
అడిగేవారికి చెప్పేవారు లోకువ అని సామెత. అయితే అవతలి వారు ఏమీ అడగకున్నా, వారికి ఏం కావాలో, ఏం చెబితే బాగుంటుందో తామే తెలుసుకుని నాలుగు మంచిమాటలు .. అందులోనూ ఆధ్యాత్మిక విషయాలు, వ్యక్తిత్వ వికాసానికి పాదులు తీసే అంశాలూ చెబుతుంటారు ప్రవచనకారులు. ఇక్కడ ప్రవచనకారులు అనగానే ముందుగా గుర్తొచ్చేది పురుషులే. అలాగని స్త్రీలు అసల్లేరని కాదు. అయితే వారి పేర్లు చెప్పాలంటే చేతివేళ్లు సరిపోతాయి. 8న మహిళా దినోత్సవం సందర్భంగా సమాజ హితంకోసం ప్రవచనాలు చెబుతున్న కొందరు మహిళామణుల గురించి తెలుసుకుందాం. వారి ప్రయాణంలోని సాధక బాధకాలు వారి మాటల్లోనే...
మహిళలు ప్రవచనాలా?
– డా. ఎన్. అనంతలక్ష్మి
‘‘ఈ రోజు ప్రేయర్ అయినాక నువ్వు మాట్లాడు’’ అన్నారు మాస్టర్ గారు. సంతోషం, భయం ఒకేసారి కలిగాయి. నా కంగారు అర్థం కాదా! పిలవలేదు. ఊపిరి పీల్చుకున్నా కాని, కొంచెం నిరాశ. తర్వాత జనకులం (తల్లి తండ్రులు స్కూలు తర్వాత పిల్లలకి సంప్రదాయం సంస్కారం నేర్పే వ్యవస్థ)లో పెద్దలకి ఆముక్తమాల్యదలో విష్ణుచిత్తుడి కథాభాగం చెప్పమన్నారు. ఎం. ఏ; లో అది మాకు పాఠ్యభాగం కాదు. మాస్టర్ గారికే నమస్కరించుకుని చెప్పాను.
అది వాళ్ళకి కాదు నాకు శిక్షణ. వేదవాఙ్మయాన్ని, పురాణేతిహాసాలను, కావ్యాలను శాస్త్రవిజ్ఞానంతో సమన్వయం చేసి, నేటితరానికి పనికి వచ్చే అంశాలని వివరించి, వాటి సార్వకాలీనతను ప్రపంచానికంతటికి వెల్లడించటం మా గురువరేణ్యులు కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్యుల పద్ధతి. అది శిష్యులలో కొద్దిగానైనా ప్రతిఫలించటం సహజం. ఈ కారణంగా నా సాహిత్య ప్రసంగాలు ఆధ్యాత్మిక ప్రవచనాలు అయ్యాయి.
వీలైనంత మందికి మాకు తెలిసిన విషయాలను చెప్పాలనే తపన తప్ప అది ప్రసంగమో, ప్రవచనమో పట్టించుకోలేదు. అందరూ అవి ప్రవచనాలు అని నిర్ధారించారు. అందరూ నన్ను ప్రవచనకర్త, ఆధ్యాత్మికవేత్త అంటుంటే వింతగా ఉంటుంది. నేను మామూలు గృహిణిని, ఉద్యోగినిని, తల్లిని అంతే! నన్ను అందరూ ఆ విధంగా గుర్తించటానికి నా కుటుంబ సభ్యులు అందరు కారణం. నా పిల్లలు, విద్యార్థులు అడిగే అనుమానాలని తీర్చటానికి మరింత అధ్యయనం చేయవలసి వచ్చింది. అనుకున్న ప్రయోజనాన్ని సాధించాననే అనుకుంటాను.
సాధారణంగా ఆడవాళ్ళు ప్రవచనాలు అంటూ బయలుదేరితే ఇంట్లోనే ఇబ్బందులని ఎదుర్కోవలసి వస్తుంది, అనేకరకాలుగా. అటువంటి సమస్య నాకు కుటుంబం నుండి రాలేదు. (ఎవరికీ ఇబ్బంది కలుగని విధంగా జాగ్రత్తలు తీసుకునే దాన్ని.) కాని, బయటి నుండి తప్పవు. ‘‘ఆడవాళ్ళు ప్రవచనాలు చేయటం ఏమిటి?’’,‘‘ముందు ఇల్లు చూసుకో మనండి.’’ ‘‘దీనికి కూడా ఆడవాళ్ళు పోటీకి వస్తే మా సంగతి ఏమిటి?’’ ఇటువంటివి చాలానే విన్నాం. పైగా మగవాళ్లు వినరు ఆడవాళ్ళు చెపితే వినేది ఏమిటి? అని. చేస్తున్నది ధర్మబద్ధం అయితే అటువంటి వ్యాఖ్యలని పట్టించుకో నవసరం లేదు. తల్లిలాగా లాలించినట్టు చెపితే మంచి వైపుకి సమాజం మళ్లుతుంది అనుకుని చెప్పాలి. అలాగే చెబుతున్నాను కూడా!
వ్యక్తిత్వ వికాసానికి.. ఆధ్యాత్మిక భావోన్నతికి...
– డా. తుమ్మలపల్లి వాణీకుమారి
వృత్తిరీత్యా నేను అధ్యాపకురాలిని. సుమారు 35 సంవత్సరాల బోధనానుభవంలో నాకు తెలిసినంతవరకు విద్యార్థులకు బోధించగలిగాననే సంతృప్తి నాకు నిండుగా ఉంది. నేను చాలాకాలంగా ప్రసార మాధ్యమాలలో, ఇతర సాహిత్య కార్యక్రమాలలో పాల్గొంటున్నా ప్రవచనాల వైపు మరల లేదు. ఒకసారి రామాయణం గురించి నేను వ్రాసిన పుస్తకాలను చూసి శ్రీ చాగంటి కోటేశ్వరరావు ‘‘ఇన్ని మంచి విషయాలను వ్రాసిన మీరు ప్రవచనాలను చెప్పకపోవడం ఏమిటి? పైగా హైదరాబాదులో ఉంటూ కూడా!’’ అన్నారు. వారి వాక్ప్రభావమో, దైవసంకల్పమో కానీ తరువాత కొన్ని ఆలయాలలో, ఇతర వేదికలలో ప్రవచనాలకు అవకాశం వచ్చింది.
మామూలు సాదం (అన్నం) భగవదర్పితమయితే ప్రసాదమైనట్లు మామూలు వచనం భగవత్సంబంధితమయితే అది ప్రవచనం అవుతుంది. ఆ విధంగా చెప్పేవారికి, వినేవారికి కూడా మనసు ఆధ్యాత్మికత వైపు మరలుతుంది కాబట్టి నాకు ప్రవచనాల పట్ల మక్కువ కలిగింది. అయితే ప్రవచనాలను వినేవారు పెద్దవారు. ప్రవచనకారులు చెప్పే విషయాల పట్ల కొంత అవగాహన ఉన్నా ఆసక్తిగా వింటారు.
చెప్పే విషయాలలో, తీరులో వైవిధ్యం ఉండటమే ఇందుకు కారణమనుకుంటాను. తెలుగు రాష్ట్రాలలో విఖ్యాతులైన ప్రవచనకారులు ఎంతోమంది ఉన్నా, నేను చెప్పినప్పుడు ఆసక్తిగా వినే శ్రోతలు లభించటం నా అదృష్టం. మంచి విషయాలను పదేపదే చెప్పటం వలన చెప్పేవారికి, వినటం వలన వినేవారికి మనసులో నాటుకుపోతాయి. మానవ సహజమైన బలహీనతలను అధిగమించే స్థైర్యం అలవడుతుంది. నా వరకు ఇది నా వ్యక్తిత్వ వికాసానికి, ఆధ్యాత్మిక భావోన్నతికి తోడ్పడుతుందని ఆశిస్తున్నాను.
చిన్నప్పుడే పునాది పడింది
– ఖుర్షీదా బేగం షేక్
నాకు చిన్నప్పటి నుంచి పుస్తక పఠనం అలవాటు. అలా ధార్మిక పుస్తకాలు, ఇస్లాం సాహిత్యాన్ని అధ్యయనం చేస్తూ, ధార్మిక రచనలు చేస్తూ ఉండటం మూలాన నా జీవితంలో ఆధ్యాత్మికతకు బలంగా పునాది పడింది. ఒక నిజమైన ముస్లిం విశ్వాసి నుండి దైవం ఏమి కోరుకుంటున్నాడో అది చేయడం మాత్రమే నా మోక్షానికి, దైవప్రేమకు, పరలోక జీవిత సాఫల్యానికి మార్గం అని గ్రహించాను. అంతిమ దైవగ్రంథం దివ్య ఖుర్ ఆన్, ప్రవక్త ముహమ్మద్(స) బోధించిన హాదీసు బోధలను, మహాప్రవక్త ముహమ్మద్ (స) వారి జీవిత చరిత్రను అధ్యయనం చేశాను. అవే నాకు ఆధ్యాత్మిక ప్రేరణ. ఒక విశ్వాసిగా ఇస్లాం అడుగుజాడల్లో నడుస్తున్నా సాటి విశ్వాసులకు ఏదో చేయాలనే తపన ఉండేది.
గ్రామీణ ప్రాంతాలలో స్త్రీలు ఆధ్యాత్మికంగా చాలా వెనుకబడి ఉండేవారు. ధార్మిక సమావేశాల్లో వారికి ఖుర్ ఆర్, హాదీసు బోధనలను వివరించేదాన్ని. వాళ్ళు కూడా ఎంతో ఆసక్తిగా విని, తమకు తెలియని ఎన్నో మంచి విషయాలను తెలుసుకునేవారు. మూఢనమ్మకాలు, అజ్ఞానం, నిరక్షరాస్యత, అనాగరిక ఆచార, సంప్రదాయాలు వారిలో ఎక్కువగా ఉండేవి. ఇస్లాం వాస్తవ బోధనలను వారికి తెలిపి వారి జీవితంలో ఆధ్యాత్మిక జ్యోతిని వెలిగిస్తే వారి ఇహ, పర జీవితాలు అల్లాహ్ కరుణను పొందుతాయని వారి ఇహ, పరలోకాలు ఆదర్శంగా, గౌరవంగా ఉత్తమ, ఉన్నత నైతికతతో ఉండి తద్వారా పరలోకంలో శాశ్వత సాఫల్యం లభిస్తాయని ధార్మిక సమావేశాల్లో వివరించేదాన్ని.
నా రచనలు, ప్రసంగాల ద్వారా చాలామంది తమలోని నైతిక రుగ్మతలను దూరం చేసుకొని, ఒక ముస్లిం ఎలా ఉండాలో అలా మారే విధంగా తమను తీర్చిదిద్దుకుంటున్నామని చెప్పినప్పుడు చాలా తృప్తిగా అనిపిస్తుంది. నా జీవితానికి సార్థకత లభించిన అనుభూతి కలుగుతుంది.
నేర్చుకున్నాను...నేర్పిస్తున్నాను
– షకీనా గ్లోరి, సువార్తికురాలు
నేను ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి పట్టణంలో భక్తిగల దైవసేవకుల కుటుంబంలో జన్మించాను. బాల్యం నుండే మా తల్లిదండ్రులు మాకు బైబిల్ ను బోధించేవారు.‘‘బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైన తర్వాత దానినుండి తొలగిపోడు’’ అని బైబిల్ వాక్యప్రకారం సమాజంలో ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో వారు మాకు నేర్పించారు. తదనుగుణంగా నేను బైబిల్లో ఉన్న యేసుప్రభువు బోధలకు, వాక్యాలకు ప్రభావితమొందాను.
నీతి నియాలు పాటించి బతికితే ఈ లోకంలో బతికినంత కాలం శాంతి–సమాధానం పొందుకుంటాము. ఒకవేళ ఏదో ఒక రోజున కన్నుమూస్తే దేవుడుండే తన రాజ్యానికి చేరుకుంటాము అనే సత్యాన్ని అనేకులకు తెలియజేయాలని, భయంకర సమస్యలకు దేవుడు పరిష్కారమిస్తాడు. మీకు మేళ్లు కలిగిస్తాడు. మిమ్మును ఆదరిస్తాడు. రక్షిస్తాడు. మీ బుద్ధిని మారుస్తాడనే శుభవార్తను అందరికీ అందించాలని, సమాజానికి ఎంతో కొంత మేలు చేయాలనే నేను నా జీవితాన్ని ఈ పనికి అంకితం చేసుకున్నాను.
ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలని బీఈడీ చేసి పోస్ట్‌గ్రాడ్యుయేషన్ కూడా కొనసాగించుచున్న నాకు దైవస్వరం వినిపించగా నా శేషజీవితమంతా దేవుని పనిలో వాడబడాలని, ఆశలు అడియాశలైన వారినెందరినో బలపరచి, వారికి ఆనందకరమైన జీవితాన్నందించాలని ఈ సేవలో సాగిపోతున్నాను. మా తండ్రిగారైన జోసఫ్ విజయకుమార్ గారే నాకు ప్రేరణ.
చాలా ఒడిదొడుకులు, అభ్యంతరాలు, ఆటంకాలు, అవరోధాలు, అవమానాలు ఎదురౌతున్నా మొక్కవోని ధైర్యంతో క్రీస్తుబోధలను మననం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. నాకు భర్త, ఇద్దరు పిల్లలున్నారు. నా కుటుంబానికి, పిల్లలకు ప్రాధాన్యతనిస్తూ... అందరం సమైక్యంగా ఈ పనిలో ఆనందిస్తుంటాము. నేను అందించిన ఈ బైబిల్ ప్రవచనాలు తమ కన్నీటిని తుడిచాయని, తమలో ధైర్యాన్ని నింపాయని, తమను వెన్నుతట్టి ప్రోత్సహించాయని, మంచిమార్గంలో నడిచేలా సహాయం చేస్తున్నాయని, చెడు వ్యసనాలతో, చెడు బుద్ధులతో ఉన్న తమను విడిపించి, సరిౖయెన, నిజమైన మార్గాన్ని చూపించాయనే సాక్ష్యాలు వింటున్నప్పుడు సంతోషం కలుగుతుంటుటుంది.
Comments
Please login to add a commentAdd a comment