![February 14th Valentines Day special](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/love.jpg.webp?itok=bThiipBF)
అలనాడు భక్త రామదాసుకు అంతా రామమయంగా, జగమంతా రామమయంగా అగుపించింది గాని, ప్రేమికులకు మాత్రం అంతా ప్రేమమయంగా, జగమంతా ప్రేమమయంగా కనిపిస్తుంది. ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే. ప్రేమికులు జరుపుకొనే రోజు కాబట్టి ఇది ప్రేమికుల దినోత్సవంగా ప్రపంచ ప్రసిద్ధి పొందింది. మన దేశంలో ఆర్థిక సరళీకరణలు మొదలయ్యాక ప్రపంచీకరణ నేపథ్యంలో పలు విదేశీ వేడుకలు మన దేశానికీ పాకాయి.
మూడు దశాబ్దాలకు ముందు మనవాళ్లకు వాలంటైన్స్ డే ఏమిటో తెలీదు. వాలంటైన్స్ డే అంటే ప్రేమికుల దినోత్సవం అని ఇప్పుడు అందరికీ తెలుసు. దీనికి కారకుడైన సెయింట్ వాలంటైన్ చరిత్ర గురించి కూడా జనాలకు కొంతవరకు తెలుసు. అయితే, వాలంటైన్స్ డే గురించి చాలామందికి తెలియని విశేషాలు చాలానే ఉన్నాయి. వాటిలో కొన్ని అరుదైన విశేషాలు మీ కోసం..
» వాలంటైన్స్ డే నేపథ్యం క్రీస్తుపూర్వం ఆరో శతాబ్ది నాటిది. అప్పట్లో రోమన్ ప్రజలు ‘లూపర్‌కేలియా’ పేరుతో సంతాన సాఫల్య వేడుకను ఫిబ్రవరి 13–15 తేదీలలో జరుపుకునేవారు. వారు ఈ వేడుకలో సంతాన సా«ఫల్యానికి అధిదైవమైన లూపర్‌కస్‌ను ఆరాధించేవారు. ఈ సందర్బంగా జంతుబలులు ఇచ్చేవారు. పోప్ గెలాషియస్–ఐ క్రీస్తుశకం ఐదో శతాబ్ది చివరి రోజుల్లో ‘లూపర్‌కేలియా’ వేడుకను నిషేధించి, దాని బదులుగా ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డేను ప్రవేశపెట్టాడనే కథనం ఉంది.
»సెయింట్ వాలంటైన్ ఒకరు కాదు, ముగ్గురు అని కూడా చెబుతారు. విచిత్రంగా వీరిలో ఇద్దరు క్రీస్తుశకం మూడో శతాబ్ది నాటి రోమన్ పాలకుడు క్లాడియస్–ఐఐ చేతిలో ప్రాణాలు కోల్పోయినవారే! యుద్ధ సమయంలో సైనికులు పెళ్లిళ్లు చేసుకోరాదన్న క్లాడియస్– ఐఐ ఆజ్ఞలను ఉల్లంఘించి, రోమ్ నగరంలో సైనికులకు ప్రేమ వివాహాలు జరిపించినందుకు సెయింట్ వాలంటైన్ మరణశిక్ష పొందాడు.
ఈ కథనం చాలామందికి తెలిసినదే! రోమ్‌కు చేరువలోనే తెర్ని పట్టణానికి చెందిన సెయింట్ వాలంటైన్ పేరు గల మరో వ్యక్తి కూడా క్లాడియస్–ఐఐ చేతిలో మరణశిక్షకు గురయ్యాడు. అయితే, కేథలిక్ ఎడ్యుకేషన్ రిసోర్స్ సెంటర్ సమాచారం ప్రకారం సెయింట్ వాలంటైన్ పేరుతో ముగ్గురు వ్యక్తులు ఉన్నారట!
» సైనికులకు పెళ్లిళ్లు జరిపించాడనే అభియోగంపై సెయింట్ వాలంటైన్‌ను క్లాడియస్–ఐఐ నిర్బంధించాడు. చెరసాల నుంచి సెయింట్ వాలంటైన్, చెరసాల పర్యవేక్షకుడి కూతురికి ప్రేమలేఖ రాశాడు. దాంతో అప్పటి వరకు చూపులేని ఆమెకు చూపు వచ్చిందనే కథనం ప్రచారంలో ఉంది. అయితే, సెయింట్ వాలంటైన్‌కు క్రీస్తుశకం 270 ఫిబ్రవరి 14న ఉరిశిక్ష అమలు చేశారు.
» వాలంటైన్స్ డే వేడుక ఖండాంతరాలకు పాకిన తర్వాత వాలంటైన్స్ డే గ్రీటింగ్ కార్డులకు గిరాకీ పెరిగింది. తొలి వాలంటైన్స్ గ్రీటింగ్ కార్డు ఆధునిక కాలానికి చెందినదై ఉంటుందని చాలామంది భావిస్తారు. అయితే, క్రీస్తుశకం పదిహేనో శతాబ్దిలో లండన్ టవర్ జైలులో బందీగా ఉన్న ఖైదీ అక్కడి నుంచి తన భార్యకు బొమ్మలతో కూడిన ప్రేమలేఖ రాశాడు. బహుశా అదే తొలి వాలంటైన్స్ గ్రీటింగ్ కార్డు అని చరిత్రకారులు భావిస్తారు. ఇరవయ్యో శతాబ్ది తొలిరోజుల్లో వాలంటైన్స్ గ్రీటింగ్ కార్డులు బాగా ప్రాచర్యంలోకి వచ్చాయి.
» పాశ్చాత్య ప్రపంచంలో పదిహేడో శతాబ్దం వరకు ప్రేమికులు చేతితో రూపొందించిన గ్రీటింగ్ కార్డులను ఇచ్చి పుచ్చుకునేవారు. అమెరికాలోని మసాచుసెట్స్‌కు చెందిన ఎస్తర్ ఏ హౌలాండ్ వాలంటైన్స్ గ్రీటింగ్ కార్డుల చరిత్రనే మార్చేసింది. పంతొమ్మిదో శతాబ్దిలో ఆమె స్వయంగా రూపొందించిన డిజైన్లతో అందంగా ముద్రించిన వాలంటైన్స్ గ్రీటింగ్ కార్డులను అమ్మడం ప్రారంభించింది. ఆమె వ్యాపారం అనతి కాలంలోనే అమెరికా అంతటా విస్తరించింది. దీంతో ఎస్తర్ ‘మదర్ ఆఫ్ అమెరికన్ వాలంటైన్స్’గా ప్రఖ్యాతి పొందింది.
» తాజా లెక్కల ప్రకారం వాలంటైన్స్ డే రోజున వివిధ దేశాల ప్రేమికులు ఇచ్చి పుచ్చుకునే గ్రీటింగ్ కార్డుల సంఖ్య 15 కోట్లకు పైగానే ఉంటుంది. వీటికి తోడు చాక్లెట్ గిఫ్ట్ బాక్సులు, గులాబీల పుష్పగుచ్ఛాలు, బంగారు ఉంగరాలు, ఇతరేతర కానుకల సంఖ్య లెక్కలకు కూడా అందదు. ఏది ఏమైనా, వాలంటైన్స్ డే ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల పర్వదినం.
Comments
Please login to add a commentAdd a comment