Delhi Accident Anjali Screaming Driver Knew Friend Recounts Horror - Sakshi
Sakshi News home page

ఢిల్లీ దారుణం: వెలుగులోకి మరిన్ని నివ్వెరపరిచే నిజాలు

Published Wed, Jan 4 2023 7:01 AM | Last Updated on Wed, Jan 4 2023 8:33 AM

Delhi Accident Anjali Screaming Driver Knew Friend Recounts Horror - Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో యువతిని స్కూటీతో పాటు కారు కింద కిలోమీటర్ల మేరకు ఈడ్చి పొట్టన పెట్టుకున్న దారుణ ఘటనకు సంబంధించి మరిన్ని నివ్వెరపరిచే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కారు ఢీకొనడంతో చక్రాల కింద ఇరుక్కుని, కాపాడండంటూ ఆర్తనాదాలు చేస్తున్నా కనికరం లేకుండా నిర్దాక్షిణ్యంగా ఈడ్చుకెళ్లారని నిధి అనే ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. మృతురాలు అంజలీ సింగ్‌కు ఆమె స్నేహితురాలే. ఘటన జరిగినప్పుడు అదే స్కూటీపై అంజలీ వెనక కూచొని ఉంది. స్వల్పగాయాలతో ప్రమాదం నుంచి బయటపడింది. షాక్‌తో ఘటన వివరాలను ఆమె ఇంతవరకూ బయట పెట్టలేదు. స్కూటీపై మరో మహిళ ఉన్నట్టు సీసీటీవీ ఫుటేజీలో గుర్తించిన పోలీసులు ఆరా తీసి ఆమె వాంగ్మూలం నమోదుచేశారు. డిసెంబర్‌ 31 అర్ధరాత్రి జరిగిన దారుణం గురించి నిధి వెల్లడించారు.

‘‘మా పరిచయమై 15 రోజులే అయినా మంచి స్నేహితులమయ్యాం. కొత్త ఏడాది వేడుక కల్సి చేసుకుందామనుకున్నాం. హోటల్‌లో పార్టీ తర్వాత 2 గంటలపుడు బయటకొచ్చి స్కూటీపై వెళ్తున్నాం. ఎదురుగా వస్తున్న కారు హఠాత్తుగా మమ్మల్ని ఢీకొట్టింది. నేను పడిపోయా. కానీ అంజలీ కారు చక్రాల్లో ఇరుక్కుని రక్తమోడుతూ సాయం కోసం అరిచింది. అయినా వాళ్లు వేగంగా అలాగే ఆమెను కారుతో పాటుగా ఈడ్చుకెళ్లారు. వెంటనే ఆపితే ఆమె కచ్చితంగా బ్రతికేది. చక్రాల్లో ఆమె ఇరుక్కుందని తెలిసీ నిర్దయగా అలాగే వెళ్లిపోయారు. ఆ దారుణాన్ని చూసిన షాక్‌లో ఈ విషయం ఎవరికీ చెప్పలేదు’’

- నిధి, బాధితురాలి స్నేహితురాలు, ప్రత్యక్ష సాక్షి

అయితే స్కూటీ ఎక్కడానికి ముందు హోటల్‌ బయట వారిద్దరూ గొడవ పడుతున్నట్టు మరో వీడియో కూడా వైరల్‌ అవుతోంది. నిధి నుంచి ఏదో లాక్కోవడానికి అంజలి ప్రయత్నిస్తున్నట్టు అందులో కనిపిస్తోంది. బహుశా స్కూటీని ఎవరు నడపాలనే విషయమై వారు వాదించుకున్నారని భావిస్తున్నారు. కాగా ఈ కేసులో అత్యాచారం ఆనవాళ్లు లేవని పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. తల, వెన్నెముక, మొండెం కింది అవయవాలకు తీవ్ర గాయాలవడంతో అంజలీ మరణించినట్టు నివేదిక పేర్కొంది. నిందితులు ఆమెను రేప్‌ చేసి చంపేశారనే ఆరోపణల నేపథ్యంలో మెడికల్‌ బోర్డు పర్యవేక్షణలో పోస్ట్‌మార్టం జరిగిందని ఢిల్లీ పోలీస్‌ స్పెషల్‌ కమిషనర్‌ సాగర్‌ ప్రీత్‌ హూడా చెప్పారు. ఝౌంతీ గ్రామంలో నగ్నంగా పడి ఉన్న యువతి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోవడం, నిందితులను అరెస్ట్‌ చేసి కస్టడీకి తీసుకోవడం తెల్సిందే. 

కేసును నీరుగారుస్తున్నారు: ఆప్‌
దర్యాప్తు వేగంగా ముగించి దోషులకు కఠిన శిక్ష పడేలా చూడాలంటూ ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌కు ‘ఆప్‌’ ఎమ్మెల్యేల బృందం వినతిపత్రం ఇచ్చింది. మృతురాలి కుటుంబానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ రూ.10 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. 

కేంద్రం సీరియస్‌ 
ఘటనపై కేంద్రం సీరియస్‌గా ఉంది. సమగ్ర నివేదిక ఇవ్వాలని ఢిల్లీ పోలీసులను కేంద్ర హోం శాఖ ఆదేశించింది. దాంతో స్పెషల్‌ కమిషనర్‌ శాలినీ సింగ్‌ నేతృత్వంలో ఢిల్లీ పోలీస్‌ విభాగం దర్యాప్తు సంఘాన్ని ఏర్పాటుచేసింది. ఘటన సమయంలో ఇద్దరు నిందితులు తాగి ఉన్నట్లు వార్తలొచ్చాయి. వారి రక్త నమూనాలను పరీక్షకు పంపారని, రిపోర్టులు రావాల్సి ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.  

కుటుంబానికి ఏకైక దిక్కు 
మృతురాలు అంజలి తన కుటుంబానికి ఏకైక పెద్ద దిక్కు. తండ్రి ఎనిమిదేళ్ల క్రితమే మరణించాడు. అక్కకు పెళ్లయింది. దాంతో అమ్మ, ఇద్దరు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెళ్లను ఆమే పోషిస్తోంది. ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలో తాత్కాలిక ఉద్యోగిగా పని చేస్తూ వారికి ఆసరాగా నిలుస్తోంది. మూత్రపిండాలు దెబ్బ తిన్న తల్లికి తరచూ డయాలసిస్‌ అవసరం.

ఇదీ చదవండి: ఢిల్లీ సుల్తాన్‌పురి ఘటన: అంజలితో పాటు మరో యువతి కూడా!.. పోలీసులు పట్టించుకోలేదా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement