వారం పాటు వాలెంటైన్స్ సంబరాలు
వాలెంటైన్స్ డే అనగానే ఫిబ్రవరి 14వ తేదీ వచ్చేవరకు ఎదురు చూస్తున్నారు కదూ. కానీ మీరు అన్నాళ్లు ఆగక్కర్లేదు. ప్రేమికులు ఒక్కరోజు కాదు, రెండు రోజులు కాదు.. వరుసపెట్టి ఎనిమిది రోజుల పాటు సంబరాలు చేసుకుంటూనే ఉండొచ్చు. ఎందుకంటే, వాలెంటైన్స్ డే అనేది ఆ ఎనిమిది రోజుల్లో వచ్చే చిట్టచివరి రోజు. ఆలోపు రకరకాల రోజులు ఉన్నాయి. వాటన్నింటి గురించి కూడా ఒక్కసారి తెలుసుకుంటే, వాలెంటైన్స్ డే సంబరాలు మరింత సరదాగా ఉంటాయి.
ఈ ఎనిమిది వారం రోజుల్లో మొట్టమొదటి రోజును రోజ్ డే అంటారు. ఈసారి ఫిబ్రవరి 7వ తేదీన రోజ్ డే జరిగింది. ఈరోజు తమకు అత్యంత ఆత్మీయులు, స్నేహితులు, ప్రేమిస్తున్నాం అనుకునేవారికి గులాబి పూలు ఇచ్చి వారిని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తారు. రెండో రోజు ప్రపోజ్ డే. ఆ రోజు తమ ప్రేమను ప్రతిపాదిస్తారు. ఆరోజు కూడా ఏదో ఒక బహుమతిని అందించి మరీ ప్రపోజ్ చేయడం పరిపాటి. సాధారణంగా అయితే ఏదో ఒక రెస్టారెంటుకు గానీ, మరెక్కడికైనా గానీ తీసుకెళ్లి ప్రపోజ్ చేస్తారు. ఇక వారంలో మూడో రోజు చాక్లెట్ డే. తాము ప్రపోజ్ చేసినవారు ఇంకా ఆలోచనలో ఉంటారు కాబట్టి, వారినుంచి సానుకూల సమాధానం రప్పించుకోడానికి ప్రేమికులు చేసే ప్రయత్నాల్లో ఒకటి.. అవతలి వారికి మంచి చాక్లెట్ ఇవ్వడం. నాలుగో రోజు టెడ్డీ డే. టెడ్డీ బేర్ అంటే సంరక్షణకు ప్రతిరూపం. తాము ప్రేమించేవారిని ఎంతో అపురూపంగా చూసుకుంటామని సృజనాత్మకంగా చెప్పేందుకు టెడ్డీ బేర్ ఒకదాన్ని బహుమతిగా అందిస్తారు. ఐదో రోజు ప్రామిస్ డే. హిందూ వివాహ వ్యవస్థలో కలకాలం కలిసి ఉంటామని అగ్నిసాక్షిగా ప్రమాణాలు చేసినట్లుగానే.. ప్రేమికులు కూడా జీవితాంతం ఎప్పటికీ తోడు వీడనంటూ ప్రమాణాలు చేసుకుంటారు.
ఇక వాలెంటైన్స్ వీక్లో చివరి మూడు రోజులూ అత్యంత ముఖ్యమైనవి. ఆరో రోజు హగ్ డే. తాము ప్రేమించినవారికి వెచ్చటి కౌగిలి అందించి, వారంటే ఎంత అభిమానం ఉందో చాటుకోవడమే ఈ రోజు ప్రాముఖ్యం. ఏడోరోజు కిస్ డే. ఇన్నాళ్లుగా ఎదురుచూస్తున్న ప్రేమికులు.. ఆరోజు ఇక తమ ప్రేమను పూర్తిస్థాయిలో ప్రకటించుకోడానికి వీలుగా గాఢమైన అధర చుంబనాలు అందించుకుంటారు. ఇక చిట్టచివరి రోజు వాలెంటైన్స్ డే. ఈ రోజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రేమ యాత్రలకు బృందావనము, నందనవనము ఏలనో.. నగరంలోనే పార్కులుండగా వేరే స్వర్గము ఏలనో అనుకుంటూ దొరికిన పార్కు చూసుకుని ఎంజాయ్ చేయడమే!! అందులోనూ ఈసారి బెస్ట్ కపుల్ ఎవరంటూ పలు పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. ఫేస్బుక్లో కూడా క్యుపిడ్ గేమ్ అంటూ పోటీలు జరుగుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే మీకు ప్రియమైన వారితో కలిసి పోటీలకు వెళ్లండి!!