వివేకం: కృతజ్ఞత తెచ్చిపెట్టుకునేది కాదు
కృతజ్ఞతాభావం అంటే ఏమిటి? మీ కళ్లను మీరు బాగా తెరిచి మీ చుట్టుపక్కల ఉన్న జీవితాన్ని చూస్తే, మీ జీవితం గడవడానికి మిగతా వాటి ప్రమేయం ఎంత ఉందో మీరు స్పష్టంగా చూస్తే, మీకు కృతజ్ఞతాభావం కలగకుండా మానదు. మీ ఎదురుగా పళ్లెం నిండా ఆహారం ఉందనుకుందాం. ఆ ఆహారం అక్కడకు రావడానికి ఎంతమంది పనిచేస్తుంటారో మీకు తెలుసా? విత్తనాలు నాటిన రైతు దగ్గరి నుండీ, ఆ భూమి మీద జరిగే ఎన్నో సంఘటనలు, కోత కోసేవారు, షాప్‌కు తెచ్చేవారు, దాన్ని అమ్మేవారు, దాన్ని అక్కడి నుంచి కొనేవారు, వండేవారు, వడ్డించేవారు... ఇలా దీనిలో ఎంతమంది ప్రమేయం ఉందో చూడండి. నేను దీనికి డబ్బు చెల్లించా కాబట్టి, నాకది వచ్చి తీరాల్సిందే అని కాకుండా, మీ ఊపిరి మొదలుకొని ఆహారం వరకూ మీ జీవితంలో మీరు ఆస్వాదించే అనుభూతి చెందే ప్రతి విషయాన్నీ ఈ విధంగా చూడండి.
ఈ మొత్తం ప్రక్రియలో మనుషులు లేకపోయినా లేదా ఉన్నవాళ్లు చేయాల్సింది చేయకపోయినా ఏమీ జరగవు. భూగ్రహం, ఈ గ్రహానికి ఆవల ఉన్న ప్రాణులు కూడా మిమ్మల్ని ఎలా పోషిస్తున్నవో, ఎలా సాయపడుతున్నవో మీరు కళ్లు తెరిచి, చూడండి. మీరు ఇదంతా చూస్తే అప్పుడు కృతజ్ఞతాభావాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉండదు. కృతజ్ఞత అనేది తెచ్చిపెట్టుకునే ఒక గుణం కాదు. మీకు అందుతున్న వాటన్నింటినీ చూసి, మీరు తబ్బిబ్బైనప్పుడు, మీ నుంచి పెల్లుబికే భావన కృతజ్ఞత. అది తెచ్చిపెట్టుకునే గుణమైతే, ఘోరంగా ఉంటుంది. కృతజ్ఞతంటే కేవలం ‘థాంక్యూ, థాంక్యూ’ అని అనడం కాదు.
ప్రస్తుతం మీరు జీవించి ఉండటానికీ, క్షేమంగా ఉండటానికీ సృష్టిలో ఉన్న అనేకం తోడ్పడుతున్నాయి. మీరు వాటిని కేవలం సంఘటనలుగా గమనించినా, ఆ మనుషుల మీద, వస్తువుల మీద కృతజ్ఞతాభావం ఉప్పొంగక మానదు. మీకు వారితో ఎటువంటి సంబంధం లేకపోయినా, తెలియకపోయినా మీ జీవితంలోని ప్రతి క్షణానికీ వారు అన్నీ ఇచ్చారు.
కాబట్టి, మీరు కళ్లు తెరిచి మీ చుట్టూ ఉన్న జీవితం ఎలా జరుగుతోందో చూస్తే, మీరు కృతజ్ఞతాభావంతో ఉండకుండా ఎలా ఉంటారు? మీరు మరీ గర్వంతో జీవిస్తూ, ఈ భూమికే రాజునని అనుకుంటే, మీరు ప్రతిదీ కోల్పోతారు. మీరు పూర్తిగా మీ గురించిన ఆలోచనలతోనే నిండిపోయి ఉంటే, మీరు మొత్తం జీవన ప్రక్రియనే అనుభవించలేరు. అలా కాకుండా, మీరు పూర్తి గమనికతో ఉంటే, కృతజ్ఞతతో ఉప్పొంగిపోతారు. మీరు కృతజ్ఞతతో ఉంటేనే, మీరు ఏదైనా స్వీకరించడానికీ అర్హులుగా ఉంటారు. మీకు ఎవరిపట్లయినా కృతజ్ఞతాభావం ఉంటే, మీరు వాళ్లని గౌరవంగా చూస్తారు. మీరు దేన్నైనా గౌరవంగా చూస్తే, మీరు చాలా స్వీకారభావంతో ఉంటారు. మొత్తం యోగా ప్రక్రియ ఉద్దేశ్యమంతా మీకు కూడా తెలియని ఎన్నో రీతులలో లోతుగా, లోలోతుగా మిమ్మల్ని స్వీకారభావంతో ఉండేలా చేయడమే. అదే దాని లక్ష్యం. కాబట్టి, కృతజ్ఞతతో ఉప్పొంగిపోవడమే స్వీకార భావంతో ఉండటానికి ఒక అందమైన దారి.
సమస్య - పరిష్కారం
పిల్లలు వీడియో గేమ్‌లు, మొబైల్ గేమ్‌లకు అలవాటు పడిపోతున్నారు. ఇవి పుస్తకాలకు ప్రత్యామ్నాయమా?
- జి.కరుణ, హైదరాబాద్
సద్గురు: పుస్తకాలు చదవడం ఒక సంస్కృతిగా ప్రోత్సహించాలి. చదవడం ఎంతో గాఢమైనది, లోతైనది. చూసేదాని కన్నా చదవటంలో ఎంతో గంభీరత ఉంది.
పుస్తకాలు చదివేవారు ప్రశాంత చిత్తులూ, జీవితం గురించి మరింత లోతుగా ఆలోచించేవారూ కాగలుగుతారు. చదువులో వారు చేసేది ఒక రకమైన ధారణ. మీ మనసుని దేనిలోనో కేంద్రీకరించడమే ధారణ అంటే. అది మెదడు పనిచేసే విధానాన్ని వృద్ధి చేస్తుంది.
ప్రస్తుతం ఈ ఎలక్ట్రానిక్ ఉపకరణాలు అన్నింటినీ అధిగమిస్తున్నాయి. అటువంటి పరిస్థితులలో మనం ఈ పుస్తక పఠనం మానకుండా ఉండటం ముఖ్యం.
ప్రస్తుతం ప్రజలు జీవితాన్ని గాఢంగా అర్థం చేసుకోలేకపోతున్నారు. జీవితంలోని గంభీరత లోపిస్తున్నది. అందరూ పైపైనే చూస్తున్నారు. దృశ్య శ్రవణ సాధనాలే దానికి కారణం అనుకుంటాను. వాటికి నేను వ్యతిరేకం కాను, కాని అవి చదువుకి ప్రత్యామ్నాయం కావు.