అది 2023, జనవరి ఒకటి.. దేశమంతా నూతన సంవత్సర వేడుకల్లో మునిగితేలుతోంది. ఇంతలో దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటన యావత్ దేశప్రజలను కలచివేసింది. మర్నాటి ఉదయం వెలుగు చూసిన ఒక వీడియో సంచలనంగా మారింది. అదే.. ఢిల్లీలో నూతన సంవత్సరం వేళ కంఝావాలాలో చోటుచేసుకున్న హిట్ అండ్ రన్ ఘటన.
ఒక హోటల్ జరిగిన న్యూ ఇయర్ పార్టీకి హాజరైన అంజలి(20) స్కూటీపై ఇంటికి తిరిగి వెళుతోంది. ఇంతలో అటుగా కారులో వచ్చిన యువకులు ఆమె వాహనాన్ని ఢీకొని, కారుని వేగంగా పోనిచ్చారు. అయితే ఆమె కారు కింద ఇరుక్కుపోయింది. కారు ఆమెను ఈడ్చుకుంటూ 12 కిలోమీటర్లు దూరం వరకూ వెళ్లింది. ఆమె తనను కాపాడాలని అరుస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఫలితంగా ఆమె మృతి చెందింది. ఈ ఘటన దేశ ప్రజల్లో ఆగ్రహాన్ని నింపింది.
ఢిల్లీ పోలీసులు ఈ కేసులో అంజలి స్నేహితురాలు నిధిని కూడా విచారించారు. ఆ సమయంలో అంజలి మద్యం మత్తులో ఉందని నిధి పోలీసులకు తెలిపింది. కాగా వారి స్కూటీ కంఝావాలాలోని సుల్తాన్‌పురి ఏరియాకు చేరుకున్నంతలో మితిమీరిన వేగంతో వచ్చిన ఒక కారు వీరి స్కూటీని ఢీకొంది. దాంతో నిధి ఎగిరి పక్కన పడిపోగా, అంజలి కారు కింద ఇరుక్కుపోయింది. అయితే కారును ఆపకుండా.. కారులో ఉన్న అయిదుగురు నిందితులు 12 కిలోమీటర్ల దూరం వరకూ అంజలిని ఈడ్చుకుంటూ వెళ్లారు. తరువాత ఆమె మృతదేహాన్ని రోడ్డుపక్కన పడేసి పరారయ్యారు.
పోలీసుల విచారణలో నిధి.. తమను కారు ఏవిధంగా ఢీకొన్నదో తెలిపింది. అయితే ఆ సమయంలో తాను భయాందోళనకు లోనైనందుకు పోలీసులకు వెంటనే ఈ విషయం చెప్పలేకపోయానని నిధి పేర్కొంది. కాగా తెల్లవారుజామున 3.24 గంటలకు ఒక మృతదేహాన్ని ఈడ్చుకుంటూ ఒక కారు కుతుబ్ మినార్ వైపు అతివేగంతో వెళుతున్నదని ఢిల్లీలోని కంఝావాలా పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందింది.
ఈ ఘటన దర్యాప్తు దరిమిలా విధులలో నిర్లక్ష్యం వహించారంటూ 11 మంది పోలీసులను సస్పెండ్ చేశారు. వీరిలో ఇద్దరు సబ్ ఇన్‌స్పెక్టర్లు, నలుగురు అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్లు, నలుగురు హెడ్ కానిస్టేబుళ్లు, ఒక కానిస్టేబుల్ ఉన్నారు. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు 800 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. పోలీసులు ఏడుగురిని నిందితులుగా కేసులో చేర్చారు. వీరిలో అమిత్ ఖన్నా, అశుతోష్‌లపై మోటారు వాహన చట్టం కింద కేసు కూడా నమోదైంది. బాధిత కుటుంబానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించారు.
ఇది కూడా చదవండి: 2023లో ప్రధాని మోదీ ఎన్ని దేశాల్లో పర్యటించారు? ఎవరిని కలిశారు?
Comments
Please login to add a commentAdd a comment