eye witness
-
పరిస్థితి భయంకరం.. ఊపిరి తీసుకోరాలేదు.. ఎక్కడివాళ్లక్కడ పడిపోయారు
చండీగఢ్: పంజాబ్ లుధియానాలోని గియాస్పూరలో కెమికల్ ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీకై 11 మంది చనిపోయిన విషయం తెలిసిందే. మృతుల్లో ఎక్కువ మంది వలస కార్మికులే ఉన్నారు. అయితే ఈ ఘటనను చూసిన ప్రత్యక్ష సాక్షి అరవింద్ చౌబె.. ఉదయం గ్యాస్ లీకైనప్పుడు పరిస్థితి ఎలా ఉందో కళ్లకుగట్టినట్లు వివరించారు. ఊపిరి పీల్చుకోవడానికి స్థానికులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారని, ఎక్కడివాళ్లు అక్కడ స్పృహ తప్పిపడిపోయారని తెలిపారు. 'నేను మా సోదరుడు ఉదయం క్రికెట్ మ్యాచ్ ఆడాలనుకున్నాం. 7 గంటలకు గ్యాస్ లీకైందని నా సోదురుడు చెప్పాడు. వెంటనే మేం అక్కడకు చేరుకున్నాం. స్థానికులకు కాపాడేందుకు మా వంతు ప్రయత్నం చేశాం. స్పృహ తప్పి పడిపోయిన వాళ్లలో ఒక వ్యక్తి బతికున్నాడని గమనించి వెంటనే అంబులెన్సు వరకు తీసుకెళ్లాం. అతను ప్రాణాలతో బయటపడ్డాడు. మేము ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిపడ్డాం. ప్రాణాలతో బతికున్నామంటే నిజంగా మా అదృష్టం.' అని అరవింద్ చెప్పారు. అరవింద్ సోదరుడు ఆశీశ్ మాట్లాడుతూ.. తమ వాళ్లను కాపాడుకునేందుకు వెళ్లే క్రమంలో కొంతమంది విషవాయువు పీల్చి రోడ్డుపైనే కుప్పకూలారని తెలిపారు. ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్న తన భార్యపై నీళ్లుచల్లుతూ సాయం కోసం పిలిస్తే దగ్గరకు వెళ్లానని, ఈలోగా అతను కూడా స్పృహ కోల్పోయాడని వివరించాడు. ఈ ప్రాంతమంతా పొగ అలుముకుందని, ఎవరికీ ఊపిరాడలేదని పేర్కొన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి వచ్చారని తెలిపారు. మరో ప్రత్యక్ష సాక్షి అర్జూ ఖాన్ మాట్లాడుతూ.. విషవాయువు పీల్చి తన 12 సోదరుడు చనిపోయాడని బోరున విలపించాడు. గ్యాస్ లీకైనప్పుడు అతను గదిలోనే ఉన్నాడని పేర్కొన్నాడు. ఘటనలో చనిపోయినవారంతా దాదాపు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందినవారేనని పేర్కొన్నాడు. కాగా.. గ్యాస్ లీకైన ప్రాంతాన్ని విపత్తు నిర్వహణ దళాలు నిర్బంధించాయి. ఇళ్లలో ఉన్నవారికి ఆస్పత్రికి తరలించాయి. ఇంకా చాలా మంది బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీక్ -
కందుకూరు ఘటన: డ్రోన్ షాట్ల దారుణమే! ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం
సాక్షి, నెల్లూరు: డ్రోన్ షాట్ల కోసం ఇరుకు కూడలిలో టీడీపీ బహిరంగ సభను నిర్వహించడంతోపాటు భారీగా ఫ్లెక్సీలు, ద్విచక్ర వాహనాల పార్కింగ్తో తోపులాట చోటు చేసుకుని తొక్కిసలాట జరిగినట్లు కందుకూరు ఘటనలో ప్రత్యక్ష సాక్షులు, బాధిత కుటుంబాలు విచారణ కమిషన్ ఎదుట వాంగ్మూలం ఇచ్చాయి. గత నెల 28వ తేదీన ‘ఇదేం కర్మ’లో భాగంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు ఎన్టీఆర్ సర్కిల్లో నిర్వహించిన కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 8 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా మరో 8 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విచారణకు ఏర్పాటైన హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ శేషశయనారెడ్డి నేతృత్వంలోని కమిషన్ శుక్రవారం సంఘటనా స్థలాన్ని సందర్శించి పలువురి నుంచి వాంగ్మూలం సేకరించింది. తొక్కిసలాట ఎలా జరిగింది? ఆ సమయంలో ఎంత మంది ఉన్నారు? అనే అంశాలపై ఆరా తీసింది. వాహనం ఎక్కడ నిలిపారు? తొలుత ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో అధికారుల నుంచి వివరాలు సేకరించిన అనంతరం కమిషన్ ఎన్టీఆర్ సర్కిల్‌ను పరిశీలించింది. బహిరంగ సభకు ఎక్కడ అనుమతి ఇచ్చారు? చంద్రబాబు వాహనం ఎక్కడ నిలిపారు? అనే అంశాలతోపాటు ప్రమాదం జరిగిన గుండంకట్ట రోడ్డును క్షుణ్నంగా పరిశీలించింది. ఇరువైపులా ఉన్న రెండు డ్రైనేజీలను పరిశీలించింది. కందుకూరు టీడీపీ ఇన్చార్జి ప్రకటించిన పరిహారం అందలేదని బాధిత కుటుంబాలు కమిషన్ దృష్టికి తెచ్చాయి. దాదాపు 27 మంది నుంచి కమిషన్ వాంగ్మూలం నమోదు చేసింది. -
‘రక్తమోడుతున్నా ఈడ్చుకెళ్లారు’.. ఢిల్లీ దారుణంపై ప్రత్యక్ష సాక్షి
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో యువతిని స్కూటీతో పాటు కారు కింద కిలోమీటర్ల మేరకు ఈడ్చి పొట్టన పెట్టుకున్న దారుణ ఘటనకు సంబంధించి మరిన్ని నివ్వెరపరిచే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కారు ఢీకొనడంతో చక్రాల కింద ఇరుక్కుని, కాపాడండంటూ ఆర్తనాదాలు చేస్తున్నా కనికరం లేకుండా నిర్దాక్షిణ్యంగా ఈడ్చుకెళ్లారని నిధి అనే ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. మృతురాలు అంజలీ సింగ్‌కు ఆమె స్నేహితురాలే. ఘటన జరిగినప్పుడు అదే స్కూటీపై అంజలీ వెనక కూచొని ఉంది. స్వల్పగాయాలతో ప్రమాదం నుంచి బయటపడింది. షాక్‌తో ఘటన వివరాలను ఆమె ఇంతవరకూ బయట పెట్టలేదు. స్కూటీపై మరో మహిళ ఉన్నట్టు సీసీటీవీ ఫుటేజీలో గుర్తించిన పోలీసులు ఆరా తీసి ఆమె వాంగ్మూలం నమోదుచేశారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి జరిగిన దారుణం గురించి నిధి వెల్లడించారు. ‘‘మా పరిచయమై 15 రోజులే అయినా మంచి స్నేహితులమయ్యాం. కొత్త ఏడాది వేడుక కల్సి చేసుకుందామనుకున్నాం. హోటల్లో పార్టీ తర్వాత 2 గంటలపుడు బయటకొచ్చి స్కూటీపై వెళ్తున్నాం. ఎదురుగా వస్తున్న కారు హఠాత్తుగా మమ్మల్ని ఢీకొట్టింది. నేను పడిపోయా. కానీ అంజలీ కారు చక్రాల్లో ఇరుక్కుని రక్తమోడుతూ సాయం కోసం అరిచింది. అయినా వాళ్లు వేగంగా అలాగే ఆమెను కారుతో పాటుగా ఈడ్చుకెళ్లారు. వెంటనే ఆపితే ఆమె కచ్చితంగా బ్రతికేది. చక్రాల్లో ఆమె ఇరుక్కుందని తెలిసీ నిర్దయగా అలాగే వెళ్లిపోయారు. ఆ దారుణాన్ని చూసిన షాక్‌లో ఈ విషయం ఎవరికీ చెప్పలేదు’’ - నిధి, బాధితురాలి స్నేహితురాలు, ప్రత్యక్ష సాక్షి అయితే స్కూటీ ఎక్కడానికి ముందు హోటల్ బయట వారిద్దరూ గొడవ పడుతున్నట్టు మరో వీడియో కూడా వైరల్ అవుతోంది. నిధి నుంచి ఏదో లాక్కోవడానికి అంజలి ప్రయత్నిస్తున్నట్టు అందులో కనిపిస్తోంది. బహుశా స్కూటీని ఎవరు నడపాలనే విషయమై వారు వాదించుకున్నారని భావిస్తున్నారు. కాగా ఈ కేసులో అత్యాచారం ఆనవాళ్లు లేవని పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. తల, వెన్నెముక, మొండెం కింది అవయవాలకు తీవ్ర గాయాలవడంతో అంజలీ మరణించినట్టు నివేదిక పేర్కొంది. నిందితులు ఆమెను రేప్ చేసి చంపేశారనే ఆరోపణల నేపథ్యంలో మెడికల్ బోర్డు పర్యవేక్షణలో పోస్ట్‌మార్టం జరిగిందని ఢిల్లీ పోలీస్ స్పెషల్ కమిషనర్ సాగర్ ప్రీత్ హూడా చెప్పారు. ఝౌంతీ గ్రామంలో నగ్నంగా పడి ఉన్న యువతి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోవడం, నిందితులను అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకోవడం తెల్సిందే. కేసును నీరుగారుస్తున్నారు: ఆప్ దర్యాప్తు వేగంగా ముగించి దోషులకు కఠిన శిక్ష పడేలా చూడాలంటూ ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు ‘ఆప్’ ఎమ్మెల్యేల బృందం వినతిపత్రం ఇచ్చింది. మృతురాలి కుటుంబానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రూ.10 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. కేంద్రం సీరియస్ ఘటనపై కేంద్రం సీరియస్‌గా ఉంది. సమగ్ర నివేదిక ఇవ్వాలని ఢిల్లీ పోలీసులను కేంద్ర హోం శాఖ ఆదేశించింది. దాంతో స్పెషల్ కమిషనర్ శాలినీ సింగ్ నేతృత్వంలో ఢిల్లీ పోలీస్ విభాగం దర్యాప్తు సంఘాన్ని ఏర్పాటుచేసింది. ఘటన సమయంలో ఇద్దరు నిందితులు తాగి ఉన్నట్లు వార్తలొచ్చాయి. వారి రక్త నమూనాలను పరీక్షకు పంపారని, రిపోర్టులు రావాల్సి ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కుటుంబానికి ఏకైక దిక్కు మృతురాలు అంజలి తన కుటుంబానికి ఏకైక పెద్ద దిక్కు. తండ్రి ఎనిమిదేళ్ల క్రితమే మరణించాడు. అక్కకు పెళ్లయింది. దాంతో అమ్మ, ఇద్దరు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెళ్లను ఆమే పోషిస్తోంది. ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలో తాత్కాలిక ఉద్యోగిగా పని చేస్తూ వారికి ఆసరాగా నిలుస్తోంది. మూత్రపిండాలు దెబ్బ తిన్న తల్లికి తరచూ డయాలసిస్ అవసరం. ఇదీ చదవండి: ఢిల్లీ సుల్తాన్‌పురి ఘటన: అంజలితో పాటు మరో యువతి కూడా!.. పోలీసులు పట్టించుకోలేదా? -
‘4-5వేల మంది ఉంటే.. సాక్ష్యులుగా 23 మందేనా?’
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో కొన్ని రోజుల క్రితం చోటు చేసుకున్న లఖీంపూర్ ఖేరీ హింసాత్మక ఘటనకు సంబంధించిన కేసును సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. ఈ క్రమంలో యూపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సంఘటన జరిగిన సమయంలో అక్కడ వేల మంది ఉంటే మీకు కేవలం 23 మంది మాత్రమే సాక్ష్యులుగా కనిపించారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎక్కువ మంది సాక్ష్యుల స్టేట్మెంట్ రికార్డు చేయాల్సిందిగా సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాక సాక్ష్యులందరికి రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వానిదే అని తెలిపింది. (చదవండి: లోతైన హృదయం ఉన్న నాయకుడి మాటలివీ) విచారణ సందర్భంగా యూపీ ప్రభుత్వం తరఫున అశిష్ మిశ్రా వాదనలు వినిపించారు. ఈ కేసుకు సంబంధించి 68 మంది సాక్ష్యులు ఉన్నారని.. వీరిలో 23 మంది ప్రత్యక్ష సాక్ష్యులు కాగా.. మరో 30 మంది స్టేట్మెంట్ రికార్డు చేశామని తెలిపారు. ఈ వాదనలపై సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘4-5వేలమందితో ర్యాలీ తీస్తుండగా సంఘటన చోటు చేసుకుంది. కానీ మీకు మాత్రం 23 మంది సాక్ష్యులే కనిపించారా.. మీ ఏజెన్సీలకు చెప్పి.. మరింత మంది స్టేట్మెంట్స్ రికార్డు చేయమనండి. ఈ విషయంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తినా.. న్యాయాధికారులు అందుబాటులో లేకపోయినా.. సమీప జిల్లా కోర్టులో స్టేట్మెంట్ రికార్డు చేయండి’’ అని ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు. తదుపరి విచారణను నవంబర్ 8కి వాయిదా వేశారు. (చదవండి: ‘పరారీలో ఉంటే ముందస్తు బెయిలు వీలుకాదు’) అక్టోబర్ 3న లఖీమ్‌పూర్ జిల్లాలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాకు చెందిన కాన్వాయ్.. నిరసన వ్యక్తం చేస్తున్న రైతుల మీదకు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. లఖీమ్‌పూర్ హింసను విచారించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. చదవండి: ఉరికి వేలాడుతున్న మనిషి.. అంతా ప్రాణం పోయింది అనుకున్నారు, కానీ.. -
‘కసబ్‌కీ బేటీ’ అన్నారు!
దశాబ్దం క్రితం జరిగిన 26/11 ముంబై దాడులకు ప్రత్యక్ష సాక్షి ఆరేళ్ల దేవిక. ముంబై ఛత్రపతి శివాజీ టర్మినస్(సీఎస్టీ)లో అమాయకులను పొట్టనబెట్టుకున్న లష్కరే ఉగ్రవాది కసబ్‌ను పోలీసులు పట్టుకున్నాక అతడిని పోలీసు పరేడ్‌లో గుర్తుపట్టిన అత్యంత చిన్న వయసు ప్రత్యక్ష సాక్షి ఈమె. ఉగ్రవాదిని గుర్తించడంలో సాయంచేసినందుకు ఆ కుటుంబం ఎదుర్కొన్న చేదు అనుభవం ఒకటైతే, ఆ చిన్ని మనసును నొప్పించిన ఘటనలెన్నో. 2008 నవంబర్ 26న ఉగ్రబుల్లెట్ల నుంచి దేవిక త్రుటిలో తప్పించుకుంది. కసబ్‌ని గుర్తుపట్టి, అతడికి వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చేందుకు నాడు కోర్టు మెట్లెక్కినపుడు దేవిక వయసు తొమ్మిదేళ్లు. ఘటన జరిగినపుడు ఆమె వయసు కేవలం ఆరేళ్లు. ‘నా కుడి కాలుని షూట్ చేశారు’ అంటూ ఆనాటి చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది దేవిక. ప్రస్తుతం దేవిక ఇంటర్మీడియెట్ చదువుతోంది. దాడి జరిగిన రోజు పుణెలోని తన చిన్న అన్నయ్యను కలవడానికి తండ్రి నట్వర్లాల్, పెద్ద అన్నయ్యలతో కలిసి రైలెక్కడానికి ముంబై సీఎస్టీకి వచ్చింది. అదే సమయంలో రైల్వేస్టేషన్లో కసబ్ విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఓ బుల్లెట్ దేవిక కుడి కాలును చీల్చుకుంటూ దూసుకెళ్లింది. రక్తసిక్తమైన దేవిక రెండు నెలల పాటు ఆసుపత్రిపాలైంది. కోలుకుని కోర్టుకెళ్లిన దేవికను ‘నిన్నెవరు కాల్చారు?’ అని ప్రశ్నించినపుడు సూటిగా కసబ్ వైపు చూపించింది. దీంతో అప్పట్లో దేవిక పేరు మార్మోగింది. దేశం యావత్తు ఆ చిన్నారి తెగువను ప్రశంసించింది. అయితే, దేవికను కష్టాలు మరోరూపంలో మొదలయ్యాయి. బడిలో తోటి విద్యార్థినులు ‘కసబ్‌కీ బేటీ’ అని పిలిచేవారు. స్నేహితులు దగ్గరికి రావడానికి భయపడ్డారు. సూటిపోటి మాటలతో వేధించారు. దీంతో దేవిక మరో పాఠశాలలో చేరాల్సి వచ్చింది. అక్కడా పరిస్థితిలో పెద్దగా మార్పులేదు. దీనికితోడు దేవిక కుటుంబానికి ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. అయినా దేవిక, ఆమె కుటుంబం వెనక్కి తగ్గలేదు. దేవిక తండ్రి రోజుకూలీ. ఇంత పేదరికంలోనూ తను లక్ష్యంగా పెట్టుకున్న ఐపీఎస్ ఆశయాన్ని సాధించేందుకు దేదిక కష్టపడి చదువుతోంది. 26/11 మృతులకు సోమవారం జమ్మూలో నివాళులర్పిస్తున్న పాఠశాల విద్యార్థులు -
పచ్చి అబద్ధం.. అలా జరగలేదు!
అమృత్సర్: దసరా పండుగ రోజున పెను విషాదం మిగిల్చిన రైలు ప్రమాదంపై భిన్న వాదనలు విన్పిస్తున్నాయి. రావణ దహనాన్ని చూసేందుకు రైలు పట్టాలపై గుమిగూడిన ప్రజలను చూసి అత్యవసర బ్రేకు వేశానని డీఈఎంయూ రైలు డ్రైవర్ అరవింద కుమార్ తెలిపారు. అయితే అక్కడున్నవారు రాళ్లు రువ్వడంతో రైలును ఆపకుండా అమృత్సర్ స్టేషన్‌కు చేర్చినట్టు వెల్లడించారు. అయితే ఈ వాదనను ప్రత్యక్ష సాక్షులు తోసిపుచ్చారు. (పెను ప్రమాదం.. అంతులేని శోకం) ‘డ్రైవర్ అరవింద కుమార్ అబద్దాలు చెబుతున్నారు. అసలు రైలును ఆపలేదు. కనీసం స్పీడు కూడా తగ్గించలేదు. క్షణాల వ్యవధిలోనే రైలు మమ్మల్ని దాటుకుని వెళ్లిపోయింది. రైలు కింద పడి ఎంతో మంది చనిపోయారు. క్షతగాత్రులు ఆర్తనాదాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఎవరైనా రాళ్లు విసురుతారా? అత్యంత వేగంగా వెళుతున్న రైలుపై రాళ్లు రువ్వడం సాధ్యమా?’ అని ప్రత్యక్ష సాక్షి మున్సిపల్ కౌన్సిలర్ శైలెందర్ సింగ్ షాలె ప్రశ్నించారు. ఆస్కారమే లేదు పెద్ద సంఖ్యలో గూమిగూడిన ప్రజలను చూసిన తర్వాత కూడా రైలు వేగం తగ్గించలేదని మరో ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ‘వేగంగా రైలు నడపడం వల్లే క్షణాల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. రైలును నెమ్మదిగా నడిపివుంటే ప్రమాద తీవ్రత తగ్గేది. రైలు ఎంత వేగంగా వెళుతుంతో తెలిపే వందలాది వీడియోలున్నాయి. మేమంతా స్పందించి, రాళ్లు విసరడానికి ఆస్కారమే లేదు. బాధితుల హాహాకారాలతో ఘటనా స్థలం దద్దరిల్లింద’ని పరమ్‌జీత్ సింగ్ అనే వ్యక్తి తెలిపారు. విసిరేలోపు వెళ్లిపోయింది ఎవరూ రాళ్లు విసరలేదని, రైలు డ్రైవర్ ఎందుకు అబద్ధం చెబుతున్నాడో అర్థం కావడం లేదని అజయ్ గోయంకా పేర్కొన్నారు. ప్రమాదం జరిగినప్పుడు ఆయన సంఘటనా స్థలంలోనే ఉన్నారు. ఒకవేళ రాళ్లు రువ్వాలనుకున్నా ఆలోపు రైలు వెళ్లిపోతుందన్నారు. అంత వేగంగా రైలు వెళ్లిపోయిందన్నారు. స్థానిక పోలీసులు కూడా ప్రత్యక్ష సాక్షుల వాదనతో ఏకీభవిస్తున్నారు. రైలు వెళుతుండగా అక్కడున్న వారెవరూ రాళ్లు విసరలేదని పోలీసు అధికారి సుఖ్మిందర్ సింగ్ తెలిపారు. దీనిపై స్పందించేందుకు రైల్వే అధికారులు అందుబాటులోకి రాలేదు. రైలు స్పీడు ఎంత? ప్రమాదానికి కారణమైన డీజిల్ ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్(డీఈఎయూ) రైలు గరిష్ట వేగం గంటకు 96 కిలోమీటర్లు. రైలు ఖాళీగా ఉన్నప్పుడు బ్రేకులు వేస్తే 300 మీటర్లలోపు ఆగుతుంది. ప్రయాణికులతో ఉంటే బ్రేకు వేసినప్పుడు 600 మీటర్లలోపు ఆగుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు. చివరిసారిగా నమోదైన ఈ రైలు వేగం 68 కేఎంపీహెచ్ అని ఫిరోజ్‌పూర్ డివిజినల్ రైల్వే మేనేజర్ వివేక్ కుమార్ తెలిపారు. సంబంధిత వార్తలు ‘మేడమ్..! 500 ట్రైన్లు వచ్చినా భయపడరు’ ‘మరో జలియన్‌వాలా బాగ్ ఉదంతం ఇది’ అమృత్సర్ ప్రమాదం : పాపం దల్బీర్ సింగ్ ప్రమాదంలో మా తప్పు లేదు : రైల్వే శాఖ -
'భయంతో వెన్నులో వణుకు పుట్టింది'
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఫ్లై ఓవర్ కూలిపోయిన ఘటన స్థానికుల్ని భయభ్రాంతులకు గురిచేసింది. రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో రెప్పపాటులో తమ కళ్ల ముందే వందలాదిమంది శిథిలాల కింద చిక్కుకోవడంతో స్థానికులను కలచివేసింది. భయంతో పిల్లలు, మహిళలు ఏడుస్తూ విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటన గురించి ఓ ప్రత్యక్ష సాక్షి మీడియాతో మాట్లాడుతూ.. ఫ్లై ఓవర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ హఠాత్పరిణామానికి వెన్నులో వణుకు పుట్టిందని చెప్పాడు. ప్రమాద ఘటనపై మరికొందరు ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్పారంటే.. స్థానిక ప్రజలు భయపడిపోయారు. భయంతో పిల్లలు, మహిళలు ఏడుస్తున్నారు శిథిలాల కింద 150 మంది చిక్కుకున్నారని భావిస్తున్నా నిన్న కాంక్రీట్, సిమెంట్ వేశారు. ఈ రోజు అకస్మాత్తుగా కూలిపోయింది ఫ్లై ఓవర్ కూలిన ఘటనలో పదిమంది మరణించగా, మరో 150 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్టు సమాచారం. వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. కోల్‌కతాలోని గణేశ్ థియేటర్ సమీపంలోని ప్రమాద స్థలలో సహాయక చర్యలు చేపడుతున్నారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. -
సల్మాన్‌ఖాన్ తాగి రాలేదు
బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌కు పెద్ద ఊరట లభించింది. గతంలో జరిగిన హిట్ అండ్ రన్ కేసులో ఆయనకు వ్యతిరేకంగా ఉంటాడనుకున్న ప్రత్యక్ష సాక్షి కాస్తా సల్లూభాయ్‌కి అనుకూలంగా సాక్ష్యం చెప్పాడు. సల్మాన్‌ఖాన్ మద్యం తాగినట్లు తాను గుర్తించలేదని అతడు కోర్టులో తెలిపాడు. సల్మాన్‌ఖాన్ వద్ద మద్యం వాసన ఏమాత్రం రాలేదని కూడా చెప్పాడు. దాంతో సల్లూభాయ్‌కి శిక్ష ప్రమాదం అవకాశాలు చాలావరకు తగ్గిపోయినట్లే అయ్యింది.