంతో పాటు మన జీవన విధానం కూడా ఎంతగానో మారిపోయింది. ఈ జీవనశైలి వల్ల చాలా మంది వివిధ వ్యాధుల బారిన పడ్డారు. ఈ సంవత్సరం కాలుష్యం కారణంగా అనేక వ్యాధులు తలెత్తాయి. 2024ని స్వాగతించే ముందు 2023లో మానవాళి ఎదుర్కొన్న తీవ్రమైన వ్యాధుల గురించి తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. తద్వారా రాబోయే సంవత్సరంలో ఈ వ్యాధులతో పోరాడేందుకు మనమంతా సన్నద్దంగా ఉండగలుగుతాం. 2023లో మానవాళి ఎదుర్కొన్న ప్రధాన వ్యాధులేమిటో ఇప్పుడు చూద్దాం.. 1. గుండె జబ్బులు: ప్రస్తుతం గుండె సంబంధిత వ్యాధులు (హృద్రోగాలు) అధికమయ్యాయి. రాబోయే సంవత్సరాల్లో గుండె జబ్బుల ముప్పు పెరగనుందని నిపుణులు చెబుతున్నారు. హృదయాన్ని కాపాడుకునేందుకు మెరుగైన జీవనశైలిని ఎంతో ముఖ్యం. అస్తవ్యస్త జీవనశైలి, మద్యం, ధూమపానం కారణంగా గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. మన దేశంలో అత్యధిక మరణాలు గుండె జబ్బుల కారణంగానే చోటుచేసుకుంటున్నాయి. 2. డెంగ్యూ ఈ సంవత్సరం డెంగ్యూ వ్యాధి ముప్పు అధికంగా వెంటాడింది. వచ్చే ఏడాది కూడా ఈ వ్యాధి విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. డెంగ్యూతో మృత్యువాత పడిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఈ వ్యాధి గురించి ప్రజలను అప్రమత్తం చేయడానికి ప్రభుత్వం పలు కార్యక్రమాలను కూడా చేపట్టింది. ఈ వ్యాధి నివారణకు ఇంట్లోకి దోమలు ప్రవేశించకుండా చూసుకోవాలి. 3. మిస్టీరియస్ న్యుమోనియా ఈ సంవత్సరం మిస్టీరియస్ న్యుమోనియా కేసులు పెరిగాయి. ఈ వ్యాధి చైనా, అమెరికాలో తీవ్రంగా కనిపించింది. ఈ వ్యాధి చైనాలో అధికంగా వ్యాప్తి చెందింది. ఈ వ్యాధి పిల్లలలో అధికంగా కనిపించింది. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న కారణంగానే వారు త్వరగా న్యుమోనియాకు గురవుతున్నారు. భారతదేశంలో ఇలాంటి కేసులు అధికంగా కనిపించనప్పటికీ, ఈ వ్యాధి విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 4. వైరల్, ఇన్ఫెక్షన్ నిపా వైరస్ ముప్పు ఈ సంవత్సరం అధికంగా కనిపించింది. జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే ప్రాణాంతక వైరస్ ఇది. గబ్బిలాలతో పాటు పందులు, మేకలు, కుక్కలు, పిల్లుల ద్వారా కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఈ వ్యాధి ముప్పు మన దేశంలో అధికంగా ఉంది. ఇది కరోనా కంటే చాలా ప్రమాదకరమైనదని నిపుణులు చెబుతుంటారు. 5. కిడ్నీ సంబంధిత వ్యాధులు ఈ సంవత్సరం కిడ్నీ సంబంధిత వ్యాధుల ముప్పు కూడా మనదేశంలో అధికంగా కనిపించింది. అస్తవ్యస్త జీవనశైలి, తగినంత నీరు తాగకపోవడం, ధూమపానం మొదలైనవి కిడ్నీ సమస్యలకు కారణమని వైద్యులు చెబుతుంటారు. ఇది కూడా చదవండి: పదుగురు స్వామీజీలు.. 2023లో అందరినీ ఆకర్షించి.. -
పదుగురు స్వామీజీలు.. 2023లో అందరినీ ఆకర్షించి..
2023వ సంవత్సరం ముగింపు దశకు వచ్చేసింది. ప్రతీ ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పలువురు స్వామీజీలు అటు రాజకీయాలను, ఇటు ప్రజలను అమితంగా ప్రభావితం చేశారు. వీరు వార్తల్లో తరచూ కనిపించారు. ఇలాంటి 10 మంది స్వామీజీల గురించి ఇప్పుడు తెలసుకుందాం. 1. సంత్ ప్రేమానంద్ సంత్ ప్రేమానంద్ మహారాజ్ ఏడాది పొడవునా అగ్రస్థానంలో వార్తల్లో నిలిచారు. బృందావనంలో నివసిస్తున్న సంత్ ప్రేమానంద్ సత్సంగాన్ని వినడానికి జనం ఎక్కడెక్కడి నుంచో తరలివస్తుంటారు. విరాట్ కోహ్లి, అనుష్క శర్మ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తదితరులు సంత్ ప్రేమానంద్ మహరాజ్‌ను దర్శించుకున్నారు. ప్రేమానంద్ చిన్ననాటి పేరు అనిరుధ్ కుమార్ పాండే. ఆయన 13 సంవత్సరాల వయసులోనే సన్యాసం స్వీకరించారు. 2. పండిట్ ధీరేంద్ర శాస్త్రి బాగేశ్వర్ ధామ్‌కు చెందిన పండిట్ ధీరేంద్ర గార్గ్ ప్రవచనకర్తగా రెండవ స్థానంలో నిలిచారు. తన ముందున్నవారి ఆలోచనలు గ్రహించి, వారి సమస్యలను పరిష్కరించగలరనే పేరు సంపాదించారు. ధీరేంద్ర గార్గ్ దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ప్రసిద్ది చెందారు. తొమ్మిదేళ్ల వయసులోనే ఆయన హనుమంతుని పూజించడం ప్రారంభించారు. 3. జయ కిషోరి కథకురాలు జయ కిషోరి జీ 2023లో ఎంతో పాపులారిటీ సంపాదించారు. ఆమె పూర్తి పేరు జయ శర్మ. ఆమె 1995లో రాజస్థాన్‌లోని సుజన్‌గఢ్‌లో జన్మించారు. ఈ 27 ఏళ్ల కథకురాలు యూట్యూబ్‌లో ఎంతో ఫేమస్ అయ్యారు. జయ కిషోరి చిన్న వయస్సులోనే భగవద్గీతను పారాయణం చేస్తూ, ప్రజలను ఆకట్టుకున్నారు. జయ కిషోరి భజన గాయకురాలిగానూ పేరొందారు. 4. సద్గురు జగ్గీ వాసుదేవ్ కర్ణాటకలో జన్మించిన సద్గురు జగ్గీ వాసుదేవ్ మోటివేషనల్ స్పీకర్, యోగా టీచర్. జగ్గీవాసుదేవ్ స్థాపించిన ఇషా ఫౌండేషన్ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. జగ్గీవాసుదేవ్‌ను సద్గురు అని కూడా పిలుస్తారు. జగ్గీవాసుదేవ్ యూట్యూబ్ చానళ్లు ఇంగ్లీషుతో సహా అనేక భాషల్లో అందుబాటులో ఉన్నాయి. 5. శ్రీశ్రీ రవిశంకర్ తమిళనాడులో జన్మించిన ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ తన ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ హ్యూమన్ వాల్యూస్ ద్వారా కోట్లాదిమందిని ప్రభావితం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా శాంతి చర్చల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. 6. గౌర్ గోపాల్ దాస్ మహారాష్ట్రలో జన్మించిన మోటివేషనల్ స్పీకర్, కృష్ణ భక్తుడైన సన్యాసి గౌర్ గోపాల్ దాస్ 2023లో తన అభిప్రాయాలు, వ్యాఖ్యానాలతో వార్తల్లో నిలిచారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా హోల్డర్ అయిన సంత్ గోపాల్‌దాస్ ఇస్కాన్‌లో సభ్యునిగా ఉన్నారు. 7. పండిట్ ప్రదీప్ మిశ్రా భోపాల్‌కు చెందిన పండిట్ ప్రదీప్ మిశ్రా.. శివ మహాపురాణం చెప్పడంలో ప్రసిద్ధి చెందారు. ఈ ఏడాది పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, వార్తల్లో నిలిచారు. ఆయన ప్రవచనాలు వినేందుకు లక్షలాది మంది తరలివస్తుంటారు. 8. అనిరుద్ధాచార్య జీ మహారాజ్ ఈయన బృందావన నివాసి. మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాలో జన్మించారు. తన ఉపన్యాసాలలో గోసేవ, జీవిత విలువల గురించి చెబుతుంటారు. సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తుంటారు. అనిరుద్ధాచార్య జీ మహారాజ్‌కు లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. 9. వైష్ణవ్ రామ భద్రాచార్య వైష్ణవ శాఖకు చెందిన రామానందాచార్య స్వామి శ్రీరామ భద్రాచార్య మహారాజ్ ఐదేళ్ల వయసులో కంటిచూపు కోల్పోయారు. అయితే పీహెచ్డీ పొందడమే కాకుండా విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం ద్వారా దివ్యాంగులకు అనేక విద్యావకాశాలు కల్పించారు. 2015లో భారత ప్రభుత్వం అతనిని పద్మభూషణ్‌తో సత్కరించింది. 10. దేవకీ నందన్ ఠాకూర్ దేవకీ నందన్ ఠాకూర్ జీ ప్రముఖ కథకునిగా పేరొందారు. 2022, 2023లలో సనాతన ధర్మానికి మద్దతు ఇవ్వడం ద్వారా వార్తల్లో నిలిచారు. దేవకీ నందన్ ఠాకూర్ మధురలోని ఓహవా గ్రామంలో జన్మించారు. తన ఆరేళ్ల వయస్సులో బృందావనం చేరుకుని, పరమ భక్తునిగా మారిపోయారు. ఇది కూడా చదవండి: యూజర్స్ అత్యధికంగా డిలీట్ చేసిన యాప్ ఏది? -
2.24 లక్షల మందిని ఇంటికి పంపిన కంపెనీలు
కోవిడ్ పరిణామాల్లో దాదాపు అన్ని రంగాల సంస్థలు, తమ కార్యకలాపాలను డిజిటలైజేషన్ చేశాయి. ఈకామర్స్ కొనుగోళ్లు అధికంగా జరిగాయి. లాక్డౌన్ల కారణంగా, ఇళ్ల వద్ద ఖాళీగా ఉన్న వారు సామాజిక మాధ్యమాలను, యూట్యూబ్‌లో వీడియోలను ఎక్కువగా తిలకించారు. ఆన్లైన్లోనే పాఠ్యాంశాలు బోధించే ఎడ్యుటెక్ సంస్థలకూ అమిత డిమాండ్ ఏర్పడింది. దీంతో సాంకేతిక నిపుణులకు ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. ఇందువల్లే అంతర్జాతీయ సంస్థలైన మెటా, గూగుల్, అమెజాన్, యాక్సెంచర్, కాగ్నిజెంట్ లాంటి వాటితో పాటు దేశీయంగా టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థలతో పాటు చాలా స్టార్టప్ కంపెనీలు తమకు వచ్చిన ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు అధిక సంఖ్యలో ఉద్యోగులను నియమించుకున్నాయి. 2023 ఏ రంగాలకు ఎలా ఉన్నా.. టెక్ కంపెనీలకు, స్టార్టప్‌లకు కొంత నష్టమే వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఈ ఏడాదంతా కూడా చాలా కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. దేశంలో ఎన్ని స్టార్టప్ కంపెనీలు ఎంతమంది ఉద్యోగులను తొలగించాయి..ఎందుకు తొలగించాయనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ‘లేఆఫ్స్.ఫై’ డేటా ప్రకారం.. 2023లో సుమారు 100 ఇండియన్ స్టార్టప్ కంపెనీలు 15000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిసింది. ఈ ఏడాది 100 మందికి పైగా ఉద్యోగులకు పింక్ స్లిప్‌లను అందజేసిన స్టార్టప్‌లలో ఓలా (200), కెప్టెన్ ఫ్రెష్ (120), షేర్‌చాట్ (500), స్విగ్గీ (380), మెడిబడ్డీ (200), డీల్‌షేర్ (100), మైగేట్ (200), బహుభుజి (100), సాప్ ల్యాబ్స్ (300), అప్‌గ్రేడ్ (120), ప్రిస్టిన్ కేర్ (300), 1k కిరానా (600), డంజో (500), జెస్ట్ మనీ (100), సింప్ల్ (150), స్కిల్ లింక్ (400), ఎక్స్ట్రామార్క్ (300), వాహ్ వాహ్! (150), మీషో (251), క్యూమత్ (100), హప్పే (160), గ్లామియో హెల్త్ (160), మోజోకేర్ (170), వేకూల్ (300), నవీ టెక్నాలజీస్ (200), మిల్క్‌బాస్కెట్ (400), టెకియోన్ (300), స్పిన్నీ (300), ఎంపీఎల్ (350) మొదలైనవి ఉన్నాయి. ఇదీ చదవండి: మీ ఫోన్ హ్యాక్ అయిందా..? తెలుసుకోండిలా.. ప్రపంచవ్యాప్తంగా 1160 కంటే ఎక్కువ టెక్ కంపెనీలు ఈ ఏడాది ఏకంగా 2,24,508 మందిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు సమాచారం. 2022లో 1064 కంపెనీలు 1,64,969 మంది సిబ్బందిని తొలగించాయి. ఆర్థిక పరిస్థితుల కారణంగా, మార్కెటింగ్ ఖర్చులను తగ్గించుకోవడం, వ్యయ నిర్మాణాలను సరిచేయడం, కాస్ట్‌కటింగ్ వంటి వాటిలో భాగంగా ఉద్యోగులను తొలగించాల్సి వచ్చినట్లు కంపెనీలు స్పష్టం చేశాయి. -
యూజర్స్ అత్యధికంగా డిలీట్ చేసిన యాప్ ఏది?
2023వ సంవత్సరం కొద్దిరోజుల్లో ముగియబోతోంది. ఈ నేపధ్యంలో ఈ ఏడాదికి సంబంధించిన అనేక అంశాల గణాంకాలు వెలువడుతున్నాయి. ఈకోవలో 2023లో అత్యధికంగా డిలీట్ చేసిన సోషల్ మీడియా యాప్‌ల జాబితా కూడా బయటకు వచ్చింది. సోషల్ మీడియా వినియోగదారుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఒక నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా వినియోగదారుల సంఖ్య 4.8 బిలియన్లను (ఒక బిలియన్ అంటే వంద కోట్లు) దాటింది. ప్రపంచంలోని చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ప్రతిరోజూ 2 గంటల 24 నిమిషాల సమయం సోషల్ మీడియాలో గడుపుతున్నారు. 2023లో యూజర్స్ అత్యధికంగా డిలీట్ చేసిన యాప్‌ల విషయానికొస్తే.. అమెరికన్ టెక్ సంస్థ టీఆర్జీ డేటాసెంటర్ నివేదిక ప్రకారం... అందుబాటులోకి వచ్చిన 24 గంటల్లోనే 100 మిలియన్ల (ఒక మిలియన్ అంటే 10 లక్షలు) వినియోగదారులను సంపాదించిన మెటాకు చెందిన త్రెడ్ యాప్.. ఆ తర్వాతి ఐదు రోజుల్లో 80 శాతం మంది వినియోగదారులను కోల్పోయింది. ఆ నివేదిక ప్రకారం 2023లో చాలా యాప్‌లు భారీ నష్టాన్ని చవిచూశాయి. ప్రపంచంలోని దాదాపు 10 లక్షల మంది యూజర్స్ ఇంటర్నెట్లో ఇన్స్టాగ్రామ్ ఖాతాను తొలగించే మార్గాల కోసం వెతికారు. ఇన్స్టాగ్రామ్ యాప్‌ను 10,20,000 మందికి పైగా వినియోగదారులు డిలీట్ చేశారు. అత్యధికంగా డిలీట్ చేసిన యాప్‌ల జాబితాలో రెండవ స్థానంలో స్నాప్‌చాట్ ఉంది. దీనిని 1,28,500 మంది డిలీట్ చేశారు. దీని తర్వాత ‘ఎక్స్’ (ట్విట్టర్), టెలీగ్రామ్, ఫేస్బుక్, టిక్‌టాక్,యూట్యూబ్, వాట్సాప్, విచాట్ మొదలైనవి ఉన్నాయి. ఈ ఏడాది 49 వేల మంది ఫేస్బుక్ యాప్‌ను తొలగించారు. వాట్సాప్‌ను తొలగించిన వినియోగదారుల సంఖ్య 4,950గా ఉంది. ఇది కూడా చదవండి: చుక్కలు చూపించిన పప్పులు, కూరగాయలు! -
పెల్లుబికిన భక్తి ప్రవాహం.. చార్ధామ్ యాత్రలో భక్తుల రద్దీ!
హిందువులు చార్ధామ్ యాత్రను ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తారు. తమ జీవితంలో ఒక్కసారైనా చార్ధామ్ యాత్ర చేయాలనుకుంటారు. ప్రతి సంవత్సరం చార్ధామ్ యాత్రకు భక్తులు తరలివస్తుంటారు. చార్ధామ్ యాత్ర అంటే కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రిలను చుట్టిరావడం. ఈ చార్ధామ్ యాత్రతో పాటు ఇతర ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు కూడా 2023లో భక్తుల తాకిడి ఎదురయ్యింది. 2023లో ఏ ధామాన్ని సందర్శించడానికి ఎంత మంది భక్తులు వచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం. మీడియా దగ్గరున్న సమాచారం ప్రకారం ఈ సంవత్సరం 50 లక్షల మందికి పైగా భక్తులు చార్ధామ్ యాత్రచేశారు. 2021లో సుమారు 5 లక్షల 18 వేల మంది భక్తులు చార్ ధామ్ యాత్ర చేశారు. 2022లో ఈ సంఖ్య 46 లక్షల 27 వేలు దాటింది. 2023లో అక్టోబర్ 16 నాటికి ఈ సంఖ్య 50 లక్షలు దాటడం విశేషం. కేదార్నాథ్ ధామ్ ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ ధామ్ 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా పరిగణిస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడికి చేరుకోవడానికి హెలికాప్టర్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. 2023 లో 19 లక్షల 61 వేల మందికి పైగా భక్తులు కేదార్నాథ్ ధామ్‌కు తీర్థయాత్ర చేశారు. 2023లో కేదార్నాథ్ తలుపులు ఏప్రిల్ 25న తెరుచుకున్నాయి. ఈ యాత్ర నవంబర్ 15న ముగిసింది. బద్రీనాథ్ ధామ్ విష్ణు భక్తులు బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించడాన్ని ఒక వరంగా భావిస్తారు. ఈ సంవత్సరం బద్రీనాథ్ యాత్ర ఏప్రిల్ 27న ప్రారంభమై, నవంబర్ 15న ముగిసింది. ఈ ఏడాది బద్రీనాథ్‌కు వచ్చిన 18 లక్షల 34 వేల మందికి పైగా భక్తులు బద్రీ విశాల్ స్వామిని దర్శించుకున్నారు. గంగోత్రి ఈ ఏడాది 9 లక్షల 5 వేల మందికి పైగా భక్తులు గంగోత్రి యాత్రను పూర్తి చేసుకున్నారు. 2023లో గంగోత్రి యాత్ర ఏప్రిల్ 22 నుండి ప్రారంభమై, నవంబర్ 14న ముగిసింది. ప్రతి సంవత్సరం గంగోత్రి యాత్ర ప్రారంభం కాగానే గంగమ్మ దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు ఇక్కడికు తరలి వస్తుంటారు. యమునోత్రి ఈ ఏడాది యమునోత్రిని 7 లక్షల 35 వేల మందికి పైగా భక్తులు సందర్శించారు. యమునోత్రి యాత్ర 2023, ఏప్రిల్ 22న న ప్రారంభమై నవంబర్ 15న ముగిసింది. యమునోత్రిని యమునా దేవి నివాసంగా చెబుతారు. ఇక్కడ యమునా దేవి ఆలయం కూడా ఉంది. అమర్నాథ్ చార్ధామ్తో పాటు ఇతర యాత్రా స్థలాల విషయానికి వస్తే 2023లో దాదాపు 4 లక్షల 40 వేల మంది భక్తులు అమర్నాథ్ను దర్శించుకున్నారు. ఈ సంవత్సరం అమర్నాథ్ యాత్ర జూలై ఒకటి నుండి ప్రారంభమై ఆగస్టు 31న ముగిసింది. అమర్నాథ్ ప్రయాణం ఎంతో కష్టతరమైనప్పటికీ భక్తులు ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో ఇక్కడికి తరలివస్తుంటారు హేమకుండ్ సాహిబ్ యాత్ర హేమకుండ్ సాహిబ్ సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ సంవత్సరం హేమకుండ్ సాహిబ్ యాత్ర మే 20 నుంచి నుండి అక్టోబర్ 11 వరకు కొనసాగింది. ప్రతి సంవత్సరం హేమకుండ్ సాహిబ్ యాత్రకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. 2023లో దాదాపు 2 లక్షల మంది హేమకుండ్ సాహిబ్‌ను సందర్శించుకున్నారు. ఇది కూడా చదవండి: అలరిస్తున్న ఉల్లి, ఇసుకల శాంతాక్లాజ్ శిల్పం!