
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అంజలి(20) అనే యువతిని కారుతో ఢీకొట్టి లాక్కెళ్లిన ఘటనలో ఆమెతోపాటు తన స్నేహితురాలు కూడా ఉన్నట్లు తేలింది. ఇప్పటి వరకు కారు ఢీకొట్టిన సమయంలో అంజలి ఒకరే ఉన్నారని అనుకున్నారు కానీ హోటల్ ముందు ఉన్న సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా పార్కింగ్ నుంచి స్కూటీ తీస్తుండగా పక్కన మరో యువతి కూడా కనిపించింది. ఆమే అంజలి స్నేహితురాలు నిధి.
ఇద్దరు స్నేహితులు శనివారం సాయంత్రం సుల్తాన్‌పురిలో న్యూ ఇయర్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఆదివారం తెల్లవారుజామున 1.45 గంటలకు హోటల్ నుంచి అంజలి స్కూటర్‌పై బయలుదేరారు. ముందుగా స్కూటీ డ్రైవ్ చేసే విషయంలో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. టూవీలర్‌ను మొదట నిదీనే డ్రైవ్ చేయగా కొంత సమయం తర్వాత అంజలి డ్రైవింగ్ తీసుకుంది. నిధి వెనకాల కూర్చుంది.
తెల్లవారుజామున 3 గంటల సమయంలో మద్యం మత్తులో అయిదుగురు వ్యక్తులతో వెళ్తున్న కారు స్కూటీని ఢీకొట్టింది. దీంతో అంజలి కారు ముందు పడిపోగా.. నిధి మరోవైపు పడింది. అదృశవశాత్తు ఆమెకు గాయాలేవి అవలేదు. కానీ అంజలి కారు ముందు చక్రాల్లో ఇరుక్కుపోయింది. దీంతో ఆమెను కారుతోపాటే వీధుల గుండా 13 కిమీ ఈడ్చుకెళ్లారు.
#WATCH | Kanjhawala death case: CCTV footage of that night shows the presence of another girl with the girl who died after being dragged for a few kilometres by a car that hit her in Sultanpuri area.
— ANI (@ANI) January 3, 2023
(CCTV visuals confirmed by police) pic.twitter.com/nd1NUBQVze
డ్డ్రైవర్ తప్పిదం వల్లే
నిధిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణకు ఆమె సహకరిస్తోందని తెలిపారు. మంగళవారం నిధిని పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. ప్రమాదం జరిగిన తర్వాత భయంతో అక్కడి నుంచి పారిపోయినట్లు తెలిపింది. భయంతో ప్రమాదం గురించి ఎవరికీ చెప్పలేదని ఆమె పేర్కొన్నారు. కారు డ్రైవర్ తప్పిదం వల్లే ఈ ఘటన జరిగినట్లు నిధి కోర్టులో వాంగ్మూలం ఇచ్చింది. స్కూటర్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని నిందితులు పేర్కొన్నారు. మరోవైపు ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన అని నిందితుల నుంచి స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు సైతం ప్రకటించారు.
అత్యాచారం జరగలేదు
మరోవైపు అంజలిపై హత్యాచారం జరిగినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేసును పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఢిల్లీ ఆందోళనలు చేపట్టారు. అయితే అంజలిపై అత్యాచారం జరగలేదని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఇక కారు డ్రైవ్ చేసిన వ్యక్తితోపాటు మొత్తం అయిదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రమాద సమయంలో మద్యం సేవించి ఉన్నట్లు నిందితులు అంగీకరించారు. వారిపై నేరపూరిత హత్య అభియోగం, ర్యాష్ డ్రైవింగ్ వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
కాగా ఈవెంట్ పనులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న అంజలి సింగ్‌ను ఢిల్లీలోని సుల్తాన్‌పురిలో జనవరి 1వ తేదీ తెల్లవారు జామున కొంతమంది యువకులు కారుతో ఢీకొట్టి కొన్ని కిలోమీటర్ల మేర ఆమెను ఈడ్చుకెళ్లిన విషయం తెలిసిందే. స్కూటర్‌ను ఢీకొట్టడంతో భయంతో అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించారు. అయితే మహిళ శీరరం కారు చక్రాలకు చిక్కుకుందన్న విషయం వారికి తెలియలేదు. సుల్తాన్‌పూరి నుంచి కంజావాలా వరకు 13 కిలోమీటర్ల మేరకు ఆమెను అలాగే ఈడ్చుకెళ్లారు. చివరికి కంజావాలా వద్ద యూ టర్న్ తీసుకునే సమయంలో మహిళ కారుతోపాటు రావడాన్ని గమనించిన కారులోని ఓ వ్యక్తి గమనించాడు. వెంటనే కారు ఆపడంతో ఆమె శరీరం పడిపోయింది. దీంతో మళ్లీ అక్కడి నుంచి నిందితులు పరారయ్యారు.
అయితే కారుతోపాటు రోడ్డుపై మహిళ శరీరం ఈడ్చుకెళ్లడం చూసిన ప్రత్యక్ష సాక్షులు పోలీసులుకు సమాచారం అందించడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. నెంబర్ ప్లేట్ ఆధారంగా కారును ట్రేస్ చేసిన పోలీసులు అదుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు దీపక్ ఖన్నా(26), అమిత్ ఖన్నా(25), క్రిష్ణణ్(27), మిథున్(26), మనోజ్ మిత్తల్‌గా గుర్తించారు. వీరకి కోర్టు మూడు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. దీపక్ ఖన్నా అనే వ్యక్తి కారు డ్రైవ్ చేస్తుండగా.. స్కూటీనిని ఢీ కొట్టిన సమయంలో దేని మీద నుంచో కారు ఎక్కించినట్లు అనిపించిందని దీపక్ పోలీసుల ఎదుట అంగీకరించాడు, అయితే మిగతావాళ్లు మాత్రం తామకు అలాంటిది ఏం అనిపించలేదని తెలిపారు. స్కూటీని ఢీకొట్టిన తర్వాత అక్కడి నుంచి భయంతో పారిపోయినట్లు తెలిపారు.