టెన్ కమాండ్మెంట్స్
మతగ్రంథంలో ఉన్నట్లే... మహిళల కోసం కూడా పది ఆజ్ఞలు ఉన్నాయని తెలుసా? ఇవి వ్యక్తిత్వ వికాస నిపుణులు రూపొందించినవి. వీటిని అనుసరిస్తే ఈ సమాజంలో మీకో గొప్ప స్థానం లభిస్తుంది. అంతేకాదు, విజయశిఖరాలను అందుకోకుండా మిమ్మల్ని ఎవరూ ఆపలేరు.
నిన్ను నువ్వు నమ్ము: ఎవరినో నమ్ముతాం. వాళ్లు మనకోసం ఏదో చేస్తారని ఆశపడతాం. చేయకపోతే దిగులుపడతాం. అసలు ముందు నిన్ను నువ్వు నమ్మితే, ఎవరిమీదా ఆధారపడాల్సిన అవసరమే ఉండదు.
ఊహల్లో తేలవద్దు: ఊహలు అవకాశాలను చంపేస్తాయని మీకు తెలుసా? అలా చేయాలి, ఇలా చేయాలి అని ఆలోచిస్తూ ఉండగానే సమయం గడిచిపోతుంది. కాబట్టి ఊహల్లో తేలడం మాని, అవకాశాలను వెతకండి.
మనసు మాట వినండి: చేసేది తప్పనిపించినప్పుడు తప్పుకోవడం ఎంత అవసరమో, సరైన దారిలో వెళ్తున్నప్పుడు ఎవరో చెప్పారనో, ఏమైనా అంటారేమోననో వెనకడుగు వేయకుండా ఉండటం అంతే అవసరమని గుర్తు పెట్టుకోండి.
కొన్నింటిని మరవాలి: మీలో చాలా ప్రతిభ ఉంటుంది. ఏదైనా చేయగలిగే శక్తి ఉంటుంది. కానీ అది గుర్తించరు. నాకు చాలా కష్టాలు ఉన్నాయి అని గుర్తు తెచ్చుకుని పదే పదే బాధపడుతుంటారు. వద్దు. వాటిని మర్చిపోండి. ఆవేదన దేనికీ పరిష్కారం కాదు. అది మనల్ని ఎక్కడికీ తీసుకెళ్లదు.
ఉన్నతంగా ఆలోచించండి: మీ చూపు ఎప్పుడూ పైకే ఉండాలి. ఎలా ఎదగాలి, ఎక్కడి వరకూ వెళ్లాలి, ఏం సాధించాలి అన్నది తప్ప మరో ఆలోచన వద్దు. ఇంతకంటే చేయలేమేమో అన్న ఆలోచనే వద్దసలు.
ఇతరులకు చాన్స్ ఇవ్వకండి: మనం చేసే ప్రతి పనిలోనూ తలదూర్చేందుకు, మనకు సలహాలిచ్చేందుకు బోలెడంతమంది సిద్ధంగా ఉంటారు. మనకు వాళ్ల సలహాలు అవసరం లేదనుకున్నప్పుడు మెల్లగా వాళ్లను అవాయిడ్ చేయండి. లేదంటే వాళ్లు మన లక్ష్యాల మీద పెద్ద ప్రభావమే చూపిస్తారు.
మనసును తెరవండి: మీ ఆలోచనలను లోపలే అణచేసుకోకండి. ఒక పని మీద కానీ, ఒక వ్యక్తి మీద కానీ, ఒక లక్ష్యం మీద కానీ... మీకేదైనా అభిప్రాయం ఉంటే ఓపెన్గా చెప్పండి. అందరికీ అది నచ్చాలని లేదు. కానీ ఎందరికి నచ్చుతోందో తెలిస్తే మీ ఆలోచనా విధానం ఎలా ఉందో మీకు తెలుస్తుంది. లేదంటే మనం మరుగున అయినా పడిపోతాం, మరొకరికి మనల్ని దాటేసే అవకాశమైనా ఇచ్చేస్తాం.
బ్రేకులు వేయొద్దు: ఏదో చేసెయ్యాలనుకుంటారు. ఎక్కడో ఏదో అడ్డు తగులుతుంది. వెంటనే అనుకున్నదాన్ని వదిలేసి వేరే వైపు దృష్టి మళ్లించేస్తారు. ఇది కూడదు. ఒక్కసారి ఏదైనా చేయాలనుకుంటే చేశాకే వదిలిపెట్టండి.
నో చెప్పి తీరాలి: నచ్చినదానికి ఎస్ చెప్పినట్టు, నచ్చనిదానికి నో చెప్పడం కూడా అవసరం. పని చేసేచోట మనలను ఇబ్బందిపెడుతున్నా, ఎందులోనైనా ఇరికించే ప్రయత్నం చేస్తున్నా, మనది కానిదాన్ని మనమీద రుద్దుతున్నా నో అనాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే మిమ్మల్ని పిరికివారిగానో, భయస్థులగానో చూస్తారు.
రిస్క్ తీసుకోండి: ఎప్పుడూ సేఫ్ జోన్లోనే ఉండలేం. ఉండాలని కోరుకోకూడదు కూడా. ఏదైనా చేయాలని అనిపించినప్పుడు... కష్టనష్టాలను తలచుకుని భయపడకండి. కాస్త కష్టమైనా పర్లేదు ప్రయత్నిద్దామని అనుకోండి. ప్రయత్నం ఎప్పుడూ వృథా కాదు. కష్టం ఎప్పుడూ ఓడిపోనివ్వదు. అది మర్చిపోకండి!