ఆడవాళ్ళు ఆయన్ని ‘బాబాయిగారు’ అని పిలుస్తారు. మగవాళ్ళలో కొందరు ‘రెడ్డిగారు’ అని పిలిస్తే, మరికొందరు రావుగారు అని, ఇంకొందరు మూర్తిగారు అని పిలుస్తారు. కుర్రాళ్లు ‘అంకుల్’ అని పిలుస్తారు. ఏ పేరుతో పిలిచినా, ఆయన అందర్నీ నవ్వుతూ పలకరిస్తూ, వాళ్ళు చెప్పిన పని చేసుకుంటూ పోతాడు .ఆయన అసలు పేరు ఎవరికీ తెలియక పోయినా, ఆయన మొబైల్ నెంబరు మాత్రం ఆ అపార్టుమెంటు వాసులందరికీ సుపరిచితమే!
ఆ ఒక్క అపార్టుమెంటే కాదు, అక్కడ ఉన్న నాలుగైదు అపార్టుమెంట్లలో కరెంటు రిపేర్లు, నీళ్ళ ట్యాపులు, సెప్టిక్ టాంకులు, బాత్రూమ్ కమోడ్లు, చెక్క పనులు– ఇలా ఒకటేమిటి, సమస్త రిపేర్లకు ఎవరైనా సరే పిలిచేది ఆయన్నే! ఇంత పెద్ద నగరంలో ఆయన తప్ప ఇంకొకళ్ళు లేరా అని మీకు అనుమానం రావచ్చు. రిపేర్లు ఎవరైనా చేస్తారు. కాని, అడిగిన వెంటనే రావటం; సకాలంలో పని పూర్తి చెయ్యటం; డబ్బులు డిమాండు చెయ్యకుండా ఎవరు ఎంతిచ్చినా చిరునవ్వుతో ‘పర్లేదులెండి’ అంటూ తీసుకోవటం వల్ల అందరూ వాళ్ళ ఇళ్ళలో ఏ రిపేరు పని వచ్చినా ఆయన్నే పిలుస్తారు.
కొంతమంది ఆయన మంచితనాన్ని అలుసుగా తీసుకుని, అన్నీ కలిపి ఒకేసారి ఇస్తామని, పని చేయించుకుని కూడా డబ్బులిచ్చే వాళ్ళు కాదు. ఆయన కూడా, ‘అలాగేనండి, మీ దగ్గర డబ్బులెక్కడికి పోతాయి’ అంటూ నవ్వేసి వెళ్ళిపోయేవాడు .‘అదేమిటండీ వాళ్ళు అలా మీ చేత పని చేయించుకుని, డబ్బులు తరువాత ఇస్తామంటే ఊరుకుంటారు’ అని అడిగితే, ‘ఏమోలే సార్! వాళ్ళకే ఇబ్బంది వుందో! వాళ్ళకు వీలైనప్పుడు ఇస్తారు లెండి’ అనేవాడు.
నాకు మాత్రం ఇతరుల కష్టం ఉంచుకోవటం ఇష్టం వుండదు. ఏ చిన్న పని చేసినా, మా ఇంట్లో ఆయన అడక్క ముందే డబ్బులిచ్చేసేవాడిని. ఆయనే , ‘ఎందుకు సార్, నేనేం పెద్ద పని చేశానని ఇంత పెద్దమొత్తం ఇచ్చారు’ అంటూ తిరిగి ఇవ్వబోయే వాడు. ఆయన మంచితనాన్ని నేనేనాడూ అలుసుగా తీసుకోలేదు. ఆయనంటే నాకు మా ఇంట్లో మనిషి అనే భావన వుండేది.
మా నాన్నది ఆయనది ఒకటే వయసు. నాన్న లేకపోవటం వల్ల అప్పుడప్పుడు ఆయనతో మాట్లాడితే నాన్నతో మాట్లాడినట్లే వుండేది. మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా ఆయన హాజరు తప్పనిసరి. భోజనానికి రమ్మని, వాళ్ళ ఆవిడని కూడా తీసుకు రమ్మని మా ఆవిడ మరీ మరీ చెప్పేది. కాని ఆయన మాత్రం ఒక్కడే, సిగ్గుపడుతూ వచ్చేవాడు, ఆ రోజు మా ఇంట్లో ట్యాపు రిపేరు చేసి వెళ్తు వెళ్తూ, ‘సార్, ఓ సెకండ్ హ్యాండ్ సింగిల్ బెడ్‌రూమ్ ఫ్లాటు చౌకగా అమ్మకానికి వచ్చింది’ అన్నాడు.
‘మరింకేం బాబాయిగారు, తీసుకోక పోయారా?’ మా ఆవిడ ప్రోత్సహించింది.
‘అదేనమ్మా! తీసుకుందామనే వుంది. కాకపోతే, ఓ యాభైవేలు తగ్గాయి’ నసుగుతూ నావంక చూశాడు.
‘యాభై వేలే కదండి, సర్దుతాలెండి’ పెద్దాయనకు భరోసా ఇచ్చాను.
‘సంతోషం సార్! మీ బాకీ చిన్నగా తీర్చుకుంటాను, వుంటాను‘ అంటూ నిష్క్రమించాడు.
‘ఆయన గుమ్మం దాటి వెళ్ళాడని నిర్ధారించుకుని, ‘ఏమిటి, నన్నడగకుండా అలా మాట ఇచ్చేయటమేనా?’ మా ఆవిడ నిలదీసింది.
‘నువ్వే కదోయ్, బాబాయిగారు! తీసుకోండి అన్నావు. నీకు ఇష్టమేనని మాట ఇచ్చాను’ చిన్నగా గొణిగాను.
‘ఎదో మాటవరసకు అంటాము. అన్నంత మాత్రాన ఉళ్ళోవాళ్ళకి ఊరికినే డబ్బులిచ్చేస్తామా, ఏమిటి?’ అంది మా ఆవిడ.
‘ఆయన మనకు ఎప్పటినుండో తెలుసు. ఆయన్ని చూస్తే మా నాన్నను చూసినట్టే వుంటుంది. మా నాన్నకు సాయం చేశాను అనుకో’ అన్నాను. ఆ మాటలతో, ఆవిడ చల్లబడింది.
‘ఔను, మనల్ని ఉబ్బులడుగుతున్నాడు, ఆయనకు పిల్లలు లేరా?’ అనుమానంగా అడిగింది.
‘లేకేం, వున్నాడులే ఓ సుపుత్రుడు. హైదరాబాద్‌లో ఏదో పని చేస్తుంటాడు. వాడికే ఈయన నెలనెలా ఉబ్బులు పంపిస్తుంటాడు. ఇంక వాడేం సాయం చేస్తాడు?’ తేల్చి పారేశాను
‘పెళ్ళయిందా?’
‘ఆ అవ్వకేం, అయ్యింది. ఒక పిల్లాడు కూడా. వాడే సరిగ్గా వుంటే, ఆయనకు ఈ తిప్పలెందుకు చెప్పు?’ శ్రీమతికి అంతా వివరంగా చెప్పిన తరువాత ఇంక ఆవిడ మౌనంగావుండిపోయింది.
‘అంతా కలిపి ఒకేసారి ఇస్తాం లెండి‘ ఎదురింటి ఆవిడ ఏమి రిపేరు చేయించుకుందో ఏమో, ఆయనతో అంటూ వుంటే, వరండాలో కూర్చున్న నా చెవిన బడింది
‘లేదమ్మా, కాస్త అవసరం పడింది. ఈమధ్యే ఓ ఇల్లు కొనుక్కున్నాను. అప్పలున్నాయి, తీర్చాలి’ ఆయన మాటలు ఆవిడకే కాదు, నాకు ఆశ్చర్యం అనిపించినా, నా అప్పు తీరబోతుందని సంతోషం వేసింది.
‘అదేమిటండీ. మేమిచ్చే పది, ఇరవైతోనే మీ అప్పులన్నీ తీరతాయా?’ నిష్ఠూరంగా అందావిడ.
‘లేదండి, పాతబాకీ, ఇప్పటిదీ అన్నీ కలిపి రెండువేల దాకా అయ్యిందండీ మీ బిల్లు’ చెప్పాడు పెద్దాయన.
‘రెండువేలా? అంత ఎందుకు అవుతుందండి?’ అంటూ రుసరుస లాడింది.
‘లేదమ్మా, ఇదిగో మీకు ఏమేం పనులు చేశానో, వాటికి సామాన్లు ఎంతయ్యాయో అన్నీ వివరంగా రాశాను’ అంటూ జేబులోంచి ఒక కాగితం తీసి ఆవిడకిచ్చాడు పెద్దాయన.
ఓ క్షణం ఆ కాగితం వంక ఎగాదిగా చూసి, ‘ఇవన్నీ మేము చేయించుకున్నామా?’ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ‘అవునమ్మా! మీరు చేయించుకున్నవే! పక్కన తారీఖులు కూడా వేశాను’ అన్నాడు పెద్దాయన.
ఇక తప్పదన్నట్టు, ‘సరేనండి, ఇంట్లో మావారు లేరు. సాయంత్రం రండి’ అంటూ తలుపేసుకుంది.ఇక చేసేదేమీలేక పెద్దాయన చిన్నగా నిట్టూరుస్తూ మెట్లు దిగి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయాడని నిర్ధారించుకుని, బయటకొచ్చి, ఒకసారి అటూ ఇటూ చూసి పక్కింటివాళ్ళ తలుపు కొట్టింది. పక్కింట్లో నుంచి బయటకొచ్చిన మరో పెద్దావిడతో ‘చూశారా పిన్నిగారు! ఆయనేదో మంచివాడు అనుకున్నామా’ అంటూ ఆగింది.
‘ఇప్పుడేమైంది’ అన్నట్టు ఆవిడ మొహం పెట్టింది.
‘మనకేదో ఉచితంగా సాయం చేస్తున్నాడనుకున్నాం కాని, ఈరోజు రెండువేలు బిల్లంటూ పట్టుకొచ్చాడు’ అంది కాస్త నీరసంగా.
‘అవునమ్మ, మాకూ వేశాడు, ఎప్పుడో మా తాతలకాలం నుండి రిపేర్లు చేస్తున్నాడట! మూడువేలు అంటూ వసూలు చేసుకెళ్ళాడు’ అంది పక్కింటి పెద్దావిడ మరింత నీరసంగా.
ఇద్ద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకుంటే, అది ప్రపంచం మొత్తం పాకిపోతుంది అన్నట్టు ఆ వార్త ఆగమేఘాల్లో అపార్టుమెంటు మొత్తం పాకిపోయింది. ప్రతి ఒక్కళ్ళూ ఆయన్ని తిట్టు కోవటమే! దాదాపు ఓ యాభై ఇళ్ళవాళ్లైనా పెద్దాయనకు బాకీ వుండి వుంటారు. ఇంటికి రెండువేలు వేసుకున్నా, లక్ష అవుతుంది. అంటే నా బాకీ త్వరగా తీరబోతుంది అని ఆనందంగా వున్నా, అందరూ ఆయన్ని తిట్టుకోవటం కాస్త బాధ అనిపించింది. ఈ మనుషుల మనస్తత్వమే అంత. ఉచితంగా సేవలు చేస్తే రాముడు, దేవుడు అంటూ పొగుడుతారు.
అదే చేసిన పనికి డబ్బు అడిగితే రాక్షసుడిలా చూస్తారు. ఆరోజు నుంచి అపార్టుమెంట్‌లోని వాళ్ళు తమ పనులకు ఆయన్ని పిలవటం తగ్గించారు. అసలు నన్నడిగితే తప్పు వాళ్ళది కాదు, పెద్దాయనదే! పని చేసినప్పుడు ఎప్పటికప్పుడు డబ్బులు తీసుకునుంటే ఎవ్వరికీ ఏ బాధ వుండేది కాదు. అంతా కలిపి ఒక్కసారి కట్టమని అడిగితే, ఇప్పుడు అందరూ ఆయన్ని ఓ అప్పులోడి కింద చూస్తున్నారు. బహశా అసలు డబ్బులు అడగడులే అనుకున్నారో ఏమో!
ఎవరిదో అన్‌నోన్ నంబరు అదే పనిగా రింగ్ అవుతుంది. ఎవరై వుంటారబ్బా అని అనుకుంటూ ఎత్తాను.
‘సార్ శ్రీనివాసరావుగారేనా? ‘అవతలి నుంచి ఎవరో ఆడగొంతు.
‘అవునండి!’ సమాధానం ఇచ్చాను.
‘ఉదయ్ హాస్పిటల్స్ నుంచండి, మీ బంధువు ఒకాయన రాత్రి గుండెనొప్పితో హాస్పిటల్‌లో చేరారు. ఎవరన్నా వున్నారా అని అడిగితే మీ నంబరు ఇచ్చారు’ చెప్పుకు పోతోంది
‘నా బంధువా? గుండెనొప్పితో హాస్పిటల్‌లో చేరాడా? ఎవరై వుంటారు?’ అప్పటి దాకా ప్రశాంతంగా వున్న నా మనసులో ఆందోళన మొదలైంది.
వెంటనే బయలుదేరి, పది నిమిషాల్లో ఉదయ్ హాస్పటల్ రిసెప్షన్ కౌంటర్ ముందు వాలాను. వాళ్ళను అడిగితే, ‘పేషంట్ పేరేమిటండి?’ అనడిగింది రిసెప్షనిస్టు. నిజమే! పేషంట్ పేరేమిటి? గాభరాలో అడగటం మర్చిపోయాను.
‘తెలియదండి, మీ దగ్గర నుంచే నాకు కాల్ వచ్చింది’ సమాధానం ఇచ్చాను. నా సమాధానానికి నా వంక విచిత్రంగా చూస్తూ, రిజిస్టరులో వెతకటం ప్రారంభించింది. ఓ రెండు నిమిషాల తరువాత, ‘ఐసీయూలో వున్నారు వెళ్ళండి’ అంది. ఆ జవాబు విన్న నేను ‘ఐసీయూలోనా!’ మనసులో మరింత ఆందోళనతో ఐíసీయూ వైపు నడిచాను. అప్పుడు కూడా పేషంట్ పేరు అడగటం మర్చిపోయాను.
ఐసీయూ లోపలకు వెళ్ళి అడిగితే, వాళ్ళు కూడా పేషంట్ పేరేమిటి అని అడిగితే ఏం చెప్పాలో అర్థం కాక, ‘రాత్రి చేరారు’ అన్నాను. ఎదురుగా వున్న బెడ్ వంక చూపించింది అక్కడ వున్న నర్సు. కర్టెన్ వేసి వుండటంతో పేషంటు కనపడట్లేదు నాకు. మెల్లిగా రెండడుగులు వేసి, కర్టెన్ పక్కకు తోసి లోపలికి అడుగుపెట్టాను. ఎదురుగా పెద్దాయన, బెడ్ మీద, ఒక్కసారిగా గుండె ఝల్లుమంది. ముఖానికి ఆక్సిజన్ మాస్క్ పెట్టి వుంది, ఛాతీ నిండా ఈసీజీ వైర్లు బిగించి వున్నాయి. పక్కన ఈసీజీ మెషిన్ బీప్.. బీప్.. అంటోంది.
బహుశా, నిద్రపోతున్నాడు అనుకుంటా కళ్ళు మూసి వున్నాయి. దగ్గరకు వెళ్ళి నిలబడ్డా, అలికిడికి కళ్ళు తెరిచాడు పెద్దాయన. ఏదో చెప్పాలనుకుంటున్నాడు కాని, ముఖానికి ఆక్సిజన్ మాస్క్ వుండటం వల్ల సాధ్యం కాలేదు. కాని కళ్ళ నుండి కారుతున్న కన్నీళ్ళు మాత్రం మాట్లాడతున్నాయి.‘ఉళ్ళో అందరికీ సహాయం చేసే నాకెందుకు ఇలా అయ్యింది’ అని అడుగుతున్నట్టు వున్నాయి పెద్దాయన చూపులు. ఇంతలో ఒక పెద్దావిడ నా దగ్గరకు వచ్చి నమస్కారం చేసింది, నావంక చూస్తూ. బహుశా, ఆయన భార్య అనుకుంటా!
‘బాబుగారు! రాత్రి గుండెల్లో బాగా నొప్పిగా వుంది అంటే, వెంటనే హాస్పిటల్లో చేర్చాను. ఆ వెంటనే మీకు కబురు పెట్టమంటే పెట్టాను’ అంది గద్గద స్వరంతో ‘డాక్టర్లు ఏమన్నారు?’ అడగలేక అడిగాను.
‘స్టెంట్ వెయ్యాలి, ఓ లక్షదాకా అవుతుంది అన్నారు’ సమాధానమిచ్చింది ‘మీ అబ్బాయికి కబురు పెట్టారా?’ ఓ క్షణం మౌనంగా వుండి పోయిందావిడ.
‘ఏమ్మా, మీ అబ్బాయికి ..’ మాట పూర్తయ్యే లోపు ‘చెప్పాను బాబు, నే వచ్చి చేసేదేముంది అన్నాడు’ తలదించుకుని జవాబిచ్చింది.
బహుశా ఇలాంటి కొడుకును ఎందుకు కన్నానా అని సిగ్గుపడుతోంది కాబోలు. ఆవిడ చెప్పిన జవాబుకి నా మనసంతా ఎవరో చెయ్యి పెట్టి కెలికినట్టు అనిపించింది.ఇంతలో పెద్దాయన మెల్లగా నా చెయ్యి మీద చెయ్యి వేసి, నా వంకే చూడటం మొదలు పెట్టాడు. ఆ చూపులలో భావం నాకు అర్థమయ్యింది.
‘ఫరవాలేదమ్మా, అధైర్యపడకండి. నేను డాక్టరుతో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేస్తాను’ అన్నాను.నా మాటలకు ఇద్దరి కళ్ళల్లో మెరుపులు మెరవటం స్పష్టంగా చూశాను.
‘అంతదాకా ఇది వుంచండి’ అంటూ, నా పర్సు తీసి రెండువేలు ఆవిడకిచ్చాను. ఆవిడ వాటిని అందుకుంటూ, నాకు నమస్కారం చేసింది కృతజ్ఞతతో. ‘మరి నేను వెళ్ళి వస్తాను, భయపడకండి. సాయంత్రం మళ్లీ వస్తాను’ అంటూ అక్కడి నుంచి బయట పడ్డాను.
‘లక్ష రూపాయలా, మొన్నే కదండీ యాభైవేలు ఇచ్చారు. అవే ఇంకా తీర్చలేదు. ఆయనేమన్నా మనకు చుట్టమా పక్కమా? పోనీ ఏమన్నా దూరపు బంధువా?’ అంది కాస్త చిరాగ్గా మా ఆవిడ. నేను మాట ఇచ్చి తప్పు చేశాను అన్నట్లు నావంక చూసింది. ‘ఆయన మనకు చేస్తున్న సహాయం ముందు ఇదెంత చెప్పు?’ అన్నాను కాస్త శాంతపరుస్తూ.
‘మనకొక్కళ్ళకేనా? ఊళ్ళో అందరికీ చేస్తున్నాడు. అయినా ఎప్పటికప్పుడు డబ్బులిచ్చేçస్తూనే ఉన్నాముగా’అంది లెక్క లేస్తూ. ‘ఇచ్చామనుకో, మనిషిని అలా చూస్తూ చూస్తూ వదిలెయ్య లేక’.. ఆ మాత్రం స్వేచ్ఛ లేదా అని మనసులో అనుకుంటూ గొణిగాను ‘అసలు కొడుక్కే పట్టనప్పుడు మనకెందుకండీ?’
మా ఆవిడ ప్రశ్నకు ఏం జవాబు చెప్పాలో అర్థంకాక మౌనంగా వుండిపోయాను. ఓ నిమిషం తరువాత, మా ఆవిడే, ‘పోనీ అపార్ట్ట్‌మెంట్‌లో వాళ్ళందరినీ తలా కొంత సాయం చెయ్యమని అడుగుదాము’ అని సలహా ఇచ్చింది. ఆ సలహా ఏదో బాగుందనిపించి, వెంటనే అపార్ట్‌మెంట్ సెక్రటరీకి ఫోన్ చేసి విషయం చెప్పాను. వెంటనే ఆయన అర్జంటు మీటింగ్ ఏర్పాటు చేసి, విషయం అందరి ముందు వుంచాడు.
‘దీనికా మీరు అర్జంటు మీటింగ్ ఏర్పాటు చేసింది? నేను ఇంకా ఏదో అనుకున్నా’ వాళ్ళలో ఓ వ్యాపారస్థుడు వెకిలి నవ్వు నవ్వుతూ అన్నాడు.
‘మేం ఇవ్వాల్సింది ఇచ్చేశాం. ఇంకేమీ బాకీలేదు’ ఎదురింటాయన కుండ బద్దలు కొట్టాడు.
‘అపార్ట్‌మెంటు సర్వీసు చార్జీలే కట్టటం కష్టంగా వుంది. ఇంకా దానాలు, ధర్మాలు ఎక్కడ చేస్తాం’ అంటూ పక్కింటాయన లేచి వెళ్ళి పోయాడు.
‘డబ్బులు లేనప్పుడు, ప్రైవేటు హాస్పిటల్‌లో చేరటం దేనికి, ప్రభుత్వ ఆసుపత్రిలో చేరితే సరిపోయేది కదా, ఆరోగ్యశ్రీ కుడా వస్తుంది’ ఓ ఉచిత సలహా పడేశాడు ఆఫీసర్ కేడర్‌లో పనిచేసే ఒకాయన.
‘మెన్ననేగా ఇల్లు కొన్నాడు. అది తాకట్టు పెట్టుకుంటే సరి, ఇలా మనల్ని దేబిరించటం ఎందుకు’ మరో రిటైర్డ్ ఆఫీసర్.
ఇలా తలా ఒక మాట విసిరి అక్కడి నుంచి అందరూ నిష్క్రమించారు. ఇంతకాలం పెద్దాయన చేత సేవలు చేయించుకున్న వీళ్ళకు ఇప్పుడు ఆయన అక్కరలేని మనిషి అయ్యాడు. ఏ మనిషైనా అంతే అవసరం ఉన్నంత వరకే, అవసరం తీరగానే అక్కరలేని మనుషులుగా మారిపోతారు. వాళ్ళ మాటలు, ప్రవర్తనతో నాకు మనుషులంటేనే అసహ్యం వేసింది. తోటి మనిషి ఆపదలో వుంటే సాయం చెయ్యకపోగా, ఇలాగేనా మాట్లాడేది అని నాలో నేనే మనిషిగా పుట్టినందుకు నన్ను నేను తిట్టుకున్నాను.
నా పరిస్థితి అర్థమయిన వాడిలా, ‘సార్! అపార్టుమెంట్ వెల్ఫేర్ ఫండ్ నుండి ఓ పదివేలు ఇవ్వగలను’ అన్నాడు సెక్రటరీ.
‘దానికైనా వీళ్ళందరూ ఒప్పుకోవాలిగా!’ అన్పాను అనుమానంగా.
‘గణేశ్ నవరాత్రుల ఖాతాలో రాసేస్తాను, ఫరవాలేదు లెండి’ అన్నాడు
గణేశ్ నవరాత్రులంటే, కిక్కురుమనకుండా వేలకు వేలు చందాలిస్తారు. ఓ మనిషి ప్రాణం పోతోంది సాయం చెయ్యండి అంటే, ఒక్కరూ ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. ఏం మనుషులో ఏమో! ఎక్కడికి పోతోంది ఈ లోకం అనుకుంటూ, సెక్రటరీ ఇచ్చిన పదివేలు తీసుకుని అక్కడి నుంచి కదిలాను.
నేను ఎదురుపడగానే, ‘ఏమైంది?’ అంటూ అడిగింది మా ఆవిడ. జరిగింది మొత్తం చెప్పాను.
‘మరి ఇప్పుడేం చేద్దామని అనుకుంటున్నారు?’ ప్రశ్నించింది.
‘అదే అర్థం కావట్లేదు. తొందరపడ్డానేమో!’ అన్నాను.
ఆవిడ నా మాటలకు ఏమీ సమాధానం చెప్పకుండా లోపలికెళ్లింది. ఏం చెయ్యాలి, లక్ష రూపాయలు ఎలా సంపాదించాలి, అనవసరంగా మాట ఇచ్చానా? అని నన్ను నేను తిట్టుకుంటూ సోఫాలో జారగిలపడి కళ్ళు ముశాను. రెండు నిమిషాల తరువాత ఏదో అలికిడి అయితే కళ్ళు తెరిచా. ఎదురుగా మా ఆవిడ చేతిలో డబ్బుతో.. ఓ క్షణం అర్థంకాక, ఆమెవంక ఆశ్చర్యంగా చూశాను.
‘మీరు హాస్పిటల్‌కు వెళ్ళిన తరువాత నాన్న వచ్చి వెళ్ళారు. నా పేరున రాసిన పొలం పంట తాలుకు కౌలు డబ్బులు ఇచ్చి వెళ్ళారు’ అంటూ నా చేతిలో డబ్బులకట్ట పెట్టింది.
‘వీటితో నగలు చేయించుకుంటానన్నావు’
‘పరవాలేదు లెండి ఓ మనిషి ప్రాణం కన్నా, నా నగలేమీ ఎక్కువ కాదు. మరోసారి చూద్దాం నగల సంగతి’ అంటూ ఓ చిన్న నవ్వు నవ్వింది.
ఆ నిమిషాన మా ఆవిడని చూస్తుంటే, మనుషుల్లో ఇంకా మానవత్వం మిగిలి వుంది అనిపించింది. ఆనందంతో శ్రీమతి నుదుట ముద్దాడి, హాస్పిటల్‌లో డబ్బు కట్టుడానికి బయలుదేరాను.
ఓ నెల రోజుల తరువాత పెద్దాయన వాళ్ళ ఆవిడతో మా ఇంటికి వచ్చాడు. ఈ నెల రోజులు ఎక్కడా కనపడకపోతే విశ్రాంతి తీసుకుంటు న్నాడేమో అని సరిపెట్టుకున్నాను. వాళ్లని చూడగానే, ‘ఎలా వున్నారు? రండి కూర్చోండి’ అంటూ లోపలికి ఆహ్వానించింది మా ఆవిడ.
‘కాఫీ తెస్తాను..’ అని లోపలికెళుతుంటే ‘వద్దమ్మా, ఒక్క నిమిషం ఇలా కూర్చో’ అంది పెద్దాయన భార్య. ఆవిడ మాటలు అర్థం కాక వాళ్ల ఎదురుగా కూర్చుంది మా ఆవిడ.
‘అసలు ఎందుకు వచ్చారు వీళ్ళు’ అని నాలో నేను అనుకుంటూ వాళ్ళ వంక చూస్తూ వుండిపోయాను.
ఇంతలో పెద్దాయన తనతో తెచ్చిన సంచిలో నుండి కొన్ని కాగితాలు తీసి, ‘అమ్మా! ఇవి మా ఇంటి కాగితాలు, మా తదనంతరం నీ పేరున రాయించాను’ అంటూ మా ఆవిడ చేతిలో పెట్టాడు.
ఆ పరిణామానికి ఇద్దరం ఆశ్చర్యపోయాము. ముందుగా తేరుకున్న మా ఆవిడ, ‘ఏంటండి, ఇదంతా, మేం ఏం సాయం చేశామని? ఆ లక్ష చిన్నగా వాయిదాల్లో చెల్లిస్తే పోయేదిగా!’ అంది.
ఆవిడ మాటల్లో ఆర్ద్రత నాకు అర్థమయ్యింది. ‘లేదమ్మా! డాక్టరుగారు కాస్త పని తగ్గించుకుని, విశ్రాంతి తీసుకోమన్నారు. మీ డబ్బు చెల్లించే దారి నాకు కనపడటం లేదు. అయినా నా ప్రాణాలు కాపాడిన మీ కన్నా నాకెవరూ ఎక్కువ కాదు. నా కూతురుకి ఇస్తున్నాను అనుకో అమ్మా!’ అంటూ కన్నీటి పర్యంతం అయ్యాడు.
వాళ్ళను చూసి మా ఆవిడ కూడా కళ్ళల్లోనుండి వస్తున్న కన్నీళ్ళను ఆపుకోలేక పోయింది. నిన్నటి దాకా వాళ్ళు ఎవరో, ఊళ్ళోవాళ్ళు అన్న మా ఆవిడను వాళ్ళు సొంత కూతురిలా భావించటంతో మా ఆవిడ మనసులో నుండి పెల్లుబికిన ప్రేమబాష్పాలవి. ఆ నిమిషాన మనుషుల మీద అప్పటిదాకా ఏర్పడిన అసహ్యం పోయి, మళ్ళీ నమ్మకం ఏర్పడటం మొదలయ్యంది. మనిషికి మనిషి సాయం చెయ్యటానికి స్నేహితుడో, బంధువులో కానక్కరలేదు. కాస్తంత గుండెల్లో తడి ఉంటే చాలు. అలా గుండెల్లో తడి ఉన్న మనుషులే నిజమైన ఆత్మబంధువులు అనుకుంటూ మా ఆవిడ వంక చూశాను, తను కూడా ఆనందంతో నా వంకే చూస్తోంది. ‘కాగితాలు తీసుకోవద్దు’ అన్నట్టు సైగ చేశాను. అలాగే అంటూ తల ఆడించింది.
Comments
Please login to add a commentAdd a comment