
మదనపల్లె: కుటుంబ పోషణ కోసం ఆస్పత్రిలో నర్సుగా చేరిన ఓ యువతిని ప్రేమ పేరుతో లొంగదీసుకుని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ప్రైవేట్ ఆస్పత్రి మేనేజర్‌తో పాటు బెదిరించినందుకు మరో ఇద్దరు వైద్యులపై గురువారం రాత్రి కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ సీఐ ఎరీషావలీ తెలిపారు. కురబలకోట మండలం తెట్టు పంచాయతీ సింగన్నగారిపల్లెకు చెందిన ఓ యువతి (25) నర్సింగ్ పూర్తిచేసి ఉపాధి కోసం మదనపల్లె పట్టణం బెంగళూరురోడ్డులోని ఓ ఆస్పత్రిలో నర్సుగా చేరింది. అదే ఆస్పత్రిలో మేనేజర్‌గా పనిచేస్తున్న వివాహితుడైన రాజేష్ రెడ్డి(30) ఆమెకు ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు.
వివాహం చేసుకుంటానని నమ్మించాడు. దీంతో ఇద్దరూ శారీరకంగా ఒకటయ్యారు. ఆమె గర్భవతి కాగా, మాయమాటలు చెప్పి తిరుపతికి తీసుకువెళ్లి గత ఏడాది ఆగస్టులో అబార్షన్ చేయించాడు. తర్వాత కొంతకాలానికి రాజేష్‌రెడ్డి వివాహితుడనే విషయం తెలుసుకున్న యువతి తనకు ఎందుకు మోసం చేశావని నిలదీసింది. తనకు న్యాయం చేయాలని లేకపోతే చట్టపరంగా పోలీసులను ఆశ్రయిస్తానని ఖరాఖండిగా చెప్పింది. దీంతో పెద్దమనుషుల సహాయంతో పలుమార్లు పంచాయతీలు నిర్వహించి యువతికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆమె వినకపోగా, తనకు కచ్చితంగా న్యాయం జరగాల్సిందేనని లేకపోతే పోలీస్ కేసు పెడతానని చెప్పింది.
దీంతో ఆస్పత్రి యజమాని, వైద్యుడైన రవికుమార్‌రెడ్డి ఆమెను నీకు దిక్కున్న చోట చెప్పుకోమంటూ ఉద్యోగంలో తొలగించి బయటకు పంపేశాడు. ఇ దే విషయంలో అంగళ్లుకు చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు రా యుడు యువతిని బెదిరింపులకు గురిచేశాడు. దీంతో తన కు న్యాయం జరగదని నిర్ధారించుకుని, బాధిత యువతి వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించింది. విచారించిన సీఐ ఎరీషావలీ, యువతిని మోసం చేసిన రాజేష్ రెడ్డి, ఆస్పత్రి వైద్యులు రవికుమార్‌రెడ్డి, ఆర్‌ఎంపీ వైద్యుడు రాయుడులపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment