కృతఘ్నత
కృతఘ్నతకు మించిన పాపం మరొకటి లేదు. అంతటి హేయానికీ, నీచానికీ ఎవరూ పాల్పడకూడదు. అలా పాల్పడేవారు నరాథములు.
మనిషై పుట్టాక ప్రతి ఒక్కరూ తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేస్తూనే వుంటారు. చిన్నవో పెద్దవో పాపాలు చేస్తూనే వుంటారు. వాటన్నింటికీ ఏదో ఒక విధమైన పరిహారం ఉంది కాని, కృతఘ్నతకు మాత్రం లేదు. కృతఘ్నత అంటే, ఎదుటి వారు చేసిన సాయం మరచిపోయి వాళ్లకే హాని తలపెట్టడం. ఇది మహా పాపం. భారతంలో ఇందుకు సంబంధించిన కథ ఒకటి ఉంది.
ఒకప్పుడు ఒక సామాన్య గృహస్థుకు డబ్బు సంపాదించాలన్న ఆశ కలిగి కొందరు వర్తకులతో కలసి దూర ప్రాంతానికి వెళ్లాడు. మధ్యలో ఒకచోట దట్టమైన అడవిగుండా నడిచి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు ఒక మదపుటేనుగు వాళ్లను వెంబడించింది. పేద గృహస్థు ఏలాగోఅలా తప్పించుకున్నాడు గాని, మిగిలిన వాళ్లందరూ చనిపోయారు. గృహస్థు పరుగెత్తి చివరకు ఓ చెట్టు కిందకు చేరాడు. దాని నీడన సేదతీరాడు. కాసేపటికి అక్కడికి ఒక ముసలి కొంగ వచ్చింది. పేద గృహస్థు ఆ కొంగతో తన కథంతా చెప్పుకున్నాడు. అది జాలిపడి అతన్ని ఆదరించింది. ఆతిథ్యమిచ్చింది. ఆ రాత్రికి అతను ఆ చెట్టు కిందే విశ్రమించాడు. మరునాడు ఉదయం మళ్లీ ప్రయాణం అయ్యాడు. కొంగ, మిత్రుడికి వీడ్కోలు చెబుతూ ‘ఇదిగో, ఇక్కడికి కొద్ది దూరంలోనే విరూపాక్షుడు అనే రాక్షసుడున్నాడు. పేరుకు రాక్షసుడే కాని చాలా మంచివాడు. నాకు మిత్రుడు. నేను పంపానని చెప్పు. నీకు కావాల్సినంత ధనం ఇస్తాడు’ అని చెప్పింది.
గృహస్థు ఆ మాటకు మహదానందపడ్డాడు. తిన్నగా విరూపాక్షుడు దగ్గరికి వెళ్లి తనను ముసలి కొంగ పంపించిందని చెప్పి పరిచయం చేసుకున్నాడు. విరూపాక్షుడు సంతోషించి అతనికి సమృద్ధిగా ధనకనక వస్తు వాహనాలిచ్చాడు. అవన్నీ తీసుకొని గృహస్థు మళ్లీ చెట్టు దగ్గరికి వెళ్లి కొంగతో జరిగిందంతా వివరంగా చెప్పాడు. కొంగ సంతోషించింది. ఆ రాత్రికి తనతో ఉండమంది. గృహస్థు సరేనన్నాడు. రాత్రి అయింది. ఇద్దరు నిద్రకు ఉపక్రమించారు. కాసేపటికి గృహస్థు లేచి ‘రేపు ఉదయాన్నే ప్రయాణం కావాలి. ఎంతో దూరం నడిస్తేగాని ఊరు చేరుకోలేను. మార్గమధ్యంలో ఆకలైతే ఏం చెయ్యాలి?’ అనుకుని ఏ మాత్రం ఆలోచించకుండా పక్కనే పడుకున్న కొంగను పెద్ద బండరాయితో మోది చంపాడు. దాని మాంసాన్ని మూటకట్టుకొని బయలుదేరాడు.
విరూపాక్షుడికీ సంగతి తెలిసింది. కోపం పట్టలేకపోయాడు. తన అనుచరులను పిలిచి ‘గృహస్థుని చంపి అతని రక్త మాంసాల్ని కడుపారా ఆరగించండి’ అని ఆదేశించాడు. ‘చేసిన మేలు మరచిపోయి ఉపకారం చేసే వాళ్లకే అపకారం చేసిన మహా పాపీ కృతఘు్నడూ అయిన ఆ గృహస్థు మాంసం మేము ముట్టం’ అని వాళ్లు తెగేసి చెప్పారు. ‘సరే! అలా అయితే ఆ మాంసాన్ని కుక్కలకీ, నక్కలకీ వేయండి’ అన్నాడు విరూపాక్షుడు. వాళ్లు హుటాహుటిన వెళ్లి గృహస్థుని హతమార్చి అతని శవాన్ని ముక్కలు చేసి కుక్కలకూ, నక్కలకూ విసిరేశారు. అవి కూడా ముట్టలేదు. ముఖాలు పక్కకు తిప్పుకున్నాయి. ఈ ప్రపంచంలో మిత్రద్రోహం, కృతఘ్నతలకు మించిన పాపం మరొకటి లేదు. అంతటి హేయానికీ, నీచానికీ ఎవరూ పాల్పడకూడదు. అలా పాల్పడేవారు నరాథములు.
- ప్రయాగ రామకృష్ణ