Gratitude
-
అందుకు ప్రత్యక్ష సాక్షిని నేనే.. మహిళ భావోద్వేగం
-
వాళ్లకు సారీ చెప్పారా? వీళ్లతో థ్యాంక్యూ అన్నారా?
365 రోజులు... జీవితమనే అంతులేని ప్రయాణంలో 2023వ సంవత్సరం ఈ 365 రోజులు మనకెన్నో జ్ఞాపకాలు, అనుభవాలు, సంతోషాలు, సవాళ్లు ఇచ్చి ఉంటుంది. ఈ ప్రయాణం మనం ఒక్కరమేచేయగలమా? ఎందరో సాయం చేసి ఉంటారు. వారికి మనస్ఫూర్తిగా థ్యాంక్యూ చెప్పామో లేదో. ఇప్పుడు చెబుదామా. కొందరిని తెలిసో తెలియకో హర్ట్ చేసి ఉంటాం. ఎంత బాధ పడ్డారో ఏమో.. సారీ చెబుదామా. పాత సంవత్సరం అకౌంట్లు సెటిల్ చేసుకొని కొత్త సంవత్సరంలోకి అడుగు పెడదామా? ఏదో హెల్త్ ఇష్యూస్ వచ్చి ఉంటాయి. ఎవరినో సలహా అడిగి ఉంటాం. హాస్పిటల్‌కు తోడు రమ్మని చెప్పి ఉంటాం. అప్పు అడిగి ఉంటాం. వారు ఇచ్చి ఉంటారు. ఆ హడావిడిలో వారికి సరైన థ్యాంక్యూ చెప్పి ఉండం. పట్టించుకోరులే అనుకుంటాం. కాని పట్టించుకుంటారు. మనకు ఈ సంవత్సరం ఇంత సాయం చేసిన వారికి ఈ సంవత్సరాంతంలో కాల్ చేసి, లేదా ఇంటికి వెళ్లి, ఈ సంవత్సరం ఫలానా టైమ్‌లో మీరు నాకు ఈ సాయం చేశారు... థ్యాంక్యూ అని చెప్పి చూడండి... వాళ్ల కళ్లల్లో నీళ్లు చిప్పిల్లుతాయి... మీ కళ్లల్లో కూడా. చెబుదామా? సాయం చేసిన వాళ్లు అవతలి వారి నుంచి కృతజ్ఞతను ఆశించరు కానీ అలాగని కృతజ్ఞత తెలియచేయడం కనీస బాధ్యత కదా! అసలు మేలు చేస్తేనే థ్యాంక్యూ చెప్పాలా? మీ ఇరుగున ఒక ఇల్లు, పొరుగున ఒక ఇల్లు ఉంటుంది. వారితో ఏ తగాదా గొడవా లేకుండానే హ్యాపీగా ఈ సంవత్సరం గడిచిపోయింది. వాళ్లను పలకరించి ‘ఈ సంవత్సరమంతా మనం స్నేహంగా ఉన్నాం. అందుకు థ్యాంక్యూ. వచ్చే సంవత్సరం కూడా ఇలాగే ఉందాం’ అని చిన్న స్వీట్ ఇచ్చి చూడండి. ఆ మేజిక్ ఎలా ఉంటుందో. మీ ఆఫీస్‌లో కలీగ్స్‌తో ‘థ్యాంక్యూ... ఈ సంవత్సరమంతా మనం కలిసి మెలిసి పని చేసినందుకు’ అని టీకి పిలవండి... అదీ చిన్న మేజిక్ కాదు. ఒక సంవత్సరం దాటి వచ్చినందుకు ఎందరికో కృతజ్ఞత ప్రకటించాలి. తల్లిదండ్రులకు, తోడ బుట్టిన వారికి, మిత్రులకు... వీరున్నారనే ధైర్యం వల్లే కదా... ప్రతి రోజునూ చులాగ్గా దాటాం. వీరికి థ్యాంక్స్ చెప్పండి: ఈ సంవత్సరమంతా మనకు ఇంటి సాయం చేసిన పని మనిషికి, కారు డ్రైవర్‌కు, ప్రయాణాలకు టికెట్లు బుక్ చేసిచ్చిన ఏజెంట్‌కు, పిల్లలకు ట్యూషన్ చెప్పిన టీచర్‌కు, అపార్ట్మెంట్ వాచ్‌మెన్‌కు, ఫ్యామిలీ డాక్టర్‌కు... డబ్బు చెల్లించే పని చేయించుకుని ఉండొచ్చు. డబ్బు ఇచ్చినా అలాంటి పని చేసేవారు దొరకనప్పుడు తెలుస్తుంది వారి విలువ. అందుకే థ్యాంక్స్ చెప్పండి. బాగుంటుంది. ఇక మీకు సపోర్ట్‌గా నిలిచిన స్నేహితులకు కాల్ చేసి, వారు ఏ సందర్భంలో ఎంత సపోర్ట్ చేశారో చెప్పి థ్యాంక్స్ చెప్పండి. ఊళ్లో ఉన్న అమ్మా నాన్నలను ఎవరో ఒక పక్కింటి పిన్ని పలకరించి బాగోగులు గమనిస్తుంటుంది. ఆమెకు థ్యాంక్స్ చెప్పండి. మన పిల్లలను రోజూ ఆటకు పిలిచి వారితో స్నేహంగా ఆడుతున్న పిల్లలకూ థ్యాంక్స్ చెప్పండి. వారు ఇంకా విలువైన వారు. అన్నింటికి మించి మన పట్ల కనికరంగా ఉన్న ప్రకృతికి. కరుణతో ఉన్న రుతువులకి, తిన్న ప్రతి అన్నం ముద్దకి, మీరు విశ్వసించే ఈశ్వరునికి థ్యాంక్స్ చెప్పండి. వీరితో సారీ చెప్పండి: ఈ సంవత్సరం రెండు మూడుసార్లు కూడా వెళ్లి చూడటం కుదరని తల్లిదండ్రులకు, తోబుట్టువులకు, అన్నదమ్ములకు... ‘సారీ.. మీరంటే ఎంతో ప్రేమ... కాని కలవడం కుదరలేదు’ అని చెప్పండి. మనసు తేలిక అవుతుంది. ఎందరో స్నేహితులు, బంధువులు శుభకార్యాలకు పిలిచి ఉంటారు. వెళ్లి ఉండరు. వారికి పనిగట్టుకుని ఫోన్ చేసి సారీ చెప్పండి. ఇకపై తప్పక వస్తామని చెప్పండి. బాగా ఆత్మీయులు కొందరు స్వర్గస్తులై ఉంటారు. ఏదో కారణాన వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చి ఉండరు. ఇప్పుడు ఫోన్ చేసి వీలైతే కలిసి సహేతుకమైన కారణం చెప్పి సారీ చెప్పండి. కొందరు మీరు చేయదగ్గ సాయం అడిగినా మీరు నిర్లక్ష్యంతో చేసి ఉండరు. వారు బాధ పడిన విషయం కూడా మీకు తెలిసి ఉండదు. గుర్తు తెచ్చుకుని సారీ చెప్పండి. ఎవరికో ఏవో వాగ్దానాలు చేసి తప్పి ఉంటారు. సారీ చెప్పండి. భార్య భర్తను బాధించిన సందర్భాలకు, భర్త భార్యను కష్టపెట్టిన సందర్భాలకు తప్పక ఒకరికొకరు సారీ చెప్పాలి. పిల్లల్ని చిన్నబుచ్చిన సందర్భాలకు కూడా వారికి సారీ చెప్పాలి. చేజారిన బంధాలు, స్నేహాలు... పలచబడిన బాంధవ్యాలు కేవలం ‘థ్యాంక్యూ’, ‘సారీ’ అనే రెండు పదాలతో తిరిగి అతుక్కుంటాయి. రెండు మూడు రోజులు టైమ్ ఉంది. తెమిలి కూచుని ఇతరుల ఒప్పులను, మీ తప్పులను లిస్ట్ చేసుకుని ఎవరికి ఏం చెప్పాలో అది చెప్పి కొత్త సంవత్సరాన్ని ఉత్సాహంగా మొదలెట్టండి. -
‘కేసీఆర్ సారూ.. మీరు సల్లగుండాలె’.. బార్ ఓనర్ల అభిషేకం వైరల్
మహబూబాబాద్: కృతజ్ఞతను ప్రదర్శించడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్లైల్. తమకున్నంతలో కొందరు చేస్తే.. ఇంకొందరు మాత్రం అతికి పోతుంటారు. అయితే ఇక్కడ మాత్రం కొందరు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పట్ల తమ కృతజ్ఞతను ప్రత్యేకంగా చాటుకున్నారు. జిల్లాలోని మానుకోటలో బార్ షాప్ యాజమానులు వినూత్నంగా సీఎం కేసీఆర్‌కు థ్యాంక్స్ తెలియజేసుకున్నారు. బార్ షాపుల్లో 90 ఎం.ఎల్, క్వార్టర్, ఆఫ్ బాటిళ్లకు అనుమతి ఇవ్వడంతో.. ఇలా కేసీఆర్ ఫొటో ముందు మందు బాటిళ్లు ఉంచి దణ్ణం పెట్టారు. కేసీఆర్ చల్లగా ఉండాలంటూ కోరుకున్నారు. ఆపై ఫొటోకు పాలాభిషేకం చేశారు బార్ యజమానులు. ప్రస్తుతం ఆ వీడియో వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతోంది. -
మంచి మాట: కృతజ్ఞత గొప్ప సంస్కారం
‘కృతజ్ఞత ’ అంటే ఒకరు మనకు చేసిన మేలును మరచి పోకుండా ఉండటం. మనం ఒక ప్రమాదకరమైన స్థితిలో ఉన్నప్పుడో, మనకు ఏదో ఒక సహాయం అవసరమైనపుడో, మనం అడిగితే సహాయపడేవారు కొందరుంటారు. మనం అడగకపోయినా మనకు అవసరమైన ఉపకారం చేసే వారు కొందరుంటారు. వీరికెప్పుడూ మనం కృతజ్ఞులమై ఉండాలి. కృతజ్ఞత అనేది మానవ సంస్కారం. ఒకరు తమకు చేసిన ఉపకారాన్ని గ్రహించటం పుణ్యం, దానికి సమానమైన ప్రత్యుపకారాన్ని చేయటం మధ్యమం, ఉపకారానికి మించిన ప్రత్యుపకారం చేయటం ఉత్తమం. ఏరు దాటాక తెప్ప తగలేసే చందంగా కాకుండా, మన ఉనికికి, ఉన్నతికి కారకులైనవారి పట్ల మనం కృతజ్ఞులమై ఉండాలి. ఒకనాడు మనకు మేలుచేసిన మనిషి, విధివశాత్తూ కష్టంలో పడినట్టు మనకు తెలిస్తే –అతని పట్ల సకాలంలో, అవసరానికి తగినట్టుగా స్పందించకపోతే అది కృతజ్ఞత ఎలా ఔతుంది. మేలు చేసిన సమస్త జీవుల పట్ల కృతజ్ఞత, మేలు చేయడంలో ఆసక్తి కలిగి ఉండాలి. అంటే మనుషులకే కాదు పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు, చెట్లు, చేమలు, పాములు, తేళ్ళు.. ఇలా అన్నింటికి మేలు కలగాలనే భావన ఉండాలి. శత్రువైనా, మిత్రుడైనా ఎవరైనా సరే అందరి మేలును కాంక్షించి కృతజ్ఞత, దయ కలిగి ఉండాలి. ప్రాణులన్నింటికి దుఃఖాలు బాధలు సహజం. కనుక వాటి దుఃఖాన్ని తొలగించటానికి, సుఖాన్ని కలిగించటానికి, అవసర సమయాలలో మేలుచేయటానికి ప్రయత్నించాలి. అయితే ఇలా సమస్త జీవుల పట్ల దయ కలగాలన్నా కష్టమే. మనకు మేలు చేసిన వారిపై అనురాగం కృతజ్ఞత ఉంటాయి. కనుక తిరిగి వారికి మేలు చేయాలనిపిస్తుంది. కాని మనకు కీడు చేసిన వారైతేనో వారికి కూడా మేలు చేయాలనుకుంటామా.. అనుకోలేము. కాని వారియందు కూడా కృతజ్ఞతాభావం, మేలుచేయాలనే గుణం కలిగి ఉండాలన్నది శాస్త్ర ప్రమాణమని పెద్దలు చెబుతున్నారు. ఇది వినటానికి బాగానే ఉంది. కాని ఆచరణకు వచ్చేటప్పటికి ఈ నీతి సూత్రాలన్నీ గుర్తుకు రావు. అయితే ఎవరికి సమబుద్ధి ఉంటుందో, అందరిని ఒకేవిధంగా, ఆత్మస్వరూపులుగా, ఒక్కటిగా చూడగలుగుతారో వారే అపకారులకు కూడా ఉపకారంచేస్తూ కృతజ్ఞత చూపగలుగుతారు. మేలు చేయాలనే ఆసక్తి కలిగి ఉంటారు. ఇలా జీవులకు చేసే హితం, సేవ పరమాత్మకు చేసినట్లే. ఎందుకంటే సమస్త జీవులయందు పరమాత్మే ఉన్నాడు గనుక. కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువను పెంచుతుంది. డబ్బుకు మనమిచ్చే విలువ ఆపదలో ఆదుకుంటుంది. సాటి మనిషికి మనం ఇచ్చే విలువ, చూపే కృతజ్ఞత వారి మనసులో మనకొక సుస్థిర స్థానం ఇస్తుంది. అందువలన మనం అత్యాశను వదిలిపెట్టి సంతృప్తిని, కృతజ్ఞతను అలవరచుకోవటానికి ప్రయత్నించాలి. సంతృప్తితో జీవించేవారిని గౌరవించడం నేర్చుకోవాలి. ఆనందమయమైన జీవితాన్ని గడపాలని ప్రతి ఒక్కరు కోరుకోవటం సహజం. దానికోసం ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తూనే ఉంటారు. అయితే అతను తన ఆశకు పరిమితులని ఏర్పరచుకోవాలి. అన్నీ ఉన్నా ఇంకా కావాలి, ఇంకా కావాలనుకోవడం వలన అతనికి అనందం లభించదు. సంతృప్తి ప్రతి వ్యక్తికీ తప్పనిసరిగా ఉండాలి. అది లేకపోతే ఎంత ఉన్నా మనిషికి ఆనందం ఉండదు. కోరికలను పెరగనిస్తూ పోతే ప్రపంచంలోని వస్తువులన్నీ కూడా ఒక వ్యక్తికి చాలవు. అందువలన అత్యాశకు అవకాశం ఇవ్వకూడదు. తనకు దక్కిన దానితో సంతోషపడటం ప్రతివ్యక్తి నేర్చుకోవాలి. అత్యాశ లేని వ్యక్తి చాలా సంతోషంగా ఉంటాడు. అరణ్యాలలో నివసించిన ఋషులు చాలా సంతోషంగా జీవించారు. అక్కడ భౌతిక సంపదలు లేవు. అయితే వారికీ సంతృప్తి అనే సంపద ఉన్నది. అది వారికి ఆనందాన్ని ఇచ్చింది. మనిషి ఆధ్యాత్మికంగా ఎదగాలంటే సంతృప్తి అవసరం. మన కోరికలను తగ్గించుకోవటం మీద మన సంతృప్తి ఆధారపడి ఉంటుంది. – భువనగిరి కిషన్ యోగి -
హన్మయ్య నీది ఎంతపెద్ద మనసయ్య.. వారి రుణం తీర్చుకోవడం కోసం..
సాక్షి, స్టేషన్‌ఘన్‌పూర్: తనకు యవ్వనంలో అశ్రయం కల్పించడంతో పాటు ప్రేమ వివాహానికి సహకరించిన వారిపై ఓ వ్యక్తి కృతజ్ఞతభావం చూపాడు. వారి మనవడి వివాహానికి హాజరై వధువు తరఫున పెళ్లి పెద్దగా నిలిచి కన్యాదానం చేయడంతో పాటు ఖర్చులకు రూ.5లక్షలు అందించాడు. వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లికి చెందిన హన్మయ్య తన 20వ ఏటా కులాంతర వివాహం చేసుకున్నాడు. ఆ సమయంలో ఇంట్లో పెద్దలకు భయపడి జఫర్‌గఢ్ మండలం తమ్మడపల్లికి రాగా తండా వాసులు వారికి ఆశ్రయం కల్పించి ఆసరాగా నిలిచారు. ఈ క్రమంలో హన్మయ్య వ్యాపారంలో రాణిస్తూ జీవితంలో స్థిరపడ్డాడు. చదవండి: (‘అమ్మా లే అమ్మ.. నాన్నా లే నాన్న.. మమ్మల్ని ఎవరు చూస్తారు') కాగా తన ప్రేమ వివాహ సమయంలో సహకరించిన గిరిజనుల మనమడు అనిల్ వివాహం నిశ్చయం కాగా ఆ కుటుంబ రుణం తీర్చుకోవాలని హన్మయ్య సంకల్పించాడు. వధువు పూజితకు తండ్రి లేకపోవడంతో ఆమెకు తండ్రి స్థానంలో నిలిచి వరుడు అనిల్ కాళ్లు కడిగి కన్యాదానం చేశాడు. శనివారం స్థానిక కేఆర్ గార్డెన్లో జరిగిన వివాహంలో ఆయన కన్యాదానం చేసి రూ.5లక్షలు అందించారు. స్వయంగా సేవా గుణం ఉన్న హన్మయ్య పెద్దపల్లిలో సొంత ఖర్చులతో పాఠశాలను కట్టించడమే కాకుండా విద్యార్థులకు పుస్తకాలు, సైకిళ్లు అందించి సమాజ సేవ చేస్తున్నాడు. కాగా వధువు తరఫున పెద్దగా నిలిచి కన్యాదానం చేయడంపై అందరూ అభినందించారు. చదవండి: (పాము విషం విక్రయం గుట్టురట్టు.. ఒక కిలో పాము విషం కోటిన్నర..?!) -
గ్రామ స్వరాజ్యం ఆవిష్కృతమై సరిగ్గా ఏడాది
-
చప్పట్లతో సీఎం జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థకు ఏడాది పూర్తయిన సందర్భంగా గ్రామ స్వరాజ్యాన్ని సాధ్యం చేస్తున్నవారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. తాడేపల్లిలోని తన నివాసంలో శుక్రవారం రాత్రి 7 గంటలకు చప్పట్లు కొట్టి అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పలువురు అధికారులు పాల్గొన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు చప్పట్లతో గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులు, వాలంటర్లకు అభినందనలు తెలిపారు. (గ్రామ స్వరాజ్యం సాకారం చేశాం: సీఎం జగన్) గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఆవిష్కృతమై సరిగ్గా ఏడాది. గత ఏడాది అక్టోబర్ 2న సచివాలయ వ్యవస్థకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జీవం పోశారు. కార్యదర్శుల నియామకం చేపట్టి ఈ వ్యవస్థను జనవరి 26న పూర్తి స్థాయిలో ప్రారంభించారు. సమస్త సేవలనూ ప్రజలకు చేరువ చేశారు. సచివాలయ వ్యవస్థతో సరికొత్త విప్లవం తీసుకొచ్చి దేశానికే ఆదర్శంగా నిలిచారు సామాన్యుడు సైతం సమస్యలను వేగంగా, సులభంగా పరిష్కరించుకునేందుకు గ్రామ సచివాలయలు ఉపయోగుపడుతున్నాయి. ప్రభుత్వ సేవలన్నీ గ్రామాలు, వార్డుల్లోనే పొందేలా వెసులుబాటు వచ్చింది. ప్రభుత్వ పథకాలు సైతం వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే దరిచేరుతున్నాయి. ♦సచివాలయ వ్యవస్థ ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా కరప సచివాలయం వద్ద చప్పట్లు కొట్టి సచివాయం ఉద్యోగులు,వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపిన వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు. ♦గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగుల సేవలకు సంఘీభావంగా డిప్యూటీ సీఎం పుష్ప శ్రీ వాణి తన నివాసం లో చప్పట్లు కొట్టి అభినందనలు తెలిపారు. ♦వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగుల సేవలకు సంఘీభావంగా విద్య శాఖ మంత్రి ఆదిములపు సురేష్ తన నివాసంలో చప్పట్లు కొట్టి అభినందించారు. ♦సంవత్సర కాలంలో కుల, మత, పార్టీలకతీతంగా సీఎం జగన్ ఆలోచనలకు అనుగుణంగా ప్రతి సంక్షేమ కార్యక్రమం నేరుగా ప్రజల చెంతకే చేరేలా సచివాలయ వ్యవస్థ, వాలంటీర్లు అద్భుతంగా పని చేసినందుకుగాను రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత రెండు నిమిషాలు చప్పట్లు కొట్టి వారిని అభినందించారు. ♦హోంమంత్రి సుచరిత చప్పట్లతో సంఘీభావం గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ ఏర్పాటై గ్రామ స్వరాజ్యం స్థాపించి నేటికి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా వారు చేస్తున్న నిస్వార్థ సేవకు కృతజ్ఞతగా ఈరోజు గుంటూరు లోని వెంకటేశ్వర విజ్ఞాన్ మందిర్ లో చప్పట్లు కొట్టి వారి సేవలను అభినందించడం జరిగింది. #GramaSwarajyamInAP pic.twitter.com/EYI4MzNPBR — Mekathoti Sucharitha (@SucharitaYSRCP) October 2, 2020 ♦నెల్లూరు: గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లకు చప్పట్లు కొట్టి అభినందనలు తెలిపిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ♦అనంతపురం: సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల సేవలను అభినందిస్తూ పెనుకొండలోని తన నివాసంలో చప్పట్లు కొట్టి ప్రోత్సాహించిన మంత్రి శంకర్ నారాయణ. ♦విజయవాడ: గ్రామ వాలంటీర్ల సేవలకు సంఘీభావం తెలుపుతూ డిప్యూటీ సీఎం కళాత్తూర్ నారాయణ స్వామి తన కుటుంబ సభ్యులుతో సహా కృతజ్ఞతపూర్వకంగా చప్పట్లు కొట్టారు. ♦విశాఖ: గ్రామ,వార్డుసచివాలయ సిబ్బంది, వాలంటరీ వ్యవస్థకు మద్దతుగా చప్పట్లు కొడుతూ వైజాగ్ బీచ్ రోడ్ నుంచి వైస్సార్ విగ్రహం వరకు మహిళలు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్, కలెక్టర్ వినయ్ చంద్, జీవీఎంసీ కమిషనర్ సృజన పాల్గొన్నారు. ♦గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగుల సేవలకు సంఘీభావంగా నగరిలో కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే రోజా చప్పట్లు కొట్టి సంఘీభావం తెలిపారు. సీఎం జగన్ తీసుకొచ్చిన ఈ వ్యవస్థ దేశంలోనే అత్యుత్తమ సేవాలందిస్తోందని రోజా పేర్కొన్నారు. గాంధీజీ స్వప్నం మరియు జగన్ అన్న అశయం అయిన గ్రామ స్వరాజ్యం సాధించడానికి సహకరించిన ప్రతి గ్రామ మరియు వార్డ్ వాలుంటీర్ అలాగే సచివాలయం సిబ్బంది కి కృతజ్ఞతలు 🙏@ysjagan @GSWSOfficial #GramaSwarajyamInAP #APVillageWarriors pic.twitter.com/owtqxhwWS6 — Roja Selvamani (@RojaSelvamaniRK) October 2, 2020 ♦విజయవాడ: సత్యనారాయణ పురం శివాజీ కేఫ్ సెంటర్లో వాలంటీర్ల వ్యవస్థ ఏడాది పూర్తి కావడంతో సీఎం ఆదేశాల మేరకు డివిజన్లో స్థానికులు చప్పట్లు కొడుతున్న దృశ్యం. -
రిలయన్స్ ఆభర్ కలెక్షన్స్
సాక్షి, ముంబై: దేశీయ అతిపెద్ద జువెల్లరీ బ్రాండ్ సంస్థ రిలయన్స్ జ్యువెల్స్ వార్షికోత్సవ కానుగా అద్భుతమైన కలెక్షన్స్‌ను లాంచ్ చేసింది. ‘‘ఆభర్’’ పేరుతో వినూత్న డిజైన్లతో బంగారం, వెండి, వజ్రాభరణాలను అందుబాటులోకి తీసుకొచ్చింది.ఈ సందర్భంగా తమ కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నట్టు రిలయన్స్ జ్యువెల్స్ తెలిపింది. ఒక దశాబ్దానికి పైగా తమ బ్రాండ్‌కు అండగా నిలిచిన వినియోగదారులందరికీ కృతజ్ఞతగా వి వోయూ (మేము మీకు రుణపడి ఉన్నాము ) థీమ్‌తో ఒక ప్రమోషన్ వీడియోను విడుదల చేసింది. కస్టమర్లకు కృతజ్ఞతను చాటేలా ఈ ప్రమోషన్ క్యాంపైన్‌ను స్కేర్క్రో ఎం అండ్ సీ సాట్చి డిజైన్ చేయడం విశేషం. 3-15 గ్రాములతో 54 ఎక్స్ క్లూజివ్ కలెక్షన్స్ అందుబాటులో ఉంచింది. బంగారు ఆభరణాలపై మేకింగ్ చార్జెస్ పై 24 శాతం, డైమండ్ జువెలరీ పై 30 శాతం తగ్గింపుతో ప్రత్యేక వార్షికోత్సవ ఆఫర్‌ను ప్రకటించింది. ఆస్టు 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. అలాగే కోవిడ్-19కు సంబంధించిన భౌతిక దూరం లాంటి అన్ని మార్గదర్శకాలతో తమ సిబ్బందికి శిక్షణ ఇచ్చామని రిలయన్స్ జ్యువెల్స్ ప్రకటించింది. ఆధునిక మహిళల అభిరుచులకు తోడుగా, ఆశ, వెలుగులు నింపేలా లాంతర్ల స్ఫూర్తితో డిజైన్లను రూపొందించినట్టు తెలిపింది. కఠినమైన సమయాల్లో వారి మద్దతు ప్రేమకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని రిలయన్స్ జ్యువెల్స్ సీఈఓ సునీల్ నాయక్ ఒక ప్రకటన విడుదల చేశారు. -
నా కళ్లు నన్ను పట్టిస్తాయి!
సంక్షిప్తం మీ గురించి ఎక్కువమందికి తెలియని రెండు విషయాలు? 1.ఆరవతరగతిలో క్లాస్ ఫస్ట్ వచ్చాను. 2.ఒకానొక సమయంలో నా బరువు 70 కిలోలు! క్షమాపణ చెప్పవలసి వస్తే.... మా అమ్మకు చెబుతాను. కొన్ని వందల పొరపాట్లు చేసి ఉంటాను. అబద్ధాలు ఆడడంలో ప్రావీణ్యం ఉందా? ఎంతమాత్రం లేదు. నేను అబద్ధం ఆడినప్పుడల్లా నా కళ్లు నిజం చెప్పేసి నన్ను పట్టిస్తాయి. మీకు నచ్చిన ప్రదేశం? మనసు ప్రశాంతంగా ఉండే ప్రదేశం. బాగా నచ్చిన ప్రణయగీతం... ‘ఆంధీ’ చిత్రంలోని తేరే బినా జిందగీ సే కోయి... పాట. ఒకే ఒక ఉత్తరం రాయాల్సి వస్తే ఎవరికి రాస్తారు? ఏమని రాస్తారు? నా భర్తకు రాస్తాను. నాకోసం అతను చేసిన ప్రతి పనిని గుర్తు తెచ్చుకొని కృతజ్ఞత చెప్పుకుంటాను. - ట్వింకిల్ ఖన్నా -
కృతఘ్నత
కృతఘ్నతకు మించిన పాపం మరొకటి లేదు. అంతటి హేయానికీ, నీచానికీ ఎవరూ పాల్పడకూడదు. అలా పాల్పడేవారు నరాథములు. మనిషై పుట్టాక ప్రతి ఒక్కరూ తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేస్తూనే వుంటారు. చిన్నవో పెద్దవో పాపాలు చేస్తూనే వుంటారు. వాటన్నింటికీ ఏదో ఒక విధమైన పరిహారం ఉంది కాని, కృతఘ్నతకు మాత్రం లేదు. కృతఘ్నత అంటే, ఎదుటి వారు చేసిన సాయం మరచిపోయి వాళ్లకే హాని తలపెట్టడం. ఇది మహా పాపం. భారతంలో ఇందుకు సంబంధించిన కథ ఒకటి ఉంది. ఒకప్పుడు ఒక సామాన్య గృహస్థుకు డబ్బు సంపాదించాలన్న ఆశ కలిగి కొందరు వర్తకులతో కలసి దూర ప్రాంతానికి వెళ్లాడు. మధ్యలో ఒకచోట దట్టమైన అడవిగుండా నడిచి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు ఒక మదపుటేనుగు వాళ్లను వెంబడించింది. పేద గృహస్థు ఏలాగోఅలా తప్పించుకున్నాడు గాని, మిగిలిన వాళ్లందరూ చనిపోయారు. గృహస్థు పరుగెత్తి చివరకు ఓ చెట్టు కిందకు చేరాడు. దాని నీడన సేదతీరాడు. కాసేపటికి అక్కడికి ఒక ముసలి కొంగ వచ్చింది. పేద గృహస్థు ఆ కొంగతో తన కథంతా చెప్పుకున్నాడు. అది జాలిపడి అతన్ని ఆదరించింది. ఆతిథ్యమిచ్చింది. ఆ రాత్రికి అతను ఆ చెట్టు కిందే విశ్రమించాడు. మరునాడు ఉదయం మళ్లీ ప్రయాణం అయ్యాడు. కొంగ, మిత్రుడికి వీడ్కోలు చెబుతూ ‘ఇదిగో, ఇక్కడికి కొద్ది దూరంలోనే విరూపాక్షుడు అనే రాక్షసుడున్నాడు. పేరుకు రాక్షసుడే కాని చాలా మంచివాడు. నాకు మిత్రుడు. నేను పంపానని చెప్పు. నీకు కావాల్సినంత ధనం ఇస్తాడు’ అని చెప్పింది. గృహస్థు ఆ మాటకు మహదానందపడ్డాడు. తిన్నగా విరూపాక్షుడు దగ్గరికి వెళ్లి తనను ముసలి కొంగ పంపించిందని చెప్పి పరిచయం చేసుకున్నాడు. విరూపాక్షుడు సంతోషించి అతనికి సమృద్ధిగా ధనకనక వస్తు వాహనాలిచ్చాడు. అవన్నీ తీసుకొని గృహస్థు మళ్లీ చెట్టు దగ్గరికి వెళ్లి కొంగతో జరిగిందంతా వివరంగా చెప్పాడు. కొంగ సంతోషించింది. ఆ రాత్రికి తనతో ఉండమంది. గృహస్థు సరేనన్నాడు. రాత్రి అయింది. ఇద్దరు నిద్రకు ఉపక్రమించారు. కాసేపటికి గృహస్థు లేచి ‘రేపు ఉదయాన్నే ప్రయాణం కావాలి. ఎంతో దూరం నడిస్తేగాని ఊరు చేరుకోలేను. మార్గమధ్యంలో ఆకలైతే ఏం చెయ్యాలి?’ అనుకుని ఏ మాత్రం ఆలోచించకుండా పక్కనే పడుకున్న కొంగను పెద్ద బండరాయితో మోది చంపాడు. దాని మాంసాన్ని మూటకట్టుకొని బయలుదేరాడు. విరూపాక్షుడికీ సంగతి తెలిసింది. కోపం పట్టలేకపోయాడు. తన అనుచరులను పిలిచి ‘గృహస్థుని చంపి అతని రక్త మాంసాల్ని కడుపారా ఆరగించండి’ అని ఆదేశించాడు. ‘చేసిన మేలు మరచిపోయి ఉపకారం చేసే వాళ్లకే అపకారం చేసిన మహా పాపీ కృతఘు్నడూ అయిన ఆ గృహస్థు మాంసం మేము ముట్టం’ అని వాళ్లు తెగేసి చెప్పారు. ‘సరే! అలా అయితే ఆ మాంసాన్ని కుక్కలకీ, నక్కలకీ వేయండి’ అన్నాడు విరూపాక్షుడు. వాళ్లు హుటాహుటిన వెళ్లి గృహస్థుని హతమార్చి అతని శవాన్ని ముక్కలు చేసి కుక్కలకూ, నక్కలకూ విసిరేశారు. అవి కూడా ముట్టలేదు. ముఖాలు పక్కకు తిప్పుకున్నాయి. ఈ ప్రపంచంలో మిత్రద్రోహం, కృతఘ్నతలకు మించిన పాపం మరొకటి లేదు. అంతటి హేయానికీ, నీచానికీ ఎవరూ పాల్పడకూడదు. అలా పాల్పడేవారు నరాథములు. - ప్రయాగ రామకృష్ణ -
వివేకం: కృతజ్ఞత తెచ్చిపెట్టుకునేది కాదు
కృతజ్ఞతాభావం అంటే ఏమిటి? మీ కళ్లను మీరు బాగా తెరిచి మీ చుట్టుపక్కల ఉన్న జీవితాన్ని చూస్తే, మీ జీవితం గడవడానికి మిగతా వాటి ప్రమేయం ఎంత ఉందో మీరు స్పష్టంగా చూస్తే, మీకు కృతజ్ఞతాభావం కలగకుండా మానదు. మీ ఎదురుగా పళ్లెం నిండా ఆహారం ఉందనుకుందాం. ఆ ఆహారం అక్కడకు రావడానికి ఎంతమంది పనిచేస్తుంటారో మీకు తెలుసా? విత్తనాలు నాటిన రైతు దగ్గరి నుండీ, ఆ భూమి మీద జరిగే ఎన్నో సంఘటనలు, కోత కోసేవారు, షాప్‌కు తెచ్చేవారు, దాన్ని అమ్మేవారు, దాన్ని అక్కడి నుంచి కొనేవారు, వండేవారు, వడ్డించేవారు... ఇలా దీనిలో ఎంతమంది ప్రమేయం ఉందో చూడండి. నేను దీనికి డబ్బు చెల్లించా కాబట్టి, నాకది వచ్చి తీరాల్సిందే అని కాకుండా, మీ ఊపిరి మొదలుకొని ఆహారం వరకూ మీ జీవితంలో మీరు ఆస్వాదించే అనుభూతి చెందే ప్రతి విషయాన్నీ ఈ విధంగా చూడండి. ఈ మొత్తం ప్రక్రియలో మనుషులు లేకపోయినా లేదా ఉన్నవాళ్లు చేయాల్సింది చేయకపోయినా ఏమీ జరగవు. భూగ్రహం, ఈ గ్రహానికి ఆవల ఉన్న ప్రాణులు కూడా మిమ్మల్ని ఎలా పోషిస్తున్నవో, ఎలా సాయపడుతున్నవో మీరు కళ్లు తెరిచి, చూడండి. మీరు ఇదంతా చూస్తే అప్పుడు కృతజ్ఞతాభావాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉండదు. కృతజ్ఞత అనేది తెచ్చిపెట్టుకునే ఒక గుణం కాదు. మీకు అందుతున్న వాటన్నింటినీ చూసి, మీరు తబ్బిబ్బైనప్పుడు, మీ నుంచి పెల్లుబికే భావన కృతజ్ఞత. అది తెచ్చిపెట్టుకునే గుణమైతే, ఘోరంగా ఉంటుంది. కృతజ్ఞతంటే కేవలం ‘థాంక్యూ, థాంక్యూ’ అని అనడం కాదు. ప్రస్తుతం మీరు జీవించి ఉండటానికీ, క్షేమంగా ఉండటానికీ సృష్టిలో ఉన్న అనేకం తోడ్పడుతున్నాయి. మీరు వాటిని కేవలం సంఘటనలుగా గమనించినా, ఆ మనుషుల మీద, వస్తువుల మీద కృతజ్ఞతాభావం ఉప్పొంగక మానదు. మీకు వారితో ఎటువంటి సంబంధం లేకపోయినా, తెలియకపోయినా మీ జీవితంలోని ప్రతి క్షణానికీ వారు అన్నీ ఇచ్చారు. కాబట్టి, మీరు కళ్లు తెరిచి మీ చుట్టూ ఉన్న జీవితం ఎలా జరుగుతోందో చూస్తే, మీరు కృతజ్ఞతాభావంతో ఉండకుండా ఎలా ఉంటారు? మీరు మరీ గర్వంతో జీవిస్తూ, ఈ భూమికే రాజునని అనుకుంటే, మీరు ప్రతిదీ కోల్పోతారు. మీరు పూర్తిగా మీ గురించిన ఆలోచనలతోనే నిండిపోయి ఉంటే, మీరు మొత్తం జీవన ప్రక్రియనే అనుభవించలేరు. అలా కాకుండా, మీరు పూర్తి గమనికతో ఉంటే, కృతజ్ఞతతో ఉప్పొంగిపోతారు. మీరు కృతజ్ఞతతో ఉంటేనే, మీరు ఏదైనా స్వీకరించడానికీ అర్హులుగా ఉంటారు. మీకు ఎవరిపట్లయినా కృతజ్ఞతాభావం ఉంటే, మీరు వాళ్లని గౌరవంగా చూస్తారు. మీరు దేన్నైనా గౌరవంగా చూస్తే, మీరు చాలా స్వీకారభావంతో ఉంటారు. మొత్తం యోగా ప్రక్రియ ఉద్దేశ్యమంతా మీకు కూడా తెలియని ఎన్నో రీతులలో లోతుగా, లోలోతుగా మిమ్మల్ని స్వీకారభావంతో ఉండేలా చేయడమే. అదే దాని లక్ష్యం. కాబట్టి, కృతజ్ఞతతో ఉప్పొంగిపోవడమే స్వీకార భావంతో ఉండటానికి ఒక అందమైన దారి. సమస్య - పరిష్కారం పిల్లలు వీడియో గేమ్‌లు, మొబైల్ గేమ్‌లకు అలవాటు పడిపోతున్నారు. ఇవి పుస్తకాలకు ప్రత్యామ్నాయమా? - జి.కరుణ, హైదరాబాద్ సద్గురు: పుస్తకాలు చదవడం ఒక సంస్కృతిగా ప్రోత్సహించాలి. చదవడం ఎంతో గాఢమైనది, లోతైనది. చూసేదాని కన్నా చదవటంలో ఎంతో గంభీరత ఉంది. పుస్తకాలు చదివేవారు ప్రశాంత చిత్తులూ, జీవితం గురించి మరింత లోతుగా ఆలోచించేవారూ కాగలుగుతారు. చదువులో వారు చేసేది ఒక రకమైన ధారణ. మీ మనసుని దేనిలోనో కేంద్రీకరించడమే ధారణ అంటే. అది మెదడు పనిచేసే విధానాన్ని వృద్ధి చేస్తుంది. ప్రస్తుతం ఈ ఎలక్ట్రానిక్ ఉపకరణాలు అన్నింటినీ అధిగమిస్తున్నాయి. అటువంటి పరిస్థితులలో మనం ఈ పుస్తక పఠనం మానకుండా ఉండటం ముఖ్యం. ప్రస్తుతం ప్రజలు జీవితాన్ని గాఢంగా అర్థం చేసుకోలేకపోతున్నారు. జీవితంలోని గంభీరత లోపిస్తున్నది. అందరూ పైపైనే చూస్తున్నారు. దృశ్య శ్రవణ సాధనాలే దానికి కారణం అనుకుంటాను. వాటికి నేను వ్యతిరేకం కాను, కాని అవి చదువుకి ప్రత్యామ్నాయం కావు.