అదీ ప్రేమంటే!
లంచ్ బ్రేక్ కోసం పిల్లలంతా ఎదురు చూస్తున్నారు. అంతలో టీచర్ ‘ప్రేమ’ అంటే ఏమిటో తెలుసా మీకు? అని అడిగింది పిల్లల్ని. పిల్లలందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. టీచర్ నవ్వుతూ ‘బ్రేక్‌టైమ్‌లో మీరంతా స్కూల్ ఆవరణలో తిరుగుతూ మీ మనసుకు నచ్చినవీ, మీకిష్టమైనవీ పట్టుకురండి. అప్పుడు చెబుతాను ప్రేమంటే ఏమిటో’ అంది.
అంతలో లంచ్ బెల్ మోగింది. పిల్లలందరూ బయటకు పరుగెత్తారు. గంట తర్వాత మళ్లీ క్లాస్ మొదలైంది. టీచర్ వచ్చి ‘ఇప్పుడు చెప్పండి - మీరేవేం తెచ్చారో’ అంది. పిల్లలందరూ హడావుడి పడుతున్నారు. ఒక అమ్మాయి ముందుకొచ్చి ‘నేను ఎర్రటి గులాబీ పువ్వు తెచ్చాను. బాగుంది కదా టీచర్?’ అంది. ఇంకో అమ్మాయి లేచి సీతాకోకచిలుకను చూపిం చింది. ‘చూడండి టీచర్ దీని రంగురంగుల రెక్కలు ఎంత ముద్దొస్తున్నాయో. నాకైతే దీన్ని అసలు వదిలిపెట్టాలనిపించడంలేదు’ అంది. ఈసారి పోటీగా ఓ పిల్లవాడు లేచి నిలబడి ‘నేనీ పక్షి పిల్లను తెచ్చాను. చెట్టుమీద ఉన్న గూడులోంచి జారికింద పడింది. క్యూట్‌గా ఉంది కదా టీచర్’ అన్నాడు. మిగిలిన పిల్లలందరూ కూడా అలాగే వాళ్లకు వచ్చినవన్నీ తీసుకొచ్చి టీచర్ టేబుల్ మీద పెట్టారు.
పెద్ద కలెక్షనే తయారైంది. కాని, ఒకే ఒక అమ్మాయి అన్నీ వింటూ అందరినీ చూస్తూ మౌనంగా ఉంది. వట్టి చేతులతో వచ్చినందుకు సిగ్గుపడుతోంది. టీచర్ వెళ్లి ఆ అమ్మాయి పక్కన కూర్చుంది. ‘ఏం? ఎందుకలా ఉన్నావ్? నీకు నచ్చినవేవీ దొరకలేదా?’ అని అడిగింది. ‘లేదు టీచర్. నాకు చాలా చాలా నచ్చాయి. పచ్చటి చెట్ల దగ్గరకు వెళ్లి రంగురంగుల పూలను చూశాను. పూలన్నీ కోసి తెద్దామనుకున్నాను. కాని కోస్తే వాటి అందం పోతుంది. పరిమళం పోతుంది. అందరూ వాటి అందాన్నీ సువాసనల్నీ అనుభవించలేరు. పూలు చెట్లకుంటేనే బాగుంటుం దని కొయ్యలేదు’ అని టీచర్ మొహంలోకి చూసింది.
టీచర్ ఆ పిల్లను గుండెలకు హత్తుకుంది.
‘నేను సీతాకోకచిలుకని కూడా చూశాను టీచర్. చాలా సాఫ్ట్‌గా కలర్‌ఫుల్‌గా ఉంది. ఈ పువ్వు మీద నుంచి ఆ పువ్వు మీదకు, ఆ పువ్వు నుంచి ఈ పువ్వు మీదకు వాలుతూ హాయిగా ఆడుకుంటోంది. దాన్ని పట్టి తీసుకురావాలనిపించలేదు. దాన్ని డిస్టర్బ్ చెయ్యకూడదనుకున్నాను’
టీచర్ కన్నీళ్ల పర్యంతమైంది. ఆ అమ్మాయి చెప్పుకుంటూపోతోంది. ‘చెట్టుమీద నుంచి ఓ పక్షి పిల్ల జారికిందకు పడబోతూ చెట్ల ఆకుల మధ్య చిక్కుకుం ది. దాన్ని చేతులోకి తీసుకోబోతుండగా పైనుంచి వాళ్ల అమ్మ జాలిగా నావంక చూసింది. పక్షిపిల్లను చెట్టు మీద నున్న గూట్లో సేఫ్‌గా పెట్టి వచ్చాను. పూలవాసన, బట్టర్‌ఫై్ల ఆటలు తల్లిపక్షి ఆనందం- ఇవి మాత్రమే నా దగ్గర ఉన్నాయి. కానీ అవేవీ నేను మీకు చూపించలేను’ అంది అమాయకంగా. టీచర్ ఆ అమ్మాయిని దగ్గరకు తీసుకుని ముద్దాడింది. అదీ ప్రేమంటే!
- ప్రయాగ రామకృష్ణ