మనస్సాక్షి | Conscience | Sakshi
Sakshi News home page

మనస్సాక్షి

Published Mon, Jan 26 2015 2:43 AM | Last Updated on Sat, Sep 2 2017 8:15 PM

మనస్సాక్షి

మనస్సాక్షి

  జ్యోతిర్మయం
 రత్తాలు ఆమె భర్త రాంబాబు ఇద్దరూ పట్నంపోయి మార్కెట్ నుంచి ఓ గాడిదను కొనుక్కుని వస్తున్నారు. కొంత దూరం వెళ్లాక వాళ్లకో కుర్రాడు ఎదురయ్యా డు. అతను వాళ్లను వింతగా చూస్తూ ‘తెలివితక్కువ దద్దమ్మలు గాడిదను ఉత్తినే అలా నడిపించుకుపోవడ మెందుకు? ఎవరో ఒకరు దాని మీద హాయిగా కూర్చోవచ్చుగా’ అనుకున్నాడు కొంచెం బయటికి వినిపించేలా. రత్తాలు, రాంబాబు విన్నారవి.
 వెంటనే రత్తాలు గాడిదనెక్కి కూర్చుంది.
 రాంబాబు పక్కన నడుస్తున్నాడు. అలా కొంత దూరం వెళ్లారు. మార్గమధ్యంలో ఒక వృద్ధుడు చూశాడు వాళ్లని. ‘కలికాలం. పెద్ద చిన్న తారతమ్యాలు లేకుండా పోయాయి. పెనిమిటి ఇంటికి పెద్ద కదా! అతను నడుస్తుంటే ఆమె ఠీవిగా గాడిదనెక్కి కూర్చుంటుందా! అని ముక్కు మీద వేలేసుకున్నాడు.
 ఈ మాటలు రత్తాలు వింది. గాడిదను ఆపి తను కిందకు దిగింది. రాంబాబును కూర్చోబెట్టింది. కొంత దూరం అలా వెళ్లారు. ఈసారి, వంగిపోయిన నడుముతో నడవలేక నడుస్తూన్న ఒక ముసలి అవ్వగారు ఎదురైంది. ఆవిడ ఒక్కక్షణం నడుమును నిటారుగా చేసుకుని వాళ్లవంక తేరిపార చూసింది ‘నువ్వయ్యా’ ఎవరో అనుకున్నాను. సీతయ్య పెద్ద కొడుకువి గదూ! అయినా ఇదేం పాడు బుద్ధిరా నీకు. పెళ్లాం ఆపసోపాలు పడుతూ పక్కన నడుస్తుంటే నువ్వొక్కడివే ‘టింగురంగా’ అన్నట్టు గాడిదమీద ఊరేగుతావా. దాన్నీ నీ పక్కన కూర్చోబెట్టుకోవచ్చు గా. ఆ మాత్రం సర్దుకోలేవా’ అని చీవాట్లు పెట్టింది.

 రాంబాబు అవాక్కయ్యాడు. తను ముందుకు జరిగి తన వెనక భార్యకు చోటిచ్చాడు. రత్తాలు ఒకే ఒక గెంతుగెంతి గాడిదనెక్కి కూర్చుంది. గాడిద భారంగా ముందుకు కదిలింది. ఆ తర్వాత కాసేపటికి బండెడు పుస్తకాలున్న సంచీని వీపు మీద మోసుకెళ్తున్న ఓ పదేళ్ల పిల్ల ఎదురైంది. ‘ఈ పుస్తకాన్నే మొయ్యలే కుండా ఉన్నాను నేను. పూర్ డాంకీ, ఆ ఇద్దర్నీ ఎలా మోస్తోందో’ అని గాడిద మీద బోకెడంత జాలి పడింది.

 రత్తాలు, రాంబాబు ఇద్దరూ ఆ మాటలు విన్నారు. వెంటనే కిందకు దిగి గాడిదను ఇద్దరూ భుజాల మీదకెక్కించుకుని నడుస్తున్నారు. ఒకే చోట సన్నటి కాలిబాట వంతెన దాటాల్సొచ్చింది. రత్తాలు, రాంబాబు వాళ్ల మీద గాడిదా ఉండె! ముగ్గురికీ ఇరుకు సందు దాటడం కష్టంగా ఉంది. గాడిద బెదిరిపోయింది. గింజుకుంది. అటూఇటూ పెనుగులాడింది. పెద్ద ఓండ్రపెట్టింది. దాంతో అదుపు తప్పి ముగ్గురూ పక్కనున్న కాలవలో పడ్డారు.

 ఒకటి గుర్తుంచుకోవాలి మనమంతా. మనల్నీ, మనం చేస్తున్న పనినీ అందరూ అన్నివేళలా హర్షిస్తారనుకోవడం తెలివితక్కువ. అలాగే అందరూ విమర్శిస్తారనుకోవడం కూడా తెలివి తక్కువే. దూషణ భూషణ తిరస్కారాలు ఎప్పుడూ ఉంటాయి. నిన్న, ఈవేళ, రేపు. మన మనస్సు స్వచ్ఛంగా శుభ్రంగా అబ్రకపు రేకులా ఉన్నంతకాలం మనం ఇతరుల మాటలను పట్టించుకోవాల్సిన పనిలేదు. పట్టించుకుంటే అడుగు ముందుకు పడదు.
     - ప్రయాగ రామకృష్ణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement