
కన్యాదానం చేస్తున్న హన్మయ్య దంపతులు
సాక్షి, స్టేషన్‌ఘన్‌పూర్: తనకు యవ్వనంలో అశ్రయం కల్పించడంతో పాటు ప్రేమ వివాహానికి సహకరించిన వారిపై ఓ వ్యక్తి కృతజ్ఞతభావం చూపాడు. వారి మనవడి వివాహానికి హాజరై వధువు తరఫున పెళ్లి పెద్దగా నిలిచి కన్యాదానం చేయడంతో పాటు ఖర్చులకు రూ.5లక్షలు అందించాడు. వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లికి చెందిన హన్మయ్య తన 20వ ఏటా కులాంతర వివాహం చేసుకున్నాడు. ఆ సమయంలో ఇంట్లో పెద్దలకు భయపడి జఫర్‌గఢ్ మండలం తమ్మడపల్లికి రాగా తండా వాసులు వారికి ఆశ్రయం కల్పించి ఆసరాగా నిలిచారు. ఈ క్రమంలో హన్మయ్య వ్యాపారంలో రాణిస్తూ జీవితంలో స్థిరపడ్డాడు.
చదవండి: (‘అమ్మా లే అమ్మ.. నాన్నా లే నాన్న.. మమ్మల్ని ఎవరు చూస్తారు')
కాగా తన ప్రేమ వివాహ సమయంలో సహకరించిన గిరిజనుల మనమడు అనిల్ వివాహం నిశ్చయం కాగా ఆ కుటుంబ రుణం తీర్చుకోవాలని హన్మయ్య సంకల్పించాడు. వధువు పూజితకు తండ్రి లేకపోవడంతో ఆమెకు తండ్రి స్థానంలో నిలిచి వరుడు అనిల్ కాళ్లు కడిగి కన్యాదానం చేశాడు. శనివారం స్థానిక కేఆర్ గార్డెన్‌లో జరిగిన వివాహంలో ఆయన కన్యాదానం చేసి రూ.5లక్షలు అందించారు. స్వయంగా సేవా గుణం ఉన్న హన్మయ్య పెద్దపల్లిలో సొంత ఖర్చులతో పాఠశాలను కట్టించడమే కాకుండా విద్యార్థులకు పుస్తకాలు, సైకిళ్లు అందించి సమాజ సేవ చేస్తున్నాడు. కాగా వధువు తరఫున పెద్దగా నిలిచి కన్యాదానం చేయడంపై అందరూ అభినందించారు.
చదవండి: (పాము విషం విక్రయం గుట్టురట్టు.. ఒక కిలో పాము విషం కోటిన్నర..?!)