365 రోజులు... జీవితమనే అంతులేని ప్రయాణంలో 2023వ సంవత్సరం ఈ 365 రోజులు మనకెన్నో జ్ఞాపకాలు, అనుభవాలు, సంతోషాలు, సవాళ్లు ఇచ్చి ఉంటుంది. ఈ ప్రయాణం మనం ఒక్కరమేచేయగలమా? ఎందరో సాయం చేసి ఉంటారు. వారికి మనస్ఫూర్తిగా థ్యాంక్యూ చెప్పామో లేదో. ఇప్పుడు చెబుదామా. కొందరిని తెలిసో తెలియకో హర్ట్ చేసి ఉంటాం. ఎంత బాధ పడ్డారో ఏమో.. సారీ చెబుదామా. పాత సంవత్సరం అకౌంట్లు సెటిల్ చేసుకొని కొత్త సంవత్సరంలోకి అడుగు పెడదామా?
ఏదో హెల్త్ ఇష్యూస్ వచ్చి ఉంటాయి. ఎవరినో సలహా అడిగి ఉంటాం. హాస్పిటల్‌కు తోడు రమ్మని చెప్పి ఉంటాం. అప్పు అడిగి ఉంటాం. వారు ఇచ్చి ఉంటారు. ఆ హడావిడిలో వారికి సరైన థ్యాంక్యూ చెప్పి ఉండం. పట్టించుకోరులే అనుకుంటాం. కాని పట్టించుకుంటారు. మనకు ఈ సంవత్సరం ఇంత సాయం చేసిన వారికి ఈ సంవత్సరాంతంలో కాల్ చేసి, లేదా ఇంటికి వెళ్లి, ఈ సంవత్సరం ఫలానా టైమ్‌లో మీరు నాకు ఈ సాయం చేశారు... థ్యాంక్యూ అని చెప్పి చూడండి... వాళ్ల కళ్లల్లో నీళ్లు చిప్పిల్లుతాయి... మీ కళ్లల్లో కూడా. చెబుదామా?
సాయం చేసిన వాళ్లు అవతలి వారి నుంచి కృతజ్ఞతను ఆశించరు కానీ అలాగని కృతజ్ఞత తెలియచేయడం కనీస బాధ్యత కదా! అసలు మేలు చేస్తేనే థ్యాంక్యూ చెప్పాలా? మీ ఇరుగున ఒక ఇల్లు, పొరుగున ఒక ఇల్లు ఉంటుంది. వారితో ఏ తగాదా గొడవా లేకుండానే హ్యాపీగా ఈ సంవత్సరం గడిచిపోయింది. వాళ్లను పలకరించి ‘ఈ సంవత్సరమంతా మనం స్నేహంగా ఉన్నాం. అందుకు థ్యాంక్యూ. వచ్చే సంవత్సరం కూడా ఇలాగే ఉందాం’ అని చిన్న స్వీట్ ఇచ్చి చూడండి. ఆ మేజిక్ ఎలా ఉంటుందో. మీ ఆఫీస్‌లో కలీగ్స్‌తో ‘థ్యాంక్యూ... ఈ సంవత్సరమంతా మనం కలిసి మెలిసి పని చేసినందుకు’ అని టీకి పిలవండి... అదీ చిన్న మేజిక్ కాదు. ఒక సంవత్సరం దాటి వచ్చినందుకు ఎందరికో కృతజ్ఞత ప్రకటించాలి. తల్లిదండ్రులకు, తోడ బుట్టిన వారికి, మిత్రులకు... వీరున్నారనే ధైర్యం వల్లే కదా... ప్రతి రోజునూ చులాగ్గా దాటాం.
వీరికి థ్యాంక్స్ చెప్పండి: ఈ సంవత్సరమంతా మనకు ఇంటి సాయం చేసిన పని మనిషికి, కారు డ్రైవర్‌కు, ప్రయాణాలకు టికెట్లు బుక్ చేసిచ్చిన ఏజెంట్‌కు, పిల్లలకు ట్యూషన్ చెప్పిన టీచర్‌కు, అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్‌కు, ఫ్యామిలీ డాక్టర్‌కు... డబ్బు చెల్లించే పని చేయించుకుని ఉండొచ్చు. డబ్బు ఇచ్చినా అలాంటి పని చేసేవారు దొరకనప్పుడు తెలుస్తుంది వారి విలువ. అందుకే థ్యాంక్స్ చెప్పండి. బాగుంటుంది.
ఇక మీకు సపోర్ట్‌గా నిలిచిన స్నేహితులకు కాల్ చేసి, వారు ఏ సందర్భంలో ఎంత సపోర్ట్ చేశారో చెప్పి థ్యాంక్స్ చెప్పండి. ఊళ్లో ఉన్న అమ్మా నాన్నలను ఎవరో ఒక పక్కింటి పిన్ని పలకరించి బాగోగులు గమనిస్తుంటుంది. ఆమెకు థ్యాంక్స్ చెప్పండి. మన పిల్లలను రోజూ ఆటకు పిలిచి వారితో స్నేహంగా ఆడుతున్న పిల్లలకూ థ్యాంక్స్ చెప్పండి. వారు ఇంకా విలువైన వారు. అన్నింటికి మించి మన పట్ల కనికరంగా ఉన్న ప్రకృతికి. కరుణతో ఉన్న రుతువులకి, తిన్న ప్రతి అన్నం ముద్దకి, మీరు విశ్వసించే ఈశ్వరునికి థ్యాంక్స్ చెప్పండి.
వీరితో సారీ చెప్పండి: ఈ సంవత్సరం రెండు మూడుసార్లు కూడా వెళ్లి చూడటం కుదరని తల్లిదండ్రులకు, తోబుట్టువులకు, అన్నదమ్ములకు... ‘సారీ.. మీరంటే ఎంతో ప్రేమ... కాని కలవడం కుదరలేదు’ అని చెప్పండి. మనసు తేలిక అవుతుంది. ఎందరో స్నేహితులు, బంధువులు శుభకార్యాలకు పిలిచి ఉంటారు. వెళ్లి ఉండరు. వారికి పనిగట్టుకుని ఫోన్ చేసి సారీ చెప్పండి. ఇకపై తప్పక వస్తామని చెప్పండి. బాగా ఆత్మీయులు కొందరు స్వర్గస్తులై ఉంటారు. ఏదో కారణాన వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చి ఉండరు. ఇప్పుడు ఫోన్ చేసి వీలైతే కలిసి సహేతుకమైన కారణం చెప్పి సారీ చెప్పండి. కొందరు మీరు చేయదగ్గ సాయం అడిగినా మీరు నిర్లక్ష్యంతో చేసి ఉండరు.
వారు బాధ పడిన విషయం కూడా మీకు తెలిసి ఉండదు. గుర్తు తెచ్చుకుని సారీ చెప్పండి. ఎవరికో ఏవో వాగ్దానాలు చేసి తప్పి ఉంటారు. సారీ చెప్పండి. భార్య భర్తను బాధించిన సందర్భాలకు, భర్త భార్యను కష్టపెట్టిన సందర్భాలకు తప్పక ఒకరికొకరు సారీ చెప్పాలి. పిల్లల్ని చిన్నబుచ్చిన సందర్భాలకు కూడా వారికి సారీ చెప్పాలి. చేజారిన బంధాలు, స్నేహాలు... పలచబడిన బాంధవ్యాలు కేవలం ‘థ్యాంక్యూ’, ‘సారీ’ అనే రెండు పదాలతో తిరిగి అతుక్కుంటాయి. రెండు మూడు రోజులు టైమ్ ఉంది. తెమిలి కూచుని ఇతరుల ఒప్పులను, మీ తప్పులను లిస్ట్ చేసుకుని ఎవరికి ఏం చెప్పాలో అది చెప్పి కొత్త సంవత్సరాన్ని ఉత్సాహంగా మొదలెట్టండి.
Comments
Please login to add a commentAdd a comment