Delhi Sultanpuri Horror: How Woman Dragged By Car What Have Done - Sakshi
Sakshi News home page

Delhi Horror: కుటుంబానికి అంజలి ఒక్కతే ఆధారం.. రాత్రి ఫోన్‌ చేసి వస్తున్నానని చెప్పి..

Jan 2 2023 7:58 PM | Updated on Jan 3 2023 9:12 AM

Delhi Horror Incident: How Woman Dragged By Car what Have Done - Sakshi

న్యూఢిల్లీ: నూతన సంవత్సరం వేళ దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకున్న విషయం తెలిసిందే.  23 ఏళ్ల యువతిని కారుతో ఢీకొట్టి కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లిన దారుణ ఘటన యావత్తు దేశాన్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. కారు చక్రాల మధ్యలో చిక్కుకొని కిలోమీటర్ల మేర మహిళను ఈడ్చుకెళ్లడంతో ఆమె శరీరం పూర్తిగా ఛిద్రమైంది. తీవ్ర గాయాలపాలైన సదరు మహిళ మధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది.

ఢిల్లీ ఘటనలో మృతిచెందిన బాధితురాలిని అమర్‌ విహార్‌కు చెందిన అంజలిగా పోలీసులు గుర్తించారు. పెళ్లిళ్లు వంటి శుభకార్యాలను నిర్వహించే ఈవెంట్‌ కంపెనీలో పనిచేస్తోంది. ఎప్పటిలాగే కార్యక్రమ పనులు ముగించుకొని డిసెంబర్‌ 31న రాత్రి ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. అంజలి తన తల్లి, నలుగురు చెల్లెళ్లు, ఇద్దరు తమ్ముళ్లతో కలిసి జీవిస్తోంది. పిల్లల్లో అంజలి పెద్దది. ఎనిమిదేళ్ల క్రితమే తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతలను అంజలి తన భూజాన వేసుకుంది. కుటుంబ పోషణ మొత్తం ఆమె ఒక్కతే చూసుకుంటోంది. తను పనిచేసి సంపాదిస్తే కానీ కుటుంబం గడవదు.

కుటుంబానికి పెద్ద దిక్కైన అంజలి మరణంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. డిసెంబర్‌ 31న సాయంత్రం ఆరుగంటలకు న్యూ ఇయర్‌ ఈవెంట్‌ కోసం అంజలి బయటకు వెళ్లిందని కుటుంబ సభ్యులు తెలిపారు. రాత్రి 9 గంటలకు కాల్‌ చేసి ఇంటికి వస్తున్నట్లు చెప్పినట్లు వెల్లడించారు. రాత్రి 10 గంటలకు మళ్లీ కాల్‌ చేయగా స్విచ్చాఫ్‌ వచ్చిందని, ఉదయం 8 గంటల సమయంలో కూతురు ప్రమాదానికి గురైనట్లు ఢిల్లీ పోలీసులు చెప్పినట్లు విలపించారు.

అంజలి మృతదేహం నగ్నంగా కనిపించిన తీరు 2012 నిర్భయ అత్యాచార ఘటనను తలపించిందని వాపోయారు. నిందితులను పోలీసులు రక్షిస్తున్నారని ఆమె కుటుంబం ఆరోపించింది. ఇది యాక్సిడెంటల్‌గా జరగలేదని ఉద్దేశ పూర్వకంగానే చేశారంటూ ఆమె తల్లి, మేనమామ ఆరోపిస్తున్నారు.

ఏం జరిగిందంటే
ఆదివారం తెల్లవారు జామున స్కూటీపై వెళ్తున్న యువతిని కారుతో ఢీకొట్టిన కొంతమంది యువకులు అక్కడితో ఆగకుండా కొన్ని కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లారు. రోహిణిలోని కంజావాల్‌ నుంచి కుతూబ్‌గఢ్‌ వైపు వెళ్తున్న కారు మహిళను ఊడ్చుకెళ్తున్నట్లు ఆదివారం తెల్లవారు జామున 3.24 నిమిషాలకు పోలీసులకు ఫోన్‌ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు సమీపంలోని అన్ని చెక్‌పోస్టులను అలెర్ట్‌ చేశారు. ఫోన్‌ చేసిన వ్యక్తి కారు నెంబర్‌ కూడా చెప్పడంతో వాహనాన్ని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.

ఇంతలోనే రోడ్డుపై నగ్న స్థితిలో ఉన్న మహిళ మృతదేహం పడి ఉన్నట్లు ఉదయం 4 గంటలకు కంజావాలా పోలీసులకు మరో కాల్‌ వచ్చింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళను మంగోల్‌పురిలోని ఆసుపత్రికి తరలించారు. మహిళ శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నట్లు గుర్తించారు. చాలా దూరం కారుతో ఊడ్చుకెళ్లడంతో మహిళ వెనకవైపు శరీరమంతా తీవ్రంగా గాయపడినట్లు, కాలిన గాయాలు ఉన్నట్లు తెలిపారు. తలకు గాయమవ్వడంతోపాటు చేతులు మరియు కాళ్లు విస్తృతంగా కొట్టుకుపోయాయని పేర్కొన్నారు.

మరోవైపు మహిళను ఢీకొట్టిన అనంతరం కారులోని వ్యక్తులు వాహనాన్ని ఆపకుండా అక్కడి నుంచి పరారయ్యారు. మహిళను అలాగే  సుల్తాన్‌పూరి నుంచి కంజావాలా వరకు 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లారు. కారుతో మహిళను ఈడ్చుకెళ్లిన ఘటనపై రాజకీయ దుమారం కూడా రాజుకుంది. న్యూ ఇయర్‌ వేళ పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలు చేపట్టక పోవడంపై, నిందితులు ఏ ఒక్క చెక్‌పోస్టు వద్ద పట్టుబడకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళ మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఆందోళనలు చేపట్టారు.

వైరల్‌ వీడియో
మహిళను కారు ఈడ్చుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కంజావాలా ప్రాంతంలో కారు యూటర్న్ తీసుకుంటున్న సమయంలో కారు కింద మహిళ చిక్కుకుని ఉండడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. తెల్లవారుజామున 3.34 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.

నిందితులు ఎలా చిక్కారంటే..
నెంబర్‌ ప్లేట్‌ ఆధారంగా కారును ట్రేస్ చేసిన పోలీసులు అదుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు దీపక్‌ ఖన్నా(26), అమిత్‌ ఖన్నా(25), క్రిష్ణణ్‌(27), మిథున్‌(26), మనోజ్‌ మిత్తల్‌గా గుర్తించారు. అరెస్టయిన వారిలో క్రెడిట్‌ కార్డు కలెక్షన్‌ ఏజెంట్, డ్రైవర్, రేషన్‌ షాపు యజమాని ఉన్నారు. ఘటన సమయంలో దీపక్‌ కారు డ్రైవ్‌ చేస్తున్నట్లు తేలింది.

సుల్తాన్‌పురి ప్రాంతంలో తమ కారు స్కూటీని ఢికొట్టిన్నట్లు నిందితులు అంగీకరించారు. కానీ మహిళ కారు చక్రాలకు చిక్కుకుందన్న విషయం తమకు తెలీదని తెలిపారు. నిందితులంతా మద్యం మత్తులోకారు డ్రైవ్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరిని సోమవారం కోర్టులో హజరుపరచగా.. మూడు రోజుల కస్టడీకి అప్పగించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement