Prayaga Ramakrishna
-
కర్మఫలం
ఒకసారి ఓ రాజుగారు తన ముగ్గురు మంత్రుల్నీ పిలిచి, అడవికి వెళ్లి ముగ్గురినీ మూడు సంచులనిండా పండ్లు తెమ్మన్నారు. రాజాజ్ఞ మేరకు, మొదటి మంత్రి అడవంతా గాలించి మంచి మంచి పండ్లను, మాగిన పండ్లను, తియ్యటి పండ్లను సేకరించాడు. రెండో మంత్రి, అంత శ్రమకోర్వలేక ‘మనమేం తెచ్చామో రాజుగారు చూస్తారా ఏంటి?’ అనుకుని పండ్లూ, కాయలూ, పిందెలూ అన్నీ ఏరి సంచీ నింపాడు. మూడో మంత్రి ‘రాజుగారు నేను తీసుకువెళ్లే సంచి ఎంత పెద్దదిగా ఉందో చూస్తారుగానీ, సంచిలో ఏమున్నాయో చూడరుగా’ అనుకుని సంచిని రాళ్లూరప్పలూ, ఆకులూ అలములతో నింపాడు. రాజుగారు మంత్రులు తెచ్చిన సంచుల్లో ఏమున్నాయో చూడకుం డానే ముగ్గురినీ మూడేసి మాసాలపాటు జైలులో ఉంచమని అధికారులను ఆదేశించారు. జైల్లో ఉన్న సమయంలో వాళ్లు అడవినుంచి సేకరించి తెచ్చుకున్న ఫలాలే తినాలి తప్ప బయటి ఆహారమేదీ వాళ్లకు సరఫరా చేయరాదని కూడా హుకుం జారీ చేశారు. మొదటి మంత్రి జైలులో ఉన్న మూడు నెలలూ తను సేకరించి తెచ్చుకున్న మధుర ఫలాలు తింటూ సుఖంగా ప్రాణాలు నిలుపుకున్నాడు. రెండో అతను– కొన్నాళ్లు మంచి పండ్లు తిన్నాడు. ఆ తర్వాత ఆకలికి తాళలేక పచ్చిపండ్లు, పిచ్చి పండ్లు అన్నీ తిన్నాడు. దాంతో అనారోగ్యం పాలయ్యాడు. మూడోమంత్రి సంగతి ఇంక చెప్పేదేముంది? తినడానికి ఏమీలేక, ఆకులూ అలములూ తినలేక ప్రాణాలు పోగొట్టుకున్నాడు. మనం చేసిన కర్మల ఫలితాలను మనమే అను భవించాలి. భవన నిర్మాణ పనుల్లో సమర్థుడని పేరుగాంచిన ఒక మేస్త్రీ ఇంక ఆ పనులు చేయదలుచుకోక అదే మాట తన యజమానితో చెప్పాడు. యజమాని ఎంత నచ్చ చెప్పినా వినలేదు మేస్త్రీ. ‘సరే ఒప్పుకున్న ఇళ్లలో ఒకే ఒకటి మిగిలిపోయింది. ఆ ఒక్కటీ కట్టి ఆపైన విరమించుకో’ అన్నాడు యజమాని. మేస్త్రీ సరేనన్నాడు. మొక్కుబడిగా అయిందనిపించాడు కూడా. ఇదివరకు అతను ఇల్లుకడితే నల్లరాతి మీద నగిషీలు చెక్కినట్టుండేది. ఇప్పుడు ఈ ఇల్లు చూస్తే తలదాచుకునేందుకు మొండిగోడలమీద పైకప్పు వేసినట్లుగా ఉంది. ఇల్లు కట్టడం పూర్తయ్యాక సెలవు తీసుకుందామని యజమాని దగ్గరకు వెళ్లాడు. ‘నీ కోసమే ఆ ఇల్లును కట్టమన్నాను. ఇన్నాళ్లూ నువ్వు చేసిన సేవలకు గుర్తుగా ఆ ఇంటిని నీకు బహుమతిగా ఇవ్వదలుచుకున్నాను. ఆ ఇల్లు నీదే! నువ్వూ నీ కుటుంబం సుఖంగా ఉండండి’ అన్నాడు యజమాని, తాళం చేతులు మేస్త్రీ చేతికిస్తూ. మేస్త్రీ అవాక్కయ్యాడు. ఈ సంగతి ముందే తెలిసుంటే ఎంత బాగుండేది అనుకుని తలపట్టుకున్నాడు. గుర్తుంచుకోండి. మనం చేసిన కర్మల ఫలాన్ని మనమే అనుభవించాలి. మంచైనా చెడైనా..! – ప్రయాగ రామకృష్ణ -
అదీ ప్రేమంటే!
లంచ్ బ్రేక్ కోసం పిల్లలంతా ఎదురు చూస్తున్నారు. అంతలో టీచర్ ‘ప్రేమ’ అంటే ఏమిటో తెలుసా మీకు? అని అడిగింది పిల్లల్ని. పిల్లలందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. టీచర్ నవ్వుతూ ‘బ్రేక్‌టైమ్‌లో మీరంతా స్కూల్ ఆవరణలో తిరుగుతూ మీ మనసుకు నచ్చినవీ, మీకిష్టమైనవీ పట్టుకురండి. అప్పుడు చెబుతాను ప్రేమంటే ఏమిటో’ అంది. అంతలో లంచ్ బెల్ మోగింది. పిల్లలందరూ బయటకు పరుగెత్తారు. గంట తర్వాత మళ్లీ క్లాస్ మొదలైంది. టీచర్ వచ్చి ‘ఇప్పుడు చెప్పండి - మీరేవేం తెచ్చారో’ అంది. పిల్లలందరూ హడావుడి పడుతున్నారు. ఒక అమ్మాయి ముందుకొచ్చి ‘నేను ఎర్రటి గులాబీ పువ్వు తెచ్చాను. బాగుంది కదా టీచర్?’ అంది. ఇంకో అమ్మాయి లేచి సీతాకోకచిలుకను చూపిం చింది. ‘చూడండి టీచర్ దీని రంగురంగుల రెక్కలు ఎంత ముద్దొస్తున్నాయో. నాకైతే దీన్ని అసలు వదిలిపెట్టాలనిపించడంలేదు’ అంది. ఈసారి పోటీగా ఓ పిల్లవాడు లేచి నిలబడి ‘నేనీ పక్షి పిల్లను తెచ్చాను. చెట్టుమీద ఉన్న గూడులోంచి జారికింద పడింది. క్యూట్‌గా ఉంది కదా టీచర్’ అన్నాడు. మిగిలిన పిల్లలందరూ కూడా అలాగే వాళ్లకు వచ్చినవన్నీ తీసుకొచ్చి టీచర్ టేబుల్ మీద పెట్టారు. పెద్ద కలెక్షనే తయారైంది. కాని, ఒకే ఒక అమ్మాయి అన్నీ వింటూ అందరినీ చూస్తూ మౌనంగా ఉంది. వట్టి చేతులతో వచ్చినందుకు సిగ్గుపడుతోంది. టీచర్ వెళ్లి ఆ అమ్మాయి పక్కన కూర్చుంది. ‘ఏం? ఎందుకలా ఉన్నావ్? నీకు నచ్చినవేవీ దొరకలేదా?’ అని అడిగింది. ‘లేదు టీచర్. నాకు చాలా చాలా నచ్చాయి. పచ్చటి చెట్ల దగ్గరకు వెళ్లి రంగురంగుల పూలను చూశాను. పూలన్నీ కోసి తెద్దామనుకున్నాను. కాని కోస్తే వాటి అందం పోతుంది. పరిమళం పోతుంది. అందరూ వాటి అందాన్నీ సువాసనల్నీ అనుభవించలేరు. పూలు చెట్లకుంటేనే బాగుంటుం దని కొయ్యలేదు’ అని టీచర్ మొహంలోకి చూసింది. టీచర్ ఆ పిల్లను గుండెలకు హత్తుకుంది. ‘నేను సీతాకోకచిలుకని కూడా చూశాను టీచర్. చాలా సాఫ్ట్‌గా కలర్ఫుల్గా ఉంది. ఈ పువ్వు మీద నుంచి ఆ పువ్వు మీదకు, ఆ పువ్వు నుంచి ఈ పువ్వు మీదకు వాలుతూ హాయిగా ఆడుకుంటోంది. దాన్ని పట్టి తీసుకురావాలనిపించలేదు. దాన్ని డిస్టర్బ్ చెయ్యకూడదనుకున్నాను’ టీచర్ కన్నీళ్ల పర్యంతమైంది. ఆ అమ్మాయి చెప్పుకుంటూపోతోంది. ‘చెట్టుమీద నుంచి ఓ పక్షి పిల్ల జారికిందకు పడబోతూ చెట్ల ఆకుల మధ్య చిక్కుకుం ది. దాన్ని చేతులోకి తీసుకోబోతుండగా పైనుంచి వాళ్ల అమ్మ జాలిగా నావంక చూసింది. పక్షిపిల్లను చెట్టు మీద నున్న గూట్లో సేఫ్‌గా పెట్టి వచ్చాను. పూలవాసన, బట్టర్ఫై్ల ఆటలు తల్లిపక్షి ఆనందం- ఇవి మాత్రమే నా దగ్గర ఉన్నాయి. కానీ అవేవీ నేను మీకు చూపించలేను’ అంది అమాయకంగా. టీచర్ ఆ అమ్మాయిని దగ్గరకు తీసుకుని ముద్దాడింది. అదీ ప్రేమంటే! - ప్రయాగ రామకృష్ణ -
మనస్సాక్షి
జ్యోతిర్మయం రత్తాలు ఆమె భర్త రాంబాబు ఇద్దరూ పట్నంపోయి మార్కెట్ నుంచి ఓ గాడిదను కొనుక్కుని వస్తున్నారు. కొంత దూరం వెళ్లాక వాళ్లకో కుర్రాడు ఎదురయ్యా డు. అతను వాళ్లను వింతగా చూస్తూ ‘తెలివితక్కువ దద్దమ్మలు గాడిదను ఉత్తినే అలా నడిపించుకుపోవడ మెందుకు? ఎవరో ఒకరు దాని మీద హాయిగా కూర్చోవచ్చుగా’ అనుకున్నాడు కొంచెం బయటికి వినిపించేలా. రత్తాలు, రాంబాబు విన్నారవి. వెంటనే రత్తాలు గాడిదనెక్కి కూర్చుంది. రాంబాబు పక్కన నడుస్తున్నాడు. అలా కొంత దూరం వెళ్లారు. మార్గమధ్యంలో ఒక వృద్ధుడు చూశాడు వాళ్లని. ‘కలికాలం. పెద్ద చిన్న తారతమ్యాలు లేకుండా పోయాయి. పెనిమిటి ఇంటికి పెద్ద కదా! అతను నడుస్తుంటే ఆమె ఠీవిగా గాడిదనెక్కి కూర్చుంటుందా! అని ముక్కు మీద వేలేసుకున్నాడు. ఈ మాటలు రత్తాలు వింది. గాడిదను ఆపి తను కిందకు దిగింది. రాంబాబును కూర్చోబెట్టింది. కొంత దూరం అలా వెళ్లారు. ఈసారి, వంగిపోయిన నడుముతో నడవలేక నడుస్తూన్న ఒక ముసలి అవ్వగారు ఎదురైంది. ఆవిడ ఒక్కక్షణం నడుమును నిటారుగా చేసుకుని వాళ్లవంక తేరిపార చూసింది ‘నువ్వయ్యా’ ఎవరో అనుకున్నాను. సీతయ్య పెద్ద కొడుకువి గదూ! అయినా ఇదేం పాడు బుద్ధిరా నీకు. పెళ్లాం ఆపసోపాలు పడుతూ పక్కన నడుస్తుంటే నువ్వొక్కడివే ‘టింగురంగా’ అన్నట్టు గాడిదమీద ఊరేగుతావా. దాన్నీ నీ పక్కన కూర్చోబెట్టుకోవచ్చు గా. ఆ మాత్రం సర్దుకోలేవా’ అని చీవాట్లు పెట్టింది. రాంబాబు అవాక్కయ్యాడు. తను ముందుకు జరిగి తన వెనక భార్యకు చోటిచ్చాడు. రత్తాలు ఒకే ఒక గెంతుగెంతి గాడిదనెక్కి కూర్చుంది. గాడిద భారంగా ముందుకు కదిలింది. ఆ తర్వాత కాసేపటికి బండెడు పుస్తకాలున్న సంచీని వీపు మీద మోసుకెళ్తున్న ఓ పదేళ్ల పిల్ల ఎదురైంది. ‘ఈ పుస్తకాన్నే మొయ్యలే కుండా ఉన్నాను నేను. పూర్ డాంకీ, ఆ ఇద్దర్నీ ఎలా మోస్తోందో’ అని గాడిద మీద బోకెడంత జాలి పడింది. రత్తాలు, రాంబాబు ఇద్దరూ ఆ మాటలు విన్నారు. వెంటనే కిందకు దిగి గాడిదను ఇద్దరూ భుజాల మీదకెక్కించుకుని నడుస్తున్నారు. ఒకే చోట సన్నటి కాలిబాట వంతెన దాటాల్సొచ్చింది. రత్తాలు, రాంబాబు వాళ్ల మీద గాడిదా ఉండె! ముగ్గురికీ ఇరుకు సందు దాటడం కష్టంగా ఉంది. గాడిద బెదిరిపోయింది. గింజుకుంది. అటూఇటూ పెనుగులాడింది. పెద్ద ఓండ్రపెట్టింది. దాంతో అదుపు తప్పి ముగ్గురూ పక్కనున్న కాలవలో పడ్డారు. ఒకటి గుర్తుంచుకోవాలి మనమంతా. మనల్నీ, మనం చేస్తున్న పనినీ అందరూ అన్నివేళలా హర్షిస్తారనుకోవడం తెలివితక్కువ. అలాగే అందరూ విమర్శిస్తారనుకోవడం కూడా తెలివి తక్కువే. దూషణ భూషణ తిరస్కారాలు ఎప్పుడూ ఉంటాయి. నిన్న, ఈవేళ, రేపు. మన మనస్సు స్వచ్ఛంగా శుభ్రంగా అబ్రకపు రేకులా ఉన్నంతకాలం మనం ఇతరుల మాటలను పట్టించుకోవాల్సిన పనిలేదు. పట్టించుకుంటే అడుగు ముందుకు పడదు. - ప్రయాగ రామకృష్ణ -
పక్కింటి అమ్మాయి
మా పక్కింటి అమ్మాయి పెళ్లయి ఆరు నెలలు కూడా కాలేదు. అప్పుడే ఏమైందో వాడిన వసంతంలా చిన్న బోయి ఉంది. గాలిలో గాలిపటంలా ఎప్పుడూ ఎగురు తూ నవ్వుతూ ఉండే పిల్ల ఎగరకపోతే ఎగరకపోయే, రెక్కలు విరిగిన పక్షిలా గోడకలా జారగిలబడి కూర్చో డమేమిటి? అలుకూ పలుకూ లేకుండా ఆ మూగనో మేమిటి? అర్థం కావడంలేదు. ఇంతలో ఆ అమ్మాయి చిన్నగా ఏడుస్తూ 'నాన్నా! నేను భరించలేను. ఆర్నెల్లుగా నేనెంత క్షోభ అనుభవిస్తున్నానో మీకు తెలీదు. ప్రతి చిన్న విషయానికీ సంజాయిషీ ఇచ్చుకోవాలి. ప్రతి పైసాకీ లెక్క చెప్పాలి. ప్రతి ఒక్కదానికీ యుద్ధం చేయాలి. అయింది చాలు. అనుభవించింది చాలు. నన్నొదిలెయ్యండి. నా చావేదో నేను చస్తాను..' అంటోంది. తండ్రి కూతురి చెయ్యిపట్టుకుని వంటింట్లోకి తీసుకు వెళ్లాడు. మేము మా వరండాలో కూర్చుంటే వాళ్ల కిచెన్ కన్పిస్తుంది. మంట పెద్దది చేశాడు... కంగారు పడ్డాను. ఆయన చాలా కూల్‌గా మూడు గిన్నెలు తీసు కుని వాటి నిండా నీళ్లుపోసి మూడు బర్నర్ల మీదా పెట్టాడు. నీళ్లు మరుగుతున్నాయి. ఒక గిన్నెలో పొటాటోలు, మరో గిన్నెలో కోడిగుడ్లు, ఇంకో గిన్నెలో కాఫీ గింజలు వేశాడు. పది నిమిషాల తర్వాత బర్నర్లు ఆపు చేసి మూడు గిన్నెలూ కిందకు దింపాడు. పొటాటోలు, కోడి గుడ్లు తీసి ఒక పళ్లెంలో పెట్టాడు. మూడో గిన్నెలోని కాఫీ ని కప్పులో పోశాడు. కూతుర్ని దగ్గరకు తీసుకుని 'ఈ మూడు ఏమిటో ఇప్పుడు చెప్పు?' అని అడిగాడు. కూతురు 'ఏముంది? పొటాటోస్, ఎగ్స్, కాఫీ' అంది. అంత తొందరెందుకు వాటిని చేతుల్లోకి తీసుకు ని చూడు' అన్నాడు తండ్రి. ఆ అమ్మాయి పొటాటోను చేతుల్లోకి తీసుకోబోతుండగానే అది మెత్తగా నుజ్జుయి కిందపడింది. తర్వాత కోడిగుడ్డును బ్రేక్ చెయ్యమన్నా డు. కూతురు గుడ్డును పగలకొట్టి పైనున్న పెంకంతా తీసేసింది. లోపల ఉడికిన గుడ్డు గట్టిగా ఉంది. తండ్రి వైపు చూసింది. 'ఇంకోటి మిగిలి ఉంది. దాని సంగతేమిటో కూడా చూడు' అన్నాడు. ఆ అమ్మాయి కాఫీ కప్పు దగ్గరకు తీసుకుంది. నురుగులు కక్కుతున్న కాఫీ మీద నుంచి వస్తున్న వెచ్చటి పరిమళం ఉల్లాసాన్ని చ్చింది. నాన్నను కాఫీ సగం తాగి మిగిలింది తనకు ఇమ్మంది. 'వద్దులే నువ్వేతాగు' అన్నాడు. ‘ఏమిటి దీని అర్థం? ఫ్లీజ్ చెప్పు నాన్నా’ అని బతిమాలింది. 'పొటాటో లు, గుడ్లు, కాఫీ గింజలు - మూడు ఒకే సమయంలో ఒకే రకమైన యాడ్వర్సిటీని ఎదుర్కున్నాయి. మరిగే నీళ్లలో అవి ఒంటిని కాల్చుకు న్నాయి. కానీ, ఒక్కోటి ఒక్కోరకంగా మారిపోయాయి. అప్పటి వరకూ గట్టిగా ఉన్న దుంపలు ప్రతికూల పరిస్థితులను తట్టుకోలేక మెత్తగా తయారయ్యాయి. గుడ్లయి తే చాలా డెలికేట్‌గా హాండిల్ చెయ్యడానికే కష్టంగా ఉండేవి. లోపలంతా ద్రవం. ఏ మాత్రం బ్రేక్ అయినా మొత్తం నేలపాలవుతుందని భయం. అలాంటివి మరిగే నీళ్లల్లో ఉడికి ఉడికీ గట్టిపడిపోయాయి. గుడ్ల లోపలి ద్రవమంతా ఘనీభవించింది. కానీ, కాఫీ గింజలో.. నీళ్లలో మరుగుతూనే నీటి రంగునీరుచినీ స్వరూపాన్నీ స్వభావాన్నీ మార్చేశాయి. పరిసరాల్ని పరిమళభరితం చేశాయి. ఇప్పుడు నువ్వాలోచించుకో. పొటాటో లాగా మెత్తబడి నిస్పృహలోకి వెళ్తావో, గుడ్డులాగా థిక్ స్కిన్డ్ అయిపోయి మనసును రాయి చేసుకుంటావో? లేక, నీ వ్యక్తిత్వంతో అందరిన్నీ గెలిచి కష్టాలను అధిగమించి మంచి కాఫీలాగా పరిమిళిస్తావో! మా పక్కింటి అమ్మాయి నాన్న చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని చెంపలోకు చేర్చుకుంది. మనసుకు హాయిగా ఉంది! స్వీట్ డాడీ! నాటీ చైల్ట్!- ప్రయాగ రామకృష్ణ? -
నిత్య సంతోషి
ఒక అడవిలో ఓ చెట్టు మీద గూడు కట్టుకుని ఒక కాకి సుఖంగా ఉండేది. ఒక రోజున ఓ సరస్సు మీదగుండా ఎగిరి వెళ్తూ కిందన ఒక చక్కని పక్షిని చూసింది. సన్నటి పొడుగాటి నాజూకైన మెడ, విశాలమైన రెక్కలు, అంతకంటే విశాలమైన పాదాలు - తెల్లగా వెన్నముద్దలా ఉంది. దాని నడకలో రాచ ఠీవి ఉంది. అది గాలిలోకి ఎగురుతున్నప్పుడు కూడా చూసింది కాకి. మెడ ముందుకు సాచి రెక్కల్ని విసనకర్రల్లా ఆడిస్తూ ఏమి వయ్యారాలు పోయిందో! కిందకు దిగి చూసింది. ఎవరో కాదది రాజహంస. ‘అది అంత తెల్లగా ఉంటే, నేను చూడు ఎలా ఉన్నానో నల్లగా’ అనుకుంది కాకి. బాధపడింది. ప్రపంచంలోని పక్షులన్నిట్లోకి హంస అదృష్టవంతురాలనుకుంటూ హంస దగ్గరకు వెళ్లి తనను తాను పరిచయం చేసుకుంది. హంసకు అభినందనలు తెలిపింది. ‘అవును, ఇన్నాళ్లూ నేనూ నా అంత అదృష్టవంతు రాలు లేదనుకున్నాను. నిన్న ఓ చిలకను చూశాక నా అభిప్రాయం మారిపోయింది. ఆ చిలక ఎంత బాగుందో! చిత్రంగా అది రెండు రంగులతో ఉంది. ముద్దు ముద్దుగా మాట్లాడుతోంది. అది ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకు ఎగురుతూంటే కళ్లార్పకుండా చూశాననుకో! సృష్టిలోకెల్లా అదే అందమైన పక్షి. సందేహం లేదు’ అంది. కాకి ఎగురుకుంటూ పోయి చిలక ముందు వాలింది. రెక్కలు రెపరెపకొట్టుకుంటూ అడవంతా మారు మోగేట్టు అల్లరి చేస్తోంది చిలక. కాకి దాన్ని చూస్తూ ‘ఏమందమే చిలకా నీది’ అంది. ‘ఔను. నేనూ అలాగే అనుకున్నాను. ఒక పిట్టయితే మొన్న నా దగ్గరకొచ్చి ‘నువ్వు నృత్యం నేర్చుకుంటే ఎంత బాగుంటుందో. నీ మాటకు ఆట కూడా జతైతే అడవికి పండగొచ్చినట్టే’ అంది. మురిసిపోయాను. కాని, అది మొన్నటి మాట. నిన్న నేను నా సావాసగత్తెతో కలిసి పట్నం వెళ్లాను. అక్కడ అన్ని రకాల పక్షుల్నీ, జంతువుల్నీ ఒక చోట ప్రదర్శనకు పెట్టారు. ‘జూ’ అంటార్ట దాన్ని. అక్కడున్న ఓ నెమలిని చూశాను. దాన్ని చూశాక నాదీ ఒక అందమే అనిపించింది. దాని నడక, దాని హొయలు, దాని అందం... ఆహాహా... ఏమని చెప్పను. గత జన్మలో అదేదో గొప్ప అదృష్టం చేసుకునుండాలి. నాకున్నవి రెండే రంగులు. దానికి ఒళ్లంతా ‘రంగులే’ అంది. కాకికి కాలు నిలవలేదు. రివ్వున ఎగురుకుంటూ వెళ్లి ‘జూ’ ముందు వాలింది. నెమలిని వెతుక్కుంటూ వెళ్లింది. ఒకచోట నీలం, ఆకుపచ్చ, ఎరుపు, బంగారం ఇలా ఎన్నెన్నో రంగులతో మెరిసిపోతూ కనిపించింది నెమలి. అప్పుడది పురి కూడా విప్పి ఉందేమో. ఇంద్రధనస్సులా కాంతులీనుతూ ఉంది. కళ్లు చెదురుతున్నాయి. కాని, నెమలి అందచందాలను ఆస్వాదిస్తూ నెమలి దగ్గరకు వెళ్లి ‘ఎంత అందంగా ఉన్నావో! చూడటానికి రెండు కళ్లు చాలడం లేదు. నిన్ను చూసేందుకు రోజూ ఇంత మంది వస్తున్నారంటేనే నువ్వెంత అందగత్తెవో అర్థమౌతోంది. నేనూ ఉన్నాను. జనాభా లెక్కకి. నన్ను చూస్తూనే విదిలించి కొడతారందరూ’ అని వాపోయింది. నెమలి విరక్తిగా నవ్వింది. ‘నా అందమే నాకు శాపం. అద్భుత రూప లావణ్యంతో ఉన్నాను కనుకే నన్నీ ‘జూ’లో బంధించారు. చాలా రోజులుగా ఈ ‘జూ’ అంతా పరిశీలించి చూస్తున్నాను. ఇక్కడ అన్ని రకాల జంతువులూ పక్షులూ బందీ అయి ఉన్నాయి. నాలా చాలా ఏళ్లుగా - ఒక్క నువ్వు తప్ప. నీలా కాకిలా పుట్టి ఉంటే ఎంత స్వేచ్ఛో గదా అనుకుంటున్నాను. నేనూ నీలా కాకినైతే నీతో చెట్టాపట్టాలేసుకుని అన్ని చోట్లకూ వచ్చుండేదాన్ని. అన్ని ఊళ్లూ చూస్తుండేదాన్ని. నాకా అదృష్టం లేదు. ఈ జన్మంతా బానిస బతుకే’ అని కన్నీళ్లు పెట్టుకుంది. నెమలి బాధ విన్నాక కాకికి తెలివొచ్చింది. మనందరి సమస్య కూడా ఇదే. ఎవరెవరితోనో పోల్చుకుని బాధపడుతుంటాం. భగవంతుడిచ్చిన దాంతో తృప్తి పడటం తెలీదు మనకు. అసంతృప్తే అన్ని దుఃఖాలకు కారణం. మనకు ఏవి లేవో వాటిని తలచుకుని పొర్లి పొర్లి ఏడ్చే బదులు, ఏవి ఉన్నాయో వాటితో సంతోషంగా ఉండటం నేర్చుకోవాలి. ప్రపంచమన్నాక హెచ్చు తగు ్గలెప్పుడూ ఉంటాయి. ఉన్న వాటిని హాయిగా స్వేచ్ఛగా తృప్తిగా అనుభవించే వాడి బతుకే బతుకు. వాడు నిత్య సంతోషి. ప్రయాగ రామకృష్ణ -
ఎందాకా ఈ పరుగు?!
అమెరికాలోని వాషింగ్టన్ డీసీ మెట్రో స్టేషన్లో ఒకతను దీక్షగా వయొలిన్ వాయిస్తున్నాడు. రైల్వేస్టేషన్ ఎలా ఉంటుందో తెలుసుగా! హడా వుడి, గందరగోళం, వెళ్లేవాళ్లు, వచ్చేవాళ్లు, ఎవరికీ క్షణం కూడా నిలబడే తీరిక లేదు. అందరూ పరుగెడుతున్నారు. అలా పరుగెడు తున్న వాళ్లలో ఒకతను మాత్రం ఎక్కడి నుంచో సంగీతం వినిపి స్తోందని కాసేపు అక్కడే ఆగి అటూఇటూ చూసి, మళ్లీ తన షెడ్యూల్ గుర్తుకొచ్చి పరుగెత్తాడు. అందరిదీ అదే స్థితి. పరుగులూ... ఉరకలూ! ఇంతలో మూడేళ్ల పిల్లాడొకడు వచ్చి అక్కడ నిలబడ్డాడు. వాళ్ల అమ్మ వాణ్ణి నిలబడనివ్వలేదు. రెక్కపుచ్చుకొని ముందుకు లాక్కుపోయింది. ఇతర తల్లులూ తమ పిల్లల్ని అలాగే తీసుకుపో తున్నారు. అప్పటికి నలభై అయిదు నిమిషాలైంది. నిర్విరామంగా అతను వయొలిన్ వాయిస్తూనే ఉన్నాడు. కానీ, నిదానంగా విన్న వాళ్లని వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. వారిలో డబ్బులిచ్చినవారూ తక్కు వే. అంతా లెక్కపెడితే యాభైడాలర్లు దాటవు! మరో పదిహేను నిమిషాల తర్వాత వయొలిన్ వాయించడం ఆపు చేశాడు. సంగీ తం నిలిచిపోయి నిశ్శబ్దం ఆవహించింది. ఎవరూ అతన్ని పట్టించుకోలేదు. ఎవరికీ తెలియని విషయమేమిటో చెప్పానా, అప్పటివరకూ మెట్రో రైల్వేస్టేషన్లో వయొలిన్ వాద్యం వినిపించింది జోషుయా బెన్ - ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంగీత విద్వాంసుడు. అత్యంత అధునాతనమైన వయొలిన్మీద చాలా క్లిష్టమైన సంగీత స్వరాల నూ, రాగాలనూ, గమకాలనూ అద్భుతంగా మనోజ్ఞంగా వినిపిం చాడు. రెండురోజుల తరువాత బోస్టన్ లో అతని సంగీతకచేరీ ఏర్పాటు చేస్తే అదే సంగీతాన్ని వినడానికి జనం వెర్రిగా ఎగబడ్డా రు. టికెట్టు కోసం తన్నుకున్నారు. ‘థియేటర్ ఫుల్ అయ్యింది, సీట్లు లేవు మహాప్రభో’ అంటే ఫరవాలేదు... నిలబడి వింటామన్నారు. ఇదేదో కల్పించి చెబుతున్న కథకాదు. నిజంగా జరిగింది. జోషుయా పేరు ప్రకటించకుండా సాదాసీదాగా ఒక సాధారణ కళాకారుడిగా ఆయన వయొలిన్ వాయిస్తే ప్రజలు ఏ మేరకు ఆస్వాదిస్తారో చూడాలన్న కుతూహలం ‘వాషింగ్టన్ పోస్ట్’కు కలి గింది. ఈ క్రమంలో ప్రజల ప్రాధాన్యాలు, అభిరుచులు, అవగా హన, స్పందన తెలుసుకోవచ్చని కూడా ఈ ప్రయోగం చేసింది. దీనితో ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. బహిరంగ ప్రదేశంలో, అనువు గాని సమయంలో మనం అందాన్ని, తీయదనాన్ని ఆస్వాదించ గలమా? అభినందించగలమా? అతని ప్రతిభను, ప్రావీణ్యాన్ని గుర్తించగలుగుతామా? ఏమో! అవన్నీ ఎలావున్నా నాకు మాత్రం ఒకటనిపిస్తోంది. ఒక అద్భుతమైన కళాకారుడు నిర్మలమైన, మధురమైన, మనోహర మైన తన దివ్య సంగీతంలో పరిసరాలను ముంచెత్తుతుంటే క్షణం కూడా నిలబడి వినేందుకు మనకు తీరిక లేదంటే ఈ ప్రవహించే జీవన వాహినిలో పరుగులిడే చక్రాలమధ్య ఏది వింటున్నామో, ఏది తింటున్నామో, ఏది చూస్తున్నామో, ఏది ఆస్వాదిస్తున్నామో తెలియకుండా ఎన్ని అందాలను, ఎన్ని సౌందర్యాలను, ఎన్ని మధురిమలను, ఎన్ని సౌకర్యాలను ఎన్ని రంగుల్ని, ఎన్ని కాంతుల్ని మనం మిస్ అవుతున్నామో కదా అని దిగులేస్తోంది! ఒకే జీవితం అనేక అందాలు, తనివి తీరా ఇప్పుడే ఆస్వాదించండి. జీవితానికి ఎక్స్‌పెయిరీ డేట్ ఉంది. -ప్రయాగ రామకృష్ణ -
కృతఘ్నత
కృతఘ్నతకు మించిన పాపం మరొకటి లేదు. అంతటి హేయానికీ, నీచానికీ ఎవరూ పాల్పడకూడదు. అలా పాల్పడేవారు నరాథములు. మనిషై పుట్టాక ప్రతి ఒక్కరూ తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేస్తూనే వుంటారు. చిన్నవో పెద్దవో పాపాలు చేస్తూనే వుంటారు. వాటన్నింటికీ ఏదో ఒక విధమైన పరిహారం ఉంది కాని, కృతఘ్నతకు మాత్రం లేదు. కృతఘ్నత అంటే, ఎదుటి వారు చేసిన సాయం మరచిపోయి వాళ్లకే హాని తలపెట్టడం. ఇది మహా పాపం. భారతంలో ఇందుకు సంబంధించిన కథ ఒకటి ఉంది. ఒకప్పుడు ఒక సామాన్య గృహస్థుకు డబ్బు సంపాదించాలన్న ఆశ కలిగి కొందరు వర్తకులతో కలసి దూర ప్రాంతానికి వెళ్లాడు. మధ్యలో ఒకచోట దట్టమైన అడవిగుండా నడిచి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు ఒక మదపుటేనుగు వాళ్లను వెంబడించింది. పేద గృహస్థు ఏలాగోఅలా తప్పించుకున్నాడు గాని, మిగిలిన వాళ్లందరూ చనిపోయారు. గృహస్థు పరుగెత్తి చివరకు ఓ చెట్టు కిందకు చేరాడు. దాని నీడన సేదతీరాడు. కాసేపటికి అక్కడికి ఒక ముసలి కొంగ వచ్చింది. పేద గృహస్థు ఆ కొంగతో తన కథంతా చెప్పుకున్నాడు. అది జాలిపడి అతన్ని ఆదరించింది. ఆతిథ్యమిచ్చింది. ఆ రాత్రికి అతను ఆ చెట్టు కిందే విశ్రమించాడు. మరునాడు ఉదయం మళ్లీ ప్రయాణం అయ్యాడు. కొంగ, మిత్రుడికి వీడ్కోలు చెబుతూ ‘ఇదిగో, ఇక్కడికి కొద్ది దూరంలోనే విరూపాక్షుడు అనే రాక్షసుడున్నాడు. పేరుకు రాక్షసుడే కాని చాలా మంచివాడు. నాకు మిత్రుడు. నేను పంపానని చెప్పు. నీకు కావాల్సినంత ధనం ఇస్తాడు’ అని చెప్పింది. గృహస్థు ఆ మాటకు మహదానందపడ్డాడు. తిన్నగా విరూపాక్షుడు దగ్గరికి వెళ్లి తనను ముసలి కొంగ పంపించిందని చెప్పి పరిచయం చేసుకున్నాడు. విరూపాక్షుడు సంతోషించి అతనికి సమృద్ధిగా ధనకనక వస్తు వాహనాలిచ్చాడు. అవన్నీ తీసుకొని గృహస్థు మళ్లీ చెట్టు దగ్గరికి వెళ్లి కొంగతో జరిగిందంతా వివరంగా చెప్పాడు. కొంగ సంతోషించింది. ఆ రాత్రికి తనతో ఉండమంది. గృహస్థు సరేనన్నాడు. రాత్రి అయింది. ఇద్దరు నిద్రకు ఉపక్రమించారు. కాసేపటికి గృహస్థు లేచి ‘రేపు ఉదయాన్నే ప్రయాణం కావాలి. ఎంతో దూరం నడిస్తేగాని ఊరు చేరుకోలేను. మార్గమధ్యంలో ఆకలైతే ఏం చెయ్యాలి?’ అనుకుని ఏ మాత్రం ఆలోచించకుండా పక్కనే పడుకున్న కొంగను పెద్ద బండరాయితో మోది చంపాడు. దాని మాంసాన్ని మూటకట్టుకొని బయలుదేరాడు. విరూపాక్షుడికీ సంగతి తెలిసింది. కోపం పట్టలేకపోయాడు. తన అనుచరులను పిలిచి ‘గృహస్థుని చంపి అతని రక్త మాంసాల్ని కడుపారా ఆరగించండి’ అని ఆదేశించాడు. ‘చేసిన మేలు మరచిపోయి ఉపకారం చేసే వాళ్లకే అపకారం చేసిన మహా పాపీ కృతఘు్నడూ అయిన ఆ గృహస్థు మాంసం మేము ముట్టం’ అని వాళ్లు తెగేసి చెప్పారు. ‘సరే! అలా అయితే ఆ మాంసాన్ని కుక్కలకీ, నక్కలకీ వేయండి’ అన్నాడు విరూపాక్షుడు. వాళ్లు హుటాహుటిన వెళ్లి గృహస్థుని హతమార్చి అతని శవాన్ని ముక్కలు చేసి కుక్కలకూ, నక్కలకూ విసిరేశారు. అవి కూడా ముట్టలేదు. ముఖాలు పక్కకు తిప్పుకున్నాయి. ఈ ప్రపంచంలో మిత్రద్రోహం, కృతఘ్నతలకు మించిన పాపం మరొకటి లేదు. అంతటి హేయానికీ, నీచానికీ ఎవరూ పాల్పడకూడదు. అలా పాల్పడేవారు నరాథములు. - ప్రయాగ రామకృష్ణ -
నిర్మల మనసు
పురుషార్థాలలో డబ్బొకటి. ప్రతి మనిషీ సంపాదించాల్సిందే. ఆ సంపాదన ధర్మబద్ధం కావాలి. మనం సంపాదించింది పదిమందికీ ఉపయోగపడాలి. కొందరు పైకి మురికోడుతుంటారు. మరి కొందరు లోపల మురికోడుతుంటారు. కొందరు చూడటానికి మల్లెపువ్వులా అందంగా వుంటారు. కానీ మనసంతా ముళ్లకంపే! కొందరు అందవికారంగా వుంటారు. కానీ మనసుమాత్రం వెన్నముద్దలా వుంటుంది. పారిజాతంలా స్వచ్ఛంగా వుంటుంది. అష్టావక్ర మహర్షి అంటాడు - మనిషి వంకరగా వున్నా ఫరవాలేదు. మనసు మాత్రం వంకరగా వుండకూడదని. మనిషి పుట్టాక విధిగా కొన్ని ధర్మాలు పాటించాలి. అందులో ‘శౌచం’ కూడా ఒకటి. శౌచం అంటే పరిశుభ్రత. ఇంగ్లిష్‌లో క్లీన్లీనెస్ అని అంటారు. ఇది బాహ్యమూ, అంతరమూ కూడా. అంతర్ శౌచమే అన్నింటికంటే ముఖ్యం. ఈర్ష్య, అసూయలు, రాగద్వేషాలు, కుళ్లూకుత్సితాలూ లేకుండా మనసు మంచిది కావాలి. మనసుబట్టే మాటలు. మనసు మంచిదైతే మాటా మంచిదవుతుంది. పలికే వారి మనసును బట్టే మాట చల్లగా ఉండడమో, తియ్యగా ఉండడమో, వాడిగా ఉండడమో, వేడిగా ఉండడమో జరుగుతుంది. అయితే ఇవేవీ కావన్నట్లు ఒళ్లంతా చందన గంధాలు పూసుకొని మేము స్వచ్ఛంగా, శుభ్రంగా ఉన్నామనుకుంటే సరిపోదు. శౌచం శరీరానికీ మనస్సుకే కాదు, అన్నింటికీ కావాలి. అలాగే డబ్బు కూడా. సంపాదించే డబ్బు సక్రమమైనదై వుండాలి. ధర్మమార్గంలో సంపాదించినదై వుండాలి. అప్పుడే దానికి యోగ్యత, గౌరవం. అర్థ శౌచమంటారు దీన్ని. అంతర్ శౌచం ఎంతముఖ్యమో, అర్థ శౌచం కూడా అంతే ముఖ్యం. శృంగేరీ శారదా పీఠాధిపతి జగద్గురువులు అయిన శ్రీ భారతీ తీర్థ మహాస్వామి ఒకసారి అనార్యుల ధనం, అసత్పరుషుల ధనం గురించి మాట్లాడుతూ - ద్రవ్యం న్యాయార్జితమై ఉండాలి. అప్పుడే అది దానానికీ, ధర్మానికీ పనికొస్తుందని సోదాహరణంగా చెప్పారు. ఒక వృద్ధుడు క్రయ, విక్రయ దస్తావేజులు రాసుకుంటూ జీవనం సాగించే వాడు. ఎంత భారీ ఆస్తి అయినా దానికి సంబంధించిన డాక్యుమెంటు రాయవలసి వస్తే 2 రూపాయలు మాత్రమే ఆయన వసూలు చేసేవారట. ఒకసారి ఆయన స్నేహితుడు ‘అదేమిటోయ్, 10,000 రూపాయల డాక్యుమెంటైనా, లక్ష రూపాయల డాక్యుమెంటైనా రెండు రూపాయలే తీసుకుంటావు. ఇదేం న్యాయం’? అని అడిగాడు. దస్తావేజు విలేఖరి నవ్వుతూ ‘న్యాయం కాక ఇంకేముంది? పదివేల రూపాయల దస్తావేజైనా, లక్షరూపాయల దస్తావేజైనా ఒకే విధంగా రాస్తాను. కాకపోతే లక్ష రూపాయల డాక్యుమెంటులో ఒక సున్నా ఎక్కువ పెడతాను. ఆ ఒక్క సున్నా కోసం ఎక్కువ వసూలు చేయడం న్యాయమంటావా’? అని ప్రశ్నించాడు. దానికి మిత్రుడు ఆశ్చర్యపోయాడు. అదీ అర్థశౌచమంటే! పురుషార్థాలలో డబ్బొకటి. ప్రతి మనిషీ సంపాదించాల్సిందే. అయితే ఆ సంపాదన ధర్మబద్ధం కావాలి. ఇంకోమాట చెబుతాను - సంపాదించింది మనమొక్కరిమే అనుభవించటం కాదు. మనం సంపాదించింది పదిమందికీ ఉపయోగపడాలి. ఇస్తే తరిగిపోతుందనుకుంటాం. కానీ అది సరికాదు. నూతిలో తోడుతూంటేనే నీరు ఊరుతూ ఉంటుంది. అదీ భారతీస్వామి చెప్పిన రహస్యం. - ప్రయాగ రామకృష్ణ.