మంచి మాట: కృతజ్ఞత గొప్ప సంస్కారం | Gratitude consists in a response to benevolence | Sakshi
Sakshi News home page

మంచి మాట: కృతజ్ఞత గొప్ప సంస్కారం

Published Mon, Apr 25 2022 12:14 AM | Last Updated on Mon, Apr 25 2022 12:19 AM

Gratitude consists in a response to benevolence - Sakshi

‘కృతజ్ఞత ’ అంటే ఒకరు మనకు చేసిన మేలును మరచి పోకుండా ఉండటం. మనం ఒక ప్రమాదకరమైన స్థితిలో ఉన్నప్పుడో, మనకు ఏదో ఒక సహాయం అవసరమైనపుడో, మనం అడిగితే సహాయపడేవారు కొందరుంటారు. మనం అడగకపోయినా మనకు అవసరమైన ఉపకారం చేసే వారు కొందరుంటారు. వీరికెప్పుడూ మనం కృతజ్ఞులమై ఉండాలి. కృతజ్ఞత అనేది మానవ సంస్కారం.

ఒకరు తమకు చేసిన ఉపకారాన్ని గ్రహించటం పుణ్యం, దానికి సమానమైన ప్రత్యుపకారాన్ని చేయటం మధ్యమం, ఉపకారానికి మించిన ప్రత్యుపకారం చేయటం ఉత్తమం.
ఏరు దాటాక తెప్ప తగలేసే చందంగా కాకుండా, మన ఉనికికి, ఉన్నతికి కారకులైనవారి పట్ల మనం కృతజ్ఞులమై ఉండాలి. ఒకనాడు మనకు మేలుచేసిన మనిషి, విధివశాత్తూ కష్టంలో పడినట్టు మనకు తెలిస్తే –అతని పట్ల సకాలంలో, అవసరానికి తగినట్టుగా స్పందించకపోతే అది కృతజ్ఞత ఎలా ఔతుంది.

మేలు చేసిన సమస్త జీవుల పట్ల కృతజ్ఞత, మేలు చేయడంలో ఆసక్తి కలిగి ఉండాలి. అంటే మనుషులకే కాదు పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు, చెట్లు, చేమలు, పాములు, తేళ్ళు.. ఇలా అన్నింటికి మేలు కలగాలనే భావన ఉండాలి. శత్రువైనా, మిత్రుడైనా ఎవరైనా సరే అందరి మేలును కాంక్షించి కృతజ్ఞత, దయ కలిగి ఉండాలి. ప్రాణులన్నింటికి దుఃఖాలు బాధలు సహజం. కనుక వాటి దుఃఖాన్ని తొలగించటానికి, సుఖాన్ని కలిగించటానికి, అవసర సమయాలలో మేలుచేయటానికి ప్రయత్నించాలి.  

అయితే ఇలా సమస్త జీవుల పట్ల దయ కలగాలన్నా కష్టమే. మనకు మేలు చేసిన వారిపై అనురాగం కృతజ్ఞత ఉంటాయి. కనుక తిరిగి వారికి మేలు చేయాలనిపిస్తుంది. కాని మనకు కీడు చేసిన వారైతేనో వారికి కూడా మేలు చేయాలనుకుంటామా.. అనుకోలేము.
 కాని వారియందు కూడా కృతజ్ఞతాభావం, మేలుచేయాలనే గుణం కలిగి ఉండాలన్నది శాస్త్ర ప్రమాణమని పెద్దలు చెబుతున్నారు.

ఇది వినటానికి బాగానే ఉంది. కాని ఆచరణకు వచ్చేటప్పటికి ఈ నీతి సూత్రాలన్నీ గుర్తుకు రావు. అయితే ఎవరికి సమబుద్ధి ఉంటుందో, అందరిని ఒకేవిధంగా, ఆత్మస్వరూపులుగా, ఒక్కటిగా చూడగలుగుతారో వారే అపకారులకు కూడా ఉపకారంచేస్తూ కృతజ్ఞత చూపగలుగుతారు. మేలు చేయాలనే ఆసక్తి కలిగి ఉంటారు. ఇలా జీవులకు చేసే హితం, సేవ పరమాత్మకు చేసినట్లే. ఎందుకంటే సమస్త జీవులయందు పరమాత్మే ఉన్నాడు గనుక.

కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువను పెంచుతుంది. డబ్బుకు మనమిచ్చే విలువ ఆపదలో ఆదుకుంటుంది. సాటి మనిషికి మనం ఇచ్చే విలువ, చూపే కృతజ్ఞత వారి మనసులో మనకొక సుస్థిర స్థానం ఇస్తుంది.

అందువలన మనం అత్యాశను వదిలిపెట్టి సంతృప్తిని, కృతజ్ఞతను అలవరచుకోవటానికి ప్రయత్నించాలి. సంతృప్తితో జీవించేవారిని గౌరవించడం నేర్చుకోవాలి.

ఆనందమయమైన జీవితాన్ని గడపాలని ప్రతి ఒక్కరు కోరుకోవటం సహజం. దానికోసం ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తూనే ఉంటారు. అయితే అతను తన ఆశకు పరిమితులని ఏర్పరచుకోవాలి.
అన్నీ ఉన్నా ఇంకా కావాలి, ఇంకా కావాలనుకోవడం వలన అతనికి అనందం లభించదు. సంతృప్తి ప్రతి వ్యక్తికీ తప్పనిసరిగా ఉండాలి. అది లేకపోతే ఎంత ఉన్నా మనిషికి ఆనందం ఉండదు.

కోరికలను పెరగనిస్తూ పోతే ప్రపంచంలోని వస్తువులన్నీ కూడా ఒక వ్యక్తికి చాలవు. అందువలన అత్యాశకు అవకాశం ఇవ్వకూడదు.
తనకు దక్కిన దానితో సంతోషపడటం ప్రతివ్యక్తి నేర్చుకోవాలి. అత్యాశ లేని వ్యక్తి చాలా సంతోషంగా ఉంటాడు. అరణ్యాలలో నివసించిన ఋషులు చాలా సంతోషంగా జీవించారు. అక్కడ భౌతిక సంపదలు లేవు. అయితే వారికీ సంతృప్తి అనే సంపద ఉన్నది. అది వారికి ఆనందాన్ని ఇచ్చింది. మనిషి ఆధ్యాత్మికంగా ఎదగాలంటే సంతృప్తి అవసరం. మన కోరికలను తగ్గించుకోవటం మీద మన సంతృప్తి ఆధారపడి ఉంటుంది.

– భువనగిరి కిషన్‌ యోగి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement