
ఉప్పల్: సరిగ్గా ఏడాది క్రితం ప్రేమికుల రోజున ఒక్కటైన జంట ఉదంతంలో విషాదం చోటుచేసుకుంది. కట్టుకున్నోడే వేధింపులకు గురిచేయడంతో తట్టుకోలేక యువతి ఆత్మహత్య చేసుకుంది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనపై ఇన్‌స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు..సూర్యాపేట జిల్లా మద్దిరాల గ్రామానికి చెందిన ఆకుల మనీషా(24), తుంగతుర్తి ప్రాంతానికి చెందిన పులిగుజ్టు సంపత్‌లు ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చదివే సమయంలో ప్రేమించుకున్నారు.
ఇద్దరి కులాలు వేర్వేరు కావడంతో మనీషా తల్లిదండ్రులను ఎదురించి సంపత్‌ను గతేడాది వాలంటైన్స్ డే రోజున ఉప్పల్ ఆర్యసమాజ్‌లో పెళ్లాడింది. అనంతరం రామంతాపూర్‌లో కాపురం పెట్టారు. వీరి వైవాహిక జీవితం కొన్నాళ్లు బాగానే ఉన్నా అనుకోని విధంగా భర్త నుంచి వేధింపులు ప్రారంభమయ్యాయి. సంపత్‌కు వరుసకు సోదరి అయ్యే మున్నిత అనే యువతి కూడా కట్నం తేవాలని వేధించడంతో ఇటీవల మనీషా విషయాన్ని తల్లిదండ్రులకు మొరపెట్టుకుంది.
దీంతో వారు భర్తను వదిలేసి ఇంటికి రావాలని సలహా ఇవ్వగా అందుకు ఒప్పుకోలేదు. చివరకు తీవ్ర ఒత్తిడికి గురై ఆదివారం రాత్రి తాను ఉంటున్న గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ అసుపత్రికి తరలించారు. మనీషా తండ్రి మల్లయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు భర్త సంపత్, మున్నితపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment