'భయంతో వెన్నులో వణుకు పుట్టింది'
కోల్కతా: పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో ఫ్లై ఓవర్ కూలిపోయిన ఘటన స్థానికుల్ని భయభ్రాంతులకు గురిచేసింది. రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో రెప్పపాటులో తమ కళ్ల ముందే వందలాదిమంది శిథిలాల కింద చిక్కుకోవడంతో స్థానికులను కలచివేసింది. భయంతో పిల్లలు, మహిళలు ఏడుస్తూ విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటన గురించి ఓ ప్రత్యక్ష సాక్షి మీడియాతో మాట్లాడుతూ.. ఫ్లై ఓవర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ హఠాత్పరిణామానికి వెన్నులో వణుకు పుట్టిందని చెప్పాడు. ప్రమాద ఘటనపై మరికొందరు ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్పారంటే..
- స్థానిక ప్రజలు భయపడిపోయారు. భయంతో పిల్లలు, మహిళలు ఏడుస్తున్నారు
- శిథిలాల కింద 150 మంది చిక్కుకున్నారని భావిస్తున్నా
-
నిన్న కాంక్రీట్, సిమెంట్ వేశారు. ఈ రోజు అకస్మాత్తుగా కూలిపోయింది
ఫ్లై ఓవర్ కూలిన ఘటనలో పదిమంది మరణించగా, మరో 150 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్టు సమాచారం. వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. కోల్కతాలోని గణేశ్ థియేటర్ సమీపంలోని ప్రమాద స్థలలో సహాయక చర్యలు చేపడుతున్నారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.