Anantha laxmi
-
'క్రమశిక్షణ' అంటే వెంటనే గుర్తుకొచ్చేది...!
‘‘ఆబ్రహ్మ పీపీలికాది పర్యంతం’’ అని సమస్తం అనే అర్థంలో ఉపయోగించటం చూస్తాం. చీమ అంటే అల్పజీవి అనే అర్థం ఇక్కడ. అంతేకాదు, చాలా చులకనగా చూడబడే జీవి, చిన్నప్రాణి. చీమ, దోమ అని కలిపి ఒకటిగా పరిగణించటం కూడా ఉంది. కానీ, మనిషి చీమ నుండి నేర్చుకో వలసినది చాలా ఉంది. అసలు చీమలు ఎన్ని రకాలో తెలుసా? ఎర్ర చీమలు, నల్లచీమలు, గండుచీమలు, బెదురు చీమలు, గబ్బుచీమలు, రెక్కలచీమలు... వీటి అన్నింటికీ సామాన్య లక్షణాలూ ఉన్నాయి, ప్రత్యేక లక్షణాలూ ఉన్నాయి. సామాన్య లక్షణాలు ఆదర్శప్రాయమైనవి, అనుసరణీయాలు.అవిశ్రాంతంగా పని చేయటం చీమల సహజగుణం. నిరంతరం ఆహారాన్వేషణ చీమల లక్షణం. తిన్నంత తిని మిగిలినది జాగ్రత్త చేస్తాయి. చీమల పుట్టలని తవ్వి చూస్తే ధాన్యాగారంలో ఉన్నంత ధాన్యం ఉంటుందని చెపుతారు. అంత ధాన్యం తానే తిందామని దాచి పెట్టిందా? తన కోసమో, తన వారి కోసమో అంటే భవిష్యత్తు కోసం భద్రం చేయటం అనే సహజ గుణం అది. అందుకే కొద్ది కొద్దిగా కూడ పెడితే చీమలాగా కూడపెట్టారని అంటారు. అందుకే చిన్న మొత్తాల పొదుపుకి ఆదర్శం చీమలే.చీమలకి ఉన్న ఘ్రాణశక్తి అమోఘం. బెల్లం ముక్క పెడితే ఎక్కడి నుండి వస్తాయో తెలియదు చీమలు కుప్పలు తెప్పలుగా వస్తాయి. ఎవరు చెప్పి ఉంటారు? అవి వాసనతో పసి గడతాయి. ఒక్కటి పసిగడితే చాలు. స్వార్థరహితంగా తన వారందరికీ తీపివార్తని అందిస్తుంది అది. ఇది కూడా అనుసరించ తగిన లక్షణమే కదా! ఏదైనా తీపి పలుకుని ఒక చీమ మోయ లేకపోయినా, ఒక చీమ చనిపోయినా దానిని తీసుకు వెళ్ళటానికి మిగిలినవి అన్నీ సహాయ పడతాయి. కలిసికట్టుగా ఉండటం చీమలని చూసి మనిషి నేర్చుకోవాలేమో!క్రమశిక్షణ అంటే వెంటనే గుర్తు వచ్చేది చీమలే. చీమలు రెండు అయినా నాలుగు అయినా, వందలూ వేలూ అయినా ఒక వరుసలో మాత్రమే వెళ్ళటం గమనించవచ్చు. పైగా ఒక దానితో మరొకటిపోటీ పడవు, దారి తప్పవు. చీమలు నడచిన దారి కాలిబాట లాగా స్పష్టంగా కనపడుతుంది. చీమల క్రమశిక్షణ నడక లోనే కాదు, నడత లోనూ కనపడుతుంది. చీమలదండులో ఒకటి మిగిలిన వాటికన్న పెద్దదిగా ఉంటుంది. అదే ఆ దండుకి నాయకుడు. చీమలదండు తమ నాయకుని మాటనిపాటిస్తుంది.చీమల గృహనిర్మాణశక్తి అద్భుతం. అంత చిన్నప్రాణులు భూమిని తొలిచి, దారి చేసుకుని, భూమి లోపల ఆశ్చర్యకరమైన నివాసస్థలాలని తయారు చేసుకుంటాయి. వాటి ప్రవేశం భూమి పైన ఉన్నా, వెళ్ళేది లోపలికి. రంధ్రంలోపలికినీళ్ళువెళ్ళటం సహజం. కానీ, చీమలు పెట్టిన పుట్ట ద్వారంలోకి నీటిచుక్క కూడా వెళ్ళదు. జాగ్రత్తగా చీమల పుట్టని అనుసరించి తవ్వుకుంటే వెడితే, లోపల ఎంతో శుచిగా, హాయిగా, చల్లగా ఉంటుందిట!గోడలు నున్నగా ఉంటాయి. అందుకేనేమోపాములు ఆ పుట్టలని తమ నివాసస్థానాలుగా చేసుకుంటాయి. ‘‘చీమలు పెట్టిన పుట్టలుపాముల కిరవైన యట్లు ..’’ అనే మాటలు వినే ఉంటాం.చీమలు తయారు చేసుకున్న నివాసాన్ని ఆక్రమించినపాములని అవకాశం చూసుకుని, అవే చీమలు పట్టి బాధిస్తాయి. చంపి వేయవచ్చు కూడా! చీమలు తలుచుకుంటే ఎంతటి పదార్థాన్ని అయినా గంటల్లో మాయం చేయగలవు. ఉదాహరణకి, మనిషిప్రాణంపోయిన తరువాత అట్లాగే ఉంచితే తెల్లవారే సరికి చీమలు ఎముకలని మాత్రమే మిగులుస్తాయి. వాటికి మనిషి మాంసం చాలా ఇష్టమట! బతికి ఉన్నా కదలిక లేకపోతే చాలు, వాటి పని అవి చేసుకుంటాయి. అందుకే మంచంలో ఉన్నవాళ్ళని, శవాలని జాగ్రత్తగా చూసుకోవాలని చెపుతారు. చీమతోపోలిస్తే సంతోషించాలి సుమా! – డా. ఎన్. అనంత లక్ష్మి -
ఏడుపు కూడా మంచిదే, లేదంటే గుండెపోటు వస్తుంది
మనుషులు ఏడవ లేక పోవటం వల్ల నవ్వుతారు అంటాడు జార్జ్ బెర్నార్డ్ షా. నిజమే కదా! పిల్లలు కింద పడి దెబ్బతగిలితే ఏడుస్తారు. పెద్దవాళ్ళకి ఆ ధైర్యం ఉండదు. పైకి ఏడవరు. ఎవరు ఏమనుకుంటారో అని సంకోచం. ఇతరుల అభిప్రాయాల కోసం బతకటం అలవాటు అవుతుంది ఎదుగుతున్న కొద్దీ. చిన్న పిల్లలకి ఆ బాధ లేదు. తమ నొప్పి మాత్రమే వాళ్ళకి ప్రధానం. భావాలని దాచుకోవటం తెలియదు. అవసరం లేదు. బాల్యావస్థ దాటి ఎదుగుతున్న కొద్దీ ఇతరులు తనని గురించి ఏమనుకుంటున్నారో అన్న దానికి ప్రాధాన్యం ఇవ్వటం ఎక్కువ అవుతూ ఉంటుంది. తన ప్రవర్తన మార్చుకునే ఉద్దేశం ఉండదు గాని, అందరు తనని గొప్పవాడుగా భావించాలనే తపన ఉంటుంది. దాని కోసమే నటించటం. ఏడుపు వచ్చినా దాన్ని అదుపులో పెట్టి, బాధాప్రకటనకి ఒక మాధ్యమం కావాలి కనుక ఏడుపునే నవ్వుగా మార్చటం జరుగుతుంది. తెలివితేటలు పెరుగుతున్న కొద్దీ ఆ సంఘటనకి రకరకాల చిలవలు పలవలు చేర్చటం కూడా చూస్తాం. తాను కావాలనే పడినట్టు చెప్పటమో, అదే బండి అయితే అది బాగుండ లేదనో, బాగు చేయటానికి ఇస్తే సరిగ్గా చేశారో లేదోనని పరీక్ష చేయబోయాననో చెపుతూ ఉంటారు. ‘‘అసలు దెబ్బ తగలనే లేదు’’, ‘‘ఇట్లాంటివి ఎన్ని చూశాం? ఇదొక లెక్కా?’’ వంటి వ్యాఖ్యానాలు విషయాన్ని తేలిక చేయటానికి చెప్పినా చెప్పకపోతేనే మర్యాదగా ఉండేది అనిపిస్తుంది. ఇది నేలమీద పడటం అన్నదానికి సంబంధించింది మాత్రమే కాదు. అన్ని విషయాలకి వర్తిస్తుంది. ఆర్థికంగా కాని, వ్యాపారపరంగా కాని, ఉద్యోగపరంగా కాని, కుటుంబపరంగా కాని, మరేదైనా కాని, దెబ్బ తగిలినప్పుడు గుట్టుగా ఉండటం మంచిదే కాని, అదేదో ఘనతగా చెప్పుకోవటం హర్షణీయం కాదు. ఏడిస్తే చూసి సంతోషించేవారు, ఓదార్చి తృప్తిపడే వారు ఉంటారు. మరింత నైతిక ధైర్యాన్ని దిగజార్చే వారూ ఉంటారు. కనుక బాధ పడుతున్నట్టు చెప్పకూడదు. అసలు విషయం ఏమంటే బాధపడకూడదు. పైకి నవ్వేసి లోపల బాధతో కుమిలి పోవటం మంచిది కాదు. ప్రస్తుతం మనం సమకాలిక సమాజాన్ని గమనించినట్టయితే చాలా మంది మనుషులు నవ్వుతూ కనపడటం ఏడవ లేక మాత్రమే అని అర్థం అవుతుంది. ఆ నవ్వులలో ఏ మాత్రం స్వచ్ఛత కనపడదు. లోపల ఉన్న బాధని, దుఃఖాన్ని, కష్టాలని, దిగులుని, నిరాశా నిస్పృహలని తెచ్చిపెట్టుకున్న నవ్వు వెనక దాచి కనపడతారు. ఆ నవ్వుల్లో జీవం ఉండదు. సహజత్వం ఉండదు. నవ్వు ఒక ముసుగు. నటులు ముఖానికి వేసుకున్న రంగు లాంటిది. మనోభావాలని యథేచ్ఛగా ప్రకటించ కలిగితే, కనీసం ఆత్మీయుల ముందు గుండెల్లో ఉన్న బరువు తగ్గుతుంది. తరువాత హాయిగా నవ్వగలుగుతాం. ఏడవటం తప్పు కాదే! మనిషికి సహజంగా ఉన్న లక్షణం. ఒకరు బాగుపడుతుంటే చూసి ఏడవటం తప్పు కాని, కష్టం వచ్చినప్పుడు ఏడవటం మానవ సహజం. శ్రీరామచంద్రుడంతటి వాడే తండ్రి మరణవార్త విని భోరున విలపించాడు. అది మానవత్వం. బాధ కలిగినప్పుడు ఏడిచి మనసులో ఉన్న బాధని బయటికి వెళ్ళగక్కకపోతే ఎన్నోరకాల అనారోగ్యాలు వస్తాయి. గుండె బరువుని తగ్గించి తేలిక పరచకపోతే అది గుండెపోటు, రక్తపోటు, మధుమేహం మొదలైన రూపాంతరాలు చెందుతుంది. నవ్వు ముఖకండరాలకి మంచి వ్యాయామం. శరీరానికి ఆరోగ్యం. మనస్సుకి రసాయనం ఎదుటివారికి ఆహ్లాదం. అట్లా ఉండాలంటే ఏడవలేక నవ్వకూడదు. ఆనందంతో నవ్వాలి. – డా. ఎన్. అనంతలక్ష్మి -
మెట్ట వేదాంతం..?
వేదాంతం అనే మాట తెలుసు అందరికీ, అర్థం సరిగ్గా తెలిసినా లేకపోయినా. ఇంతకీ ఈ మెట్టవేదాంతం ఏమిటి? కాని, ఈ మాటని చాలామంది పెద్దవాళ్ళు వాడుతూ ఉంటారు. మాగాణి వేదాంతం మరొకటి ఉందా? దీనికీ, దానికీ తామరకి, మెట్టతామరకి మధ్య ఉన్నంత తేడా ఉంటుందా? తామర, మెట్టతామర రెండూ పూలు. అంతే వాటి సంబంధం. ఒకటి నీళ్ళలో, మరొకటి నేల మీద పెరుగుతాయి. కాని, వేదాంతానికి మెట్ట వేదాంతానికి ఉన్నది మరొక రకమైన సంబంధం. వేదాంతం ఒక శాస్త్రం. అన్ని వేదాలు క్షుణ్ణంగా చదివిన తరువాత గురువు సమీపంలో కూర్చుని వేదాలలోని మర్మాలు తెలుసుకుంటాడు శిష్యుడు. ప్రశ్నోత్తరాల రూపంలో ఉన్న ఆ సంభాషణలని ఉపనిషత్తులు అని అంటారు. వేదాధ్యయనం అయిన తరువాత తెలుసుకునే భాగాలు కనుక వేదాంతంగా పరిగణించబడినాయి. సమస్తం భగవంతుడి స్వరూపంగా భావించ గలగటం అప్పటికి అభ్యాసం అయి ఉంటుంది. అందువల్ల వేదాంతం వంటపట్టిన వారు సామాన్య భక్తులలాగా పూజాదికాలకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వరు. నిరంతరం సర్వవ్యాపి అయిన పరబ్రహ్మతత్త్వాన్ని ధ్యానం చేస్తూ, వివేచన చేస్తూ, అనుభూతి చెందటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వారు చెప్పే మాటలని పూర్తిగా అర్థం చేసుకోకుండా కేవలం ఒకటి, రెండు మాటలని పట్టుకుని తమకి అనుకూలంగా వాడుకుంటారు కొంతమంది. కొంతమంది తెలియక కూడా ఆ విధంగా చేస్తారు. అంటే వేదాంత పరిభాషని తన ప్రవర్తనని సమర్థించుకునేందుకు చేసే ప్రయత్నం అని చెప్పవచ్చు. ఇటువంటి సందర్భాలు మనకి అడుగడుగునా, కోకొల్లలుగా కనిపిస్తూ ఉంటాయి. ‘‘అన్నమైతేనేమిరా? మరి, సున్నమైతే నేమిరా?’’ అని అన్నానికి సున్నానికి తేడా లేదని అంతా సమానమేనని ఇంటిముందు అడుక్కునేందుకు వచ్చిన సన్న్యాసి పాడుతాడు. ‘అబ్బా ఎంత వైరాగ్యం!’ అని అనుకుంటూ ఉంటే ఇట్లా కొనసాగిస్తాడు – ‘‘అందుకే ఈ పాడు పొట్టకి అన్నమే వేదాము రా! పప్పన్నమే వేదాము రా! నెయ్యన్నమే వేదామురా! పెరుగన్నమే వేదాము రా!’’ అంటాడు. అంతటితో ఆగడు. ‘‘చీరలైతేనేమిరా? మరి, నారలైతే నేమిరా? అందుకే ఈ పాడు ఒంటికి చీరలే కడదామురా! పట్టుచీరలే కడదామురా!’’ ఇట్లా కొనసాగుతూ ఉంటుంది ఆ పాట. ఇటువంటి వాటిని తత్త్వాలు అంటారు. తన శక్తిమేరకు పనిచేసి ఫలితం ఏమైనా పట్టించుకోకపోవటం వేదాంతి అయిన వాడు చేసే పని. కాని, వేదాంత ప్రసంగాలు విని, విని కొన్ని ఊతపదాలు మనకి అలవాటై పోయాయి. ‘‘మన చేతుల్లో ఏముంది?’’,‘‘ఎట్లా రాసి ఉంటే అట్లా జరుగుతుంది’’ అంటూ చేతులు ముడుచుకుని కూర్చునేవారు, తమ బద్ధకానికి, చేతకానితనానికి వేదాంతపు ముసుగు వేసుకున్నారు అని అర్థం చేసుకోవాలి. ఇటువంటి వారి వల్లనే మన ధర్మానికి, వేదాలకి, వేదాంతానికి చెడ్డపేరు వస్తోంది. మనం మెట్టవేదాంతులం కాకుండా ఉంటే చాలు. అటువంటి వారి నుండి దూరంగా ఉండటం మంచిది. అన్నానికి సున్నానికి తేడా లేదనటం వేదాంతం. అందుకని రకరకాల అన్నాలు వేద్దామనే నిర్ణయానికి రావటం మెట్టవేదాంతం. ఈ రెండింటికి తేడా లేదని చెప్పటం దంతవేదాంతం. ఆచరణలో చూపటం అసలైన వేదాంతం. రుచికరమైన ఆహారం తినకూడదని కాదు దీని అర్థం. అది కావాలని కోరకూడదు. దొరికినది ఏది అయినా ఒకే భావనతో తినగలగాలి. అట్లాగే ఎట్లాగైనా ఉండగలగాలి. అంటే పట్టుపరుపులైనా, నేలమీదైనా ఒకే రకం గా నిద్రించటం వేదాంతి లక్షణం అయితే, రెండూ ఒకటే కనుక పట్టుపరుపులే కావాలనుకోవటం మెట్టవేదాంతం. – డా.ఎన్. అనంతలక్ష్మి -
ఎంతెంత దూరం?
ప్రతి చర్యకి సమానమైన, వ్యతిరిక్తమైన ప్రతిచర్య ఉంటుంది అన్నది న్యూటన్ గతి సిద్ధాంతాలలో మూడవది. ఒక ఎత్తు నుంచి బంతిని నేలకి కొడితే అది అంతకన్నా ఎంతో ఎక్కువ ఎత్తుకి ఎగురుతుంది కదా! అప్పుడు రెండు సమానం ఎట్లా అవుతాయి అని మొదటిసారి తరగతిలో ఉపాధ్యాయుడు చెప్పిన పాఠం గురించి ఒక చిన్నారికి సందేహం కలగటం సహజం. బంతిని నేల మీద విసిరినప్పుడు అన్నిమార్లూ ఒకే ఎత్తుకి వెడుతోందా? లేదే? ఎందుకని అన్నది అర్థమైతే సిద్ధాంతం అర్థమవుతుంది. తేడా ఎంత బలంగా కొట్టారు అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. దూరం, బలం రెండింటి మొత్తాన్ని తీసుకుంటే ఎంత ఎత్తు వెళ్లింది అన్నది సరిగ్గా సమానంగా ఉంటుంది. ఇది మానవ సంబంధాలకూ వర్తిస్తుంది. ‘నువ్వీ మధ్య నాతో సరిగా మాట్లాడటం లేదు.’ ‘ఫోన్ చెయ్యటం లేదు.’ ‘మా ఇంటికి అసలే రావటం లేదు.’ ఇటువంటి దెప్పిపొడుపులు అయినవాళ్ళ మధ్య తరచుగా వింటూ ఉంటాం. ‘పోనీ నువ్వే ఫోన్ చెయ్యచ్చుగా.’ ‘నువ్వే రావచ్చుగా’ అంటూ సమాధానాలు చెప్పరు. పైగా ‘ఈ ఊరికా ఊరెంత దూరమో ఆ ఊరికీ ఈ ఊరంతే దూరం’ అని సమర్థించుకుంటారు. ‘వన్ వే ట్రాఫిక్‌లు వచ్చాక ఆ రూల్ పని చేయదు’ అని వింటున్న కుర్రదో, కుర్రాడో అంటే తెల్ల మొహం వేస్తారు పెద్దవాళ్ళు. వన్ వేలు మాత్రమే కాదు డివైడర్లు వచ్చాక అది చాలా పెద్ద విషయమే అయ్యింది కదా! మీటర్ మీద వచ్చే ఆటోకి ఒక చోటుకి వెళ్ళటానికైనా, రావటానికైనా దానికి చాలా తేడా ఉంటుంది. ఏమంటే డివైడర్లు అంటారు. జాగ్రత్తగా గమనిస్తే, డివైడర్ కారణంగా కొంచెం దూరం ఎక్కువైనా రద్దీ తక్కువై, దాని వల్ల ఇంధనం బాగా పొదుపవుతుంది. వాహనం మీద ఒత్తిడి తగ్గి దాని ఆయువు పెరుగుతుంది. ఈ ఉపయోగాలని దృష్టిలో ఉంచుకుంటే స్వంత వాహనదారులు చికాకు పడరు. మానవ సంబంధాల విషయంలో కూడా అంతే. ఉదాహరణకు తల్లితో కూతురికి పోటీ ఏమిటి? ‘‘నా ఇంటికి నువ్వెన్ని సార్లు వచ్చావో నీ ఇంటికి నేనూ అన్నేసార్లు వస్తాను’’ అని కూతురు అనటం సమంజసంగా అనిపిస్తుందా? గురువుతో అదే మాట శిష్యుడు అనవచ్చా? ఈ మాటని వృద్ధాశ్రమంలో ఉన్న తండ్రి కొడుకుతో అంటే?... ఏ ఇద్దరి మధ్యనైనా ఉండే సంబంధం ఇరుపక్షాల నుంచి సమానమే అయినా వ్యక్తీకరించే విధానం వంటి వాటిలో తేడా ఉంటుంది. కనుక ప్రతి దానికి పోటీ పెట్టటం కుదరదు. ఈ సంగతిని అర్థం చేసుకుంటే వ్యక్తుల మధ్య సంబంధాలు భద్రంగా ఉంటాయి. – డాక్టర్ ఎన్. అనంతలక్ష్మి -
సీవోఈలో కరీంనగర్ టాప్
తిమ్మాపూర్, న్యూస్‌లైన్ : ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(సీవోఈ) పాఠశాలల్లో కరీంనగర్‌లోని అల్గునూర్ పాఠశాల ప్రథమ స్థానంలో నిలిచిందని ప్రిన్సిపాల్ అనంతలక్ష్మి తెలిపారు. దివంగత నేత వైఎస్సార్ హయాంలో రాష్ట్రంలో కరీంనగర్, కడప, వైజాగ్ సీవోఈలు ఏర్పాటుచేశారు. అల్గునూర్ పాఠశాల విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించి టాప్‌లో నిలిచారు. ఎంపీసీ విభాగంలో యు.అమృత 974 మార్కులతో ప్రథమ, బి.హరిత(973)ద్వితీయ, నల్ల గంగాధర్(966) తృతీయ స్థానంలో నిలిచారు. బైపీసీలో 957మార్కులతో టీ.శివకుమార్ ప్రథమ, జి.హరిత940, దీరావత్ శివ 934మార్కులతో ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. ఐఐటీ, జేఈఈ మెయిన్స్‌కి అల్గునూర్ సీవోఈకి చెందిన 62మంది విద్యార్థులు పరీక్ష రాస్తే 13 మంది అర్హత సాధించారు. వారిని సీవోఈ ప్రిన్సిపాల్ అనంతలక్ష్మి, లెక్చరర్లు అభినందించారు. ప్రొఫెసర్ అవుతా.. నాది రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలం పులుమద్ది గ్రామం. తల్లి లలిత మరణించగా.. తండ్రి యాదయ్య వ్యవసాయం చేస్తున్నాడు. నేను మొదటి నుంచి ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే చదివా. సీవోఈలో సీటు రావడమే సంతోషమనిపించింది. ఇప్పుడు ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించడం ఆనందంగా ఉంది. ప్రొఫెసర్ కావడమే నా లక్ష్యం. -అమృత డాక్టర్ లక్ష్యం.. నాది మహబూబ్‌నగర్ జిల్లా కోడేరు మండలం రాజాపూర్. తల్లిదండ్రులు వెంకటస్వామి, సాలమ్మ కూలీ పని చేస్తుంటారు. నేను ఇంటర్లో 956 మార్కులు సాధించిన వయసు లేకపోవడంతో మెడిసిన్‌లో సీటు వచ్చే పరిస్థితిలేదు. ఎవరైనా ఫ్రీ కోచింగ్ ఇస్తే లాంగ్‌టర్మ్ తీసుకుని ఎంబీబీఎస్ సీటు సాధించి డాక్టర్ అవ్వాలన్నది లక్ష్యం. - శివకుమార్ ఇంజినీర్‌నవుతా.. అల్గునూర్ సీవోఈ ద్వారా ఐఐటీ, జేఈఈ మెయిన్స్‌లో అర్హత సాధించిన టాపర్‌గా నిలవడం సంతోషంగా ఉంది. నాది ధర్మపురి మండలం జైన్ గ్రామం. తల్లిదండ్రులు లక్ష్మీ, లక్ష్మణ్ చనిపోయారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో సీటు సాధించి కష్టపడి చదివి ఎరోస్పేషన్ ఇంజినీర్ కావాలనేది నాలక్ష్యం. - ఎన్.గంగాధర్